ఒకవైపు సినిమా పరిశ్రమలోకి కొత్త నీరు వస్తోంది. యంగ్ మూవీ మేకర్లు సరికొత్త, భిన్నమైన ప్రయోగాలతో సినిమాలు రూపొందించగలుగుతున్నారు. తక్కువ బడ్జెట్ లో పరిమిత వనరులతో ఏ మాత్రం స్టార్ ఇమేజ్ లేని నటీనటులతో వైవిధ్యభరితమైన సినిమాలు వస్తున్నాయి తెలుగులో. ఇది వరకూ ఇలాంటి సినిమాలంటే అవి ఏ పక్క భాషలవో అయ్యుంటాయనే అభిప్రాయాలుండేవి. అయితే గత కొన్నేళ్లలో తెలుగులోనూ పరిస్థితులు చాలా మారాయి. చిన్న చిన్న సినిమాలు పెద్ద పెద్ద విజయాలు సొంతం చేసుకుంటున్నాయి. ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా, హైప్ లేకుండా, స్టార్ల ప్రోద్బలం లేకుండా పలు వైవిధ్యభరితమైన సినిమాలు వచ్చి ప్రేక్షకుల ఆదరణకు నోచుకున్నాయి.
అలాంటి మన సినిమాలను పక్క భాషల వాళ్లు కూడా ఆసక్తిదాయకంగా చూశారు. అభినందించారు. అవార్డులను ఇచ్చారు. వీలైతే రీమేక్ చేసుకున్నారు, రీమేక్ చేసుకుంటున్నారు. అది తెలుగు సినిమా అభిమానులు కూడా గర్వపడే అంశం. వైవిధ్యభరితమైన సినిమాలను అందిస్తున్నారు అని కొత్త తరం దర్శకులను, యంగ్ మూవీ మేకర్లను, అలాంటి సినిమాలను నిర్మిస్తున్న ప్రొడ్యూసర్లను కూడా ప్రేక్షకులు అభినందిస్తూ ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో.. పక్క భాషల వాళ్లు రాసుకున్న సినిమా ఆర్టికల్స్ లో కూడా తెలుగు సినిమాల ప్రస్తావన కనిపించింది. ఈ తెలుగు సినిమాలను తప్పకుండా చూడండి.. అంటూ పరాయి భాషల ప్రేక్షకులకు కూడా ఇంగ్లిష్ మూవీ ఆర్టికల్స్ లో సలహాలు ఇచ్చారు రివ్యూయర్లు.
లాక్ డౌన్ లో చూడదగ్గ బెస్ట్ సౌతిండియన్ మూవీస్ లో తెలుగు వాటా ఘనంగానే కనిపించింది. విశేషం ఏమిటంటే.. ఆ సినిమాలేవీ తెలుగు స్టార్ హీరోలు నటించినవి కావు. అర్జున్ రెడ్డి, బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, కేరాఫ్ కంచరపాలెం, మల్లేశం, అ!, పెళ్లిచూపులు వంటి నయా జనరేషన్ ను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాలను పరాయి భాషల వాళ్లు కూడా ప్రస్తావించారు. ఈ సినిమాలను కచ్చితంగా చూడండి అని.. ఇతర భాషల సినీ ప్రియులకు సజెస్ట్ చేశారు సినిమా ఆర్టికల్స్ రాసేవాళ్లు.
ఒకవైపు తెలుగు సినిమా యంగ్ బ్లడ్ అలాంటి ఆసక్తిదాయకమైన సినిమాలను, ప్రేక్షకుల్లో అమితాసక్తిని కలిగించే సినిమాలను రూపొందిస్తూ ఉంది. ప్రతి యంగ్ మూవీ మేకరూ అలాంటి బెంచ్ మార్క్ సినిమాలను రూపొందించకపోయినా.. వీటి స్ఫూర్తి కొత్తగా వచ్చే వాళ్లకు ఉపయోగపడుతుంది. అలాగే ప్రేక్షకులకు కూడా మంచి సినిమాలు చూసిన అనుభూతి అప్పుడప్పుడు అయినా కలుగుతోంది.
