కుమార సంగక్కర, మహేల జయవర్ధనే.. శ్రీలంక క్రికెట్లో మాత్రమే కాదు.. ప్రపంచ క్రికెట్లో తమదైన ముద్ర వేసిన ‘స్టార్’ క్రికెటర్లు వీరిద్దరూ. ఈ వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ కానున్నామని చాన్నాళ్ళ క్రితమే ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు.
‘ప్లీజ్.. రిటైర్మెంట్ ఆలోచన విరమించుకోండి..’ అంటూ అభిమానులు, జట్టు సభ్యులు కోరినా, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. తమ జట్టుకు వరల్డ్ కప్ అందించి సగర్వంగా క్రికెట్ నుంచి తప్పుకోవాలని సంగక్కర, జయవర్ధనే భావించారు. కానీ, ఒక్క మ్యాచ్.. శ్రీలంకను ఇంటిబాట పట్టించింది. సౌతాఫ్రికాతో జరిగిన ‘నాకౌట్’ మ్యాచ్‌లో శ్రీలంక ఘోర పరాజయం పాలయ్యింది.
ఈ వరల్డ్ కప్‌లో వరుసగా నాలుగు సెంచరీలు బాదిన సంగక్కర, టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం విదితమే. మరోపక్క మహేల జయవర్ధనే ఓ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ, సౌతాఫ్రికాతో మ్యాచ్ అనంతరం భారంగా క్రికెట్‌కి వీడ్కోలు పలికారు. జట్టు సభ్యులంతా తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. సౌతాఫ్రికా ఆటగాళ్ళూ సంగక్కర, మహేల జయవర్ధనేలను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
క్రికెట్లో కొత్త కొత్త స్టార్స్ ఎంతమంది వచ్చినా, కళాత్మక ఇన్నింగ్స్ ఆడటం కొంతమందికే సాధ్యమవుతుంది. అనుభవంతోనే ఆ కళాత్మకత అబ్బుతుంది. ఆ విషయంలో సంగక్కర, జయవర్ధనే తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు. వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా లంక జట్టుకి సంగక్కర సేవలందించాడు. జయవర్ధనే సైతం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకుంటే వికెట్ తీయడం కష్టం.. అన్న మాటకి జయవర్ధనే అతికనట్టు సరిపోతాడు.
మొత్తమ్మీద, ఇద్దరు మేటి క్రికెటర్లు క్రికెట్‌కి గుడ్ బై చెప్పారు. అలాగే భారత ఉప ఖండం నుంచి ఓ జట్టు వరల్డ్ కప్ పోరు నుంచి భారంగా నిష్క్రమించింది. ఉప ఖండంలోని నాలుగు జట్లు టీమిండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్.. నాకౌట్‌కి చేరిన విషయం విదితమే.