ధిగ్గజాలుగా పేర్కొనే చాలా మంది క్రికెటర్లు తమ కెరీర్ ఆసాంతం కొట్టింది 20 నుంచి 30 సెంచరీలు మాత్రమే! సచిన్ టెండూల్కర్ ను మినహాయిస్తే… స్టార్ బ్యాట్స్ మన్లు, బ్యాటింగ్ ధిగ్గజాలుగా పేరును తెచ్చుకున్న వాళ్లు.. బౌలర్లకు నిద్ర లేకుండా చేసిన వాళ్లు… సెంచరీల విషయంలో వీళ్ల గరిష్ట స్థాయి 30 మాత్రమే! వీళ్లంతా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్లే! మరి అలాంటి స్టార్ల ఫీట్లన్నీ ఇప్పుడు చిన్నబోతున్నాయి! విరాట్ ఊపు మీద అవన్నీ తక్కువగా కనిపిస్తున్నాయి.
రికీ పాంటింగ్ ను సచిన్ తో పోలుస్తూ ఉంటారు. ఒక దశలో ఈ ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ సెంచరీల విషయంలో సచిన్ కు పోటీగా వచ్చాడు. అయితే కెరీర్ ముగింపు దశకు వస్తున్న కొద్దీ టెండూల్కర్ దూకుడు పెరగడంతో పాంటింగ్ వెనుకబడ్డాడు. పాంటింగ్, సనత్ జయసూరియా, కుమార సంగకర, దిల్షాన్, గంగూలీ, గేల్.. వంటి సుడిగాలి వీరులందరికీ సెంచరీల విషయంలో 20 మార్కును దాటడానికి కనీసం మూడువందల వన్డేలు ఆడాల్సి వచ్చింది. అయితే విరాట్ మాత్రం 174వన్డేలకే 26వ సెంచరీని పూర్తి చేశాడంటే… ఆ స్టార్ ఆటగాళ్ల దూకుడు తో పోల్చి చూసినా.. విరాట్ ఆట స్థాయి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
గత తరం ధిగ్గజాలను మించి పోయేలా సాగుతోంది విరాట్ ఆట, వారికి రెట్టింపు స్థాయిలో ఉంది విరాట్ వేగం. అయితే ఒకరిద్దరు ఈ తరం ఆటగాళ్లు మాత్రం విరాట్ కు కొంత పోటీ ఇస్తున్నారు. సాతాఫ్రికన్ బ్యాట్స్ మన్లు డివిలియర్స్, హాషిమ్ అమ్లాలు.. కూడా సెంచరీల విషయంలో ఊపు మీదనే కనిపిస్తున్నారు. కానీ వీరు మిగతా ధిగ్గజ ఆటగాళ్లను సెంచరీల సంఖ్య విషయంలో అధిగమించ గలరేమో కానీ.. విరాట్ ను మాత్రం దాటేసే అవకాశాలు లేవు.
విరాట్ ప్రస్తుతానికి వన్డే క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మన్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతి తక్కువ వన్డేల్లో ఈ రేంజ్ కు వెళ్లాడు. మరో నాలుగు సెంచరీలు చేస్తే.. జయసూరియా, పాటింగ్ లను దాటేస్తాడు. ఆ తర్వాత విరాట్ టార్గెట్ టెండూల్కర్ రికార్డే! 49 సెంచరీలతో టాప్ లో ఉన్న సచిన్ ను అందుకోవాలంటే మాత్రం.. విరాట్ కొన్ని సంవత్సరాల పాటు ఇదే ఫామ్ ను కొనసాగించగలగాలి!