ఆరేడేళ్ల కిందటి వరకూ కూడా.. ఇలాంటి సినిమాలు కూడా తెలుగులో అరుదుగా కూడా వచ్చేవి కావు! ప్రయోగాలు, విభిన్నమైన సినిమాలు, ఫార్ములాకు అతీతమైన సినిమాలు.. అంటే అవి ఏ తమిళులో, మరే మలయాళీలో తీయాల్సిందే తప్ప తెలుగు వాళ్లకు అంత సీన్ లేదన్నట్టుగా ఉండేది పరిస్థితి! దశాబ్దానికి ఒకటి అన్నట్టుగా శేఖర్ కమ్ముల ఆనంద్ వంటివి వచ్చాయి. అలాంటి వైవిధ్యత కాస్తా ఏడాదికి ఒకటీ రెండు సార్లు అయినా ఆవిష్కృతమయ్యే పరిస్థితి వచ్చిందిప్పుడు. ప్రేక్షకుల అభిరుచి మారింది. అందుకు తగ్గట్టుగా ఇలాంటి సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యే సరికి కొత్త ఉత్సాహానికి అవకాశం ఏర్పడింది. ఇది తెలుగు సినిమాకు సంబంధించి ఒకవైపు!
ఇక మరోవైపు స్టార్ హీరోలు. ఫార్ములాలు. ఐదు పాటలు, ఐదు ఫైట్లు, ఒక ఐటమ్ సాంగ్! అదెప్పుడూ ఎవరిగ్రీన్. వైవిధ్యభరితమైన సినిమాల కన్నా ఇవే ఎక్కువమందిని ఎంటర్ టైన్ చేస్తాయి. ఈ మాస్ మసాలాలకు ఎప్పుడూ ఉండే క్రేజ్ ఉండనే ఉంటుంది. పక్కా ఫార్ములాతో ఈ సినిమా ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అది అవాంఛనీయమైన ధోరణి ఏమీ కాదు. ఇది అంతటా జరిగేదే. ఈ విషయంలో తెలుగు సినిమా కన్నా తమిళుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి హీరోల సినిమాల్లో ఎలివేషన్లను భరించడం ప్రేక్షకులకు రోజు రోజుకూ కష్టం అవుతోంది.
తెలుగులోనూ ఇది శ్రుతి మించుతూ పోతూ ఉంది. అయితే ఈ సినిమాల మార్కెట్ వందల కోట్లు. ఎంత అతి చేసినా.. వంద కోట్లు గ్యారెంటీ. హీరోలకు వచ్చే నష్టం లేదు, నిర్మాతలకూ రాబడే. సినిమా మురీ విసిగిస్తే తప్ప మరీ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. దీంతో.. ఈ మాస్, హీరోయిక్ ఎలివేషన్లతోనే స్టార్ హీరోలు బిజీగా ఉన్నారు. వారు ఆ కట్టుబడి నుంచి బయటకు వచ్చే ఛాన్సే లేకుండా పోయింది. ఈ సినిమాలను అమితంగా ఎంజాయ్ చేసే వాళ్లకు సమస్యే లేదు. ఇక వాటిని భరించలేమనే ప్రేక్షకుడు వాటికి దూరంగా కూర్చుంటాడు. వాళ్లకు ఓటీటీ ఉండనే ఉంది.
