భారతీయ పాస్పోర్టుకి ప్రపంచంలో ఎక్కడికి వెళ్లడానికైనా వీసాలు పొందే వీలుంటుంది కానీ, అమెరికాకి పొందడం మాత్రం అంత తేలిక కాదు. ఇక్కడ చెప్పుకునేది చదువు వీసాలు, జాబ్ వీసాలు గురించి కాదు… కేవలం ఒక టూరిస్టుగా తిరిగి రావడానికి కూడా!
అమెరికన్ టూరిస్ట్ వీసా ఉన్నవారికి అది పొందడానికి ఎంత ప్రిపరేషన్ కావాలో, ఎలా కౌన్సలేట్ వద్ద లైన్లో నిలబడాలో, ఫీజులెంతో ఒక అవగాహన ఉంటుంది. లైన్లో నిలబడినంత మాత్రాన వీసా వస్తుందని కాదు. రిజెక్ట్ అయ్యే చాన్సులు ఎక్కువగానే ఉంటాయి. ఉన్నంతలో పిల్లలు అమెరికాలో ఉండి వాళ్లని చూడడానికి వెళ్లే వయసుమీరిన తల్లిదండ్రులకి ఈ వీసా తేలికే కానీ, వయసులో ఉన్నవాళ్లకి దొరకడం చాలా కష్టం. ఎందుకంటే అమెరికన్ టూరిస్ట్ వీసా అంటూ ఇస్తే ఒకేసారి పదేళ్లకు ఇచ్చేస్తారు. అంటే ఆ పదేళ్లలో ఎన్నిసార్లైనా టికెట్ కొనేసుకుని వెళ్లొచ్చేస్తూ ఉండొచ్చు. పదేళ్ల కాలం తీరితే మళ్లీ లైన్లో నిలబాడాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ఏజెంటు ద్వారా పాస్పోర్టుని కౌన్సలేట్ డ్రాప్ బాక్సులో వేస్తే రెండువారాల్లో వీసా రిన్యూ అయిపోయి వచ్చేస్తుంది. కనుక ఇలాంటి వీసాని ఇవ్వడానికి చాలా రకాలైన చెక్స్ చేయడం జరుగుతుంది కౌన్సిలేట్ ఇంటర్వ్యూలో.
ముఖ్యంగా టూరిస్ట్ వీసా మీద వెళ్లినవాళ్లు కూడా అమెరికా నుంచి తిరిగిరాని ప్లాన్స్ వేస్తున్నారు. పదేళ్ల వీసాతో అమెరికాలో ల్యాండవ్వగానే ఆర్నెల్ల పాటు అక్కడ ఉండనిస్తారు. ఆ లోగా తిరిగి వెళ్లిపోవాలి. అంటే సొంత దేశానికని కాదు. పక్కనున్న ఏ విదేశానికో వెళ్లి మళ్లీ దేశంలోకి ఎంటరైపోయి ఇంకో ఆర్నెల్లు ఉండొచ్చు. ఇలాంటి లెక్కలతో కొందరు అమెరికాలోనే ఉండిపోయి ఇల్లీగల్ సంపాదన చేసే వాళ్లున్నారు. రూల్ ప్రకారం టూరిస్ట్ వీసా మీద వెళ్లేవారు ధనార్జన చేయకూడదు. కానీ కొందరు అక్రమదారుల్లో అక్కడ వలసదారుల్లా మారిపోయే అవకాశముంది కనుక వీసా ఇచ్చేటప్పుడే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు కౌన్సిలేట్ వాళ్లు.
ఉదాహరణకి సదరు అమెరికన్ టూరిస్ట్ వీసా కోరే వ్యక్తి వయసెంత, అతనికి ఇండియాలో స్థిరమైన ఉద్యోగం ఉందా, సంపాదన బాగుందా, స్థిరాస్థులు ఉన్నాయా, ట్యాక్స్ క్రమంగా కడుతున్నాడా, అకౌంట్లో డబ్బులు నిండుగా ఉన్నాయా వంటివి చూస్తారు. అన్నీ ఉన్నాయనిపించి, ఆ వ్యక్తి అమెరికాకి కేవలం టూరిస్టుగానే వెళ్లి వచ్చేస్తాడని నమ్మకం కలిగితే వీసా ఇచ్చేస్తారు. ముందుగా వయసు పెద్దదయ్యుండి, వారి సంతానం అమెరికాలో ఉంది కనుక వెళ్తున్నామంటే వీసా ఇవ్వడంలో మెలికలేమీ ఉండవు. ఎందుకంటే అలా వయసు మీరిన వారు అక్కడికెళ్లి పని చేసి సంపాదించడమనేది జరగదు కనుక.
