సల్మాన్‌ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసు..
సల్మాన్‌ఖాన్ జింకల వేట కేసు..
జయలలిత అక్రమాస్తులకేసు..
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసులే వున్నాయి.. దేశంలో న్యాయవ్యవస్థపై సగటు ప్రజానీకానికి విశ్వాసం కోల్పోయేలా చెయ్యడానికి. ఆయా కేసుల్లో న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులు ప్రజల్ని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ఓ న్యాయస్థానం దోషిగా తేల్చితే, ఇంకో న్యాయస్థానం క్లీన్ చిట్ ఇస్తుంది. 'పైగా ఆరోపణల్ని నిరూపించలేకపోయినందున..' అంటూ న్యాయస్థానాలు ఆయా వ్యక్తులకు 'వెసులుబాటు' కల్పిస్తుండడంతో న్యాయవ్యవస్థపై గందరగోళం అలా అలా పెరిగిపోతూనే వుంది.
అయినాసరే, కొన్ని కేసుల్లో న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు వ్యవస్థ మీద నమ్మకాన్ని పెంచుతున్నాయన్నది నిర్వివాదాంశం. దురదృష్టవశాత్తూ ఇప్పుడు న్యాయవ్యవస్థకు మరో 'మకిలి' అంటుకునేలా కన్పిస్తోంది. హైకోర్టు జస్టిస్‌కి, సర్వోన్నత న్యాయస్థానం ఏకంగా ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అంతకన్నా ముందు, సదరు జస్టిస్ ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే జైలు శిక్ష విధించేయడం గమనార్హం.
న్యాయవ్యవస్థపైనా, న్యాయమూర్తులపైనా, న్యాయవాదులపైనా ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కిన కోల్‌కతా హైకోర్టు జస్టిస్ కర్ణన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. సుప్రీంకోర్టు, జస్టిస్ కర్ణన్‌ని విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించినా, ఆయన ఆ ఆదేశాల్ని పెడచెవిన పెట్టారు. ఇక ఇలా కాదని, న్యాయ, పరిపాలన విధులు నిర్వర్తించకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా డోన్ట్ కేర్.. అన్నట్టు వ్యవహరించారాయన. చివరి అస్త్రంగా, ఇదిగో ఇప్పుడు ఆరు నెలల జైలు శిక్షను విధించింది సర్వోన్నత న్యాయస్థానం.
నిజానికి సుప్రీంకోర్టు అంటేనే ఫైనల్. కానీ, హైకోర్టు జస్టిస్ ఇచ్చిన తీర్పు మాటేమిటి.? ఇప్పుడు కర్ణన్ ఇచ్చిన తీర్పు అమలవుతుందా.? సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలవుతాయా.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్ కాబట్టి, జస్టిస్ కర్ణన్‌ని అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సి వుంటుంది. కానీ, ఈ మొత్తం వివాదం న్యాయవ్యవస్థకే పెద్ద 'మచ్చ'లా మారే ప్రమాదముంది. ఇలాంటి సంఘటనలు న్యాయవ్యవస్థపై ప్రజల్లో వున్న గౌరవాన్ని తగ్గిస్తాయన్నది నిర్వివాదాంశం.
గతంలో కిందిస్థాయి కోర్టులకు చెందిన న్యాయమూర్తులు అవినీతి ఆరోపణల్లో ఇరుక్కోవడం చూశాం. అవి చిన్న చిన్న అంశాలుగా మాత్రమే మిగిలిపోయాయి. కానీ, ఇప్పుడలా కాదు, ఏకంగా హైకోర్టు న్యాయమూర్తి.. ఇలా జైలు శిక్షను ఎదుర్కోవడమంటే.. కాస్త ఆలోచించాల్సిన విషయమే. దేశ చరిత్రలోనే ఓ హైకోర్టు న్యాయమూర్తి కి జైలు శిక్ష పడటం, అదీ సుప్రీంకోర్టు ఆ శిక్ష విధించడం తొలిసారి.