రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం… ఇది ఒకప్పటి మాట. ప్రపంచ వ్యాప్తంగా వలస రాజ్యాలను కలిగి ఉండి.. అనునిత్యం ఏదో ఒక దేశంలో బ్రిటీష్ వారి ప్రభ కొనసాగుతున్నకాలం నాటి మాట అది. అది మరీ ఎప్పటి మాటో కాదు… ఐదారు దశాబ్దాల కాలం కిందట వరకూ ప్రపంచంలోని చాలా దేశాలు బ్రిటీష్ వారి గుప్పిట్లోనే ఉన్నాయి. ఆ దేశాలన్నింటినీ బ్రిటీషర్లు పీల్చి పిప్పి చేశారు. వనరులన్నింటినీ వాడేసుకొన్నాకా… స్థానికంగా చెలరేగిన స్వతంత్ర ఉద్యమాల నేపథ్యంలో ఆ దేశాలకు స్వతంత్రాలను ప్రకటించారు. ఈ చరిత్ర, బ్రిటిషు వారి తీరు గురించి వందల సంవత్సరాల పాటు వారి పాలనలో మగ్గిన భారతీయులకే బాగా తెలుసు.
మరి బ్రిటీషర్లు బలప్రయోగం ద్వారా మాత్రమే కాదు… కొన్ని దేశాలను వ్యూహాత్మకంగా కూడా కలుపుకొన్నారు. వాటిని తమ రాజ్యంలో భాగం చేసుకొన్నారు. అలాంటి దేశాల్లో స్కాట్ లాండ్ ఒకటి. గ్రేట్ బ్రిటన్ పరిధిలో ఎలిజబెత్ రాణి ప్రత్యక్ష ఏలుబడిలోని దేశాల్లో స్కాట్ లాంట్ ఒకటి. గ్రేట్ బ్రిటన్ అనే నిర్వచనం నుంచి చూసినప్పుడు స్కాట్ లాండ్ ఒక ప్రాంతం అవుతుంది. అయితే ఇంగ్లండ్ అని వ్యవహరించినట్లైతే స్కాట్ లాండ్ వేరే దేశం అవుతుంది.
మరి ఇప్పుడు అలాటి స్కాట్ లాంట్ స్వతంత్రాన్ని కోరుకొంటోంది. బ్రిటన్ నుంచి వేరుపడాలని అనుకొంటోంది. ఇందుకోసం సెప్టెంబర్ 18 వ తేదీన రెఫరండం జరగనుంది. దశాబ్దాలుగా చాలా చిన్న స్థాయిలో వినిపిస్తూ వస్తున్న స్వతంత్రం డిమాండ్ నేపథ్యంలో ఈ రెఫరండం జరగనుంది.
స్కాట్ లాండ్, ఇంగ్లాండ్ లది ఈనాటి బంధం కాదు. వీళ్ల బంధం 307 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది. 790 ద్వీపాల సముదాయమైన స్కాట్లాండ్ బ్రిటన్ కు ఉత్తర భాగంలో ఉంటుంది. ఒకనాడు స్కాట్ లాండ్, ఇంగ్లండ్ లు పక్కపక్కనే ఉన్న శత్రుదేశాలు. వీటి మధ్య అనేక యుద్ధాలు కూడా జరిగాయని చరిత్ర చెబుతోంది. అయితే వివిధ రాజకీయ, సామాజిక, ఆర్థిక అవసరాల నేపథ్యంలో స్కాట్ లాండ్ ఇంగ్లండ్ ఏలుబడి కిందకు వచ్చింది. ఈ రెండు దేశాలూ ఒకే రాజరికం కింద ఏకం అయ్యాయి.
1707లో ఈ రెండు దేశాల కలయిక జరిగింది. అప్పటి నుంచి బ్రిటీషు సామ్రాజ్యం ఒక తరంగంలా ఎగిసింది. అనేక దేశాలపై తన పంజా విసిరింది. రవిఅస్తమించని సామ్రాజ్యంగా పేరు తెచ్చుకొంది. తర్వాతి కాలంలో ప్రభ మసకబరింది. ఇప్పుడు గ్రేట్ బ్రిటన్ అనేది పేరుకు మాత్రమే గొప్ప అవుతుంది. ఇలాంటి పరిణామాల మధ్య స్కాట్ లాండ్ కూడా తనదారి తాను చూసుకొందామనే భావనకు వచ్చింది.
