వారంతా కోట్లకు పడగెత్తిన వారే. ఒక్కొక్కరికీ వేయికోట్లకు తక్కువ ఉండదు. అందరూ కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికల్లో నెగ్గిన వారే. అయినా పార్లమెంట్‌లో అడుగుపెట్టాక ఏమి చేయాలో వారికి తోచడంలేదు. ఎవరూ వారిని పట్టించుకోవడంలేదు. వారి పట్ల చాలా మందికి సదభిప్రాయం లేదు. రాజకీయాలకు వారు కొత్త. ఒక్క మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్‌పివై రెడ్డి తప్ప మిగతా వారంతా మొదటిసారి లోక్‌సభకు ఎన్నికైన వారే. వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఎన్నికైన 9 మంది ఎంపీల దుస్థితి ఇది.
ఈ 9 మంది ఎంపీల్లో ఎన్నికైన వెంటనే, కనీసం ఎంపిగా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా పార్టీకి గుడ్‌బై చెప్పి, తెలుగుదేశం పార్టీలో చేరిన వ్యక్తి ఎస్‌పివై రెడ్డి. బీఈ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి రకరకాల పరిశ్రమలు పెట్టి, కోట్లకు కోట్లు గడించిన ఈయనకు రాజకీయాలెందుకో తెలియడం లేదు. ఆవేశపరుడు, ఎవరైనా ఏమైనా చెబితే విరుచుకుపడి, వీలైతే కొట్టడానికి కూడా సిద్దపడే ఈయన రాజకీయాలకు పనికిరాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని కాంగ్రెస్ నుంచి ఎంపిగా ఎన్నికైన ఎస్‌పివై రెడ్డి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు చెప్పుకుని సీమాంధ్ర నుంచి ఎంపికైన ఏకైక మాజీ కాంగ్రెస్ ఎంపి ఆయన.
అయినప్పటికీ కనీసం నైతిక విలువలు పాటించకుండా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోయాడు. చంద్రబాబు పాదాలకు నమస్కరించి కండువా కప్పుకున్నాడు. విచిత్రమేమంటే, ఎస్‌పీవై రెడ్డి గతంలో బీజేపీలో చేరారు. తనను ముఖ్యమంత్రి చేస్తానని వాగ్దానం చేస్తే ప్రతి నియోజకవర్గానికీ కనీసం పదికోట్లు ఖర్చుపెట్టి పార్టీని గెలిపిస్తానని ఆయన చాలా కాలం క్రితమే బీజేపీ సీనియర్ నేతలకు వాగ్దానం చేశాడు. టీడీపీతో కూడా బేరసారాలు నడిపాడు. చివరకు కాంగ్రెస్‌లో చేరారు. 64 ఏళ్ల ఎస్‌పీవై రెడ్డి ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే తెలుగుదేశం కండువా కప్పుకున్న ఈయనను తెలుగుదేశం పార్టీ నేతలూ పెద్దగా ఆహ్వానించడం లేదు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఆయనను పట్టించుకునే వారు లేరు. తెలుగుదేశం ఎంపి కాకపోవడంతో ఆయనను పార్టీ సమావేశాలకూ పిలవడం లేదు. ఆయనతో దివాకర్ రెడ్డి తప్ప మాట్లాడేవారు లేరు. లోక్‌సభలో అధికార పక్ష బెంచీల్లో కూర్చుంటే బీజేపీ నేతలు అభ్యంతరం తెలిపారు. దీనితో చివరకు వెనుక బెంచీలో కూర్చోవాల్సి వచ్చింది. అక్కడ వైసీపీ నేతలు కూడా ఆయనను అసహ్యించుకుని మాట్లాడడం మానేశారు. దీనితో పార్లమెంట్‌లో వృధాగా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పులిమీద పుట్ర అన్నట్లుగా స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆయనకు నోటీసు పంపారు. పార్టీ ఫిరాయించినందుకు లోక్‌సభ సభ్యత్వం నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాల్సిందిగా ఆమె ఈ నోటీసులో పేర్కొన్నారు. ఆయన జవాబివ్వకపోతే రెండోసారి నోటీసు పంపారు. చివరకు ఆయనపై అనర్హత వేటు పడేలా కనిపిస్తున్నాయి. ఆయనను ఏ విధంగానైనా లోక్‌సభ నుంచి బహిష్కరించేలా చూడాలని వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, వైఎస్. అవినాశ్ రెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నారు.
