ఈ కంగారూ.. తోక వంకర.!

మామూలుగా అయితే కంగారూల తోక నిటారుగానే వుంటుంది. దాని తోకే దానికి బలం. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఆస్ట్రేలియా క్రికెటర్ల గురించి. ఆసీస్‌ క్రికెటర్లలో చాలామందికి తోక వంకర.. అనే విమర్శలున్నాయి. కారణం, మైదానంలో…

మామూలుగా అయితే కంగారూల తోక నిటారుగానే వుంటుంది. దాని తోకే దానికి బలం. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఆస్ట్రేలియా క్రికెటర్ల గురించి. ఆసీస్‌ క్రికెటర్లలో చాలామందికి తోక వంకర.. అనే విమర్శలున్నాయి. కారణం, మైదానంలో వారు వేసే వేషాలు అలాంటివి. క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ పుట్టింది కంగారూ గడ్డ మీదనే. ప్రపంచమంతా ఛీత్కరించేసరికి స్లెడ్జింగ్‌ విషయంలో కంగారూలు కాస్త వెనక్కి తగ్గారు.

ఇక, తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఫిల్‌ హ్యూస్‌ మైదానంలో బంతి తగిలి కుప్పకూలిపోవడం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం ప్రపంచ క్రికెట్‌లో పెను విషాదం. దేశవాలీ మ్యాచ్‌లోనే ఫిల్‌ హ్యూస్‌ గాయపడి మరణించాడు. దాంతో, ఆసీస్‌ క్రికెట్‌లోనే కాదు, ప్రపంచ క్రికెట్‌లోనే ఇక బౌన్సర్లు కన్పించవేమోనని అంతా అనుకున్నారు.

 ఫిల్‌ హ్యూస్‌ మరణం తర్వాత జరిగిన చాలా మ్యాచ్‌లలో వివిధ దేశాల బౌలర్లు బౌన్సర్లు సంధించకుండా వున్నారంటే, ఫిల్‌ హ్యూస్‌ మరణం క్రికెట్‌ని ఎంత ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు.

అయితే, ఆస్ట్రేలియా క్రికెటర్లు కాస్త వెరైటీ కదా. ఫిల్‌ హ్యూస్‌ మరణం కొంతమేర ఆస్ట్రేలియా ఆటగాళ్ళపై ప్రభావం చూపినా, ఆస్ట్రేలియా తన ట్రేడ్‌ మార్క్‌ అగ్రెసివ్‌నెస్‌ని మాత్రం దాచుకోలేకపోయింది. ఓ బౌన్సర్‌ని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై సంధించాడు మిఛెల్‌ జాన్సన్‌. బంతి హెల్మెట్‌కి తగిలిందిగానీ, అదృష్టవశాత్తూ కోహ్లీకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ సమయంలో కంగారుపడ్డ మిచెల్‌ జాన్సన్‌, ఆ తర్వాత తనదైన బౌన్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ప్రధానంగా భారత కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు వరుస బౌన్సర్లు సంధించాడు జాన్సన్‌. ఓ బౌన్సర్‌ సాహా చేతికి తగిలింది. మిగతా బౌన్సర్ల నుంచి తప్పించుకోవడానికి నానా తంటాలూ పడాల్సి వచ్చింది సాహా. ఒకదాని తర్వాత ఒకటి వరుస బౌన్సర్లు జాన్సన్‌ వేస్తోంటే… ఈ కంగారూ తోక వంకర.. అని భారత క్రికెట్‌ అభిమానులు అనుకోకుండా వుంటారా.?