గుండె తరుక్కుపోతున్నది! ఆరుగాలం కష్టించి, ఎండనక వాననక, పురుగనక పుట్రనక, పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో తెలియకుండా, ప్రతి యేడూ గుండె దిటవు చేసుకుని దేశానికి, మానవాళికి పట్టెడన్నం పెడుతున్న నవభారత రైతుల దుస్థితి చూస్తుంటే గుండె నిజంగానే తరుక్కుపోతున్నది! పుట్టి పెరిగిన కర్మ భూమినే కన్నబిడ్డగా భావించి ప్రళయ ప్రకృతి, అనైతిక వ్యాపారనీతి లాంటి అనేకానేక విషమయ పరిస్థితులను తట్టుకుంటూ అహరహం పరితపిస్తూ తద్వారా సకల మానవాళి మనుగడకి ప్రత్యక్షంగా, పరోక్షంగా పాటుపడుతున్న అన్నదాతలకి తమ కన్నబిడ్డపై ఎలాంటి విధమైన హాక్కులూ లేవన్నట్టు నేటి భృష్టుపట్టిన భారత రాజకీయాలు నిర్లజ్జగా చేస్తున్న నీచ రాజకీయాలకి తలవొగ్గుతున్నాడు రైతన్న. రైతన్నలకి తమ భూమిపై ఏ హక్కు లేదనడం ఆత్మహత్యా సదృశం, గర్హనీయం. తరతరాలుగా రైతులు తమ సొంత బిడ్డల్లా కల్లనిండా చూసుకుంటూ, గుండెల్లో పెట్టుకున్న భూములను ప్రభుత్వమే అభివృద్ధి పేరుతో తమ బినామీ వ్యాపార, పారిశ్రామిక వర్గాలకి రాజధానని, పరిశ్రమని, ఇంకోటని కట్టబెట్టడాన్ని ప్రశ్నించడానికి ముందుకురాని మన భారతదేశ పౌరులని చూస్తుంటే వాల్లకి, వాళ్ళ పిల్లలకి భవిష్యత్తులో అన్నమే అవసరముండదా అని అనిపిస్తుంది!
2013 భూస్వాధీన (land acquisition) చట్టం తర్వాత భూమిని స్వాధీనం చేసుకునే హక్కు పూర్తిగా కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు భూసేకరణ అనబడే చట్టబద్దత లేని, భద్రతా విహీనమైన చట్టం గురించి ప్రస్తుతం మాట్లాడుతున్నది. ఇది రెండు తత్వములు లేదా సంస్థల మధ్య జరిగే సాధారణ ఒప్పందంలా కనిపిస్తున్నా ఆంధ్రా ప్రభుత్వం అగమ్యగోచర విధానం అనుసరణీయం కాదు. ముఖ్యంగా మేము రాజధాని ఇక్కడ కడతాం అన్నాము కాబట్టే ఈ భూములకి ధరలు పెరిగాయనే వాదన దుర్మార్గానికి ఉదాహరణ! ఇప్పుడు చెబుతున్న రాజధాని ప్రాంతం మూడు పట్టణాల మధ్య త్రిగుణాత్మకమై సుక్షేత్ర సమృద్దమై సుమారు ముప్పైలక్షల మందికి పైగా ప్రజలకి అవాసమై పాడి పంటలతో ఏడాది పొడువునా సుసంపన్నమైన ప్రత్యక్షలక్ష్మికి ప్రతిరూపంగా ఉండే భూమిది! ఎకరాకి లక్ష రూపాయల పైన ఆదాయన్నిస్తూ ఇప్పటికే కోట్ల రూపాయల విలువచేస్తుందన్నది పచ్చి నిజం!
