ఒక మంచి హీరో అనిపించుకున్న తరువాత కూడా ఆచి తూచి, వైవిధ్యమైన సినిమాలు చేయడం అన్న అలవాటును దూరం చేసుకోని నటుడు శర్వానంద్. తెలుగు ప్రేక్షకులు శర్వానంద్ సినిమా వస్తోంది అంటే కచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు అనుకునే ఇమేజ్ ను స్వంతం చేసుకున్నాడు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానంభవతి వంటి వరుస హిట్ లు ఖాతాలో వున్నా, వెంట మందీ మార్బలం లేకుండా, వీలయినంత కామ్ గా, నెమ్మదిగా, నవ్వుతూ కనిపిస్తాడు. సంక్రాంతి బరిలో హేమా హేమీ సినిమాలతో పాటు దిగి, అద్భుతమైన హిట్ ను స్వంతం చేసుకున్నా కూడా తన సినిమా బడ్జెట్ పది కోట్లు దాటడానికి వీల్లేదు అని కండిషన్ పెడతాడు. మంచి కథ వచ్చింది, మంచి ప్రాజెక్టు, సరే చూద్దాం అంటూ ఎప్పటికప్పుడు పారితోషికానికి మేకు కొట్టి అలాగే వుంచేసాడు. అలాంటి శర్వా నటించిన లేటెస్ట్ మూవీ రాధ. ఈ సినిమా విడుదల సందర్భంగా శర్వానంద్ తో ముఖాముఖి.
హిట్ ల మీద హిట్ లు వస్తుంటే బరువు బాధ్యతలు పెరుగుతున్నాయా?
చాలా. ఏం చేయాలి? అన్నది ఎంచుకోవడం దగ్గరే ఎక్కడలేని కష్టమూ పడాల్సి వస్తోంది. వన్స్ అది డిసైడ్ అయిపోతే ఇక ముందుకు వెళ్లిపోవచ్చు. అయినా ఇది బరువు అనుకోవడం లేదు. నా కెరీర్ కు నా బాధ్యత అదే కదా?
బాధ్యత పెరిగింది సరే, వరుస హిట్ ల హీరోగా జేబు బరువు కూడా పెరిగిందా?
(నవ్వేస్తూ) అబ్బే ఇంకా అంత లేదండీ. ఇప్పటి దాకా చేసినవి, చేస్తున్నవి, చేయాల్సినవి అన్నీ ఇంతకు ముందు ఎప్పడో కమిట్ అయినవి, కాస్త మొహమాటాలు వున్నవీ. అందువల్ల ఇంకా జేబు బరువు పెరిగేంత లేదు వ్యవహారం.
రన్ రాజా రన్ తరువాత అదే లైన్ లో అంటే, ఫన్ జోనర్ లోనే ఎక్కువగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.
నిజంగా రన్ రాజా రన్ నా కెరీర్ లో ఓ మాంచి మలుపు. నేను ఏం చేయాలో నాకే తెలియని టైమ్ లో సుజీత్ నన్ను ఇలా ముందుకు వెళ్లాలి అని డిసైడ్ చేసి చూపించాడు. అయితే ఇక అవే సబ్జెక్ట్ లు అని కాదు. ఒక్కో సినిమా ఒక్కో మీటర్ పై నడుస్తుంది. మొత్తం మీద కామన్ ఆడియన్స్ తో కూర్చుని సినిమా చూస్తుంటే, వాళ్లు నా నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుస్తోంది. ఓ సీన్ లో నేను కాజువల్ గా చేస్తేనే వాళ్లు మరీ అంత రెస్పాన్స్ ఇస్తున్నారు అంటే, ఇంకా చేస్తే ఎలా వుంటుంది, మరేం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తాను నేను.
రాధ కూడా అలాంటి సినిమానేనా?
ఇది ఓ మీటర్ లో నడుస్తుంది. ఒక కొత్త పాయింట్ కు కనెక్ట్ అయ్యాను. దేవుడు అంటే ఎవరు? పిలవగానే పలికేవాడు. 365 రోజులు, 24 గంటలు పిలవగానే పలికేది ఎవరు? 100 డయిల్ చేస్తే పోలీస్ నే కదా? అందుకే చిన్నప్పటి నుంచీ పోలీస్ నే దేవుడు అనుకుంటూ పెరుగుతాడు హీరో. అందుకే భగవద్గీత టైపు డైలాగులు ఫన్నీగా చెబుతూ వుంటాడు. సందేశం కావాలా? సారాశం కావాలా? ఇలా. అలా పుట్టే ఫన్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది.
