రజనీకాంత్‌.. ఓవర్‌ రేటెడ్‌ సూపర్‌ స్టార్‌?!

రజనీకాంత్‌.. ఓవరేటెడ్‌ సూపర్‌ స్టార్‌! ఇది కావాలని చేసే విమర్శ కాదు, రజనీపై కోపంతోనో, అక్కసుతోనో అనే మాట కాదు. అభిమానులు హర్ట్‌ కావొచ్చు, రజనీని మానవతీతుడిగా చేసేవాళ్లూ ఒప్పుకోకపోవచ్చు. రజనీ గురించి చెప్పమంటే..…

రజనీకాంత్‌.. ఓవరేటెడ్‌ సూపర్‌ స్టార్‌! ఇది కావాలని చేసే విమర్శ కాదు, రజనీపై కోపంతోనో, అక్కసుతోనో అనే మాట కాదు. అభిమానులు హర్ట్‌ కావొచ్చు, రజనీని మానవతీతుడిగా చేసేవాళ్లూ ఒప్పుకోకపోవచ్చు. రజనీ గురించి చెప్పమంటే.. సినిమాల్లో సూపర్‌ ఈ విషయం ఏకగ్రీవంగా అంతా ఒప్పుకునేదే! దానికి మించి చెప్పేవే.. రజనీ స్టార్‌డమ్‌ను స్థాయిని చాలా వరకూ పెంచేస్తాయి!

రజనీకాంత్‌.. సింప్లిసిటీకి నిదర్శనం, నిలువెత్తు రూపం. సకల భోగాలూ ఉన్నా, హిమాలయాల బాట పట్టిన యోగి! ఇంకా.. బేసిక్‌ మోడల్‌ మొబైల్‌ వాడతాడు! తనను ఎవరూ అంతగా గుర్తుపట్టని విదేశాల్లో ఉన్నప్పుడు రోడ్డుపై సింపుల్‌గా నడుచుకొంటూ వెళతాడు! ఇంకా.. ఇలాంటివి ఎన్నో! జనాలకు ఎవరైనా నచ్చారంటే ఇదే సమస్య. వాళ్ల గురించి ఎన్నో పాజిటివ్‌ పాయింట్లు. వీటిల్లో ఉన్నవీ, లేనివీ కూడా ఆటోమెటిక్‌గా యాడ్‌ అవుతూ ఉంటాయి. గుప్తదానాలు చేశారని, ఎంతో మందిని ఉద్ధరిస్తున్నారని.. ఇలా ఎన్నో! రజనీ విషయానికి వస్తే.. ఆయనను తమిళ ప్రజలు దేవుడిలా చూస్తారని, ప్రాణాలర్పించడానికి రెడీగా ఉంటారనే.. మాట తమిళనాట కన్నా, బయటే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది! ఇలాంటి మాటలు చెప్పి.. తమకు పక్క రాష్ట్రాల విషయాల గురించి చాలా ఎక్కువ అవగాహన ఉందని కొంతమంది తమ 'మేధస్సు'ను ప్రదర్శించేస్తూ ఉంటారు!

 రజనీ రాజకీయాల్లోకి వస్తే ఇకఅంతే.. మిగతా పార్టీలన్నీ మూసేసకోవాల్సిందే అని మరికొందరు చిలకజోస్యాలు చెప్పేస్తూ ఉంటారు. రజనీకాంత్‌ అంటే తమిళులు కోసేసుకుంటారు.. రజనీని ముఖ్యమంత్రిగా చేయడానికి వారు రెడీగా ఉన్నారనే వాళ్లలో ఎంతమంది తమిళనాడులోని అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఎంత? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరనేది తర్వాతి ప్రశ్న. బయటి వాళ్ల అతిని పక్కన పెడితే.. తమిళనాట మాత్రం రజనీపై సెటైర్లు పడుతూనే ఉన్నాయి! ఇటీవల రజనీ పొలిటికల్‌ ఎంట్రీ విషయంలో శరత్‌ కుమార్‌ వ్యాఖ్యల నేపథ్యంలో రజనీ స్టార్‌ రేటింగ్‌ను ప్రస్తావించుకోవచ్చు! రజనీ సినీ అభిమానులు ఎంతో మంది ఉన్నారు, ఇదే సందర్భంలో రజనీని విమర్శించే వాళ్లు కూడా ఉన్నారనే విషయాన్ని కూడా ప్రస్తావించాలి. 

