ఆనందంగా జీవించ‌డం ఎలా?

జీవితంలో స‌క్సెస్ గురించి చాలా మంది చెబుతారు! చాలా ర‌కాలుగా చెబుతారు! స‌క్సెస్ ఫుల్ జీవితం కావాలంటే అలా చేయాలి, ఇలా చేయాలి.. ఐదింటికే లేవాలి! అంద‌రితోనూ ప‌ద్ధ‌తిగా ఉండాలి! రేప‌టి ప‌నిని ఈ…

జీవితంలో స‌క్సెస్ గురించి చాలా మంది చెబుతారు! చాలా ర‌కాలుగా చెబుతారు! స‌క్సెస్ ఫుల్ జీవితం కావాలంటే అలా చేయాలి, ఇలా చేయాలి.. ఐదింటికే లేవాలి! అంద‌రితోనూ ప‌ద్ధ‌తిగా ఉండాలి! రేప‌టి ప‌నిని ఈ రోజే చేయాలి! ప్లాన్డ్ గా ఉండాలి, పంక్చువ‌ల్ గా ఉండాలి.. ఇలా ఇలా ఎన్నో చెబుతూ ఉంటారు! మ‌రి స‌క్సెస్ గురించి చెప్పే వాళ్లు ఎంత‌మంది ఉన్నా, వారు చెప్పేది ఏదైనా.. ఆనందంగా జీవించ‌డం మాత్రం ప‌ర్స‌న‌ల్! ఇది ఒక‌రు చెప్పేదాన్ని బ‌ట్టి మ‌న జీవితంలో వ‌చ్చేది కాదు! స‌క్సెస్ కు బోలెడ‌న్ని నిర్వ‌చ‌నాలు ఉంటాయి, ఆనందానికి కూడా అంతే! ఇది ఎవ‌రికి వారి వ్య‌క్తిగ‌తం. అయితే ఆనందంగా ఉండ‌టం అంటే మాత్రం మాట‌లు కాదు. పైకి ఏం చేస్తున్నా, ఎలా మాట్లాడుతున్నా.. లోలోన తొలిచే ఘ‌ట‌న‌లు అంద‌రి జీవితాల్లోనూ ఉంటాయి.

ఎలాంటి వేళ‌లో అయినా అవి మ‌న‌సులోని ఆనందాన్ని డ్యామినేట్ చేస్తూ ఉంటాయి! చిన్న‌వో పెద్ద‌వో కానీ.. జీవితంలో ఎదురైన అనుభ‌వాలు మ‌న‌సులో దాక్కొని ఎప్ప‌టిక‌ప్పుడు మెలిపెట్ట‌డంలో మాస్ట‌ర్ ఆర్ట్స్ చేసి ఉంటాయి! మ‌రి అలాంటివాటిని జ‌యించి జీవితం హ్యాపీగా సాగిపోవాలంటే .. అనుస‌రించాల్సిన సిద్ధాంతాలు ఏమో కానీ, మెద‌డుకు కొన్ని అల‌వాట్లు ఉంటే, వాటిని ఆనందంగా జీవించ‌డం అల‌వాటు అవుతుంద‌ని అంటున్నాయి కొన్ని ప‌రిశోధ‌న‌లు, ప‌రిశీల‌న‌లు, ఆ అల‌వాట్లు ఏమంటే!

బీ గ్రేట్ఫుల్!

తెలుగులో చెప్పాలంటే ఉన్నదాని ప‌ట్ల కృత‌జ్ఞ‌త‌తో ఉండ‌టం! ఉద్యోగం కావొచ్చు, జీవితంలోని వ్య‌క్తుల స‌హ‌చ‌ర్యం కావొచ్చు.. ఏ విష‌యంలో అయినా, ద‌క్కిన‌దాని ప‌ట్ల కృత‌జ్ఞ‌త‌తో ఉండ‌టం అంటే స‌గం ఆనందం సొంతం అయిన‌ట్టే! ఏదో కోరుకుంటూ ఉండ‌టం, ఏదో కావాల‌నే త‌ప‌న‌తో నిరంత‌రం ఉండ‌టం.. ఈ త‌ర‌హాలో సాగితే, వ‌ర్త‌మానంలో ఉన్న వాటి గురించి ఆలోచించ‌డం కూడా ఆగిపోతుంది. ఇవే నెగిటివ్ గా క‌నిపిస్తూ ఉంటాయి. కోరుకున్న‌ది ద‌క్క‌దు, ఉన్న‌దాని ప‌ట్ల ఊసే ఉండ‌దు.. అలాంట‌ప్పుడు జీవితమంతా అలా గ‌డిచిపోవ‌డ‌మే కానీ, ఇక ఆనందం అనే ప్ర‌శ్న ఎక్క‌డ‌? ఎప్పుడైతే వ‌ర్త‌మాన ప‌రిస్థితుల ప‌ట్ల కృత‌జ్ఞ‌తా భావం అనేది మ‌న‌సులో ఉంటుందో అలాంటి వారు నిస్సందేహంగా ఆనందంగా గ‌డుపుతూ ఉంటారు. అది పైకి చూపించ‌క‌పోయినా.. మ‌న‌సులో ఉంటే చాలు! అంత‌కు మించిన ఆనందం ఉండ‌దు!

