ప్రొఫెసర్‌గిరీ: ముల్లుని ముల్లుతోనే తియ్యాలి

ముల్లుని ముల్లుతోనే తియ్యాలన్నది పెద్దలు చెప్పే మాట. ఎంతైనా ప్రొఫెసర్‌ కదా.. కీలెరిగి వాత పెట్టడమెలాగో ఆయనకు బాగా తెలుసు. అయితే, సరైన టైమ్‌ కోసం ఇప్పటిదాకా వెయిట్‌ చేశారంతే. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ని…

ముల్లుని ముల్లుతోనే తియ్యాలన్నది పెద్దలు చెప్పే మాట. ఎంతైనా ప్రొఫెసర్‌ కదా.. కీలెరిగి వాత పెట్టడమెలాగో ఆయనకు బాగా తెలుసు. అయితే, సరైన టైమ్‌ కోసం ఇప్పటిదాకా వెయిట్‌ చేశారంతే. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ని ఎదిరించడమంటే ఆషామాషీ విషయం కానే కాదు. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, వామపక్షాలే చేతులెత్తేశాయి. అలాంటిది, ఒకే ఒక్కడు.. అది కూడా ఓ సాధారణ ప్రొఫెసర్‌ టీఆర్‌ఎస్‌తో తలపడగలరా.? ఆయన బలమేంటో ఆయనకు తెలుసు. అందుకే రైట్‌ టైమ్‌ వచ్చేదాకా ఆగారు. 

టైమొచ్చింది.. మల్లన్నసాగర్‌ వివాదాన్ని సరిగ్గా వాడుకున్నారు. వాడుకోవడమంటే అలా ఇలా కాదు, మొత్తంగా టీఆర్‌ఎస్‌యేతర రాజకీయ పార్టీలన్నీ తనకు మద్దతుగా మాట్లాడేలా చేయగలిగారు. అంతే, గడ్డిపరక కాస్తా, మదపుటేనుగుని బంధించే శక్తిని సంపాదించుకుంది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇది వాస్తవం. న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోని కొట్టివేయడం ఒక ఎత్తయితే, నిర్వాసితుల తరఫున పోరాటంలో కోదండరామ్‌ విజయం సాధించడం ఇంకో యెత్తు. 

వాస్తవానికి, తెలంగాణలో ఏ రాజకీయ పార్టీనీ కేసీఆర్‌ పట్టించుకోలేదు, పాడుచెయ్యడానికి ప్రయత్నించి సఫలమయ్యారంతే. కాంగ్రెస్‌, టీడీపీ కుదేలయ్యాయి, వైఎస్సార్సీపీ మాయమైంది.. ఇంతలా రాజకీయాల్ని భ్రష్టుపట్టించిన కేసీఆర్‌, ఒకసారి కాదు, మొత్తం పదహారుసార్లు న్యాయస్థానాల నుంచి మొట్టికాయలేయించుకున్నా, వాటినీ పట్టించుకోలేదు. 'దున్నపోతు మీద వాన కురిసిన చందాన..' అంటూ విపక్షాలు గగ్గోలు పెడ్తున్నాయనుకోండి కేసీఆర్‌ తీరు గురించి.. అది వేరే విషయం. 

కానీ, తాను పెంచి పోషించిన మొక్క.. ఇప్పుడు తననే నిలదీస్తోంటే కేసీఆర్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. అదే, కోదండరామ్‌ ఏదన్నా రాజకీయ పార్టీలో వుంటే, కేసీఆర్‌కి 'పని' తేలికైపోయేది. కానీ, ఇప్పుడు కోదండరామ్‌ని ఏమీ చేయలేని పరిస్థితి. సరిగ్గా, ఇక్కడే కోదండరామ్‌, కేసీఆర్‌ని ఇంకా గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 'తెలంగాణలో ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఆంధ్రోళ్ళకి ఇవ్వకూడదు..' అంటూ కోదండరామ్‌ ఫత్వా జారీ చేయడం గమనార్హం. 

తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్ళని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు కేసీఆర్‌. తెలంగాణలో ఆంధ్రోళ్ళకు చోటు లేదు.. అని ఇదే కేసీఆర్‌ నినదించారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పెట్టుబడిదారుల పేరుతో ఆంధ్రా కాంట్రాక్టర్లకు రెడ్‌ కార్పెట్‌ వేసేస్తున్నారు. మామూలుగా అయితే ఇదేమీ తప్పు కాదు. కానీ, కేసీఆర్‌ స్కూల్లోంచి వచ్చినవారెవరికైనా ఇది తప్పులానే కనబడాలి. ఎందుకంటే, వాళ్ళెవరికీ ఆంధ్రా అన్న వాసన గిట్టకూడదు కాబట్టి. 

కోదండరామ్‌ వాదనలోనూ లాజిక్‌ వుంది. కాంట్రాక్టులు ఆంధ్రోళ్ళే పొందుతున్నారు.. కానీ, పనులు చేస్తున్నది మాత్రం తెలంగాణకి చెందిన సంస్థలే. అంటే సబ్‌ కాంట్రాక్టులన్నమాట. అలాంటప్పుడు వేల కోట్ల ప్యాకేజీలను వివిధ భాగాల కింద చేస్తే, తెలంగాణలోనూ కాంట్ట్రార్లు పుట్టుకొస్తారన్నది కోదండరామ్‌ లాజిక్‌. అదిరింది కదూ.! 

ముల్లుని ముల్లుతోనే తీయాలి.. కేసీఆర్‌ని ఆంధ్రా సెంటిమెంట్‌తోనే కొట్టాలి. ఇదీ ఇప్పుడు కోదండరామ్‌ తాజా వ్యూహం. కోదండరామ్‌ 'వాయిస్‌' పవర్‌ ఏంటో, మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు వివాదంలో టేస్ట్‌ చూసిన కేసీఆర్‌, ఇప్పుడీ ఆంధ్రా సెంటిమెంట్‌ దెబ్బకి ఎలా బెంబేలెత్తుతారో వేచి చూడాల్సిందే.