సగటు తమిళుడు పరిశీలిస్తున్నాడు!

ఎంత సూపర్‌స్టార్‌ అయినా కావొచ్చు.. సదరు స్టార్‌ తన సినిమాలతో ఎంత వినోదాన్ని అయినా అందించవచ్చు.. దీనికి మించిన రజనీకాంత్‌ తన సింప్లిసిటీతో, దైవభక్తితో, హిమాలయాల బాటతో మరింత ఇమేజ్‌నూ పెంపొందించుకుని ఉండొచ్చు.. కానీ రజనీ 'దాతత్వం' విషయంలో మాత్రం ఇంత వరకూ సరైన మార్కులు పొందలేకపోయాడనేది సగటు తమిళుడి నుంచి వినిపించే మాట. 

నిజమే.. రజనీకాంత్‌ సింపుల్‌గా ఉంటాడు, బయటకొస్తే విగ్గు పెట్టుకోడు. సినిమాల్లో మాత్రమే నటించాలి, బయటమాత్రం జీవించాలి అనేది ఆయన మోటో. చాలామంది స్టార్‌ హీరోలు తమ అసలు రూపాన్ని చూపించడానికి వెనుకంజ వేస్తారు, రజనీ మాత్రం దశాబ్దాలుగా మేకప్‌ లేకుండానే కనిపిస్తున్నాడు. అయితే ఇంత సింపుల్‌గా ఉండే రజనీ దాతత్వం విషయంలో మాత్రం పెద్దమనసును చాటుకోలేకపోయాడని తమిళులు అంటుంటారు. ప్రత్యేకించి చెన్నై వరదల సమయంలో స్పందించిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది కూడా!

రేడీయో జాకీలు, అనామక నటులు, పక్క రాష్ట్రాల వారు చెన్నై  ధీన స్థితిపై చూపిన ఔదార్యాన్ని కూడా రజనీ చూపలేదనేది అప్పట్లో వచ్చిన ఫిర్యాదు. రజనీ సినిమాలు కోట్ల రూపాయలు వసూలు చేస్తాయని చెప్పుకోవడం గొప్పే.. కానీ రజనీ ఎంత వితరణ చాటాడో చెప్పుకోవడం అంత కన్నా గొప్ప! రజనీ భారత దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకునే నటుడు అనేది అభిమానులకు గర్వకారణం కావొచ్చు, ఈ విధంగా ఆయన వందల కోట్లు వెనకేస్తున్నాడనేది కూడా వారు మురిసిపోయే విషయం కావొచ్చు! కానీ.. పరుల కోసం ఎంత పెడుతున్నాడనే విషయంలో ఏవైనా నంబర్లు చెప్పగలిగితే.. అప్పుడు అదిరిపోతుంది! 

రజనీ ఎంత సింపుల్‌గా ఉండినా, ఆయన తన కుటుంబీకుల బాగోగులను చూసుకుంటాడు తప్ప.. అంతకు మించి బయటవాళ్లకు ఏమీచేయడు అని కొంతమంది తమిళులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. రజనీ నుంచి వారు ఆశించడం రైటా? రాంగా? అనేది తర్వాతి వాదన. కానీ వారికి అదో అభిప్రాయంగా మారిందంతే!

సినిమాలకు లాభమే ప్రధానమా?

'బాబా' సినిమాలతో భారీగా లాస్‌ అయిన బయ్యర్లకు రజనీ డబ్బులు వెనక్కు ఇచ్చాడు.. అనేది బాగా ప్రచారం పొందిన అంశం. ఈ విధంగా సౌత్‌లో తొలుత చేసింది రజనీనే అని.. తన సినిమాను నమ్ముకుని నష్టపోయిన వారిని ఆయన ఆదుకున్నాడని అంటారు. ఈ విషయంలో సూపర్‌స్టార్‌, సూపర్‌స్టారే, మరి ఇదే వ్యవహారం 'లింగా' వద్దకు వచ్చే సరికి? ఏమైందనేది ఒక శేష ప్రశ్న! అత్యంత భారీ అంచనాల మధ్య, 'బాబా'కు మించిన ఆర్థిక వ్యవహారంగా వచ్చింది 'లింగా'. అయితే సీరియల్‌ తరహాలో ఉండే ఈ సినిమా డిజాస్టరాఫ్‌ ద డికేడ్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాపై భారీ మొత్తాన్ని వెచ్చించి విడుదల చేసిన బయ్యర్లకు చేతిలో చిప్ప మిగిలింది!