ఏదేమైనప్పటికీ ప్రభుత్వం విధానం వల్ల వచ్చే ఫలాలని అనుభవించడానికి ఒక సాధారణ రైతుగా నాకు అన్నిరకాలుగా హక్కు ఉంది. దీనికి ఉదాహరణగా ఒక వాస్తవ సంఘటని తీసుకుందాం. ఇనుప ఖనిజ ఎగుమతులపై ఆంక్షలని భారత ప్రభుత్వం 2002 సరళీకృత౦ చేసిన దరిమిలా జిందాల్, వేదాంత లాంటి అనేక ప్రభుత్వేతర రంగ సంస్థలు దాని ఫలాలని అనుభవించాయి, ఆకర్షణీయమైన ప్రయోజనాలతో సహా. అంతే గాని జాతీయ సహజవనరుల పేరిట ముడిపెట్టి వారి ప్రయోజనాలని భంగపరచడం జరగలేదే? ఈ ప్రఖ్యాతిగాంచిన ప్రైవేట్ సంస్థలు వారి లాభాలను దేశ ప్రజలతో గాని, ప్రభుత్వంతో గాని పంచుకోలేదే, మరి రైతన్నలు మాత్రమే ఎందుకు రాష్ట్ర,దేశ ప్రయోజనాల కోసం త్యాగాలు చెయ్యాలి?
ప్రస్థుతానికి వస్తే ఒక వర్గ ప్రయోజానాలకి కొమ్ము కాస్తున్నట్లుండే ఆంధ్రా ప్రభుత్వ తీరు అనుమానాస్పదమై చివరికి ఒక అనామక రియల్ ఎస్టేట్ సంస్థలా వ్యవహరిస్తూ రైతుల హక్కులని హరించే ప్రయత్నం చేస్తున్నది. తుది కాకపోయినా చివరిగా కొన్ని చారిత్రక సంఘటనలని గుర్తుచేసుకుని అవి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. అది ఫ్రెంచ్ విప్లవమైనా, సోవియట్ సోషలిస్టు పతనమైనా దానికి నాంది ఆహార సరఫరా సమగ్రత (food-supply chain) విచ్చిన్న లోపమేనన్నది మననం చేసుకోవాలి. విద్యుత్తు, వాహానాలు మరియి నవీనఉపకరణాలైన ఇంటర్నెట్ లేకుండా బతకకగలమేమో గానీ ఆహారం లేకుండా కాదు గదా? ఒక్క మూడు రోజులు ఆహార సరఫరా విచ్చిన్నమైతే దానివల్ల జరిగే అనర్ధాలు ఊహించలేకుండా ఉంటుంది!. సాధారణ రైతులలో నెలకొన్న భయాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ దరిమిలా కొన్ని ఆలోచనాత్మక, ఆవశ్యక ప్రశ్నలూ, వ్యాఖ్యలూ:
ముప్పైవేల ఎకరాల సుసంపన్న సుక్షేత్ర భూమికి ఏవిధంగా న్యాయం చేస్తారో ఒక ప్రణాళికని బహిరంగపరిచి రైతులకి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి.
ప్రభుత్వానికి 10%, రైతులకి 23% అంటే మొత్తం 33% పోగా మిగిలిన 67%ని ఏ బినామీల జేబుల్లోకి చేర్చాలని చూస్తున్నది ఈ చంద్రబాబు ప్రభుత్వం?
అమరావతి, నూజివీడు, కంచికచెర్ల మరియు ఇతర అనావాస ప్రాంతాలని ఎందుకు పరిగణలోకి తీసుకోకూడదు?అనావాస అడవులని, అన్యాక్రాంత మాన్యపు భూములని వాడుకునే చట్టబద్దతను ఆంధ్ర రాష్ట్రపు జీర్ణోద్దరణ బిల్లు ప్రభుత్వానికి కల్పించింది.
రాజధాని ఊహాగానాల దరిమిలా తాను 150 ఎకరాల భూమిని కొన్నానాని బహిరంగంగా ప్రకటించిన సుజనా చౌదరి లాంటి ప్రజాపతినిధి మరియి ఫక్తు వ్యాపారవేత్తకి లాభం చేకూరేలా ఆయన భూముల్ల్లోంచే బ్రిడ్జి కట్టాలన్న పన్నాగం ప్రభుత్వ నిజాయితినీ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా రాజధానికి ఆమడల దూరంలో రెండువందల ఎకరాలు కలిగిన గోకరాజు గంగరాజు భూమిని, అలాగే సుజనా చౌదరి భూములని ఎందుకు స్వాధీనం చేసుకోదు ఈ ప్రభుత్వం రైతుల భూమిని స్వాధీనం చేసుకునే ముందు?