ఇంగ్లాండ్ కు పక్కనే ఉన్న మరో దేశం ఐర్లాండ్ కూడా ఒకప్పుడు గ్రేట్ బ్రిటన్ లో భాగంగానే ఉండేది. అయితే 1922లో ఇలాగే జరిగిన ఒక రెఫరండంతో అది బ్రిటన్ నుంచి విడిపోయింది. స్వతంత్రదేశంగా అవతరించింది. సరిగ్గా అప్పటి నుంచినే స్కాట్ లాండ్ వైపు నుంచి స్వతంత్రం కావాలనే డిమాండ్ వినిపిస్తూ వస్తోంది. 92 సంవత్సరాల తర్వాత మరో రెఫరండం జరగనుంది. ఈ రెఫరండంలో పదహారేళ్లు దాటినవారందరూ ఓటు వేయనున్నారు. ఇలా మొత్తం 40 లక్షల మంది ఓటు వేస్తారని తెలుస్తోంది.
గ్రేట్ బ్రిటన్ భాగం అయినప్పటికీ స్కాట్ లాండ్ కు ఆది నుంచి కొన్ని ప్రత్యేక వ్యవస్థలున్నాయి. అక్కడి న్యాయవ్యవస్థ కూ ఇంగ్లండ్ తో సంబంధాలుండవు. అలాగే కొన్ని క్రీడా పోటీల్లో కూడా స్కాట్ లాండ్ కు సొంత జట్లున్నాయి. కొన్ని ఈవెంట్స్ లో మాత్రం స్కాట్ లాండ్ వాళ్లు గ్రేట్ బ్రిటన్ తరపునే ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ తేడాను ఒలింపిక్ వంటి క్రీడల సమయంలో కూడా గమనించవచ్చు.
మరి ప్రీపోల్ సర్వేలను బట్టి స్కాట్ లాండ్ బ్రిటన్ నుంచి విడిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని ఆన్ లైన్ సంస్థలు చేసిన సర్వే ప్రకారం 47 శాతంమంది బ్రిటన్ నుంచి విడిపోవడానికి అనుకూలంగా ఓటేస్తుంటే.. 53 శాతం మంది ఉమ్మడిగా ఉండటానికే అనుకూలంగా ఉన్నారు. అయితే పోలింగ్ రోజుకు ఈ పరిస్థితి మారుతుందని… స్కాట్ లాండ్ విడిపోవడానికే ఎస్ అనే వాళ్ల సంఖ్యే ఎక్కువ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక స్కాట్ లాండ్ విడిపోవడం వల్ల బ్రిటన్ ప్రభ మరింత తగ్గినట్టేనని చెప్పవచ్చు. మనదేశంలో ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విడిపోవడం అనే ప్రక్రియ ద్వారా ఎంతగా నష్టపోతున్నాయో.. బ్రిటన్ కు కూడా అలాంటి ఇబ్బందులు కొంత వరకూ ఉంటాయి. అయితే గ్రేట్ బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో స్కాట్ లాండ్ ఆర్థిక వ్యవస్థ పదో శాతం మాత్రమే ఉంటుంది. దీని వల్ల మరీ పెద్ద దెబ్బ ఉండదని విశ్లేషకులు అంటున్నారు. అలాగే విడిపోవడం వల్ల స్కాట్ లాండ్ కు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. కరెన్సీతో సహా స్కాట్ లాండ్ కు కొన్ని సమస్యలు తప్పవని అంటున్నారు. మరి ఇలాంటి వ్యవహారాలన్నింటి గురించి ఆలోచించి స్కాట్ లాండ్ ప్రజలు ఇలాంటి నిర్ణయానికి వస్తారో.. ఏం ఫలితాన్ని ఇస్తారో చూడాలి.