బయ్యర్లు రోడ్డు ఎక్కారు! రజనీ ఇంటి ముందు భైఠాయించారు. తాము నిండా మునిగామని ఆవేదన వ్యక్తంచేశారు. రీయింబర్స్‌ చేయమని రజనీకి బహిరంగ విజ్ఞాపనలు చేసుకున్నారు. ఆ సమయంలో కొంతమంది 'లింగా' డిస్ట్రిబ్యూటర్లు రజనీపై విమర్శల వాన కురిపించారు. మరి లాభాలు వచ్చి ఉంటే రజనీకి వాటాలు ఇచ్చేవారు కాదు కదా, నష్టాలొచ్చినప్పుడు వాళ్లే భరించాలి కదా.. అనే వాదన వినిపించవచ్చు. మరి ఈ మాత్రానికే అయితే.. మిగతా హీరోలకూ, సూపర్‌స్టార్‌కు తేడా ఎక్కడ?

ఇక జయలలితను తనే ఎన్నికల్లో ఓడించాను… అని ఈ మధ్య సూపర్‌స్టార్‌ ప్రకటించుకోవడంపై మీడియా నుంచి వ్యంగ్యాస్త్రాలు పడ్డాయి. జయను ఓడించాను అని చెప్పుకుంటున్న రజనీ పీఎంను ఎందుకు ఓడించలేకపోయాడు? వివిధ సందర్భాల్లో రజనీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానే తమిళ రాజకీయాలను ప్రభావితం చేయాలని చూసినప్పుడు ఫలితాలు ఎందుకు రాలేదు? అంత సత్తానే ఉంటే.. ఆయనే ఎందుకు బరిలోకి దిగడం లేదు? అనే ప్రశ్నలు సహజంగానే పడ్డాయి!

రజనీ జడ్జిమెంట్‌ ఇంతేనా!

తను వంకరగా మెట్లు దిగొస్తే.. తను స్టైల్‌గా నోట్లోకి సిగరెట్లో, చాక్లెట్టో వేసుకుంటే.. తను గడ్డం పెంచేస్తే, కొత్త టైపు విగ్గు పెట్టేస్తే.. సినిమాలు ఆడేస్తాయనే భ్రమతో ఉన్నాడా? సూపర్‌స్టార్‌ అని మరికొందరు క్రిటిక్స్‌ ప్రశ్నిస్తున్నారు. కథ అవసరం లేదు, కథనం గొప్పగా ఉండనక్కర్లేదు.. తన స్టైల్‌ మీదే సినిమా నడిచేస్తుందని రజనీ భావిస్తున్నాడనేందుకు రుజువు 'కబాలి' వంటి సినిమాలే అని విశ్లేషకులు అంటారు. ఆ సినిమాకు కలెక్షన్లు వచ్చి ఉండొచ్చు గాక.. కానీ కనీసం మంచి సినిమాగా నిలిచే లక్షణాలు కూడా లేవు దానికి, అనే పెదవి విరుపులుండనే ఉన్నాయి. ఈ వయసులో రజనీ కేవలం కమర్షియల్‌ దక్పథంతోనే సినిమాలు చేయడమా? సూపర్‌స్టార్‌ నుంచి కోరుకునేది ఇంతేనా? అనేది వారి ప్రశ్న!

సెటైర్లు తమిళులే వేస్తారు!

బయటివాళ్లు రజనీ మీద అతి భక్తి ప్రవత్తులు చూపించినా, రజనీకాంత్‌ తమిళులందరి గుండెల్లో దేవుడు.. అని వీళ్లు నొక్కి వక్కాణించినా.. రజనీపై సెటైర్లు పడేది తమిళనాడు నుంచే! రజనీని లక్ష్య పెట్టని సినిమా వాళ్లు, రజనీకి ప్రాధాన్యతను ఇవ్వని రాజకీయ పార్టీలు.. రజనీకి అంతసీన్‌ లేదనే వాళ్లు తమిళనాటే ఉన్నారు! సూపర్‌ స్టార్‌పై వ్యంగ్యాస్త్రాలకు వాళ్లు వెనుకాడలేదెప్పుడూ.

