ఊహ తెలిసిన తర్వాత.. కొత్త ప్రాంతాలు చూడాలని, కొత్త ప్రదేశాలు తిరగాలని, తద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలని ముచ్చటపడని వారు చాలా తక్కువగా ఉంటారు. గిట్టేదాకా ఎటూ కదలకుండా పుట్టినచోటే ఉండిపోవాలని కోరుకునే వారు చాలా అరుదు. ప్రతి జీవిలోనూ చాలా సహజంగా భ్రమణ కాంక్ష ఉంటుంది. మనలో చాలా మందిలో అది కనిపిస్తుంది. అతిశయమైన భ్రమణ కాంక్షకు వేలకొద్దీ ఉదాహరణలు మనకు యూట్యూబ్ లో ట్రావెలాగ్స్/వ్లాగ్స్ రూపంలోనూ, ఓటీటీ వేదికల మీద ట్రావెల్ సిరీస్ రూపంలోనూ పుష్కలంగా కనిపిస్తుంటాయి.
పాతకాలంలో.. ‘కొన్నాళ్లపాటూ కొత్త ఊర్లకు, ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లండి..’ అనే మాటలను మనం ఆరోగ్యం కుదుటపడడానికి డాక్టరు సూచించే చికిత్సగా అనేక సందర్భాల్లో గమనించి ఉంటాం. ఊరు మారినంత మాత్రాన ఆరోగ్యం కుదుట పడుతుందా? కొన్ని ఊర్లకు ప్రత్యేకమైన ప్రకృతి అందాలు, విలక్షణతలు, వాతావరణంలోని లక్షణాలు, గాలిమార్పు ఆరోగ్యం మీద ప్రభావం చూపించేవేమో అనిపిస్తుంది. కానీ దీర్ఘకాలంగా ఆందోళనతో గడుపుతున్న.. తమ చుట్టూ చిన్న గిరి గీసేసుకుని, దాన్ని దాటి రాకుండా ముడుక్కుపోయిన కొందరు మిత్రులకు కూడా నేను ఇలాంటి సలహాలనే ఇస్తుంటాను. అయితే నా ఉద్దేశం వేరు.
ఎవరైనా మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురవుతున్నారంటే అదుకు దారితీసే పరిస్థితులు వారి చుట్టూ తిష్టవేసి ఉంటాయి. వారి ఇల్లు, పరిసరాల్లోని వారందరూ కూడా వారి ఆందోళనలో భాగంగా, ఆ ఆందోళన పలచబడకుండా స్థిరంగా ఉండడానికి కారకులు అవుతూ ఉంటారు. ఆ వాతావరణంలో వారి ప్రతిక్షణం, ప్రతి మాట కూడా.. వారు అనుభవిస్తున్న ఆందోళనను గుర్తుచేసేదే అయి ఉంటుంది. అలాంటి మిత్రులకు నేను చెప్పే సలహా అదే!
‘ఒక్కడిగానో, లేదా.. నీ చుట్టూ ఇప్పుడున్న వాళ్లు కాకుండా ఇతర మిత్రులతోనో ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లు. నాలుగైదు రోజులు గడుపు. తిరిగి రా!’ అనేవాడిని. ‘కొత్త’ ప్రదేశానికి అని ఒత్తి చెప్పడం వెనుక నా ఉద్దేశం వేరు. గతంలో వెళ్లిన ప్రదేశాలే అయితే.. మళ్లీ వెళ్లడం వల్ల వారి బుద్ధి ఆందోళననుంచి పక్కకు మరలే అవకాశం తక్కువ. అదే కొత్త ప్రదేశం అయితే.. అక్కడ చూసే కొత్త వింతలను, కొత్త విశేషాలను, కొత్త మనుషులను ఆస్వాదించి, అర్థం చేసుకునే ప్రయత్నం.. వారు అనుభవించే ఆందోళనకు కొంత విరామంలా పనిచేస్తుందని నా అభిప్రాయం. ఈలోగా ఆ ఆందోళన పూర్తిగా ఉపశమించవచ్చు, లేదా పలచబడవచ్చు! ఇలాంటి భ్రమణ కాంక్ష- ఒక మందుగా మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న వారి మీద పనిచేస్తుందనడంలో సందేహం ఏముంది.