ఎస్‌పీవై రెడ్డి ఉదంతం ఇలా ఉండగా, ఆయన వల్ల ప్రోత్సాహం పొందిన మరో ఇద్దరు ఎంపీలు బుట్టా రేణుక, కొత్తపల్లి గీత తెలుగుదేశంలో చేరాలని ఉత్సాహపడి భంగపడ్డారు. ఈ ఇద్దరూ కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి వైసీపీలో చేరారు. బుట్టా రేణుక చేనేత వర్గాలకు చెందిన మహిళ. ఇంటర్ వరకే చదువుకున్నారు. ఆమె భర్త నీలకంఠ ఆమె పట్ల ఆకర్షితులై రెండో వివాహం చేసుకున్నారని వినికిడి. ఏమైనప్పటికీ ఆమె దాదాపు వేయికోట్లు బుట్టాగ్రూప్‌కు అధిపతిరాలైంది. పార్లమెంట్‌కు సమర్పించిన వివరాల ప్రకారం ఆమె స్వంత ఆస్తులే దాదాపు. రూ.250 కోట్లున్నాయి. రోజూ ఆడీ కారులో లోక్‌సభకు వస్తారు. బుట్టా గ్రూప్ నిర్వహిస్తున్న నగల వ్యాపారం, హోటళ్ల వ్యాపారం, విద్యాసంస్థల వ్యాపారం. కార్లు, ద్విచక్ర వాహనాల డీలర్‌షిప్‌లన్నీ రేణుకే చూస్తారు. తనిష్క్ పేరిట వారికి నగల వ్యాపారం ఉన్నది. మెరిడియన్ విద్యాసంస్థల ఆధిపత్యం వారిదే. ఇంతేకాక నీలకంఠ శిథిలమైన నగరాలను నిర్మించడంలో ఖ్యాతి గడించారు. ఇన్నివేల కోట్లు గడించినా తన భార్యను ఆయన రాజకీయాల్లోకి ఎందుకు దింపారో తెలియదు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పుతుందని ఆయన భావించి ఉంటారు. అది జరగకపోవడంతో ఆమెను తెలుగుదేశం పార్టీలోకి చేర్చాలని నీలకంఠ తెగ ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చినప్పుడు భార్యభర్తలిద్దరూ తాజ్‌మాన్ సింగ్ హోటల్‌కు వెళ్లి ఆయనకు కరచాలనం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో తమకు భాగస్వామ్యం కావాలని కోరారు. అయితే ఎప్‌పీవై రెడ్డికి స్పీకర్ నోటీసు ఇచ్చారని తెలియగానే రేణుక ఖంగుతిన్నారు. వ్యూహత్మక మౌనం పాటించడం ప్రారంభించారు. ఆమెను కూడా వైసీపీ నేతలు దూరం పెట్టారు. వైవీ సుబ్బారెడ్డి ఆమెను బెదిరించారని వినికిడి.