మొన్న శరత్‌కుమార్‌ వ్యాఖ్యాలను పరిశీలించినా మరి కొంతమంది సినిమా వాళ్ల మాటలను పరిశీలించి చూసినా.. రజనీ మానవాతీత వ్యక్తి ఏమీకాదు వారి దష్టిలో అనే విషయం స్పష్టం అవుతుంది. వెనుకటికి సత్యరాజ్‌ ఒక సినిమా తీశాడు. అది తెలుగులోకి అనువాదమై 'కథానాయకుడు' పేరుతో విడుదల అయ్యింది. (రజనీకాంత్‌ కూడా ఆ తర్వాత ఇదే పేరుతో ఒక సినిమాలో నటించాడు.. జగపతిబాబు అందులో రజనీ సహనటుడు). సత్యరాజ్‌ 'కథానాయకుడు' తమిళ సినీ ఇండస్ట్రీపై సెటైరిక్‌ రూపొందించింది. అందులో రజనీని ఉద్దేశించి కొన్ని సీన్లుంటాయి. ఆ సినిమాలో సత్యరాజ్‌ ఒక తమిళ సినీస్టార్‌గా నటించాడు. రజనీ తీరుపై బలమైన సెటైర్లే ఉంటాయి ఆ సినిమాలో. సత్యరాజ్‌ అప్పటికే పేరున్న నటుడు, స్టార్‌గా సెటిలైన హీరో కాబట్టి.. రజనీ మీద కూడా ధైర్యంగా వ్యంగ్యాస్త్రాలు సంధించగలిగాడు. ఆ సినిమాను చూస్తే..రజనీపై తమిళ సినిమా నుంచే సెటైర్లు పడుతుంటాయని బయటి వారు కూడా అర్థం చేసుకోవచ్చు.

సింపుల్‌గా ఉండటం.. రజనీ జీవనశైలి. ఆ విషయంలో అభినందనీయుడే. మిగతా హీరోలందరూ బడాయిలు పడుతుంటారు కాబట్టి.. వారి మధ్యన రజనీ ప్రత్యేకంగా నిలుస్తుంటారు. ఈ విషయంలో ఆయన ప్రత్యేకత ఆయనదే. అయితే.. మిగతా విషయాల్లో మాత్రం రజనీ మరీ అంత అతీతమైన వ్యక్తి కాకపోవచ్చు.. అనేది సామాన్యుల నుంచి వివిధ సందర్భాల్లో వ్యక్తమైన స్పందన, క్రిటిక్స్‌ విశ్లేషించే మాట. అతీమైన వ్యక్తిగా ఉండాల్సిన అవసరం కూడా రజనీకి లేకపోవచ్చు. ఆయన లైఫ్‌ ఆయన ఇష్టం!

రాజకీయాల ముచ్చట ఒకటీ తీరిపోవాలి!

జనాలు సినీ హీరోలను అభిమానిస్తారు. ఈ తరంలో ఆ అభిమానం అంత వరకే! ఏ కుల బంధంతోనో, మత బంధంతోనో.. సినిమాల ఆవల కూడా హీరోలను అభిమానించే వారు ఉండవచ్చు. కానీ అందరూ ఇలా ఉండరు, ఉన్న వారి మద్దతు దేనికీ చాలదు. వెనుకటికి దక్షిణాదినే చాలా మంది స్టార్‌ హీరోల రాజకీయ ఆరంగేట్రాలతో ఈ విషయం తేలిపోయింది. మరి రజనీ కూడా ఆ రాజకీయం ఏదో మొదలుపెడితే.. మొత్తం వ్యవహారంపై స్పష్టత వస్తుంది! అదే జరిగితే.. రజనీ పరిస్థితి ఎంజీఆర్‌కు తక్కువ, విజయ్‌కాంత్‌కు ఎక్కువ అన్నట్టుగా ఉంటుందనేది ఒక సగటు తమిళ రాజకీయ విశ్లేషకుడి మాట!