పాక్‌ని కంగారెత్తిస్తున్న ఆసీస్‌

వరల్డ్‌ కప్‌ పోటీల్లో భాగంగా మూడో క్వార్టర్‌ ఫైనల్‌లో పాకిస్తాన్‌ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఆస్ట్రేయాతో జరుగుతోన్న నాకౌట్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కి దిగిన పాకిస్తాన్‌, మొదట్లోనే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. ఆ తర్వాత…

వరల్డ్‌ కప్‌ పోటీల్లో భాగంగా మూడో క్వార్టర్‌ ఫైనల్‌లో పాకిస్తాన్‌ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఆస్ట్రేయాతో జరుగుతోన్న నాకౌట్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కి దిగిన పాకిస్తాన్‌, మొదట్లోనే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. ఆ తర్వాత కాస్సేపు పాక్‌ కెప్టెన్‌ మిస్బా, మరో బ్యాట్స్‌మన్‌ హారిస్‌ సొహైల్‌ వికెట్ల పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆసీస్‌ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ పాకిస్తాన్‌పై ఒత్తిడిని పెంచుకుంటూ పోయారు.

ఉమర్‌ అక్మల్‌, షాహిద్‌ ఆఫ్రిది మరోమారు తీవ్రంగా నిరాశపర్చారు.  41 ఓవర్లు పూర్తయ్యే సమయానికి పాకిస్తాన్‌ 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. మ్యాచ్‌పై ఆసీస్‌ పట్టు కొనసాగితే పాకిస్తాన్‌ 250 పరుగుల లోపు ఆలౌట్‌ అయ్యే అవకాశముంది. పాకిస్తాన్‌ ప్రతిఘటిస్తే మాత్రం, గౌరవప్రదమైన స్కోర్‌ ఆ జట్టుకి లభించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇదిలా వుంటే, ఆసీస్‌ బౌలర్లలో హేజెల్‌వుడ్‌, మ్యాక్స్‌వెల్‌ చెరో రెండు వికెట్లు తీయగా, స్టార్క్‌, జాన్సన్‌ చెరో వికెట్‌ నేలకూల్చారు. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే, ఆ జట్టు భారత్‌తో సెమీస్‌లో తలపడనుంది. భారత క్రికెట్‌ అభిమానులు, ఈ మ్యాచ్‌ వరకూ పాకిస్తాన్‌ని సపోర్ట్‌ చేస్తుండడం గమనార్హం. వరల్డ్‌ కప్‌లో పాకిస్తాన్‌పై టీమిండియాకి తిరుగులేని రికార్డ్‌ వుండడంతో, పాక్‌తో సెమీస్‌లో టీమిండియా తలపడితే, టీమిండియాదే విజయం.. అన్నది వారి నమ్మకం.