ఇక పడికట్టు ఫార్ములాలకు ఫిక్సయిన స్టార్ హీరోలు.. కథల విషయంలో మరింత కంఫర్ట్ జోన్లోకి వెళ్లిపోతున్నారు. అదే మరో విడ్డూరం. టాలీవుడ్ లో రీమేక్ ల పరంపర తీవ్ర స్థాయికి వెళ్తోంది. ప్రత్యేకించి స్టార్ హీరోలు ఇప్పుడు వరస పెట్టి రీమేక్ సినిమాలను ఎంచుకుంటూ ఉన్నారు. డైరెక్టుగా కథలను ఎంచుకునే ధైర్యం కూడా లేకుండాపోతోందా తెలుగు టాప్ హీరోలకు అనే సందేహం రాకమానదు వరస పెట్టి తెరకెక్కుతున్న రీమేక్ సినిమాలను చూస్తే!
మెగాస్టార్ నుంచి పవర్ స్టార్ వరకూ!
రాజకీయాల నుంచి విరమించుకుని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సందర్భంలో చిరంజీవి డైరెక్టు కథను ఎంచుకోలేకపోయారు. రీ ఎంట్రీనే ప్రయోగం జోలికి వెళ్లకుండా అరవ సినిమా రీమేక్ ను ఎంచుకున్నారు. ఆ రీమేక్ ఫార్ములా వర్కవుట్ అయ్యింది. సినిమా సూపర్ హిట్ అయ్యింది. రీ ఎంట్రీ కాబట్టి.. సేఫ్టీ జోన్లో సినిమా చేసుకున్నారు చిరంజీవి. అక్కడి వరకూ ఓకే. ఆ తర్వాత చిరంజీవి సైరా నరసింహారెడ్డి రూపంలో పెద్ద ప్రయోగాన్నే చేశారు. భారీ బడ్జెట్ పెట్టి మరీ ప్రయోగాత్మక సినిమాలో చిరు కనిపించారు. ఆ సినిమాకు కమర్షియల్ గా వచ్చిన లోటేమీ లేదు. భయంకరమైన హీరోయిజం కూడా ఉంది. కాబట్టి సేఫ్ జోన్లోనే నిలబడింది. చిరంజీవిని నటుడిగా మరోసారి ఆవిష్కరించింది ఆ సినిమా. ఇప్పుడు మెగాస్టార్ తలపెట్టిన లూసీఫర్ రీమేక్ మాత్రం.. ఎందుకు? అనే సందేహం కామన్ ఆడియన్స్ లో రాకమానదు!
ఏదో మరీ గొప్ప అనుకున్న సినిమాలను చిరు రీమేక్ చేస్తే ఆ మజా వేరు. అలాంటి వాటిల్లో బెస్ట్ రీమేక్ హిట్లర్. ఇక మున్నభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నభాయ్ లను రీమేక్ చేసి చిరంజీవి బావుకున్నది ఏమీ లేదు! ఆ సినిమాలు హిందీలో క్లాసిక్స్. అలాంటి సినిమాలు ఒక్కసారే బావుంటాయి. తిరిగి తీస్తే.. అతకవు! కమల్ హాసన్ అది అర్థం చేసుకున్నాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్ రీమేక్ చేశాకా కమల్ కు అర్థం అయ్యింది. అందుకే లగేరహో జోలికి వెళ్లలేదు. అయితే ఎందుకో చేశారో, ఎలా చేశారో తెలియని లగేరహో మున్నభాయ్ తెలుగులో వికటించింది. రాజకీయాల్లోకి వెళ్లే ముందు చిరంజీవికి చేదు అనుభవాన్ని ఇచ్చింది ఆ సినిమా.
