క్రికెట్ ప్రపంచకప్ లో తొలిసారి క్వార్టర్ ఫైనల్స్ వరకూ వచ్చిన బంగ్లాదేశ్ ను చాలా మంది మెచ్చుకొన్నారు. ఇంగ్లండ్ వంటి జట్టుపై పై చేయిసాధించడం ద్వారా బంగ్లా క్వార్టర్స్ కు అర్హత పొందింది. ఇన్ని రోజులూ పసికూనగానే ఉండిన జట్టు ఇలాంటి ఘనత సాధించడం పట్ల దాని స్థాయి కూడా కొంతవరకూ పెరిగినట్టేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఇక ఇండియాతో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ లో బంగ్లా ఓడినా.. ఆరంభంలో కొంత సేపు ఇండియాను ఇబ్బంది పెట్టగలిగింది. ఆట తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 35 వ ఓవర్ వరకూ బ్యాటింగ్ చేసిన తీరును గమనిస్తే.. బంగ్లా పోటీ ఇచ్చిందనే అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత ఆట పూర్తిగా భారత స్వాధీనంలోకి వచ్చింది. బ్యాటింగ్ లో బంగ్లా బోల్తాపడటంతో మ్యాచ్ పూర్తిగా ఇండియా వశం అయ్యింది.
ఇలా ముగిసిన మ్యాచ్ గురించి బంగ్లా ఇప్పుడు చిల్లర ఆరోపణలు చేస్తోంది. తన పోరాట స్ఫూర్తితో అందరి ప్రశంసలు పొందిన జట్టు ఇప్పుడు విజ్ఞత మరిచి వ్యవహరిస్తోంది. మ్యాచ్ లో అంపైరింగ్ పై బంగ్లా విమర్శలు చేస్తోంది. రోహిత్ శర్మ ఔట్ అయినా.. నాటౌట్ గా ప్రకటించింది అంపైర్లు భారత్ కు అనుకూలంగా వ్యవహరించారని బంగ్లా క్రికెట్ బోర్డు ఆరోపిస్తోంది!
బోర్డు అధికారి ఒకరు మీడియా ముందుకు వచ్చి ఐసీసీపై కూడా ధ్వజమెత్తాడు. ఐసీసీ ఇండియాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించాడు. చెప్పాలంటే రోహిత్ శర్మ ఔటైన బంతి నోబాల్. ఆట నియమాల ప్రకారం ఆ బంతికి ఔట్ అయినా నాటౌటే!
కానీ బంగ్లావాళ్లు మాత్రం ఓటమి మూడ్ లో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆడలేనమ్మ మద్దెల వోటు.. అన్నట్టుగా ఇప్పుడు బంగ్లా దేశ్ వాళ్లు అంపైరింగ్ పైవిమర్శలు చేస్తున్నారు. తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్టుగా.. ఐసీసీ ఇండియాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని అర్థంలేని విమర్శలు చేస్తున్నారు. మరి ఆట ద్వారా సత్తా చూపాల్సిన బంగ్లా పులులు ఇలాంటి అర్థం లేని మాట్లాడటం ఏమిటో!