‘గ్రీన్ ఛానల్’.. ఈ పేరు ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అవుతోంది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాల్ని, వేరే ప్రాంతంలో ప్రాణాలతో పోరాడుతూ అవయవదానం కోసం ఎదురుచూస్తోన్న బాధితులకు అమర్చేందుకోసం జరిగే ‘ప్రయాణం’ ఈ గ్రీన్ ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం.
ఇటీవలే బెంగళూరు నుంచి హైద్రాబాద్‌కి ‘గ్రీన్ ఛానల్’ ద్వారా ఓ గుండె తరలి వచ్చింది. బెంగళూరులో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండను, హైద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో గుండె జబ్బుతో బాధపడ్తోన్న మహిళకు అమర్చిని వైద్యులు ఈ ‘ఆపరేషన్’లో విజయం సాధించారు. ఆ మధ్య బెంగళూరు నుంచి చెన్నయ్ ఇలానే పలుమార్లు ‘గుండె’ పయనించింది. హైద్రాబాద్‌లోనే ఓ ఆసుపత్రి నుంచి ఇంకో ఆసుపత్రికి రెండు మూడుసార్లు గుండె తరలివచ్చింది.
తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై ఆసుపత్రి నుంచి చెన్నయ్‌కి ఓ గుండె తరలి వెళ్తోంది. కృష్ణా జిల్లాకి చెందిన ఓ యువకుడు మణికంఠ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి చికిత్స అందిస్తున్న వైద్యులు, బ్రెయిన్ డెడ్‌గా తేల్చారు. అతని కుటుంబీకులు, పెద్ద మనసుతో అవయవదానానికి అంగీకరించారు.
గుండెను చెన్నయ్‌కి తరలించనుండగా, లివర్‌తోపాటు ఓ కిడ్నీని హైద్రాబాద్‌కి తరలిస్తున్నారు. మరో కిడ్నీని గుంటూరులోనే ఓ వ్యక్తికి అమర్చనున్నారు. రెండు కళ్ళను ఇద్దరు వ్యక్తులకు అమర్చుతారు. చెన్నయ్‌కి తరలి వెళ్ళే గుండెతోపాటు ఊపిరితిత్తులనూ ఇంకొకరికి అమర్చనున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి ఎన్నారై ఆసుపత్రి నుంచి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం వరకూ ‘గ్రీన్ ఛానల్’ని ఏర్పాటు చేసి, దారి పొడుగునా ఎలాంటి ఇబ్బందీ లేకుండా పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.