అయితే, నా మటుకు కొత్త ప్రదేశాలు తిరగడానికి ప్రేరేపించే అంశాలు ఇతరత్రా కూడా కొన్ని ఉన్నాయి. మార్పు అనేది సహజమైన జీవలక్షణం. మన చుట్టూ ఉండే పరిసరాలు మారుతూ ఉంటే.. ఆ ప్రక్రియ మనలోని జీవలక్షణాన్ని కాపాడుతూ వస్తుంది. మనలోకి జవజీవాలను కొత్తగా నింపుతూ వస్తుంది. మనల్ని మనం కాపాడుకోగలుగుతాం.
ఇంకో అంశం ఉంది. మనిషి తన జీవన గమనంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ.. పొరలు పొరలుగా అహంకారం పేరుకుంటూ వస్తుంది. నేను సంపదలను సృష్టిస్తున్నాను.. నా అంతటి వాడు లేడు.. నేను ఎంతో ఎత్తు ఎదిగి పైకి వచ్చాను.. నేను ఈ కుటుంబాన్ని నడుపుతున్నాను.. నేను మహానుభావుడిని.. అనుకునే ఇలాంటి అతిశయం పెరుగుతూ వస్తుంది. వారి వారి ఆర్థిక, సామాజిక, మానసికమైన స్థాయులను బట్టి.. వారు ఈ తరహా అహంకారానికి లోనవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్లు కేవలం కొత్త ప్రదేశాలు కాదు, విశిష్టమైన ప్రదేశాలకు పర్యటించడం అనేది చాలా అవసరం. వారి అల్పత్వం వారికి తెలిసివస్తుంది.
సూటిగా చెప్పాలంటే మనలోని అల్పత్వం మనకు అనుభవంలోకి రావాలంటే.. ఎన్ని శిఖరాలు అధిరోహించామో కదా అనే గర్వఛాయలు సమూలంగా రూపుమాసిపోవాలంటే.. ఒకసారి వెళ్లి సముద్రం ఎదుట నిల్చోవాలి. అలలు పాదాలను తాకి వెళుతూ ఉంటే కలిగే అనుభూతుల సంగతి తరువాత.. కానీ ఆ సముద్రం ఎదుట నిల్చుని ఉన్నప్పుడు.. సృష్టిలో మనం ఎంతటి సైకతరేణు ప్రమాణమో మనకు తెలిసి వస్తుంది.
అదే రామేశ్వరంలోని ఆలయానికి వెళ్లి.. ఆ ప్రాంగణంలో ఒక మూల నిల్చున్నామంటే.. ఇరు తెరగులా విస్తరించిన స్తంభాల మండపాల మహా నిర్మాణం మనల్ని ఆశ్చర్యానికి గురిచేయడం మాత్రమే కాదు.. మన బతుకులు ఎంతటి గిజిగాడి గూళ్లో తెలియజెబుతుంది. ఏ శ్రీరంగం ఆలయం గోపురం ఎదుటనో, గోమఠేశ్వరుడి పాదాల చెంతనో నిల్చున్నామంటే.. మనం ఎంతటి అంగుష్ట మాత్రులమో అనుభవైకవేద్యం అవుతుంది.
ఇలా ఎన్ని ప్రదేశాలు తిరగగలిగితే అన్ని కోణాలలో అవి మన అల్పత్వాన్ని గుర్తు చేస్తాయి. కొండొకచో మన స్వాతిశయాన్ని పరిహసిస్తాయి. అందుకే సంపదల్లో పడి, సంపాదనలో పడి, గర్వవీచికలకు లోనవుతూ ఉండే ప్రతి ఒక్కరూ కూడా తమ బుద్ధికి తాము పగ్గాలు వేసుకోవడానికి, ఖచ్చితంగా భ్రమణ కాంక్షను కలిగి ఉండాలి. ప్రదేశాలు తిరుగుతూ ఉండాలి.
