అహంభావ ప్రధాని…!

పాలకులు ఎలా ఉండాలో, ఏ రాజధర్మాలు ఎలా పాటించాలో  ఇతిహాసాలైన రామాయణంలో, మహా భారతంలో ఉంది. యుగాలు మారాయి కాబట్టి అప్పటి రాజధర్మాల్లో కొన్ని ఈ కాలానికి పనికిరాకపోయినా మౌలిక ధర్మాలు, పరిపాలనా సూత్రాలు…

పాలకులు ఎలా ఉండాలో, ఏ రాజధర్మాలు ఎలా పాటించాలో  ఇతిహాసాలైన రామాయణంలో, మహా భారతంలో ఉంది. యుగాలు మారాయి కాబట్టి అప్పటి రాజధర్మాల్లో కొన్ని ఈ కాలానికి పనికిరాకపోయినా మౌలిక ధర్మాలు, పరిపాలనా సూత్రాలు మారవు. మహా భారతంలో భీష్ముడు ధర్మారాజుకు బోధించిన రాజధర్మాలు, పరిపాలనా సూత్రాలు, విధానాలు చదివితే పాలకులు ప్రజలకు ఏం చేయాలో అర్థమవుతుంది. రాజు అనేవాడు ఎంత బ్రాడ్ మైండెడ్‌గా ఉండాలో, ఎంత నిస్వార్థంగా ఉండాలో, ఎంత పక్షపాత రహితంగా ఉండాలో అర్థమవుతుంది. మన పురాణాలుగాని, ఇతిహాసాలుగాని ప్రధానంగా చెబుతున్న విషయం పాలకులు ‘అహంకారం’తో వ్యవహరించకూడదని. ఒక్క పాలకులే కాదు, మనిషి అహంకారంతో వ్యవహరిస్తే పతనం తప్పదని చెప్పాయి.  అహంకారంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించిన మహారాజులు, చక్రవర్తులు పాతాళంలో కూరుకుపోయారు. పాలకులకు ఉండాల్సింది ప్రజల పట్ల ప్రేమగాని అహంకారం కాదు. ఇంత ఉపోద్ఘాతం చెప్పుకోవడానికి కారణం…దాదాపు కొద్ది రోజుల తేడాతో అధికార పీఠాలు అలంకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నారా చంద్రబాబు నాయుడు అలవిమాలిన అహంకారంతో వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏదో ఒకనాడు ఇది వారి పతనానికి దారి తీస్తుంది. ప్రస్తుతం ప్రధాని మోదీ గురించి చెప్పుకుందాం.

మోదీ-అమిత్ అహంకార ఫలితమే ఢిల్లీలో పతనం

ప్రస్తుతం భాజపాకు కర్త, కర్మ, క్రియ ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అనేది అందరికీ తెలుసు. లోక్‌సభ ఎన్నికల్లో283 సీట్లు గెల్చుకుని తిరుగులేని పార్టీగా అవతరించి అధికార పీఠం ఎక్కిన తరువాత పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భాజపా విజయేకతనం ఎగరేసింది. చివరకు జమ్మూకాశ్మీర్ వంటి సరిహద్దు రాష్ర్టంలోనూ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించే స్థాయికి చేరుకుంది. దీంతో మోదీ-అమిత్ ద్వయానికి అహంభావం తలెకక్కింది. అందులోనూ అనేకమంది ఇతర పార్టీల నాయకులు భాజపాలో చేరుతుండటంతో వారి ‘నషా’ నషాళానికి ఎక్కింది. పార్టీపై, ప్రభుత్వంపై మోదీ పూర్తి పట్టు సాధించారు. మంత్రులు ఆయనకు పరమ విధేయులగా మారిపోయారు. వెంకయ్య నాయుడు అంతటివాడు రోజూ స్తోత్ర పాఠాలు చదవడం ప్రారంభించారు. ‘ఈ దేశాన్ని బాగుచేయడానికి ఉద్భవించిన దేవుడు’ అని కూడా అన్నారు. మోదీ ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతోంది. చివరకు నెహ్రూ హయాంలో ఏర్పాటైన ప్రణాళికా సంఘాన్ని కూడా రద్దు చేశారు. మోదీఅమిత్ ద్వయం పార్టీలో ఎవ్వరినీ ఖాతరు చేయడంలేదనే వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి. పార్టీలో సీనియర్లను కూడా గౌరవించడంలేదట…! రాష్ట్రాలను పట్టించుకోవడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో  మిత్రపక్షమైన  టీడీపీని అసలు ఖాతరు చేయడంలేదు. సరిగ్గా చెప్పాలంటే భవిష్యత్తులో దాన్ని వదిలించుకోవాలనే ఆలోచన చేస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ఇతరత్రా ఎటువంటి సహాయం చేయకుండా ఇబ్బందులు పెడుతోంది. తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఫైల్ప్ పట్టుకొని నాలుగు రోజులకోసారి ఢిల్లీ వెళ్లి మోదీ చుట్టూ, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొంప ముంచిన పది లక్షల సూట్