వ్యాయామం!

వ్యాయామం అంటే అది శారీర‌క ప‌టిష్ట‌తకే కాదు, వ్యాయామం వ‌ల్ల శ‌రీరంలో విడుద‌ల అయ్యే హార్మోన్లు మిమ్మ‌ల్ని ఆనందంగా జీవించేలా చేయ‌గ‌ల‌వ‌ని అంటున్నాయి అధ్యయ‌నాలు. వ్యాయామం చేసిన‌ప్పుడు మ‌న‌సుకు ఉత్తేజాన్ని క‌లిగించే హార్మోన్లు ఉత్ప‌త్తి అవుతాయి. ఆ ఫీల్ గుడ్ హార్మోన్లు మీరు ఆనందంగా ఉండేలా చేస్తాయ‌ని అధ్య‌య‌నాలు వివ‌రిస్తున్నాయి. వ్యాయామం వల్ల ఆనందం కూడా సాధ్య‌మే అని వాటి ద్వారా తెలుస్తోంది.

క్వాలిటీ రిలేష‌న్ షిప్స్!

మీకు ఎంత‌మంది తెలుసు? మీరు ఎంత‌మందికి తెలుసు? అనేవి ప్ర‌శ్న‌లే కాదు. మీ స‌ర్కిల్ ఎంత చిన్న‌దైనా, పెద్ద‌దైనా.. అది క్వాలిటీ రిలేష‌న్ షిప్స్ తో కూడుకున్న‌ది అయి ఉండాలి! ఆఫీసులో కొలీగ్స్, చుట్ట‌ప‌క్క‌ల‌, ఇంట్లో.. ఇలా ఇత‌రుల‌తోనే మ‌నం గంటల కొద్దీ గ‌డుపుతూ ఉంటాం. అలాంటి స‌ర్కిల్ వారి మాట‌ల‌తో మీకు లేని స్ట్రెస్ ను పెంచేదిలా ఉండ‌కూడ‌దు. ఒక‌వేళ దాని త‌త్వం అదే అయితే.. దాంతో తెంచుకోవ‌డ‌మే ఉత్త‌మం! ఎప్పుడైతే ఇంటా బ‌య‌ట క్వాలిటీ రిలేష‌న్ షిప్స్ ఉంటాయో అప్పుడు చాలా వ‌ర‌కూ స్ట్రెస్ ఉండ‌దు. అలాంటి స‌ర్కిల్ ను మెయింటెయిన్ చేసుకోవాలి!

నెగిటివ్ ఎమోష‌న్స్ ను పెట్టుకోవ‌ద్దు!

ఎవ‌రైనా మ‌న‌కు న‌చ్చ‌న‌ట్టుగా ప్ర‌వ‌ర్తించారు.. వారిపై క‌సిని మ‌న‌సులో దాచుకోవ‌డం, తిరిగి వారిపై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి ఎదురుచూడ‌టం, లేదా ఏదైనా నెగిటివ్ ఎమోష‌న్ ను మ‌న‌సులో మోస్తూ ఉండ‌టం.. ఇలాంటి తీరు మీకు ప్ర‌శాంత‌త‌ను లేకుండా చేస్తుంది. ఆలోచ‌న‌లు అన్నీ వాటి చుట్టూరానే తిరుగుతాయి, దీంతో ఆనందాన్ని ఇచ్చే అంశాల‌న్నీ మ‌రుగున ప‌డిపోతాయి. అలాంటి నెగిటివ్ ఎమోష‌న్స్ ను క్యారీ చేయ‌కుండా, పోతేపోనీ.. అనే దృక్ప‌థంతో ఉండ‌టం నిస్సందేహంగా మిమ్మ‌ల్నీ ఆనందంగా ఉంచుతుంది!

వ‌ర్త‌మానంలో ఉండ‌టం!

గ‌తం గురించి ఆలోచించుకుంటూ ఉండ‌ట‌మో, లేదా భవిష్య‌త్తుపై ఆలోచ‌న‌ల‌తో ఉండ‌టం, లేదంటే ఊహా లోకంలో విహ‌రిస్తూ ఉండ‌టం.. ఇవ‌న్నీ కూడా ఆనందంగా ఉండే వారి ల‌క్ష‌ణాలు కావు. వ‌ర్త‌మానంలో జీవిస్తూ వాస్త‌విక ధోర‌ణితో స్పందించడం, నెగిటివిటీని వ‌దలి ప్ర‌శాంత‌మైన ఆలోచ‌న‌ల‌తో సాగడం ఆనందంగా ఉండే వారి మెద‌డుకు ఉంటే అల‌వాట్లు!

One Reply to “ఆనందంగా జీవించ‌డం ఎలా?”

Comments are closed.