తెలంగాణ ముఖ్యమంత్రి ఎదుటివారికి తాను ఇవ్వాల్సినవి ఇవ్వకుండా తనకు వారి నుంచి రావల్సినవాటి కోసం ఆరాటపడిపోతున్నారు. తాను ఇవ్వాల్సినవి తొక్కిపెడుతూ, సమస్యలను పరిష్కరించకుండా నాన్చుతూ అవతలివారిపై ఒత్తిడి పెంచుతున్నారు. అవతలివారు ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కేసీఆర్ ఆరాటపడిపోయేది ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న సచివాలయం, అసెంబ్లీ భవనాల కోసం. ఈ భవనాల కోసం ఆరాటపడిపోతున్న కేసీఆర్ విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలోని ఉమ్మడి సంస్థల విభజన విషయాన్ని పట్టించుకోవడంలేదు. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లయినా ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాకుండా ఉంది. నిజానికి రెండు ప్రభుత్వాలు కలిసి కూర్చుని చర్చించుకుంటే హైదరాబాదులోని ఉమ్మడి సంస్థల విభజన కష్టం కాదు. కాని కేసీఆర్ ఇందుకు ముందుకు రావడంలేదు.
సచివాలయం, అసెంబ్లీ భవనాల కోసం కేసీఆర్ ఆరాటపడటానికి ఆస్కారం ఇచ్చిందే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నోటుకు ఓటు కేసు కారణంగా సొంత రాష్ట్రం నుంచే పరిపాలన సాగించాలంటూ రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో హడావుడిగా సచివాలయం నిర్మించి హైదరాబాదులోని ఏపీ సచివాలయంలోని ఉద్యోగులను అక్కడికి తరలించారు. అసెంబ్లీ సమావేశాలు కూడా హైదరాబాదులో నిర్వహించేది లేదన్నారు. దీంతో ఈ భవనాలు ఖాళీ అయిపోయాయి. ఇవి ఎప్పుడైతే ఖాళీ అయిపోయాయో అప్పటినుంచి వాటిని అప్పగించాలని పాట పాడుతున్నారు. ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో చెప్పించారు. పని కాలేదు. దీంతో తాజాగా త్రిసభ్య కమిటీని నియమించారు. మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జి.వివేకానందతో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ భవనాల అప్పగింత విషయమై ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంది. సాధ్యమైనంత త్వరగా భవనాలను అప్పగించాలని కోరనుంది. వాస్తవానికి రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత గవర్నర్‌దే.
హైదరాబాదులోని సచివాలయం, అసెంబ్లీ భవనాలు ఆయన ఆధ్వర్యంలోనే విభజించారు. హద్దులను ఆయనే నిర్ణయించారు. ఈ భవనాలకు సంబంధించి వివాదాలు తలెత్తితే ఆయనే ఇద్దరు చంద్రులను కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. ఈ విషయంలోనూ ఆయన 'న్యాయంగా' వ్యవహరించడంలేదనే అనుమానాలు కలుగుతున్నాయి. సచివాలయం కూల్చి కొత్తది నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇలా నిర్ణయించుకున్న వెంటనే గవర్నర్‌ను కలిసి ఏపీకి సంబంధించిన సెక్రటేరియట్ భవనాలు కూడా అప్పగిస్తే మొత్తం కూలగొట్టి కొత్త నిర్మాణం ప్రారంభిస్తానన్నారు. కేసీఆర్ చెప్పడమే తడవుగా గవర్నర్ ఈ విషయం చంద్రబాబు చెవిలో వేయడమే కాకుండా భవనాలు అప్పగించాల్సిందిగా కోరారు. బాబు కేబినెట్ సమావేశంలో చర్చించిన తరువాత నిర్ణయిస్తామన్నారు. ఇందుకు ఆయన చెప్పిన కారణం…విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలోని ఉమ్మడి సంస్థల విభజన విషయంలో తెలంగాణ సర్కారు సహకరించడంలేదు. ఆ సంస్థలకు సంబంధించిన ఆస్తుల పంపకం, మరికొన్ని సమస్యలు న్యాయంగా పరిష్కారమైతే భవనాలు అప్పగిస్తామన్నారు.
అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కరించుకోవాలనుకుంటున్నామని, సమస్యలు పరిష్కారం కాకుండా భవనాలు అప్పగిస్తే ప్రజలు నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పారు. తమకు న్యాయంగా రావల్సిన నిధులు, ఆస్తులు రాకుండా నిలిచిపోయాయని, ముందు కీలకమైన ఈ సమస్య పరిష్కారం కావాలని, దీనిపై చాలా జాప్యం జరుగుతోందని చెప్పారు. బాబు చెప్పింది సబబుగా ఉంది కాబట్టి గవర్నర్ వెంటనే చంద్రులను కూర్చోబెట్టుకొని సమస్య పరిష్కరించాలి. కాని పెద్దాయన 'సచివాలయం ఖాళీగానే ఉంది కదా ఇచ్చేయండి' అని చెప్పారు. సచివాలయం మొత్తం ఖాళీ చేసి 'ఇదిగోండి తాళం చెవి' అని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇచ్చేస్తే ఉమ్మడి రాజధాని మీద ఏపీ సర్కారుకు హక్కు పోతుందట…!
కాబట్టి పదేళ్లపాటు హైదరాబాదుపై ఉన్న హక్కును వదులుకోవడానికి చంద్రబాబు నాయుడు ఇష్టపడటం లేదు. విభజన సమస్యలు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం కూడా ఇందుకు కారణంగా చెబుతున్నారు. హైకోర్టు డివైడ్ కాలేదు. ఉమ్మడి రాష్ట్రంపై ఇప్పుడే హక్కులు ధారాదత్తం చేస్తే ఇబ్బందులొస్తాయి. దీంతో సచివాలయం వెలగపూడికి తరలిపోయినా ఏపీ సర్కారు తనకు కేటాయించిన సచివాలయంలో కొంత సిబ్బందిని (స్కెలిటన్ స్టాఫ్) ఉంచింది. మరి కేసీఆర్ నియమించిన త్రిసభ్య కమిటీ ఏపీ సర్కారుతో ఎలాంటి సంప్రదింపులు జరుపుతుందో, చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.