లూసీఫర్ రీమేక్ విషయానికి వస్తే.. మోహనలాల్ కూడా అక్కడ మాస్ హీరోనే, స్టార్ హీరోనే. అయితే.. తమ స్టార్ హీరోని అడుక్కుతినే వాడి పాత్రలో కూడా చూడగలరు మలయాళీలు. గడ్డం నెరిసిపోయి బెడ్ కు అతుక్కుపోయినా పాత్రలో చేసినా మోహన్ లాల్ ను యాక్సెప్ట్ చేస్తారు మలయాళీలు. అలాంటి చిత్రమైన పాత్రల్లో అతడు కనిపించిన సినిమాలు బొచ్చెడు ఉంటాయి. అంధుడు, నెగిటివ్ రోల్ పాత్రల్లో కూడా అక్కడి సూపర్ స్టార్ హీరోలు కనిపిస్తారు. లూసీఫర్ మలయాళీ వెర్షన్లో హీరోకు హీరోయిన్ లేదు, కామెడీ సీన్లు ఉండవు, ముప్పాతిక భాగం పంచెలో, సామాన్యుడిగా కనిపిస్తూ ఉంటాడు. ఆ సినిమాకు హీరో అలా ఉండటమే హైలెట్.
అదే పాత్రకు ఒక హీరోయిన్ ను తగిలింది, నాలుగు సాంగ్స్ పెట్టి, స్టెప్పులు వేయిస్తే.. అంతటితో ఖేల్ ఖతం. ఏ వైవిధ్యత అయితే ఆ సినిమాకు గొప్పగా నిలిచిందో దాన్నే యథాతథంగా చూపిస్తే, అందునా చిరంజీవిని అలా చూపించడానికి ఆయన మాస్ ఇమేజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు!
సామాన్యంగా కనిపించే అసామాన్య పాత్రలో, అందులోనూ చిరంజీవిని సగటు తెలుగు ప్రేక్షకుడు చూడలేడు. ఠాగూర్ లో ప్రొఫెసర్ పాత్రే అయినా, ఫైట్లు, డ్యూయెట్లు అన్నీ కామన్! మరి లూసీఫర్ లో ఒక వృద్ధాశ్రమం నడుపుకునే సాధువు పాత్ర.. దాన్ని గర్ల్స్ హాస్టల్ నిర్వహించేలా మాట్లాడాలి తెలుగులో! అప్పుడు కానీ.. ఇమేజ్ కు న్యాయం జరగదేమో! ఇలాంటి రీమేక్ లు అవసరమా? లూసీఫర్ వంటి కొత్త దనాన్ని ఆవిష్కరించడం తెలుగు మూవీ మేకర్లకు చేత కాదా? అనేది సగటు ప్రేక్షకుడి ప్రశ్న!
అయ్యప్పన్ రీమేక్.. అతుకుతుందా?
రీమేక్ ల మీద తెగ మోజు పడే మరో తెలుగు హీరో పవన్ కల్యాణ్. ఆల్రెడీ తెలుగు వాళ్లు చూసేసిన సినిమాలను కూడా పవన్ మళ్లీ చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కెరీర్ ఆరంభం నుంచి పవన్ కల్యాణ్ ది రీమేక్ ల బాటే. ఇప్పటి వరకూ ఆయన చేసిన సినిమాల్లో 80 శాతం రీమేక్ లే ఉన్నాయి. తొలి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం, తమ్ముడు, ఖుషీ, అన్నవరం, తీన్ మార్, గబ్బర్ సింగ్, గోపాలా గోపాలా, కాటమరాయుడు, మొన్నటి అజ్ఞాతవాసితో సహా.. ఇలా మెజారిటీ సినిమాల విషయంలో రీమేక్ బాటనే ఎంచుకున్నాడు పవన్ కల్యాణ్.
పుష్కలమైన మాస్ ఇమేజ్ కలిగి, మార్కెట్ ఉండి కూడా.. అరుదుగా మాత్రమే స్ట్రైట్ కథలను ఎంచుకునే తత్వం పవన్ కల్యాణ్ ది. ఈ క్రమంలో ఆయన ఇప్పుడు వరస రీమేక్ లను చేపట్టారు. అధికారికంగా షూటింగులో ఉన్న పవన్ కల్యాణ్ ప్రస్తుత మూడు సినిమాల్లో రెండు రీమేక్ లు. ఒకటి పింక్ రీమేక్, మరోటి అయ్యప్పనుం కోషీయుం సినిమా రీమేక్.