ఎన్నికల్లో తనను  చాయ్‌వాలాగా ప్రచారం చేసుకొని, తాను సామాన్యుడినని చెప్పుకొని, తన ఆస్తి కేవలం ఇరవైమూడు వేల రూపాయలని ఊదరగొట్టిన నరేంద్ర మోదీ మొన్నీమధ్య అమెరికా అధ్యక్షుడు ఒబామా వచ్చినప్పుడు విదేశాల నుంచి పది లక్షల ఖరీదు చేసే సూటు తెప్పించుకొని వేసుకోవడం కూడా ఆయన అహంభావానికి నిదర్శనంగానే చెప్పుకోవచ్చు. ఢిల్లీ ఎన్నికల్లో భాజపా పరాజయానికి ఈ సూట్ ప్రధాన కారణమైందంటే అతిశయోక్తి కాదు. చివరకు విమర్శల నుంచి తప్పించుకునేందుకు ఈ వివాదాస్పద సూట్‌ను 4 కోట్ల 31 లక్షలకు వేలం వేశారు. ఈ డబ్బును ‘క్లీన్ గంగా’ కోసం ఉపయోగిస్తారట….!  ఇక మోదీది ప్రచారం పటాటోపమనే విమర్శలు ఇప్పుడిప్పుడు బాగా పుంజుకుంటున్నాయి. ఆయన డ్రెస్సులు మెయింటైన్ చేస్తున్నారుగాని దేశాన్ని మెయింటైన్ చేయడంలేదని విశ్లేషకులు అంటున్నారు. గత ఎనిమిది నెలల్లో మోదీ దేశానికి పనికొచ్చే పని ఒక్కటీ చేయలేదని అభిప్రాయం ప్రజల్లో నాటుకుంటోంది. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్టుబడిదారులతో అంటకాగడమే సరిపోతోంది. తాను అమెరికా వెళ్లినప్పుడు, బరాక్ ఒబామా ఇక్కడికి వచ్చినప్పుడు మోదీ చేసిన హడావిడి  అంతా కాదు. ఇక కొన్నాళ్లు మోదీ మంత్రివర్గ సభ్యుల్లో కొందరు చేస్తున్న ‘పిచ్చి ప్రేలాపనలు’ వినీవినీ ప్రజలకు విసుగు కలుగుతోంది. మంత్రివర్గంలోని కొందరు ‘సాధ్వి’లు, సన్యాసులు మతోన్మాద ప్రకటనలు,  వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినప్పటికీ మోదీ ఏం మాట్లాడకుండా గమ్మున ఉండిపోయారు. క్రైస్తవుల చర్చిలపై దాడులు జరిగాక మొన్న ఆయన నోరు విప్పి మతం పేరుతో వివాదాలు, హింసను ప్రేరేపిస్తే సహించబోనన్నారు. ఇదే మాట ఆయన మంత్రివర్గ సహచరులు ప్రేలాపనలు చేసినప్పుడే చెప్పొచ్చు కదా…! మోదీ పాలనపై ప్రజల్లో నెమ్మదిగా అసంతృప్తి ప్రబలుతోందనడానికి మొన్నటి ఢిల్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఈ అసంతృప్తి కూడా సాధారణ స్థాయిలో లేదు. కేవలం మూడు సీట్లు మాత్రమే ఇచ్చారంటే ఈ అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

కాంగ్రెసు హయాంలోనే పనులు జరిగాయట…!

కాంగ్రెసు దేశాన్ని భ్రష్టు పట్టించింది. కుంభకోణాలు పుట్టలోంచి పాములు బయటకు వచ్చినట్లు వచ్చాయి. విసిగిపోయిన ప్రజలు  భాజపాకు అకండ మెజారిటీ కట్టబెట్టారు. ఇంత భారీ మెజారిటీ ఇచ్చింది ఎందుకు? దేశానికి, ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తారని. కాని అదేమీ జరగడంలేదని అన్ని వర్గాలవారూ ఆవేదన చెందుతున్నారు. ‘కాంగ్రెసు హయాంలో వంద పనులు జరగాలని కోరుకుంటే సగమైనా జరిగేవి. ఇప్పుడు వంద పనులకు పది పనులు కూడా జరగడంలేదు’ అని ఒక ఎంపీ వ్యాఖ్యానించారు. అంటే మోదీ ప్రభుత్వం పనిచేయడంలేదనేది సారాంశం. భాజపా మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ కూడా కేంద్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చినట్లు వార్తలొచ్చాయి. తాజాగా హెచ్‌డిఎఫ్‌సి ఛైర్మన్ దీపక్ పరేఖ్ ఓ వ్యాఖ్య చేశారు. ‘కొత్త ప్రభుత్వం కొలవుతీరి తొమ్మిది నెలలవుతున్నా ఇప్పటివరకూ క్షేత్రస్థాయి పరిస్థితిలో మార్పు రాలేదు’ అని అన్నారు. మోదీ ప్రభుత్వంపై అంచనాలు తప్పాయన్నారు. 