ఫ్యాంట్ షర్ట్ వేసుకున్న కృష్ణుడిగా కనిపిస్తున్నారు. కిరీటం కూడా పెట్టేసుకున్నారా?
ఆ గెటప్ అంతా సినిమా ప్రమోషన్ కోసం చేసిన ఫోటో షూట్. ఓ పాటలో మాత్రం జస్ట్ అలా కనిపిస్తా.
మీ దగ్గరకు వచ్చిన ప్రతి కొత్త దర్శకుడు మీకు హిట్ లు ఇస్తున్నారు. ఇదెలా సాధ్యమవుతోంది?
నా దగ్గరకు వచ్చేవారిని నాకిది కావాలి అని అడగను. మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతా. నాకు కథ చెప్పే ముందే చెబుతా, నేను కనెక్ట్ అయితేనే ఓకె అంటా. లేదూ అంటే లేదు. అని ముందే చెప్పేస్తా. నా స్టాండర్ట్ డైలాగ్ ఒకటే. మీరు నా కోసం సినిమా చేయాలనుకుంటున్నారా? మీరు డైరక్టర్ గా స్టాండ్ కావడానికి సినిమా చేయాలనుకుంటున్నారా? వాళ్లు అనుకున్న సబ్జెక్ట్ అయితే వాళ్లకు ఇంట్రెస్ట్ వుంటుంది. అంతే కానీ, నేను యాక్షన్ సినిమా చేద్దాం అనుకుంటున్నా, మాస్ సినిమా లేదా క్లాస్ సినిమా అంటూ నేను గీతలు గీస్తే వాళ్లు నా కోసం ఏదో చేద్దామని ప్రయత్నిస్తారు. అప్పుడు సక్సెస్ రావచ్చు రాకపోవచ్చు. అదే వాళ్లకు నచ్చింది, వచ్చింది చేస్తే, కచ్చితంగా సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం వుంటుంది.
అంటే కథ నచ్చితే ఇక లైన్ క్లియర్ అయిపోయినట్లేనా?
కాదు. అక్కడా కండిషన్ అప్లయ్ వుంటుంది. నిర్మాతకు ముందే చెబుతా, కథ నచ్చింది. మీరు రాయించుకుంటారో? డైరక్టర్ రాస్తారో నాకు తెలియదు, ఫుల్ డైలాగ్ వెర్షన్ తో బౌండ్ స్క్రిప్ట్ కావాలి. అది చదివాకే ఓకె అంటాను. అంటానని గ్యారంటీ లేదు. ఈలోగా మీరు ఆఫీసు తీసేసాం, ఖర్చులు పెట్టేసాం అంటే నాకు కుదరదు. సినిమా ఓకె, డేట్ లు, ఆఫీస్ ఇవన్నీ బౌండ్ స్క్రిప్ట్ నేను చదివాకే.
ఇది ఎప్పటి నుంచి? కెరీర్ గాడిలో పడ్డాకనా? తొలినాళ్ల నుంచీనా?
మొదట్నించీ. దేవా కట్టా, క్రిష్ అందరూ నాకు బౌండ్ స్క్రిప్ట్ అందించారు.
స్క్రిప్ట్ మొత్తం సీన్ టు సీన్ డైలాగ్ టు డైలాగ్ మీరే చదువుతారా? ఎవరి సాయం అన్నా తీసుకుంటారా?
సమస్యే లేదు. నేనే చదువుకుంటా. ఓ నైట్ చదివేసి, వెంటనే మార్నింగ్ ఫోన్ చేసి ఎస్ ఆర్ నో చెప్పేస్తా. అక్కడ మాత్రం మొహమాటం లేదు.
హిట్ హీరో సరే, భారీ సినిమాల హీరో అని కూడా అనిపించుకుంటారా?
సమస్యే లేదు. నా సినిమాల బడ్జెట్ ఇప్పట్లో పది కోట్లు దాటదు. దాట వద్దని ముందే చెబుతాను. సినిమా ఫలితం ఎలా వున్నా, అది సేఫ్ జోన్.
మరి అలా అయితే మీ రెమ్యూనిరేషన్ పెరగడం కష్టం కదా?
పెరగదు. పోనివ్వండి. కావాలంటే లాభంలో వాటా తీసుకుంటాను. నిర్మాతకు అది మంచిది కదా? నిర్మాతలు లేకపోతే మనం ఎక్కడ వుంటాం అండీ. అందుకే నాకు నేను ఆ బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నాను.
