మానవుడి మేధకు కారణమైన కమ్యూనికేషన్ రెవల్యూషన్ ఒక్కోసారి మూఢనమ్మకాలను వ్యాప్తి చేసేందుకు కూడా పనికొస్తుందా? అంటే పలు సందర్భాల్లో అది నిజమేనని రుజువైంది. తాజాగా సోమవారం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు స్వల్పంగా ఇండియానూ ప్రభావితం చేసిన భూకంపం నేపధ్యంలో 26 అనే తేదీయే అశుభం అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ తేదీ అశుభం అనేందుకు గాను కొన్ని దృష్టాంతాలను కూడా కొందరు చూపిస్తున్నారు.
1700 సంవత్సరం జనవరి 26న నార్త్ అమెరికాలో భూకంపం వచ్చిందని, 1883 ఆగస్టు 26న క్రకాటావూ అనే అగ్నిపర్వతం బద్ధలైందని, 1926 జూన్ 26న ది రోడ్స్ ఎర్త్ కేక్ సంభవించిందని, 1932 డిసెంబరు 26న చైనాలో భూకంపం వచ్చిందని, 1939 డిసెంబరు 26న టర్కీలో భూకంపం చోటు చేసుకుందని, 1951 జనవరి 26న పోర్చుగల్‌లో, 1963 జులై 26న, 1976 జులై 26న భూకంపాలు సంభవించాయని, 1996 డిసెంబరు 26న సాబాహ్ టైడల్ వేవ్స్, 2003 డిసెంబరు 26న ఇరాన్లో భూకంపం వచ్చిందని, 2004 డిసెంబరు 26న సునామీ ఉత్పాతం, 2010 ఫిబ్రవరి 26న జపాన్‌లో భూకంపం, అదే ఏడాది జూన్ 26న తాసిక్ ఎర్త్‌కేక్, అదే ఏడాది జులై 26న తైవాన్ ఎర్త్ కేక్, అదే ఏడాది అక్టోబరు 26న మెరాపి అగ్నిపర్వతం బద్ధలవడం, మెంటావాయ్ సునామీ రావడం, 2001 జనవరి 26న గుజరాత్లో భూకంపం, 2015 ఏప్రిల్ 26న నేపాల్‌లో భూకంపం, 2005 సంవత్సరం జులై 26న ముంబయి వరదలు… ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతి వైపరీత్యాలకు 26 వతేదీకి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుందని వీరు అంటున్నారు. అంతేకాదు మానవ సంబంధ విధ్వంసాలకూ ఈ తేదీ కారణమవుతోందంటూ ముంబయి మీద 2008 నవంబరు 26న జరిగిన ఉగ్రదాడుల్ని చూపుతున్నారు. ఈ రకమైన మెసేజ్‌లు అప్పుడే వాట్సప్, ఫేస్‌బుక్‌లలో హల్ చల్ చేస్తున్నాయి.
ఆధునిక టెక్నాలజీ ద్వారా జీవనం సులభతరం కావాలే తప్ప… లేనిపోని అపోహలు రప్పించి మనసుల్లో లేనిపోని భయాల వ్యాప్తికి కారణం మవడం సరైంది కాదు.