సెమీస్‌లో గెలిచి, ఫైనల్‌లో చేరాల్సి వున్న టైమ్‌లో ఎంతో బాధ్యతాయుతంగా ఆడాల్సిన భారత బ్యాట్స్‌మన్, తడబడ్తున్నారు. మంచి ఓపెనింగ్ కుదిరాక కూడా, వికెట్లు కోల్పోవడమంటే అది ఖచ్చితంగా టీమిండియాకి ఇబ్బంది కలిగించే అంశమే.
ఓపెనర్లు ధావన్, రోహిత్ అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి, టీమిండియాకి మంచి బిగినింగ్ ఇచ్చారు. అయితే 76 పరుగుల వద్ద భారీ షాట్‌కి యత్నించి ధావన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ, కేవలం ఒక్క పరుగుకే వికెట్ పారేసుకోవడం గమనార్హం. ‘ఛేజింగ్ హీరో’గా విరాట్ కోహ్లీకి మంచి పేరున్న దరిమిలా, ఈ మ్యాచ్‌కి అతనే ఆపద్బాంధవుడు అవుతాడని భారత క్రికెటర్లు నమ్మారు. అయితే ఆ నమ్మకాన్ని వమ్ముచేశాడు కోహ్లీ.
ఆస్ట్రేలియా బౌలర్లలో హేజెల్‌వుడ్, జాన్సన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కోహ్లీ ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 78 పరుగులు మాత్రమే. రెండు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసిన టీమిండియా, 329 పరుగుల టార్గెట్‌ని ఛేదించాలంటే, మంచి భాగస్వామ్యం మూడో వికెట్‌కి నమోదవ్వాల్సి వుంది.