ఆసీస్‌ దూకుడు తగ్గుతుందా.?

ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఫిల్‌ హ్యూస్‌ మైదానంలో గాయపడి, ప్రాణాలొదిలిన ఘటన యావత్‌ ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. ఇది క్రికెట్‌కి బ్లాక్‌ డే అని చాలామంది అభివర్ణించారు. అందులో నిజం లేకపోలేదు. బోల్డంత భవిష్యత్‌ వున్న…

ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఫిల్‌ హ్యూస్‌ మైదానంలో గాయపడి, ప్రాణాలొదిలిన ఘటన యావత్‌ ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. ఇది క్రికెట్‌కి బ్లాక్‌ డే అని చాలామంది అభివర్ణించారు. అందులో నిజం లేకపోలేదు. బోల్డంత భవిష్యత్‌ వున్న ఓ యంగ్‌ క్రికెటర్‌, మైదానంలో నేలకొరగడం అంటే చిన్న విషయమేమీ కాదు. ఆస్ట్రేలియా అంటేనే దూకుడు.. ఆటగాళ్ళలో ఆ దూకుడు కారణంగానే ఆ జట్టుకి అంత పేరొచ్చింది. కానీ అదే దూకుడు తమ క్రికెటర్‌ ప్రాణాల్ని పొట్టనపెట్టుకోవడంతో మొత్తంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.

సరిగ్గా ఈ టైమ్‌లోనే టీమిండియా, ఆస్ట్రేలియాతో తలపడాల్సి వస్తోంది. ఆస్ట్రేలియా పిచ్‌లు ఫాస్ట్‌ బౌలింగ్‌కి అనుకూలం. పెర్త్‌ వంటి మైదానాల్లో అయితే ఎంతటి బలమైన ప్రత్యర్థి అయినా ఆసీస్‌ ముందు తలొంచాల్సిందే. గత అనుభవాలు భారత క్రికెటర్లను ఇప్పటిదాకా కాస్త ఆందోళనకు గురిచేశాయి. అయితే ఫిల్‌ హ్యూస్‌ మరణంతో ఆస్ట్రేలియా ఆటగాళ్ళలో మానసిక ఒత్తిడి పెరిగిందనీ, ఈ టైమ్‌లో సిరీస్‌ని రద్దు చేయడం లేదా వాయిదా వేయడం ఉత్తమమం అన్న అభిప్రాయాలు మాజీ క్రికెటర్లనుంచి వ్యక్తమవుతున్నాయి.

ఆస్ట్రేలియా ` ఇండియా మధ్య మ్యాచ్‌ అంటే ‘దాయాదుల పోరు’ అన్నంతగా వుంటుంది. ఆస్ట్రేలియాకి ఇంగ్లాండ్‌ క్రికెట్‌లో దాయాది జట్టుగా చెబుతారు. దానికన్నా పవర్‌ఫుల్‌గా వుంటుంది ఇండియా ` ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ అంటే. అలాంటప్పుడు ‘టెంపర్‌’ని అదుపులో పెట్టుకోవడం ఆటగాళ్ళకు చాలా కష్టమైన విషయమే. అందుకే, కొన్నాళ్ళపాటు ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మ్యాచ్‌లను వాయిదా వేయడం ఉత్తమేమో.!

టూర్‌ వాయిదా సంగతెలా వున్నా, ఆసీస్‌లో ఇదివరకటి దూకుడు ఇకపై కన్పించకపోవచ్చనీ, ఇప్పటికే మేటి ఆటగాళ్ళు దూరమయ్యాక జట్టులో వేడి తగ్గిందనీ, హ్యూస్‌ మరణంతో కొన్నాళ్ళపాటు.. కనీసం ఏడాదిపాటైనా ఆసీస్‌ జట్టులో దూకుడు చూడలేం.. అనే వాదన ప్రముఖంగా విన్పిస్తోంది. అదెంత నిజమోగానీ, ఇప్పటికైతే ఆసీస్‌ ఆటగాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతిలోనే వున్నారు.