ఆమెకు అవార్డు ఇస్తే ‘క్రెడిట్‌’ ఎవరి ఖాతాలో?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ 'క్రెడిట్‌' సమస్య మొదలైంది. క్రెడిట్‌ అంటే ఇదేదో రుణానికో,  ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిందో కాదు. 'ఘనత'కు సంబంధించింది. ఏమిటా ఘనత? ఏమా కథ? ఒకవిధంగా చెప్పాలంటే ఇది…

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ 'క్రెడిట్‌' సమస్య మొదలైంది. క్రెడిట్‌ అంటే ఇదేదో రుణానికో,  ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిందో కాదు. 'ఘనత'కు సంబంధించింది. ఏమిటా ఘనత? ఏమా కథ? ఒకవిధంగా చెప్పాలంటే ఇది పాత కథే. మళ్లీ కొత్త రూపంలో తెర మీదికి వచ్చింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తెలుగు తేజం, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి  పీవీ సింధు కేంద్రంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య మళ్లీ పోటీ మొదలైంది.

ఆమె పతకం సాధించినప్పుడు  ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబు నాయుడు సింధు తెలంగాణ బిడ్డ అని, కాదు ఆంధ్రా అమ్మాయని పోటీపడిన సంగతి ఇంకా ఎవ్వరూ మర్చిపోకపోవచ్చు. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమంటే మాటలు కాదు కదా. సో…ఆ క్రెడిట్‌ కొట్టేయడానికి, తమ రాష్ట్రం అమ్మాయి పతకం సాధించిందని చెప్పుకోవడానికి ఇద్దరు సీఎంలు పిచ్చిగా పోటీపడ్డారు. కాని తాను ఫలానా రాష్ట్రానికి చెందిన అమ్మాయినని సింధు ఎక్కడా చెప్పకుండా జాగ్రత్తపడటంతో ఈ వివాదం నెమ్మదిగా తెరమరుగైంది. మరి ఇప్పుడు మళ్లీ తెర మీదికి ఎందుకొచ్చింది? ఇందుకు కారణం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే 'పద్మ' పురస్కారాలు.

తెలంగాణ సర్కారు పాతికమంది పేర్లను 'పద్మ' అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. వాటిల్లో పద్మ విభూషణ్‌  కోసం పీవీ సింధు పేరును సిఫార్సు చేసింది. విశేషమేమిటంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఇదే పురస్కారానికి సింధు పేరును రికమండ్‌ చేసింది. ఒకరు సిఫార్సు చేసిన విషయం మరొకరికి తెలుసా? లేదా కాకతాళీయంగా జరిగిందా? అనేది తెలియదు. కాని సింధుకు 'పద్మ' పురస్కారం ఇప్పించిన ఘనతను సొంతం చేసుకోవాలని, తమ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణికి జాతీయ పురస్కారం లభించిందని చెప్పుకోవాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని అర్థమవుతోంది. సింధు కుటుంబం మూలాలు ఆంధ్రాలో ఉన్నాయి. వారి కుటుంబం కొన్ని తరాల కింద హైదరాబాదుకు తరలివచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆమె ఎక్కడి అమ్మాయి? అనే ప్రశ్న రాలేదు. రాష్ట్రం విడిపోయాక ఆమె పతకం సాధించడంతో తెలంగాణ బిడ్డ అని కేసీఆర్‌, కాదు ఆంధ్రా అ అమ్మాయి అని చంద్రబాబు వాదులాడుకున్నారు. రెండు ప్రభుత్వాలు పోటీలు కోట్ల రూపాయల నగదు బహుమతులు, ఇళ్ల జాగాలు, ఉద్యోగాలు తదితర నజరానాలు ప్రకటించాయి.

నిజానికి సింధు విజయం పూర్తిగా ఆమె సొంతం. ఈ విజయం వెనక ఉన్న వ్యక్తి ఆమె శిక్షకుడు (కోచ్‌) పుల్లెల గోపీచంద్‌. రజత పతక విజయం క్రెడిట్‌ వారిద్దరిది. కాని ఈ విజయాన్ని ముందుగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) క్లెయిమ్‌ చేసుకుంది. జీహెచ్‌ఎంసీ క్లెయిమ్‌ చేసుకోవడమంటే తెలంగాణ ప్రభుత్వం క్లెయిమ్‌ చేసుకున్నట్లే లెక్క.  సింధు బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా ప్రాక్టీసు ప్రారంభించింది జీహెచ్‌ఎంసీ నిర్వహించిన సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులోనట…! ''సింధు జీహెచ్‌ఎంసీ ప్రోడక్ట్‌'' అంటూ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమె చిన్నతనంలో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులో ప్రాక్టీసు చేస్తున్నప్పటి ఫోటోలను  విడుదల చేశారు. సింధు ఒలింపిక్‌ వరకు వెళ్లేందుకు అడుగులు సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపు నుంచే పడ్డాయి అని అధికారులు చెప్పారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింధు విజయంలో తనకూ భాగముందని పరోక్షంగా చెప్పారు. తాను ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాదులో క్రీడారంగానికి అద్భుతమైన అవకాశాలు కల్పించానన్నారు. తానే గోపీచంద్‌ చేత అకాడమీ ఏర్పాటు చేయించానని, ఆయన అద్భుతమైన క్రీడాకారులను తయారుచేస్తున్నారని చెప్పారు. అంటే తాను ఆ అకాడమీ ఏర్పాటు చేయించకపోతే  సింధు శిక్షణ పొందే అవకాశం ఉండకపోయేదని, కాబట్టి ఆమె గెలుపునకు తానూ కారకుడిననని ఆయన ఉద్దేశం.  సింధు పూర్వీకులది ఆంధ్రాలోని ఏలూరు. తరాల కిందటే (ముత్తాతలు) తెలంగాణకు వచ్చేశారు. సింధు తండ్రి సహా అంతా తెలంగాణలోనే పుట్టి పెరిగారు. ఈ లెక్కన చూసుకుంటే ఆమె అచ్చమైన హైదరాబాదీ అవుతుంది. కాని పూర్వులు ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి  ఆంధ్రా అమ్మాయి అంటున్నారు. కాని ఈ ఒలింపిక్‌ విజేతను భారతీయురాలిగా చూడాలనే ఆలోచన లేదు.