నూతన రాజధాని నిర్మించడానికి అవసరమైన మూలధన౦, మౌలిక సదుపాయాలూ వాటి సంధానకర్తలూ, పరిహారముల మీద ప్రభుత్వం ఒక సమగ్రమైన ప్రణాళికని పొందుపరిచడమన్నది తక్షణ కర్తవ్యం.
అన్నదాతలకి మనఃశాంతి చేకూరాలంటే భయాందోళనలు సృష్టించి తమ భూములు లాక్కుంటారన్న భావనలని రైతుల్లోంచి పోయేట్లు ప్రభుత్వం చేయాలి. ఇలాంటి ఊహాగానాలు సృష్టించే మాధ్యమాలని నియంత్రించాలి.
ఆంధ్ర ప్రభుత్వం ఇస్తున్న వివరణలని 2013 భూస్వాధీన బిల్లు ప్రశ్నిస్తున్నది!
సుక్షేత్ర భూములని భూస్వాధీనం నుంచి మినహాయించాలి
ఏదేనీ ప్రభుత్వ-ప్రభుత్వేతర భాగస్వామ్యాన భూమి స్వాధీనం చేసుకోవాలంటే కనీసం 70% అనుమతి అవసరం. అది ఎలాగూ కుదరదనే ప్రభుత్వం భూసేకరణ (land pooling) గురించి మాట్లాడుతున్నది.
ప్రభుత్వరంగ భూముల్లో రాజధాని నిర్మాణం జరిగినప్పుడు రైతుల భూములకి ఏవిధంగానైన మరింత ధర వస్తుంది కూడా!
ఇది ప్రైవేటు మరియు ప్రభుత్వం మధ్య జరిగే ఒప్పందం కాబట్టి ఒక్కసారి భూసేకరణ జరిగితే తర్వాత దానికి ఏవిధమైన రక్షణ చట్టపరంగా ఉండదని రైతులని జాగృతపరిచాలి. ఒకవేళ ఖచ్చితంగా భూసేకరణ జరగాలంటే అది తర్కపద్దతిలో, కింద సూచించిన విధంగా జరగాలని తెలియజేయాలి.
సమయ౦ మరియు పరిహారమూ పరిధిగా సమగ్ర ఒప్పందం జరగాలి, రాజధాని మొదలుపెట్టె రెండు మూడేళ్ళ ముందే ఈ తతంగం పూర్తి అవ్వాలి. చేసుకున్న ఒప్పందాన్ని అతిక్రమించినచో భూమిని తిరిగి రైతులకి అప్పగించే విధంగా ఒప్పందం జరగాలి!
మరికొన్ని ఆవశ్యక ప్రశ్నలు:
2004లో ఇదే విధమైన పద్దతిని ఉప్పల్, హైదరబాదులో అవలంబించి పదేళ్ళు దాటినా రైతులకి నేటికీ వారి భూములు తిరిగివ్వలేదు.
రెండు తరాల తర్వాత అనగా ఒక పదీ-పదిహేను సంవత్సరాల తర్వాత రైతుల భవిష్యత్తు ఏంటి?
బడుగు, బీద, బిక్కి రైతు, కూలీలని అణచివేస్తున్నది రాజకీయ, ఉన్నత పెట్టుబడిదారు, మీడియా, అధికార వర్గాలు అనేది నగ్న సత్యం! ఇన్ని బలమైన శక్తులని ఎదుర్కోవడంలో దేశ పౌరులు విజయం సాధించడానికి తీవ్రంగా కృషి చెయ్యాలి, లేకపోతే మన సమాజం అధోగతి పాలవుతుంది! అందువల్ల అన్నదాతలారా, మేల్కోండి. మీ భవిష్యత్తు తరాల జన్మహక్కులని రక్షించడానికి పోరాడండి. భూసేకరణ తర్కబద్దసహితమై షరతులు సవివరంగా ఉండే ప్రణాళికని రూపొందించాలని దిక్కులు పిక్కటిల్లేలా, వర్గ ప్రయోజనాలు వడలిపోయ్యేలా నినదిద్దాం. మన ఈ పోరాటంలో మేధావుల, ఉద్యమకారుల మద్దతు తీసుకుందాం!
గురవా రెడ్డి (అమెరికా), పవన్ నరంరెడ్డి (అమెరికా), రాజేష్ గొట్టెముక్కల (ఇండియా)
జోహార్ పెద్దాయన!