పసికూనని లైట్‌ తీసుకుంటే అంతే సంగతులు.!

తొలి క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సంచలన విజయం సాధించింది. శ్రీలంక మట్టికరిచింది. ఈ స్థాయిలో శ్రీలంక ఓడిపోతుందనిగానీ, భారీ విజయాన్ని దక్షిణాఫ్రికా నమోదు చేస్తుందనిగానీ ఎవరూ ఊహించలేదు. శ్రీలంక బలం బ్యాటింగ్‌తోపాటు, స్పిన్‌…

తొలి క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సంచలన విజయం సాధించింది. శ్రీలంక మట్టికరిచింది. ఈ స్థాయిలో శ్రీలంక ఓడిపోతుందనిగానీ, భారీ విజయాన్ని దక్షిణాఫ్రికా నమోదు చేస్తుందనిగానీ ఎవరూ ఊహించలేదు. శ్రీలంక బలం బ్యాటింగ్‌తోపాటు, స్పిన్‌ బౌలింగ్‌. ఫాస్ట్‌ బౌలింగ్‌లోనూ సత్తా చాటగల ఆటగాళ్ళున్నారు శ్రీలంకలో.

దక్షిణాఫ్రికాని తీసుకుంటే, బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌.. అన్ని విభాగాల్లోనూ బలంగానే వుంది. కాకపోతే వరల్డ్‌ కప్‌లో సౌతాఫ్రికా పెర్ఫామెన్స్‌ గత రికార్డుల్ని తీసుకుంటే బాగానే వున్నా, అదృష్టం ఎప్పుడూ వారి పక్షాన నిలబడదు. క్వార్టర్స్‌లో పలుమార్లు, సెమీస్‌లో పలుమార్లు ఇంటిదారి పట్టిన సౌతాఫ్రికా ఇప్పటిదాకా ఫైనల్‌కి చేరిన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలోనే లంక గెలుపు నల్లేరు మీద నడకేనని అంతా అనుకున్నారు. ఫలితం రివర్స్‌ అయ్యింది.

ఇక, టీమిండియా – బంగ్లాదేశ్‌ రేపు (19 మార్చ్‌) క్వార్టర్స్‌లో తలపడనున్నాయి. మామూలుగా అయితే బంగ్లాదేశ్‌ పసికూన. అయితే భారత్‌ మీద బంగ్లాదేశ్‌ గెలిచిన సందర్భాలూ లేకపోలేదు. వరల్డ్‌ కప్‌లో సంచలనాలు బంగ్లాదేశ్‌కి కొత్త కాదు. సెమీస్‌దాకా వెళ్ళకపోయినా, పెద్ద టీమ్‌లను క్వార్టర్స్‌ మెట్లెక్కకుండా చేసిన ఘనత బంగ్లా సొంతం. సో, బంగ్లాదేశ్‌ని పసికూన అనుకోడానికి వీల్లేదన్నమాట.

ఇప్పటికిప్పుడు టీమిండియా పూర్తి బలంతో వుందన్నది కాదనలేని వాస్తవం. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో బలంగానే వున్నా, జింబాబ్వేతో లీగ్‌ దశలో ఆడిన ఆఖరి మ్యాచ్‌లో టాప్‌ ఆర్డర్‌ చేతులెత్తేయడం పలు అనుమానాలకు తావిచ్చింది. బంగ్లాదేశ్‌ని పసికూనగా భావించకుండా, మైదానంలో ఏమాత్రం అలసత్వానికి తావివ్వకుండా వుంటే టీమిండియా సెమీస్‌కి చేరడం పెద్ద కష్టమేమీ కాదు.