డిఆర్‌డిఓ (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) కు డైరక్టర్ జనరల్‌గా, రక్షణమంత్రికి సైంటిఫిక్ ఎడ్వయిజర్‌గా పని చేస్తున్న అవినాశ్ చందర్ భారతదేశానికి ఎంతో ఖ్యాతి గడించిపెట్టిన బాలిస్టిక్ మిసయిల్ సిస్టమ్స్ అగ్ని సీరీస్‌కు ప్రధాన శిల్పి. జనవరి 31న అగ్ని5 ప్రయోగం జరగబోతూండగా మిమ్మల్ని అవేళ నుంచే తీసేస్తున్నాం అంటూ జనవరి 14న తెలియపరిచారు. ఐఐటి నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగు పట్టా తీసుకుని 1972లో డిఆర్‌డిఓలో చేరిన అవినాశ్ సారథ్యంలో డిఆర్‌డిఓ ఎన్నో విజయాలను సాధించింది. అతనికి పద్మశ్రీ బిరుదు కూడా యిచ్చారు. సాధారణ ఉద్యోగిని తీసేసేటప్పుడు సైతం పిలిచి ఎగ్జిట్ ఇంటర్వ్యూ పేర చర్చిస్తారు. అవినాశ్ వంటి ఉన్నతోద్యోగిని తీసేసేటప్పుడు అలాటి మర్యాదలేవీ పాటించలేదు సరికదా తనను తీసేసినట్లు అతనికి మీడియా ద్వారానే తెలిసింది. 2013 మేలో అతన్ని యుపిఏ ప్రభుత్వం మూడేళ్ల కాంట్రాక్టుపై నియమించింది. అది చాలా వింతగా వుంది అని యీ రోజు రక్షణమంత్రి అంటున్నారు. అంత వింతగా వుంటే దాన్ని మన్నిస్తూ 2014 నవంబరులో 64 ఏళ్లు నిండి రిటైరయ్యాక (సైంటిస్టులకు రిటైర్‌మెంట్ వయసు 64) అతని కాంట్రాక్టును 2016 మే వరకు పొడిగించి నెలన్నరలోనే యిలా అర్ధాంతరంగా, అవమానకరంగా తీసేయడం వింతన్నరగా వుంది. ఎందుకు పొడిగించారో, అంతలోనే ఎందుకు పీకేశారో యిప్పటిదాకా స్పష్టంగా తెలియరాలేదు. అవినాశ్‌ను అడిగితే ''42 ఏళ్ల సర్వీసు తర్వాత, ఏ చర్చలూ, సంప్రదింపులు లేకుండా 'తీసేశారు' (శాక్‌డ్) అనిపించుకోవడం బాధాకరం.'' అన్నాడు. అంటూనే తన టీమును ఎంచుకునే హక్కు రక్షణమంత్రికి వుంటుంది అని వివాదాలకు దూరంగా వున్నాడు. రక్షణమంత్రి మనోహర్ పారికర్ 'డిఆర్‌డిఓ అభివృద్ది చెందాలనే కాంక్ష గల యువసైంటిస్టులు వుండాలని మా కోరిక' అన్నాడు. మరి ప్రభుత్వం అన్నిచోట్లా యువకులను వేస్తోందా అంటే అదీ లేదు. అది కొత్తగా నియమిస్తున్న వారిలో 60 ఏళ్లు దాటినవారు చాలామంది వున్నారు.
డిఆర్‌డిఓ వేగంగా పనిచేయడం లేదని, అది చేసిన ఆలస్యాల వలన రూ. 29 వేల కోట్లు వ్యర్థమయ్యాయని, మారిన పరిస్థితుల్లో కూడా చల్తా హై అనే ధోరణిలోనే నడుస్తూ తన స్పీడు అందుకోలేకపోతోందని మోదీకి విసుగుపుట్టి యీ చర్య తీసుకున్నారని కొందరు చెప్తున్నారు. అవినాశ్‌ను అడిగినా, డిఆర్‌డిఓలోని యితర సైంటిస్టులను అడిగినా ఎప్పుడో థాబ్దాల కితం నాడు వేర్వేరు కారణాల వలన అర్జున్ ట్యాంక్, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ వంటివి ఆలస్యమైన మాట నిజమే అయినా ప్రస్తుతం ఏ ప్రాజెక్టూ డ్రాయింగ్ బోర్డు నుంచి డెలివరీ వరకు నాలుగైదు సంవత్సరాలకు మించి పట్టటం లేదని చెప్తున్నారు. మిలటరీ రూ.1.70 లక్షల కోట్ల ఆర్డరు తమకు యిచ్చిందని గుర్తు చేస్తున్నారు. తమకు సంబంధించిన అనేక సంస్థలు త్వరగా, చౌకగా అనేక ఆధునిక పరికరాలను తయారుచేస్తున్నాయని తెలుపుతున్నారు.
ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేమిటో తెలియక వూహా-గానసభలు సాగిపోతున్నాయి. దానిలో ఒకటి – ప్రధాని కార్యాలయానికి అవినాశ్‌పై మూడు ఫిర్యాదులు వచ్చాయట. రెండు ఆకాశరామన్న ఉత్తరాలు కాగా, మరొకటి అవినాశ్‌తో పని చేసే ఆర్ కె గుప్తాది. గుప్తా హైదరాబాదులోని అడ్వాన్స్ సిస్టమ్ లేబ్‌కు అధిపతి. అగ్ని5 ప్రాజెక్టు డైరక్టర్. అవినాశ్ రూల్సు మార్చేసి తన జూనియర్‌కు ప్రమోషన్ యిచ్చి, తనను పక్కకు తప్పించాడని గుప్తా అభియోగం. గుప్తా మాట విశ్వసించి అవినాశ్‌ను తప్పించారనుకున్నా, అగ్ని5 ని ప్రయోగించిన వెంటనే గుప్తాను ఆ డిపార్టుమెంటు నుంచి వేరే చోటకి బదిలీ చేశారు. జనవరి 9 వ తారీకుతో వున్న బదిలీ ఆదేశం తనకు ఫిబ్రవరి 2 న చేరిందని, తన వంటి సీనియరు పట్ల యిలా వ్యవహరించడం అన్యాయమని గుప్తా వాపోయాడు. 'నేనే కాదు, మా కుటుంబసభ్యులందరూ కూడా బాధపడుతున్నాం. జరగరానిది ఏదైనా జరిగితే దానికి అవినాశ్ చందర్, డా|| విజి శేఖరన్ బాధ్యత వహించాలి' అని తన లేఖలో పేర్కొన్నాడు.
అవినాశ్ నిష్క్రమణ వెనక్కాల నీతి ఆయోగ్ సభ్యుడిగా నియమితుడైన విజయ్ కుమార్ సారస్వత్ వున్నారన్న పుకారు వినబడుతోంది. అతను అవినాశ్ కంటె డిఆర్‌డిఓలో పది రోజులు సీనియర్. ఇద్దరూ కలిసి కలామ్ సారథ్యంలో పృథ్వి, అగ్ని, అరిహంత్ ప్రాజెక్టులలో పనిచేశారు. మంచి స్నేహితులు కూడా. సారస్వత్ 2009 నుండి 2013 వరకు డిఆర్‌డిఓకు అధిపతిగా వున్నాడు. అతను రిటైరయ్యాక అవినాశ్ అతని స్థానంలోకి వచ్చాడు. సారస్వత్‌కు బిజెపితో సంబంధాలు పెంచుకున్నాడు. సంఘ్ పరివార్‌కు సంబంధించిన వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేసి, ఎన్‌డిఏ ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్ స్థానంలో తీసుకుని వచ్చిన నీతి ఆయోగ్‌లో కేంద్రమంత్రివర్గంలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ స్థాయిగల ఫుల్‌టైమ్ మెంబర్‌గా అయ్యాడు. అతను వచ్చిన కొన్ని రోజులకే అవినాశ్ వుద్యోగం వూడింది. అవినాశ్ సైంటిస్టే తప్ప రాజకీయాల జోలికి వెళ్లలేదు. అతను వృద్ధుడై పోయాడని పారికర్ అంటున్నారు. రెండు నెలలైనా అతని స్థానంలో యింకా ఎవర్నీ నియమించలేదు. సీనియారిటీ ప్రకారం చూస్తే డిఆర్‌డిఓలో అవినాశ్ స్థానంలో వచ్చే వాళ్లందరూ 60 ఏళ్లకు పై బడినవారే. డిఆర్‌డిఓ పరుగులు పెట్టాలి అంటూ ఆకస్మిక నిర్ణయం తీసుకున్న మోదీ సర్కారు రెండు నెలలుగా అంత ముఖ్యమైన సంస్థకు అధిపతి లేకుండా చేసింది! ఇదెక్కడి తర్కమో అర్థం కాదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)