అప్పుడందరివారు…మరి ఇప్పుడు?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ చెందిన, అందరూ ప్రాంతాలకతీతంగా అభిమానించిన, ఆదరించిన, ఆరాధించిన కవులు, రచయితలు, కళాకారులు ఇప్పుడు ఆయా రాష్ట్రాలకే పరిమితం కాబోతున్నారా? వారు  ఒక ప్రాంతానికి చెందినవారుగా ముద్ర వేయించుకోబోతున్నారా?…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ చెందిన, అందరూ ప్రాంతాలకతీతంగా అభిమానించిన, ఆదరించిన, ఆరాధించిన కవులు, రచయితలు, కళాకారులు ఇప్పుడు ఆయా రాష్ట్రాలకే పరిమితం కాబోతున్నారా? వారు  ఒక ప్రాంతానికి చెందినవారుగా ముద్ర వేయించుకోబోతున్నారా? ఒకప్పుడు అశేష ఆంధ్రులు (తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ) అభిమానించిన మహానుభావులు ఒక ప్రాంతానికి లేదా ఒక్క రాష్ట్రానికే పరిమితం కాబోతున్నారా? ఒక రాష్ట్రంలోని  కవులు, రచయితలు, కళాకారుల గురించి మరో రాష్ట్రంవారు ఇక తెలుసుకునే పని లేదా?…ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు ‘అవును’ అనే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడబోతున్నది. ప్రధానంగా తెలంగాణలోని కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ‘తెలంగాణీకరణ’ చేయడంలో భాగంగా చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే ఒకప్పటి ‘అందరివారు’, ఇక ముందు ‘కొందరి వారు’గా మిగిలిపోయే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయాక రెండు తెలుగు ప్రభుత్వాలు నిరంతరం ఘర్షణ పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం కొన్ని అంశాలకే పరిమితమైన ఈ ఘర్షణపూరిత వాతావరణం సాహిత్య, సాంస్కృతిక రంగాలకు వ్యాపించే అవకాశముంది.

మొన్నటివరకు తెలుగు ప్రజలంతా అభిమానించి, ఆరాధించిన కవులు, కళాకారులు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందినవారుగా విడిపోయారు. ప్రస్తుతం జీవించి ఉన్నవారు సహజంగానే విడిపోతే, దివంగతులైన వారిని ప్రభుత్వాలు విడదీస్తున్నాయి. తెలంగాణలో సీమాంధ్ర ఛాయలేవీ ఉండకూడదని, ఈ రాష్ట్రం నూటికి నూరు శాతం తెలంగాణ రాష్ట్రంగానే ఉండాలని ఆకాంక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాహిత్య, సాంస్కృతిక రంగాలపై తెలంగాణ ముద్ర వేసేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటంలో భాగంగా, తెలంగాణ ప్రముఖులను గౌరవించడంలో భాగంగా కేసీఆర్‌ ప్రభుత్వం ఈమధ్య మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతిని, ప్రముఖ అభ్యుదయ కవి, సినీ గేయ రచయిత డాక్టర్‌ దాశరథి జయంతిని అధికారికంగా నిర్వహించింది. ఉమ్మడి రాష్ట్రంలో పివి నరసింహారావు జయంతి, వర్థంతి కార్యక్రమాలను ప్రభుత్వం తరపున నిర్వహించినప్పటికీ అది నామమాత్రం, మొక్కుబడి మాత్రమే. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ పివి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తూతూ మంత్రంగా నిర్వహించింది. కాంగ్రెసు అధినేత్రి సోనియా గాంధీకి పివి అంటే అయిష్టం కాబట్టి ఆయన కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తే ఆమెకు కోపం వస్తుందనే ఉద్దేశంతో ఏదో మమ అనిపించేవారు. అయితే కేసీఆర్‌ అందుకు భిన్నంగా ఘనంగా నిర్వహించారు. ఒక విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెడతామన్నారు. ఆయన పేరిట చేయబోయే కొన్ని కార్యక్రమాలను ప్రకటించారు.

 పివి తెలంగాణ వ్యక్తి కాబట్టి ఆయన మాజీ ప్రధాని అయినా ఆంధ్రప్రదేశ్‌ వారు ఎటువంటి కార్యక్రమాలు చేయనక్కర్లేదు. దాశరథి జయంతిని కూడా కేసీఆర్‌ ఘనంగా నిర్వహించారు. ఇలా ప్రభుత్వం తరపున నిర్వహించిన దాఖలాలు గతంలో లేవు. వాస్తవానికి దాశరథి వంటి మహాకవి జయంతిని తెలుగువారంతా జరుపుకోవల్సిందే. కాని..ఆయన ఇప్పుడు ఆయన తెలంగాణ కవిగా మారిపోయారు. ఒకప్పుడు ఆయన సినిమా పాటలను తెలుగు ప్రజలంతా అభిమానించారు. ఆయన్ని తెలుగు కవిగా చూశారే తప్ప తెలంగాణ కవిగా చూడలేదు. కాని ఇప్పుడు తెలంగాణ కవిగా మారిపోయారు.  ఆయనను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలచుకోవల్సిన అవసరం లేదు. అలాగే ఆంధ్ర ప్రాంత ప్రముఖులను తెలంగాణవారు పట్టించుకోరు. సమస్త తెలుగువారి ‘ఉమ్మడి సంపద’ అయిన కవులు, రచయితలు, కళాకారులపై ‘ప్రాంతీయ ముద్రలు’ పడిపోయాయి. దాశరథి జయంతిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించడం హర్షణీయమే అయినా ఆ సభలో కేసీఆర్‌ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం ఆయన స్థాయికి తగింది కాదు. హైదరాబాద్‌లో దాశరథి విగ్రహం ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్‌ పనికిమాలినోళ్లు విగ్రహాలు (ట్యాంక్‌బండ్‌ మీద ఉన్న విగ్రహాల గురించి కావొచ్చు) చాలా ఉన్నాయని అన్నారు. బళ్లారి రాఘవ ఎవరో ఎరికైనా తెలుసా? అని ప్రశ్నించారు. ఎంఎ తెలుగు చదువుకున్న కేసీఆర్‌కు బళ్లారి రాఘవ ఎవరో తెలియకుండా ఉంటుందా? కేవలం ప్రాంతీయ ద్వేషం రెచ్చగొట్టేందుకే ఇలా మాట్లాడారు.

 మొన్నటివరకు తెలుగు పిల్లలు తమ పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర కవులు, కళాకారుల గురించిన పాఠాలు చదువుకున్నారు. అన్ని ప్రాంతాల గురించి తెలుసుకున్నారు. తెలంగాణ విద్యార్థులు ఆంధ్ర కవులు, రచయితలపై, ఆంధ్ర విద్యార్థులు తెలంగాణ ప్రముఖులపై పరిశోధనలు చేశారు. కాని…ఇక ముందు ఇలా ఉండకపోవచ్చు. నాయకులు ఎలా వ్యవహరించినా, రాష్ట్రాలుగా విడిపోయినా కవులు, కళాకారులు, రచయితలు అందరివారే. 

-అమృత