అవి రెండూ అభినందనలు, ఆదరణ పొందిన సినిమాలే. ప్రత్యేకించి తెలుగు మూవీ మేకర్లే వాటిని ఆదరించారు. అయ్యప్పనుం కోషీయుం అయితే లాక్ డౌన్ సమయంలో తెలుగులో నాట నుంచినే బహుశా ఎక్కువ వ్యూస్ పొంది ఉంటుంది! అలాంటి సినిమాను తీసినందుకు మలయాళీ మూవీ మేకర్లను తెలుగు ప్రేక్షకులు అభినందించారు. సోషల్ మీడియాలో ఆ సినిమాలను అభినందిస్తూ బోలెడన్ని పోస్టులు పెట్టారు. అయితే.. ఎటొచ్చీ దాన్ని రీమేక్ అంటేనే.. ఆ సినిమా వీరాభిమానులు కూడా విస్తుపోతారు.
తెలుగు సోకాల్డ్ హీరోయిక్ ఇమేజ్ లన్నింటికీ కూడా సుదూరంగా సాగే సినిమా అదాయె. హీరోలిద్దరూ తన్నుకునే సీన్లు కూడా ఊళ్లలో జరిగే గొడవల్లాగా ఉంటాయి తప్ప… కొట్టగానే ఎగిరి కింద పడే బౌన్సింగ్ ఫైట్ల సినిమా కాదు. హీరోకి డ్యూయెట్లు, ఎలివేషన్ల మాటే లేదు. సాధారణ మనుషులకు ఉండే ఎమోషన్లకు తగ్గట్టుగా రెండు పాత్రలూ కనిపిస్తాయి. ఈ సినిమాను సొంతంగా నిర్మించినా ఎక్కడా హీరోయిక్ ఇమేజ్ కోసం పాకులాడలేదు పృథ్విరాజ్. తొలి సీన్లోనే పృథ్విరాజ్ పాత్రను హీరో రోల్ ఛాతిమీద తన్నే సీన్ ఉంటుంది. అప్పుడు మొదలవుతుంది.. వీళ్లలో ఎవరు హీరో, ఎవరిది నెగిటివ్ రోల్ అని! ఫస్ట్ టైమ్ ఆ సినిమాను చూసేటప్పుడు ఉండే ఎగ్జయిట్ మెంట్ మామూలుది కాదు. అద్భుతం ఒక్కసారే అద్భుతం అనిపిస్తుంది. రెండోసారి అయ్యప్పనుం చూసినప్పుడు కూడా ఆ ఫీలింగ్ ఉండకపోవచ్చు.
మలుపులు మచ్చుకైనా లేకుండా.. కేవలం హ్యూమన్ ఎమోషన్స్ మీద నడిచే సినిమాలు రీమేక్ చేసినప్పుడు తేడా కొట్టే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఇది వరకూ అనేక రీమేక్ లు చాటిన సత్యమది. కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ఒక మోతుబరి కుటుంబం నుంచి వచ్చిన యువకుడికీ, ఆత్మగౌరమే ఆయువుగా బతికే పోలీసాఫీసర్ కూ మధ్య జరిగే క్లాష్ ను మన దగ్గర ఎంతగా తెనుగీకరించినా.. ఎంత మేరకు అతుకుతుంది? అనేది ప్రశ్నార్థకమే! అలాంటి సినిమాలే మనకు కొత్త.. వాటిని సొంతంగా తీస్తే.. కనీసం అభినందనలు సొంతం అవుతాయి. అయితే ఈ రీమేక్ లు పులిని చూసి వాత పెట్టుకున్నట్టుగా ఉంటే మాత్రం తేడా కొడుతుందని ఇది వరకటి పలు ఉదాహరణలున్నాయి. సినిమా బాగుంటే చూడాలి కానీ రీమేక్ చేసేయడం ఎంత వరకూ నప్పుతుందో ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.