* * *
‘ఇన్ సెర్చ్ ఆఫ్ లైఫ్’ అనే పేరుతో మహారాష్ట్రకు చెందిన విశాల్ టేకడే అనే ఓ కుర్రవాడు భారతదేశవ్యాప్తంగా సైకిలు యాత్ర తలపెట్టాడు. విమానాశ్రయాల మేనేజిమెంట్ కు సంబందించిన ఉద్యోగం కొన్నాళ్లు చేసి, విరామం తీసుకుని దేశాటనం ప్రారంభించాడు. బయలుదేరిన కొన్నాళ్లకు కరోనా మహమ్మారి వచ్చింది. అప్పటికి ఇంచుమించుగా కేరళ ప్రాంతానికి చేరాడు. అడవుల్లో ఉండే ఒక చిన్న హోటలులో పనికి కుదురుకుని.. అక్కడ కూడా కరోనా దెబ్బకు వ్యాపారం లేకపోగా.. పెట్టింది తిని, చెప్పిన పనిచేస్తూ రోజులు గడిపాడు. మహమ్మారి కాస్త నెమ్మదించాక తిరిగి యాత్ర సాగించాడు.
అతను చెన్నై విడిచి తిరుపతి సమీపిస్తుండగా.. ఒక రాత్రి బస ఏర్పాటు చేయగలనేమో అని.. ఎవరో పరిచయస్తుల ద్వారా నన్ను అడిగాడు. ఆ రోజు నుంచి అతడు హైదరాబాదు చేరే వరకు దారిపొడవునా బస, భోజనం వసతులు అనేకమంది మిత్రుల సహకారంతో ఏర్పాటుచేయించాను. హైదరాబాదులో మా ఇంట్లోనే పదిరోజులున్నాడు. తెలంగాణ దాటి వెళ్లేవరకు అన్ని సదుపాయాలూ చూసుకున్నాను. జీవితాన్ని ఎంత మేర కనుగొనగలిగాడో గానీ.. అహంకారం దరి జేరని వ్యక్తిత్వాన్ని ఈ అన్వేషణలో అలవరచుకుని ఉంటాడని నాకు ఒక నమ్మకం కలిగింది. అతనిలో భ్రమణ కాంక్షకు ముచ్చటేసింది.
మనుషులలో ఉండే భ్రమణ కాంక్షను, అందుకు ఎంతటికైనా సాహసించే, తీరును కథాత్మకంగా మనం చిన్నతనం నుంచి తెలుసుకుంటూనే ఉన్నాం. శ్రవణ కుమారుడి కథ మనందరికీ తెలుసు. తల్లిదండ్రులు గుడ్డివాళ్లే అయినా.. పుణ్యక్షేత్రాల సందర్శనాభిలాషను తీర్చడానికి శ్రవణుడు వారిని కావడిలో చెరోవైపున కూర్చుండబెట్టుకుని దేశమంతా తిప్పిన వైనం మనం చదువుకున్నాం.
