ప్రశాంతం ఉండే ఒక కొలనులోకి రాయి విసిరితే.. అలజడి పుడుతుంది. క్రికెట్ మ్యాచ్ ల విషయంలో పిలిఫ్ హ్యూస్ మరణం కూడా ఇలాంటి వాతావరణాన్నే సృష్టించినట్టుగా ఉంది. భారత్, ఆస్ట్రేలియాల మధ్య టెస్టు సీరిస్ ప్రారంభానికి ముందు ఆసీస్ దేశవాళీ టీమ్ తరపున ఆడుతూ బౌన్సర్ తగిలి మరణించి పిలిఫ్ హ్యూస్ ఇరు టీమ్ ల ఆటగాళ్లను జ్ఞాపకంగా వెంటాడుతున్నట్టుగా ఉన్నాడు. ప్రత్యేకించి ఆసీస్ క్రికెటర్లను… వారైతే.. ఇప్పుడు బౌన్సర్ అంటేనే కొంచెం భయపడే పరిస్థితి ఉన్నట్టుంది.
అందుకు నిదర్శనం తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు జరిగిన ఈ సంఘటన. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్డ్ చేశాకా.. ఇండియా ఇన్నింగ్స్ ప్రారంభం అయ్యింది. భారత్ రెండు వికెట్ల నష్టానికి 111 పరుగులు సాధించిన దశలో.. కెప్టెన్ విరాట్ స్ట్రైక్ లో ఉన్నాడు. మిచెల్ జాన్సన్ బౌలింగ్ చేస్తున్నాడు.
జాన్సన్ బంతిని విసిరాడు.. అది లో హైట్ లో దూసుకొచ్చింది.. అయితే అది బౌన్సర్ గా దూసుకెళుతుందని భావించిన విరాట్ కిందకి వంగాడు. అయితే బంతి విరాట్ పై నుంచి దూసుకెళ్లలేదు. సూటిగా వచ్చి అతడి హెల్మెట్ ను తాకింది! అది కూడా ముందువైపున. దీంతో విరాట్ కొంచెం ఇబ్బందిగా కదిలాడు. వేగవంతమైన బంతి వచ్చి అలా తగిలే సరికి కుదురుకోవడానికి అన్నట్టుగా హెల్మెట్ తీసేశాడు.
బౌన్సర్ ను ఎదుర్కొన్న విరాట్ స్థితి ఇలా ఉంటే.. ఆసీస్ క్రికెటర్ల స్థితి మరోలా ఉంది. కెప్టెన్ క్లార్క్ తో సహా ఆసీస్ క్రికెటర్లు అంతా విరాట్ దగ్గరకు చేరుకొన్నారు. బౌన్సర్ ఏమైనా విరాట్ కు తగిలిందా.. అనే ఆందోళనతో వారందరూ ఇండియన్ కెప్టెన్ చుట్టూ మూగారు. విరాట్ తన కేం కాలేదన్నట్టుగా చెప్పేంత వరకూ వారందరూ అక్కడే ఉన్నారు. విషయాన్ని అర్థం చేసుకొని ఊపిరి పీల్చుకొన్నారు.
వెళుతూ వెళుతూ బౌన్సర్ ను ఎదుర్కొన్న విరాట్ తలను నిమురుతూ కొందరు.. భుజం తడుతూ మరికొందరు తమ తమ స్థానాల్లోకి వెళ్లారు. మొత్తానికి హ్యూస్ షాక్ నుంచి ఆసీస్ క్రికెటర్లు ఇంకా బయటపడలేదేమో.. వాళ్లకు ఇప్పటికీ బౌన్సర్ అనేది కలవరపాటుగానే ఉన్నట్టుంది.