'జావా' అనే మాట వినేసరికి నా గుండె గొంతులోకి వచ్చేసింది. ఇది వరకే మూడు సార్లు జావా నేర్చుకోవటం మొదలుపెట్టి, అర్థం కాక, అరగక మానేసాను. ఇక జీవితంలో జావా చదవటం కాదు కదా, కనీసం త్రాగ కూడదు అని గట్టిగా ఏ ముహుర్తాన అనుకున్నానో, అదే జావాని ఇప్పుడు అంతకంటే గట్టిగా నేర్చుకోవాల్సిన పరిస్థితి.
తర్వాత రోజే క్లాసు మొదలైంది. జావా అర్థం చేసుకోవటం కన్నా అమ్మాయి మనస్సుని అర్థం చేసుకోవటం తేలికని అప్పటి వరకు నాకు గట్టి నమ్మకం. ఎండాకాలం ఏ.సి.లో కూర్చుంటే స్వర్గంలో ఉన్నట్టుంది. చిన్నగా తూలటం మొదలు పెట్టాను. మెల్లగా నిద్రలో జారుకున్నాను.
“నా పేరు శృతి” అని చక్కని శృతిలో చెప్పింది ఓ గొంతుక. ఆ మాటకు ఉలిక్కిపడి లేచాను. ఎవరా శృతిగల ఇంతి అని. ఆకు పచ్చని చుడీధార్‌లో ముక్కుపచ్చలారని మచ్చలేని ముఖం. ఒక్క మాటలో, కాదు,, ఒక్క వాక్యంలో చెప్పాలంటే పాలలో ముంచి తీసిన హంపీ శిల్పంలా ఉంది. ఇలా ఇదివరకు ఎంతోమంది చెప్పారనుకుంటే, ఇప్పుడే కొన్న కొత్త ఐఫోనులా ఉంది.
ఒక్కసారిగా చల్లని గాలి తాకింది, చిన్నగా వర్షపుజల్లు మొదలైంది. చక్కగా విరిసిన పూలు గాలికి మెల్లగా ఊగుతూ ఆ జల్లులో తడుస్తున్నాయి. మామూలుగా అయితే ఇలానే జరగాలి, కానీ మేము అద్దాలు బిగించిన ఏ.సి గదుల్లో ఉండటం చేత నేను ఆ దృశ్యాలను కోల్పోయాను.
Entry scene of Sruthi in the popular eBook Ram@Sruthi.com. To read this novel of our age click here now!