ఆ దృష్టాంతాలతో పోల్చినప్పుడు.. గుజరాత్ కు చెందిన డెబ్భయి నాలుగేళ్ల డాక్టర్ ఆర్.ఉపాధ్యాయ జీవితం ఏమాత్రం తీసివేయతగ్గది కాదు. ఆయన ద్వారక నుంచి రామేశ్వరం వరకు సపత్నీకంగా యాత్ర చేయదలచుకున్నాడు. పాదయాత్రగా! అయితే సరుకు సరంజామా కోసం చిన్న మూడు చక్రాల తోపుడు బండిని తయారు చేసుకున్నాడు. భార్య సరోజిని వయసు కూడా 71 ఏళ్లు. ఆయనకున్న కాలి సత్తువ ఆమెకు లేకపోయింది. అయినా ఉపాధ్యాయ మాత్రం.. తన పట్టుదల వీడలేదు. మూడేళ్లుగా యాత్రలో ఉన్న ఆయన భార్య నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ మూడు చక్రాల తోపుడుబండిమీదనే కూర్చోబెట్టుకుని నెమ్మదిగాతోసుకుంటూ వెళుతూ యాత్ర సాగిస్తున్నాడు. ఈ దారమ్మట పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించుకుంటూ వెళ్లాలనేది ఆయన ముచ్చట.
డాక్టర్ ఆర్. ఉపాధ్యాయ- సరోజిని ఎందరికి స్ఫూర్తి కాగలరో తెలియదు. వారిలాగా పాదయాత్ర రూపంలోనే వెళ్లాలని కూడా కాదు. కానీ ప్రతి ఒక్కరిలోనూ భ్రమణ కాంక్ష మాత్రం ఎంతో కొంత ఉండాల్సిందే. ఆ కాంక్షను మీ జీవితానికి అనుసంధానించే సూత్రం ఏదైనా కావొచ్చు. అంటే పుణ్యక్షేత్రాలు తిరగడమే మీ లక్ష్యం కావొచ్చు. విహార యాత్రా స్థలాలే మీ ముచ్చట కావొచ్చు. లేదా మరొక రకమైన ముచ్చట మిమ్మల్ని నడిపించవచ్చు. కానీ భ్రమణ కాంక్షను కలిగి ఉండడం అనేది మిమ్మల్ని, మీలోని వ్యక్తిత్వాన్ని అనేక రకాలుగా కాపాడుతూ ఉంటుంది. సానపెడుతూ ఉంటుంది.
ఈ భ్రమణ కాంక్ష కూడా ఒక స్టేటస్ సింబల్ గా మార్చుకున్నవారు, పటాటోపం ప్రదర్శనకు మార్గంగా ఎంచుకునే వారు కొందరుంటారు. వారి స్వస్థలానికి అత్యంత సమీపంలో ఉండే విశిష్టమైన స్థలాలను వారు చూసి ఉండరు. కానీ లక్షలకు లక్షలు తగలేసి యూరప్ ట్రిప్ వెళ్లాలనుకుంటారు.
సొంత ఊర్లకు దగ్గరలో ఉండే కొండల్లోని జలపాతం గురించి కూడా వారికి తెలియకపోవచ్చు, కానీ అమెరికా వెళ్లి నయాగరా చూసి వచ్చి ఉంటారు. ప్రపంచమంతా చుట్టేయాలనే కాంక్ష తప్పు అని కాదు.. కానీ, ముందుగా మన పరిసరాలను మనం తెలుసుకుంటే బాగుంటుంది. స్వస్థలాలు, సొంత జిల్లాల్లో ఉండే ప్రాంతాలు, సొంత రాష్ట్రంలో ఉండే ప్రాంతాలు ఒక్కొక్కటిగా పూర్తిచేసుకుంటూ యావత్ ప్రపంచమూ గిర్రున తిరిగేసినా శోభిస్తుంది. పైగా ప్రతిసారీ భారీ ఖర్చులకు వెరచి, భ్రమణ కాంక్షను చంపుకునే దుస్థితి కూడా రాదు.
అలవాటు ఇప్పటిదాకా లేకపోతే ఒకసారి ఎక్కడికైనా వెళ్లి రండి. అలవాటు ఉన్న వారే అయితే.. పర్యటనాసక్తిని కొత్త కోణంలో చూసుకుంటూ కొత్త ప్రదేశాలకు వెళ్లిరండి.. భ్రమణకాంక్ష ఇవ్వగల తృప్తి మీకు బోధపడుతుంది.
..కె.ఎ. మునిసురేష్ పిళ్లె