వెంకటేష్.. రీమేక్ ల రాజా!
పవన్ కల్యాణ్ కన్నా ఎక్కువ శాతం రీమేక్ లను తన కెరీర్ లో కలిగి ఉన్న హీరో వెంకటేష్. కెరీర్ ఆరంభం నుంచి వెంకీ రీమేక్ లు అన్నీ ఇన్నీ కావు. తమిళం, హిందీ, కన్నడ.. ఇలా ఏ భాషలో హిట్ అయిన సినిమాలను అయినా వెంకీ రీమేక్ లు చేస్తూ ఉంటారు. అలా రీమేక్ లతో ఎక్కువ హిట్టను పొందిన ఘనత కూడా బహుశా వెంకటేష్ దే కాబోలు. అదే సమయంలో కొన్ని రీమేక్ లు డిజాస్టర్లు కూడా అయ్యాయి.
రజనీకాంత్ చేసిన సినిమాను అయినా, విజయ్ కాంత్ చేసిన సినిమాను అయినా, సూర్య చేసిన సినిమాను అయినా.. అలా భిన్నమైన ఇమేజ్ లున్న హీరోలు చేసిన సినిమాలను అన్నింటా తనే అయ్యి తెలుగు వాళ్లకు చూపించేస్తూ ఉంటారు వెంకటేష్. వెంకటేష్ స్ట్రైట్ కథలను ఎంచుకున్న సినిమాలు అరుదుగానే ఉంటాయి. కొన్ని రీమేక్ లు వెంకటేష్ కు టైలర్ మేడ్ లా సెట్ అయ్యి సూపర్ హిట్ లు అయ్యాయి. మరి ఇప్పుడు కూడా వెంకీ ఏతిలో రెండు రీమేక్ లున్నాయి. అందులో ఒకటి తమిళంలో ధనుష్ చేసిన సినిమా, మరోటి దృశ్యం-2.
తమిళనాట ఎప్పుడో దళితులపై జరిగిన ఊచకోత ఘటన ఆధారంగా రూపొందిన సినిమాను తెలుగులో వెంకటేష్ నారప్ప పేరిట రూపొందిస్తూ ఉన్నాడు. దాన్ని రాయలసీమకు అన్వయిస్తున్నారట! ఇదేం దారుణమో అర్థం కాదు. తమిళనాడులో వాళ్లేదో వాస్తవఘటన ఆధారంగా సినిమాను తీసుకుంటే.. దాన్ని రీమేక్ చేస్తూ.. ఇలా రాయలసీమకు ఆ ఘటనలను అంటగట్టడం ఎందుకో తెలుగు సినిమా వాళ్లకే తెలియాలి! రీమేక్ లు చేసినప్పుడు ఇలా ప్రాంతాలకు లేని చరిత్రను ఎందుకు అంటగట్టే ప్రయత్నాలు జరుగుతాయో! వాడెవడో తమిళంలో సుబ్రమణ్యపురం అంటూ గొంతులు కోసే సినిమా ఒకటి తీస్తే, దాన్ని అనంతపురం అంటూ డబ్బింగ్ చేసిన దుర్మార్గం టాలీవుడ్ ది. ఇప్పుడు తమిళనాట జరిగిన వాస్తవ ఘటన అధారంగా తమిళంలో చేసిన కల్పిత సినిమాను రాయలసీమకు అంటగట్టి రీమేక్ చేయడం టాలీవుడ్ దుర్మార్గపు ధోరణి.
సినిమాలో ప్రాంతాల, కులాల మనోభావాలను దెబ్బతీస్తారు అంటే ఇలా కాదా? మనకేం మాత్రం సంబంధం లేని దాన్ని ఇక్కడకు అంటగట్టి అతికించేలని చూడటం ఏమిటో అసలు!
