షరామామూలుగానే వరల్డ్ కప్‌లో టీమిండియా చేతిలో పాకిస్తాన్ పరాజయం పాలయ్యింది. ఇప్పటిదాకా వరల్డ్ కప్‌లో పాకిస్తాన్, టీమిండియాపై గెలిచిన దాఖలాల్లేవు. ఆ సెంటిమెంట్ మరోమారు పునరావృతమయ్యింది. టీమిండియాకి ఘనవిజయం దక్కింది. ఎప్పుడూ పాకిస్తాన్‌పై టీమిండియా బ్యాట్స్‌మన్ సెంచరీ చేయకపోయినా, ఆ ఘనత ఈ సారి వరల్డ్ కప్‌లో భారత బ్యాట్స్‌మన్ కోహ్లీ సాధించాడు.
క్రికెట్‌లో పెద్దగా సెంటిమెంట్లు పండవుగానీ, మానసికంగా ఈ సెంటిమెంట్లు ఆయా జట్లకు అదనపు బలాన్నీ, ప్రత్యర్థులకి లేనిపోని టెన్షన్‌నీ తెచ్చిపెడ్తుంటాయి. ఆ టెన్షన్‌ని అధిగమిస్తే, సెంటిమెంట్లు క్రికెట్‌లో పటాపంచలైపోతాయి. కానీ మైదానంలో దిగేటప్పుడే ఆయా జట్ల ట్రాక్ రికార్డుల్ని లెక్కేసేస్తుంటారు విశ్లేషకులు. అది మైదానంలోని ఆటగాళ్ళపై ఎంతో కొంత ఒత్తిడిని పెంచుతుంది.
ఇప్పుడిదంతా ఎందుకంటే, వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా చేతిలో ఇప్పటిదాకా టీమిండియా పరాజయాల్నే చవిచూసింది. ఈ టెన్షన్ ఇప్పుడు టీమిండియాని వెంటాడుతోంది. రేప్పొద్దున్నే సౌతాఫ్రికాతో టీమిండియా తలపడనున్న దరిమిలా, అభిమానుల్లోనూ బోల్డంత టెన్షన్ వుందన్నది కాదనలేని వాస్తవం. అయితే, సౌతాఫ్రికా ఎంత బలంగా వున్నా, ఆ టీమ్‌కీ చాలా వీక్‌నెస్‌లు వున్నాయి. స్పిన్‌ని ఆడటంలో సౌతాఫ్రికా చాలా ఇబ్బంది పడ్తుంది. కానీ, మోడ్రన్ క్రికెట్‌లో పరుగుల వరద సృష్టించడమెలాగో సౌతాఫ్రికా ఇటీవల పలు మ్యాచ్‌లలో చూపించేసింది.
సో.. రేపు మానసికంగా బరిలోకి టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో దిగితే తప్ప, సౌతాఫ్రికాపై పైచేయి సాధించడానికి వీలుపడదు. టోటల్‌గా యంగ్ గన్స్ టీమిండియాలో వుండడం కాస్త ఊరట కలిగించే అంశం భారత క్రికెట్ అభిమానులకి. మరి, ఈసారి వరల్డ్ కప్ హిస్టరీని టీమిండియా తిరగరాస్తుందా.? వేచి చూడాల్సిందే.