ఢిల్లీ ఎన్నికల్లో అహంకారపూరిత వ్యాఖ్యలు

మోడీ  మంచి వక్త. అందులో సందేహం లేదు. కాని అహంకారపు పొరలు కమ్ముకొని మాట్లాడటంతో ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలు దారుణంగా ఓడించారు. తాను ప్రధానినన్న విషయం కూడా మర్చిపోయి, హుందాతనం విడనాడి ఆమాద్మీ పార్టీని, దాని అధినేత కేజ్రీవాల్‌ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఢిల్లీ ప్రజలకు రుచించలేదు. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలవారు మోదీని కూడా తీవ్రంగా విమర్శించారు. గుజరాత్‌లో మారణకాండ జరిపించిన కిరాతకుడన్నారు. నరహంతకుడన్నారు. ఈ చాయ్‌వాల్ దేశాన్ని ఏం పరిపాలిస్తాడని అన్నారు. గుజరాత్ అభివృద్ధి అంతా బోగస్ అన్నారు. ఈ మాటలకు మోదీ తప్పనిసరిగా బాధపడే ఉంటారు. మాటలతో హృదయం గాయపడుతుందని తెలిసిన మోదీ అలాంటి తీవ్రమైన వ్యాఖ్యలనే కేజ్రీవాల్ పట్ల చేశారు. మోదీపై ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా ప్రజలు ఏవిధంగా అయితే ఆయనకు అధికారం కట్టబెట్టారో, అదేవిధంగా కేజ్రీవాల్‌పై మోదీ చేసిన విమర్శిలను కూడా ఢిల్లీ ప్రజలు పట్టించుకోకుండా ఆప్‌కు అధికారం అప్పగించారు. బంతిని నేల మీద ఎంత బలంగా కొడతామో అంతే ఫోర్స్‌గా పైకి లేస్తుంది. మోదీకి ఇది ప్రజలు నేర్పిన పాఠం. ఒకవిధంగా చెప్పాలంటే ప్రధాని తీవ్ర వ్యాఖ్యల కారణంగానే ఆప్ విజయం సాధించిందని చెప్పొచ్చు. ఇక పార్టీలో ఎవ్వరినీ సంప్రదించకుండా భాజపా తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీని ప్రచారం చేయడం కూడా దారుణంగా దెబ్బతీసింది. మోదీఅమిత్ షా ద్వయం నియంతృత్వ ధోరణిని భాజపా నాయకులే నిరసించారు. ఓటమికి తమ వంతు పాత్ర పోషించారు. ఒకప్పుడు మోదీని నానా తిట్లూ తిట్టిన కిరణ్‌బేడీ అదే మోదీని ఆకాశానికి ఎత్తడం ఢిల్లీ ప్రజలు సహించలేకపోయారు. 

ఛరిస్మా ఉన్నా అహంకరిస్తే అంతే సంగతులు

ప్రజలను ఆకర్షించే గొప్ప ఛరిస్మా ఉన్న ఎందరో నాయకులు అధికార పీఠం ఎక్కాక అహంకారంతో విర్రవీగి మట్టికరిచారు. అహంకారంతో అత్యవసర పరిస్థితి విధించిన ఇందిరాగాంధీని ప్రజలు దారుణంగా ఓడించారు. రాజీవ్ గాంధీని ఇంటికి పంపారు.  అహంకారంతో 31 మంది మంత్రులను ఒక్క కలం పోటుతో ఊడబెరికిన ఎన్‌టి రామారావును ప్రజలు తిరస్కరించారు. ‘సర్వం నేనే చేశా…అన్నీ నా ఘనతే’ అని చెప్పుకున్న చంద్రబాబును ప్రజలు పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. తన రెక్కల కష్టం మీదనే కాంగ్రెసు అధికారంలోకి వచ్చిందనుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డికి రెండో దఫా బొటాబొటి మెజారిటీ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూపోతే చరిత్రలో అనేకమంది పాలకులు ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఎదురు లేదని భావనతో, అహంకారంతో చెలరేగిపోతున్నారు. ఆయనకూ ప్రజలు గుణపాఠం చెబుతారు. ప్రధాని మోడీ పది లక్షల సూట్ వేసుకున్న విషయం మనసులో పెట్టుకొని పరాభవించారు ప్రజలు. వాళ్లు ప్రతీ చిన్న విషయాన్నీ గమనిస్తూనే ఉంటారని పాలకులు తెలుసుకుంటే మంచిది. 

ఎం.నాగేందర్