ఆ సంగతలా ఉంటే.. దృశ్యం-2 అలా అమెజాన్ లో విడుదలై పాజిటివ్ టాక్ రాగానే.. ఆ సినిమాను లాంఛనంగా ప్రారంభించేశారు! తెలుగులో దృశ్యం రీమేక్ అయ్యింది కాబట్టి, దృశ్యం-2ను రీమేక్ చేసేస్తే ఓ పనైపోయినట్టుగా కనిపిస్తుందా వ్యవహారం! డబ్బులు పెట్టేవాళ్లు అన్ని లెక్కలేసుకునే సినిమాను రీమేక్ చేస్తూ ఉండొచ్చు. పోతే వాళ్ల డబ్బులే కావొచ్చు. అయితే.. తెలుగు సినిమా ఎంత సేపూ ఇలా రీమేక్ లా చుట్టూ తిరగడం ఏమిటో అనేది నిరుత్సాహం కలిగించే అంశం.
అవతల కన్నడీగులు ఇలాంటి పోకడలకే పోతూ ఉంటారు. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా ఏ భాషలో వచ్చిన మాస్ మాసాలాలను, ప్రతి సినిమానూ కన్నడీగులు రీమేక్ లు చేసుకుంటూ ఉంటారు. అది మరీ ఓవర్ అయిపోవడంతో ఒక దశలో కన్నడ ప్రేక్షకులకు సొంత ఇండస్ట్రీ మీద విసుగు వచ్చింది. ఆల్రెడీ తమిళంలో, తెలుగులో, హిందీలో వచ్చిన సినిమాలను మళ్లీ రీమేక్ చేసి మీరు మాకు చూపించేందేంటి? మేమే ఆ సినిమాలను ఆ భాషల్లో చూసేస్తాం.. మీకన్నా ఎక్కువ బడ్జెట్ తో ఒరిజినల్ ను బాగా తీసుకుంటారనే ధోరణికి ఫిక్సయ్యారు కన్నడ ప్రేక్షకులు. దీంతో.. కర్ణాటకలోని మారుమూల ప్రాంతాల్లో కూడా తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు డైరెక్టుగా విడుదల అయ్యే పరిస్థితి వచ్చింది.
ఎలాగూ.. కన్నడ స్టార్ హీరోలు తీసే సినిమాలు కూడా ఏ తమిళ సినిమాకో, తెలుగు సినిమాకో రీమేకే అనే వాతావరణంలో.. తెలుగు, తమిళ డైరెక్టు రిలీజులు ఊపందుకున్నాయి. దీంతో మొదటికే మోసం వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ సినిమాల రుచి మరిగిన కన్నడ ప్రేక్షకులు.. సొంత సినిమాలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో డైరెక్టు కన్నడ సినిమాలకు మార్కెట్ పరిమితం అయ్యింది. ఫలితంగా ఇండస్ట్రీ రేంజ్ చాలా పరిమితం అయిపోయింది. కొత్తదనం ప్రశ్నార్థకం అయ్యింది! సినిమాల మార్కెట్ పరిమితం కావడంతో.. బడ్జెట్ పరిమితం అయ్యింది. అతిరీమేక్ ల వల్ల అలాంటి బోలెడన్ని అనార్థాలు ఎదుర్కొంది కన్నడ చిత్ర పరిశ్రమ.
అక్కడి స్టార్ హీరోలు కంఫర్ట్ జోన్ ను వెదుక్కోవడంతో అలాంటి పరిస్థితి ఏర్పడింది. తెలుగు చిత్ర పరిశ్రమకు అంత ప్రమాదం లేకపోయినప్పటికీ.. ఒకవైపు ఓటీటీలు విస్తృతం అయ్యాయి. విదేశీ సినిమాలతో మొదలుపెట్టి పక్క భాషల సినిమాల వరకూ అన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. రీమేక్ లు విషయంలో టాలీవుడ్ ఆచితూచి స్పందించాల్సి ఉందేమో!
-జీవన్ రెడ్డి.బి