అమెరికాలో తరచూ తెలుగుసంఘాల ఉత్సవాలు జరుగుతుంటాయి- తానా, ఆటా, నాట్స్..ఈ విధంగా. ఈ ఉత్సవాల సమయంలో సాధారణంగా తెలుగునాట ఉన్న కళాకారుల్ని, సినీప్రముఖుల్ని వారి లెటర్ హెడ్ మీద ఆహ్వానపత్రం పంపి వీసా స్పాన్సర్ చేసి పిలుస్తుంటారు తెలుగుసంఘాలవాళ్లు. నూటికి తొంభై శాతం మంది కళాకారులకి ఈ కోటాలోనే టూరిస్ట్ వీసాలొస్తుంటాయి. అలా లెటర్ తెచ్చుకుంటే వీసా గ్యారెంటీ అని కాదు. అక్కడ కూడా చాలా రెజెక్షన్స్ ఉంటాయి. ప్రొఫైల్ కరెక్ట్ గా ఉండి, కౌన్సులేట్ లో ఇంటర్వ్యూ చేసే అమెరికన్ అధికారికి అనుమానం రాకపోతేనే వీసా ఇవ్వబడుతుంది. ఆ నమ్మకం కలిగించడం అభ్యర్థి పని.
సరే ఇదంతా పక్కనపెట్టి, అమెరికన్ టూరిస్ట్ వీసా వల్ల ఉపయోగమేంటి? ఆ దేశం వెళ్లి చూసి రావడానికి..అంతే కదా అనిపించొచ్చు. అలా అనుకుంటే పొరబాటే. అమెరికన్ టూరిస్ట్ వీసా పొందగలిగితే ట్రావెలింగ్ ఆసక్తి ఉన్నవాళ్లకి చాలా ఉపయోగాలుంటాయి. అమెరికన్ టూరిస్ట్ వీసా ఉన్న భారతీయులకి మెక్సికో, కొలంబియా, కోస్టారికా, బహామాస్, డొమినికన్ రిపబ్లిక్, టర్కీ, యూ.ఎ.ఈ, శ్రీలంక, ఫిలిపైన్స్ లాంటి దేశాలకు ఆన్ అరైవల్ వీసాలో, లేదా ఫ్రీ ఎంట్రీయో లభించే అవకాశముంటుంది. ఇవే కాదు..ఇంకా చాలా దేశాలకు ఈజీగా వెళ్లే అవకాశముంటుంది.
అందుకే ముఖ్యంగా ట్రావెల్ వ్లాగర్లు అమెరికన్ వీసా పొందేందుకు తహతహలాడుతుంటారు. ఒక్క భారతీయులే కాదు, ట్రావెల్ పరంగా వీక్ పాస్పోర్ట్ ఉన్న ఏ దేశీయులకైనా అమెరికన్ వీసా ఆ పాస్పోర్ట్ స్థాయిని పెంచుతుంది. అందుకే ఫీజు ఎక్కువైనా, వీసా రిజెక్ట్ అయినప్పుడు ఆ డబ్బు వెనక్కి రాదని తెలిసినా ప్రయత్నాలైతే చేస్తుంటారు.
ఇక్కడ ఇంకొక విషయం ఉంది. టూరిస్ట్ వీసా ఒకసారి రిజెక్టైతే రెండో సారి రావడం ఇంకాస్త కష్టమవుతుంది. ఏది ఏమైనా అమెరికన్ టూరిస్ట్ వీసా ఉంటే ప్రపంచయాత్రికులకి సగం కష్టాలు తీరినట్టే. వీసా తీసుకుని వెళ్లాల్సిన చాలా దేశాలకి వీసా పొందడం కూడా తేలికవుతుంది కనుక. అందుకే అమెరికన్ టూరిస్ట్ వీసా మీద ఇన్వెస్ట్ చేసేవాళ్లు నేటి యువతలో ఎక్కువమంది ఉన్నారు.
పద్మజ అవిర్నేని
many cooks working in indian restuarants are on tourist visa. They come here, make 10k cash per month. and after 6 months, they cross the border to canada for a week and come back. Rinse and repeat for 5-6 years and go home, with loads of cash. Better than Dubai.
10K rupees ?
10k usd buddy