త్వరలో తెలంగాణ విద్యార్ధుల చదువులు మారనున్నాయి. పాత తరం సబ్జెక్టుల్లో సమూలమైన మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్ర సంస్కృతి , సంప్రదాయాలు ఉట్టిపడేలా పాఠ్యాంశాలు రూపొందించాలని కసరత్తు చేస్తోంది. పాఠ్యపుస్తకాల్లో నూతన సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు విధివిధానాలు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు.
కొత్త రాష్ట్రం, కొత్త పాలన, కొత్త పాఠ్యాంశాలు…పాత విధానాలకు స్వస్తి పలికే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. డిగ్రీ కోర్సుల్లో సమూల మార్పులు తెచ్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. రాష్ట్ర పరిస్థితులు, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా బీఏ, బీకాం తదితర కోర్సుల్లో సిలబస్‌ను మార్పు చేయాలని నిర్ణయించింది.
సోషల్ సెన్సైస్, భాషా పరమైన సబ్జెక్టుల్లోనూ మార్పులు చేయనుంది. బీకాం కామర్స్ సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులపై ఉన్నత స్థాయి కమిటీతోపాటు సూపర్‌వైజరీ, వర్కింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా రాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా కామర్స్ సిలబస్‌లో మార్పులు తీసుకువస్తారు.
పారిశ్రామిక రంగంలో పరిస్థితులు, భవిష్యత్తులో అవసరాలపైనా పాఠ్యాంశాలు ఉంటాయి. వివిధ రంగాల వారీ స్థితిగతులపై విద్యార్థుల్లో పూర్తిస్థాయి అవగాహన కలిగేలా ఈ మార్పులు తెస్తారు. దేశ వాణిజ్య విధానంతోపాటు విదేశీ వాణిజ్య విధానాలపైనా పాఠ్యాంశాలు ఉంటాయి.
మూడేళ్ల కోర్సులో 16 సబ్జెక్టుల్లో సిలబస్‌ను మార్పు చేయనున్నట్లు సమాచారం. నిపుణులతో ప్రతి సబ్జెక్టుకి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇంగ్లిషు, తెలుగు సబ్జెక్టుల్లోనూ సిలబస్ మార్చనున్నారు. వాటితోపాటు సోషల్ సెన్సైస్‌లో హిస్టరీ, కల్చర్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టుల సిలబస్‌లో మార్పులు తెస్తారు.
భాష, సంస్కృతి సబ్జెక్టుల్లో ప్రొఫెసర్ జయశంకర్, కొమురం భీం వంటి వారి చరిత్ర, తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, కళాకారుల పాత్ర, బతుకమ్మ, కోలాటం, దసరా తదితర పండుగలకు చోటు కల్పిస్తారు. తెలంగాణ యాస-భాష, సాహిత్యం, సంస్కృతి, మహానుభావుల పద్య, గద్య రచనలు, కవిత్వాలపైనా పాఠ్యాంశాలు ఉంటాయి. అన్ని సబ్జెక్టుల్లో మార్పులను పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తేవాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రయత్నిస్తోంది.