ఆటోరిక్షాను రోడ్లపై నడుస్తున్న మహిళలకు అడ్డంగా ఆపడం, “రావాలా” అంటూ వెకిలిగా అడగడం, అసభ్య చేష్టలకు సైతం పాల్పడడం… ఆటోలకు నిత్య ప్రయాణీకులైన మహిళలలో పలువురికి చిరపరిచితాలే. మీటర్ గురించి ప్రస్తావిస్తే ఇక కొందరు ఆటోడ్రైవర్లు మరింత రెచ్చిపోయి మహిళలపై ఇష్టారాజ్యంగా మాట్లాడడం విని, చూసిందే.
అయితే ఇదే పరిస్థితి ఎదురైన ఒక ముంబయి మహిళ వేధించిన డ్రైవర్‌పై తిరగబడింది. ఆటో ఆపమని చెప్పి గదమాయించి, ఆపిన తర్వాత ఒక్కసారిగా రోడ్డు మీద ఉన్న రాళ్లు తీసుకుని ఆటోపై దాడికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పాదచారులు సైతం తాము కూడా తలా ఓ చేయి వేయడంతో ఆటో ధ్వంసం కాగా… డ్రైవర్ అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ సంఘటనలో పోలీసులు మహిళ నుంచి ఫిర్యాదు తీసుకుని ఆటోడ్రైవర్‌పై కేసు నమోదు చేసుకున్నారు.
ముంబయిలోని పాల్గార్ రైల్వే స్టేషన్ ఎదురుగా మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. తనపై ఈవ్‌టీజింగ్, లైంగిక వేధింపులకు ఆటోడ్రైవర్ పాల్పడినందువల్లే తాను ఆగ్రహానికి గురై ఆటోను ధ్వంసం చేశానని వర్షా కటేలా అనే సదరు మహిళ పోలీసులకు తెలిపింది. ఈ గిరిజన మహిళ చూపిన తెగువ నిమిషాల్లోనే వీడియోలకు అటు నుంచి ఇంటర్‌నెట్‌కు ఎక్కేసింది.