కాని గీత మాత్రం రేణుకలాగా తెలివిగా వ్యవహరించలేదు. జగన్‌ను, ఆయన పార్టీని బహిరంగంగా తిట్టారు. పార్టీ నేతలు తనతో సరిగా వ్యవహరించడం లేదని, మహిళలను అవమానిస్తున్నారని తూర్పారపట్టారు. తెలుగుదేశం స్థానిక నేతల్నే కాక చంద్రబాబునాయుడును కలుసుకుని తెలుగుదేశంలోకి వస్తానని చెప్పారు. కాని మీరు వస్తే మీ సభ్యత్వం పోతుందని నాయుడు హెచ్చరించారు. తెలివిగా వ్యవహరించమని చెప్పారు. కాని గీత అలా వ్యవహరించకుండా జగన్‌తో పెట్టుకున్నారు. దీనివల్ల స్థానిక వైసీపీ నేతలు ఆమెను బూతులు తిట్టారు. వెబ్‌సైట్‌లో ఆమె గురించి చాలా అసహ్యంగా వచ్చింది. దీనితో ఆమె కళ్ళనీళ్ల పర్యతం అయ్యారు. గీత కూడా తాను పాతిక కోట్లు ఖర్చుపెట్టి సీటు సంపాదించానని, ఎన్నికల్లో గెలిచేందుకు మరో పాతికకోట్లు ఖర్చయ్యాయని చెప్పుకుంటున్నారు. ఆమెకీ డబ్బు ఎలా వచ్చింది? ఆమె తండ్రి జాకబ్ చాలా కాలం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నారు. ఆయన దళత క్రైస్తవుడని చాలా మంది అంటారు. కాని ఆయనకు గిరిజనుడన్న సర్టిఫికెట్ ఉన్నది. గీతకు కూడా తద్వారా ఎస్‌టీ సర్టిఫికెట్ వచ్చింది. గీత తెలివైన విద్యార్థి. ఆమె సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీల్లో మూడు ఎమ్మేలు చేశారు. గ్రూప్ వన్ కూడా పాసయ్యారు. గోదావరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ పదనుంచి ఆర్టీవో, డిప్యూటీ, అసిస్టెంట్ కలెక్టర్ వరకు ఎదిగారు. ఆమెను బెంగళూరుకు చెందిన ప్రముఖవ్యాపార వేత్త పరుచూరి రామకోటేశ్వరరావు వివాహం చేసుకున్నారు. అంతే ఆమె వ్యాపారవేత్త కూడా అయ్యారు. విశ్వేశ్వరా గ్రూప్ అధిపతి అయ్యారు. చాలా కాలం తన కంపెనీలు చూసుకున్నారు. ఎన్జీవో కూడా పెట్టి గిరిజనులకు సంఘసేవ చేశారు. చివరకు రాజకీయాల్లో దిగి ఎన్నికయ్యారు. ఎన్నికైనా ఏం ప్రయోజనం కనపడకపోవడంతో చివరకు తెలుగుదేశంతో చేతులు కలపాలని ప్రయత్నిస్తున్నారు.
ఇక వైసీపీకి చెందిన మిగతా 8 మంది ఎంపీల్లో అంతా విద్యాధికులే. ఎంబీఏలు, ఇంజనీరింగ్‌లు చేసి వేలకోట్ల వ్యాపారం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ వరప్రసాదరావు తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి. బాగా సంపాందించారు. దళితుడుగా తిరుపతి సీటు సంపాదించి గెలిచారు. తొలుత ఆయన ప్రజారాజ్యంలో చేరి 2009లో చింతామోహన్‌కు వ్యతిరేకంగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు పరిస్థితులు మారడంతో వైసీపీలో చేరి గెలిచారు. అయితే ఎంపీగా గెలిచినప్పటికీ ఢిల్లీలో చేసేది ఏమీ లేకపోవడంతో ఆయన కూడా పార్లమెంట్‌లో అయోమయంగా తిరుగుతున్నారు. మిగతా వైసీపీ ఎంపీల మధ్య ఆయన గడపలేకపోతున్నారు. పార్లమెంట్‌లో పెద్దగా మాట్లాడింది కూడా ఏమీ లేదు.
ఇక మిగతా ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అవినాశ్ రెడ్డి, మిథున్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి కలిసి తిరుగుతున్నారు. ఈ ఐదుగురు రెడ్డి ఎంపీలు వేరే పార్టీలో చేరే అవకాశంలేదు. మిథున్ రెడ్డి తెలుగుదేశంలో చేరతారని ప్రచారం జరిగినప్పుటికీ అది నిజం కాదని తేలిపోయింది. వీరందరూ వ్యాపారాల్లో, కాంట్రాక్టుల్లో స్థిరపడ్డారు. అందరితో స్నేహం చేస్తూ తమ వ్యాపారానికి ఢోకా లేకుండా చూసుకుంటున్నారు. పార్లమెంట్‌లో ఏదో ఒకటి మాట్లాడినా, రాజకీయాల్లో ఏదో పొడిచేయాలని వారికి లేదు. జగన్ వచ్చినప్పుడు ఆయనతో కలుసుకోవడం తప్ప వారికి వేరే పనిలేదు. వ్యాపారవేత్తలు కనుక వారికి రాజకీయ శత్రువులు కూడా లేరు. వీరివల్ల ఢిల్లీలో జగన్‌కు పెద్దగా ఉపయోగం లేదు, నష్టమూ లేదు.
-హరీష్