వైవాహిక జీవితం అంటే ఒక రేంజ్ అంచనాలను కలిగిన వారు ఉంటారు. అలాంటి వైవాహిక జీవితం తాము అనుకున్నట్టుగా లేకపోతే, అనుకున్నట్టుగా సాగకపోతే తీవ్రమైన నిస్పృహకు గురయ్యే వారూ ఉంటారు. తమకే ఎందుకిలా.. అనుకుంటూ ఉంటారు! అయితే గమనిస్తారో లేదో కానీ.. మీకే కాదు, వైవాహిక జీవితంలో ఇతరులకు కూడా కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి తప్ప.. వాటిని చూసి తీవ్రమైన నిస్పృహకు గురి కాకూడదనే సందేశాన్ని ఇస్తున్నారు రిలేషన్షిప్ కౌన్సిలర్లు!
కొత్తగా పెళ్లి చేసుకుని.. నెల రోజుల తర్వాత ఆఫీసుకొచ్చిన ఒక అమ్మాయి.. ఎలా ఉంది మ్యారిడ్ లైఫ్ అంటే, పనంతా నేనే చేయాల్సి వస్తోంది, అంతకు ముందు హాస్టల్లో ఉన్నీ టేబుల్ వద్దకు వచ్చేసేవి, ఇప్పుడు వంట వండాలి, గిన్నెలు తోమాలి, పాలు పెరుగూ తెచ్చుకోవాలి.. ఇలా అన్ని పనులూ నా మీదే పడుతున్నాయి, కాస్త తీరికైనా దొరకడం లేదు.. అంటూ వాపోయే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో! పెళ్లి అంటే.. ఆమె ఊహించుకున్న వాటిల్లో.. ఇవన్నీ లేవు! నెలరోజుల్లోనే ఇలాంటి వైరాగ్యాలు మొదలవుతున్న కాలం ఇది. అలాంటిది ఆర్థికపరమైన, ఇద్దరి కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్, సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉంటే.. కథ మరింత ఇబ్బందికరంగా మారే అవకాశాలూ ఉంటాయి. అయితే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ చాలా మందిలో కామన్ అని, కాబట్టి.. వాటి గురించి బాధపడటం కన్నా, సరి చేసుకోవడం గురించినే ఆలోచించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు!
కమ్యూనికేషన్ ప్రాబ్లమ్!
ఏ విషయాన్ని అయినా, సహచరికి ఎలా కన్వే చేయాలి, ఎలా చెబితే అర్థం అవుతుంది అనే విషయం అతడికీ క్లారిటీ లేకపోవచ్చు. తనదైన శైలిలో మాత్రమే వ్యవహరిస్తూ ఆమె అర్థం చేసేసుకోవాలని, చేసేసుకుంటుందని అనుకోవచ్చు! అయితే ఈ అనుకోవడం సంవత్సరాలకు సంవత్సరాలు కూడా కొనసాగుతుంది! దీంతో.. దశాబ్దాలపాటు కాపురం కొనసాగినా.. మామూలుగా చెప్పడం కన్నా, అరిచి చెప్పడం అనే పద్దతి కొనసాగుతూ ఉంది. ఈ విషయంలో మారొచ్చనే ఆలోచన అతడికి రాదు, మార్చుకోవాలనే ప్రయత్నం ఆమె కూడా చేయదు! చాలా మంది భార్యాభర్తల్లో ఉండే తీరే ఉంది. సరైన కమ్యూనికేషన్ తో కన్నా.. తమదైన కమ్యూనికేషనే వారి ఇగోలకు కూడా శాటిస్ ఫ్యాక్షన్ ఇస్తుంది కాబోలు! తమ వద్దకు వచ్చే ఇలాంటి కేసులు చాలా ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు!
ఫైనాన్షియల్ స్ట్రగుల్స్!
వివాహం తర్వాత ఊహించుకునే కలర్ ఫుల్ లైఫ్ లో ఆర్థిక స్వతంత్రం ఒకటి. పెళ్లికి ముందే ఆర్థికంగా అన్ని విషయాలూ నచ్చే, లెక్కలేసుకునే ఉంటారు! అయితే.. వివాహం తర్వాత కూడా ఇదో సమస్య గా కొనసాగొచ్చు. స్పెండింగ్ హ్యాబిట్ విషయంలో ఇద్దరి దారులూ వేర్వేరు తరహాలో ఉండవచ్చు. దీని వల్లనే ఇదో సమస్యగా మారే అవకాశం ఉంది. పొదుపరి అబ్బాయి, దారాళంగా ఖర్చు చేయాలనే అమ్మయి.. లేదా ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు చేయకూడదనే అంశాల గురించి పరస్పరం అవగాహన లేకపోవడం అనేది చాలా రొటీన్ ప్రాబ్లమ్. ఈ విషయంలో కూడా దీర్ఘకాలం పాటు సఫర్ అయ్యే జంటలు చాలానే ఉంటాయని రిలేషన్ షిప్ కౌన్సిలర్లు అంటున్నారు.
ఇంటిమసీ, సెక్సువాలిటీ!
సెక్స్ విషయంలో కూడా పరస్పర నిర్వచనాలు వేర్వేరుగా ఉంటాయి. కొందరు రొమాంటిక్ గా ఉంటారు, రొమాంటిక్ పార్ట్ నర్ ను ఎక్స్ పెక్ట్ చేస్తారు! అయితే మూడ్ వస్తే తప్ప పార్ట్ నర్ ను టచ్ చేయని వారూ ఉంటారు! కిచెన్ లో ఇద్దరూ ఉన్నప్పుడే రొమాన్స్ ను ఎక్స్ పెక్ట చేసే తత్వం ఉన్న అబ్బాయి లేదా అమ్మాయి శృంగారం అంటే కేవలం శారీరక కలయిక మాత్రమే అనుకునే వారికీ చాలా తేడా ఉంటుంది. బయటకు చెప్పుకోలేని సమస్య కూడా ఇది! దీని ప్రభావం ఇతర అంశాల ద్వారా వ్యక్తం అవుతుందని నిపుణులు వివరిస్తున్నారు.
పేరెంటింగ్ డిఫరెన్సెస్!
పిల్లల పెంపకంలో కూడా చాలా విబేధాలుంటాయి. పిల్లల చదువు, ఆడించడం, వారి ఆలనాపాలనా చూసుకోవడం.. ఇలాంటి విషయంలో బాధ్యతలు తీసుకోవడానికి పోట్లాడే వారితో మొదలుపెడితే, పిల్లలకు నచ్చినట్టుగా వ్యవహరించడం లేదా వారి పట్ల కఠినంగా వ్యవహరించడంలో కూడా పరస్పరం విరుద్ధమైన పోకడలకు పోయే భార్యాభర్తలు ఉండవచ్చు!
పిల్లల విషయం కాబట్టి.. ఆఖరికి ఏదోలా మాట్లాడుకుని రాజీ పడతారు. మిగతా విషయాల్లో మాత్రం మాట్లాడుకుని ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మాత్రం రకరకాల అంశాలు అడ్డొస్తాయి! ఇవి వైవాహిక బంధంలో ఉండే కామన్ ప్రాబ్లమ్స్ అని, వీటిని ఫేస్ చేసే వారు కుంగిపోవడం కన్నా, కలిసి మాట్లాడుకుంటనే మంచి ప్రయోజనం ఉంటుందని రిలేషన్ షిప్ కౌన్సిలర్లు వివరిస్తున్నారు.