ఇప్పటి వరకూ కరోనా వైరస్ వ్యాప్తి, ప్రభావం విషయంలో జరిగిన పరిశోధనల ప్రకారం… వ్యాధి నిరోధకత బాగా ఉన్న వారిపై ఆ వైరస్ ప్రభావం తక్కువే అనే మాటను అధ్యయన కర్తలు చెబుతూ ఉన్నారు. ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారిని కరోనా వేగంగా అస్వస్థతకు గురి చేస్తూ ఉందని, అదే అలాంటి సమస్యలు లేని వారిలో ఎవరికైనా కరోనా వైరస్ సోకినా, సింప్టమ్స్ కూడా అంత తేలికగా బయటకు రావడం లేదని కూడా అంటున్నారు. అలాంటి వారు కోలుకునే అవకాశాలు కూడా ఎక్కువని తేలుస్తున్నారు.
ఈ క్రమంలో వ్యాధినిరోధకతను పెంచుకోవాలని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇంతకీ వ్యాధినిరోధకత ఎలా పెరుగుతుందనే అంశం గురించి పరిశీలిస్తే…
-వ్యాయామం, రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయడం శరీరంలో వ్యాధినిరోధకతను పెంచుతుందని అంటున్నారు పరిశోధకులు. కనీసం వారంలో ఐదు రోజుల పాటు రోజుకో అరగంట వ్యాయామం చేయడం వల్ల శరీరం నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ విసర్జింపబడతాయట. దీంతో వ్యాధినిరోధకత పెరుగుతుందంటున్నారు.
-నిద్ర, రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలపాటు నిద్ర అవసరం. సరిపడినంత ఈ నిద్ర శరీరాన్ని ఆరోగ్యవంతం చేస్తుందని అధ్యయనకర్తలు చెబుతున్నారు. ఈ మేరకు నిద్రను షెడ్యూల్ చేసుకోమని సూచిస్తున్నారు.
-జంక్ ఫుడ్ వద్దు, చిరుతిండ్లను మానేయడం మంచిదని అంటున్నారు. పిజ్జాలు, బర్గర్లు, చిప్స్ వంటివి తినడం ఆపాలని సూచిస్తున్నారు. పానీపూరీ వంటి ఇండియన్ జంక్ కూడా ఇదే కేటగిరిలోకి వస్తుంది. డైట్ బ్యాలెన్స్ చేసుకోవాలని, విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ ఉంటే ఆహారాన్ని తీసుకోవాలని ఇది ఒక ఉపయుక్తమైన చర్య అని వారంటున్నారు.
-శుచి,శుభ్రత, వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండటం, చేతులను ఎప్పటికప్పుడు కడుక్కొంటూ ఉండటంతో పాటు, ఇంటిని మరింత పరిశుభ్రంగా ఉంచుకోవడం, పరిసరాల పరిశుభ్రత, వీటితో పాటు పబ్లిక్ గేదరింగ్స్ వైపు, ఎక్కువమంది కలిసే చోటికి వెళ్లకపోవడం.. ఇవన్నీ కూడా వ్యాధినిరోధకతను పెంచే అంశాలని అంటున్నారు.
-ఒత్తిళ్లను తగ్గించుకోవడం, స్ట్రెస్ లేకపోవడం అనేది కూడా వ్యాధినిరోధకతను పెంచుతుందని అంటున్నారు. అనవసరమైన ఒత్తిళ్లకు దూరంగా ఉండటం, రిలాక్స్డ్ గా ఉండటం కూడా కీలకమంటున్నారు. మెడిటేషన్ వంటి మార్గాలను సూచిస్తున్నారు.