పంత్ చేతిలోనే లార్డ్స్ టెస్ట్ మ్యాచ్..!

లార్డ్స్ టెస్టులో తొలి రోజే ప‌టిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా ఆఖ‌రి రోజుకు కాస్త డిఫెండ్ చేసుకోవాల్సిన స్థితిలోకి వ‌చ్చింది. చివ‌రి రోజు బ్యాటింగ్ లో భార‌త జ‌ట్టు అవ‌కాశాలు పూర్తిగా యంగ్ క్రికెట‌ర్…

లార్డ్స్ టెస్టులో తొలి రోజే ప‌టిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా ఆఖ‌రి రోజుకు కాస్త డిఫెండ్ చేసుకోవాల్సిన స్థితిలోకి వ‌చ్చింది. చివ‌రి రోజు బ్యాటింగ్ లో భార‌త జ‌ట్టు అవ‌కాశాలు పూర్తిగా యంగ్ క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ చేతిలోనే ఉన్న‌ట్టున్నాయి. ఒక‌వైపు టెయిలెండ‌ర్లు మ‌రోవైపు పంత్… ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆడ‌టం పంత్ కు కొత్త కాదు. బోర్డ‌ర్- గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో ఇదే ప‌రిస్థితుల్లో ఆడాడు పంత్. అప్పుడు త‌న‌లో ఉన్న అద్భుత ఆట‌ను ప్ర‌ద‌ర్శించాడు. ఈ రోజు పంత్ క‌నీసం ఒక సెష‌న్ పాటు నెట్టుకు వ‌చ్చినా.. భార‌త జ‌ట్టు లార్డ్స్ టెస్టులో క‌చ్చితంగా సేఫ్ జోన్లో నిలిచిన‌ట్టే.

ప్ర‌స్తుతం ఇండియా 154 ప‌రుగుల లీడ్ లో ఉంది. ఆఖ‌రి రోజు క‌నీసం లంచ్ వ‌ర‌కూ అయినా ఇండియా బ్యాటింగ్ కొనసాగిస్తే.. అంటే క‌నీసం 25 ఓవ‌ర్ల పాటు చివ‌రి నాలుగు వికెట్ల‌తో భార‌త బ్యాటింగ్ కొన‌సాగాలి. పంత్ గ‌నుక లంచ్ వ‌ర‌కూ క్రీజ్ లో ఉంటే.. ఈ లీడ్ క‌నీసం 220 ప‌రుగుల‌ను దాటుతుంది. ఇక మిగిలిన రెండు సెష‌న్ల‌లో అంత స్కోరును చేజ్ చేయ‌డం ఇంగ్లండ్ కు తేలికేమీ కాదు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల దృష్ట్యా ఆఖ‌రి రోజు .. వ‌ర్షం అంత‌రాయం లేక‌పోతే.. 80 ఓవ‌ర్ల వ‌ర‌కూ ప‌డే అవ‌కాశాలున్నాయి. నాలుగో రోజు 82 ఓవ‌ర్లు సాధ్యం అయిన నేప‌థ్యంలో.. ఆఖ‌రి రోజు కూడా ఆ మాత్రం ఓవ‌ర్లు ప‌డ‌వ‌చ్చు. 

అలాగే ఈ మ్యాచ్ లో ఇండియాకు విజ‌యావ‌కాలూ లేక‌పోలేదు. టార్గెట్ ను ఏ రేంజ్ లో సెట్ చేసినా.. ఆఖ‌రి రోజు పిచ్ పూర్తిగా బౌలింగ్ కు అనుకూలించినా ఆశ్చ‌ర్యం లేదు. రెండు వంద‌ల స్థాయి టార్గెట్ ను చేజ్ చేయ‌డం కూడా ఈ పిచ్ పై సుల‌భ‌త‌రం కాదు. నాలుగో రోజు ఇంగ్లండ్ స్పిన్ బౌల‌ర్ అలీ బంతులను గ‌మ‌నిస్తే.. భార‌త స్పిన్న‌ర్ జ‌డేజా కూడా బంతిని తిప్ప‌గ‌లిగే ప‌రిస్థితులు ఉండ‌బోతున్నాయ‌ని స్ప‌ష్టం అవుతోంది. అయితే ఇండియాకు ఈ మ్యాచ్ లో ఒకే స్పిన్న‌ర్ ఉన్నాడు. పార్ట్ టైమ్ స్పిన్న‌ర్ కూడా ఎవ్వ‌రూ లేరు.

ఏదేమైనా.. ఇండియా ఆఖ‌రి రోజు ఇర‌వై ముప్పై ప‌రుగుల‌ను యాడ్ చేసినా.. మ్యాచ్ ఫ‌లితంలో అవే కీల‌కం అవుతాయ‌ని విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన మ్యాచ్ గా నిలుస్తోంది ఈ టెస్టు మ్యాచ్.