ఇప్పటి దాకా దాదాపు అన్నీ కొత్త దర్శకులతో, ఒకటీ అరా సినిమాలు చేసిన వారితో చేసుకుంటూ వస్తున్నారు. తొలిసారి ప్రూవ్ చేసుకున్న డైరక్టర్ మారుతి తో చేస్తున్నారు. అలాగే సుధీర్ వర్మతో చేయబోతున్నారు?
అవును మారుతితో డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. నిర్మాతలకు, హీరోలకు అలాంటి డైరక్టర్లు వుండాలి. చాలా కూల్ గా, స్మూత్ గా వుంటుంది వ్యవహారం. అస్సలు సినిమా చేస్తున్నట్లు, షూటింగ్ చేస్తున్నట్లు వుండదు. పక్కా ప్లానింగ్ తో, ఆరామ్ గా చేసుకుంటూ వెళ్తాడు.
మారుతి మహానుభావుడు ఎలా వుండబోతున్నాడు?
అది డిఫరెంట్ సబ్జెక్ట్. రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, రాధ ఓ లైన్ లోకి వస్తే, అది వేరే లైన్. కచ్చితంగా మంచి సినిమా అవుతుంది.
రాధ సినిమా పై మీ అంచనాలు ఎలా వున్నాయి. శతమానంభవితి లాంటి పెద్ద హిట్ తరువాత వస్తోంది. ప్రేక్షకుల అంచనాలు కూడా కాస్త ఎక్కువే వుంటాయేమో కదా?
కచ్చితంగా బాగుంటుంది. క్లీన్ యు సర్టిఫికెట్ సినిమా. అవుట్ అండ్ అవుట్ ఫన్ తప్ప మరేమీ వుండదు. ఎక్కడో అండర్ కరెంట్ గా చిన్న మెసేజ్ వుంటుంది.
లావణ్య త్రిపాఠీతో జోడీ ఎలా వుండబోతోంది?
చాలా సరదాగా వుంటుంది మా ఇద్దరి పెయిర్. ప్రేక్షకులు చాలా క్లోజ్ గా, హోమ్లీగా, తెలిసిన జంటను చూసినట్లు ఫీలవుతారు.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి మాంచి ఫీల్ లవ్ సినిమా అందించారు. మళ్లీ ఎప్పుడు అలాంటి సినిమా?
నిజం చెప్పనా? మాంచి ప్యూర్ లవ్ స్టోరీ చేయాలన్నది నా డ్రీమ్. ఎవరికీ ఇది కావాలి అని అడగను ఎప్పుడూ. కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా మాంచి ప్యూర్ లవ్ స్టోరీ తెస్తే బాగుండును అని వుంది.
మణిరత్నం సార్ ని అడిగి, ఆయనతో చేయవచ్చుగా?
అమ్మో..అంత అదృష్టమా? అంతకన్నా ఇంకేం కావాలి?
మరి అడగొచ్చుగా ఆయనను?
నిజానికి ఒకటి రెండు సార్లు అడుగుదాం అనుకున్నపుడల్లా, ఆయన ఏదో ఒక ప్రాజెక్టులో వుంటున్నారు. నాకు సఖి, ఓకె బంగారం లాంటి సినిమా ఆయనతో చేయాలని వుంది.
ప్యూర్ లవ్ స్టోరీ సంగతి సరే, ఇంట్లో మీ 'ఫ్యామిలీ' స్టోరీ గురించి అడగడం లేదా?
అబ్బో అదేమంటారు? ఇంకెప్పుడు ఇంకెప్పుడు అంటారు? రెండేళ్ల దాకా మాట్లాడ వద్దని చెప్పేసా. లక్కీగా ఇండస్ట్రీలో ఇంకా కొంతమంది ఎలిజిబుల్ బ్యాచులర్స్ వున్నారు. వాళ్లను చూపించి, నేను ఇంట్లో తప్పించుకుంటున్నా. ఇంకా ప్రభాస్ చేసుకోలేదు, నన్ను ప్రెజర్ చేయకండి అంటున్నా (నవ్వుతూ)
అంటే రెండేళ్ల దాకా సినిమా సందళ్లే కానీ, పెళ్లి సందడి లేదన్నమాట.
కచ్చితంగా. లేనట్లే.
మీరు హీరోగా వున్నారు. మీ బ్రదర్ డిస్ట్రిబ్యూటర్ గా వున్నారు. మళ్లీ సినిమా నిర్మాణం గురించి ఆలోచించడం లేదా?
లేదండీ. అది అంత చిన్న విషయం కాదని గతంలోనే అర్థమయింది. అందుకే ఇక అటు వెళ్లకపోవచ్చు.
విఎస్ఎన్ మూర్తి