అనూహ్య రీతిలో వన్డే , టీ 20 కెప్టెన్సీకి సెలవిచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఇండియన్ క్రికెట్ కు వన్డేల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా, టీ 20 వరల్డ్ కప్, ఓడీఐ వరల్డ్ కప్, చాంఫియన్స్ ట్రోఫీలను సాధించిన జట్టుకు సారధిగా.. వీటన్నింటికీ మించి కెప్టెన్ కూల్ గా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ధోనీ.. ఉరుము లేని పిడుగులా కెప్టెన్సీని వదులుకున్నాడు. ధోనీ ఈ విధమైన నిర్ణయం తీసుకుంటాడని అస్సలు ఎవ్వరూ ఊహించలేదు.
మరి ఇంత షడన్ గా ధోనీ కెప్టెన్సీని వదులు కోవడానికి కారణం అసంతృప్తినా? తనకు బోర్డు విలువను ఇవ్వడం లేదనే భావనతోనే ధోనీ తప్పుకున్నాడా? అనే సందేహాలు కలగకమానవు. ఇంతకు ముందు జరిగిన పరిణామాలు ఈ అనుమానాలకు కారణం అవుతున్నాయి.
ధోనీ బ్యాట్ పట్టి చాలా కాలం అయ్యింది. ఇప్పటికే టెస్టుల నుంచి రిటైరైన ధోనీ.. అప్పుడెప్పుడో వన్డేలు ఆడాడు. నెలలు గడిచిపోయాయి! ఆ తర్వాత టీమిండియా న్యూజిలాండ్, ఇంగ్లండ్ లతో టెస్టు మ్యాచ్ లు ఆడింది. సుధీర్ఘమైన ఈ సీరిస్ ల తర్వాత త్వరలోనే టీమిండియా ఇంగ్లిష్ జట్టుతో వన్డే సీరిస్ ఆడనుంది. ఈ సీరిస్ కు ధోనీ కెప్టెన్ గా వ్యవహరించాలి. అంతకన్నా ముందు.. ధోనీకి కొంత ప్రాక్టీస్ అవసరం. ఈ నేపథ్యంలో వన్డే సీరిస్ కు ముందు ఒక క్యాంప్ షెడ్యూల్ అయి ఉంది.
దానికి టీమిండియా ఆటగాళ్లంతా హాజరు కావాలి. అయితే ఈ ప్రాక్టీస్ క్యాంప్ ను రద్దు చేసింది బోర్డు. దానికి కారణం విరాట్ కొహ్లీనే! వరసగా మ్యాచ్ లు ఆడి తాము అలసిపోయామని.. ప్రస్తుత పరిస్థితుల్లో క్యాంప్ వద్దని విరాట్ చెప్పడంతో.. బోర్డు క్యాంప్ ను రద్దు చేసింది. దీంతో ధోనీకి అంతర్జాతీయ ఆటగాళ్లతో ప్రాక్టీస్ అవకాశం లేకుండా పోయింది!
వన్డే సీరిస్ కు ముందు తన సహచర ఆటగాళ్లతో కలిసే అవకాశం కూడా లేకపోయింది ధోనీకి. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ఆటగాళ్లతో కలిసి ధోనీ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు. మరి తన స్థాయికి అది తక్కువ అనుకుని ఉండవచ్చు.. క్యాంప్ రద్దు చేయడం పట్ల కినుక వహించి ఉండవచ్చు.. తన మాట చెల్లుబాటు కాలేదనే భావనతో ధోనీ కెప్టెన్సీని వదులుకుని ఉండవచ్చు… అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి! పైకి వేరే కారణాలు ఏవైనా చెప్పవచ్చు. హఠాత్ నిర్ణయం కాబట్టి అనే అనుమానాలు సహజంగానే ఉంటాయి.
అయితే.. కెప్టెన్సీని వదులుకున్నా, జట్టులో చోటునైతే ధోనీ కోరుకుంటున్నాడు. శుక్రవారం జరిగే సెలక్షన్ కమిటీ మీటింగ్ కు ఈ విషయాన్ని ధోనీ తెలియజేశాడు. తనను జట్టులోకి ఎంపిక చేసేందుకు పరిగణనలోకి తీసుకోవాలని తెలియజేసినట్టుగా తెలుస్తోంది.
ధోనీ తప్పుకోవడంతో కెప్టెన్సీ విరాట్ చేతికి వెళుతుంది. మరి ఒక్కసారిగా కెప్టెన్సీని వదులుకుని ఆటగాడు అయ్యాకా.. ధోనీ అంతర్జాతీయ కెరీర్ ఎక్కువ కాలం సాగకపోవచ్చు. 2019 వరల్డ్ కప్ వరకూ అయినా సాగేనా? అనేది అనుమానమే!