చిరంజీవితో పాటు పలువురు సినీప్రముఖులు నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. షూటింగ్స్ కు అనుమతి కోరడంతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలు సమస్యల్ని జగన్ కు విన్నవించారు. ఈ సమావేశంపై బాలయ్య స్పందించారు.
జగన్ తో మీటింగ్ కోసం కేవలం ఒక వ్యక్తికి (చిరంజీవి) అపాయింట్ మెంట్ ఇచ్చారని.. అతడితో పాటు మరికొందర్ని పిలిచారని.. ఒక వ్యక్తికి అపాయింట్ మెంట్ ఇచ్చినప్పుడు తను ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు బాలయ్య. పైగా తన ప్రమేయం లేకుండానే సమావేశానికి బాలయ్య రాడంటూ వాళ్లకు వాళ్లే ప్రకటించేశారని ఆరోపించారు.
“ముఖ్యమంత్రితో ఓ వ్యక్తికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. దానికి ఎవరెవర్ని తీసుకురావాలో రాసిపెట్టారు. ఓ వ్యక్తికి అపాయింట్ మెంట్ ఇచ్చినప్పుడు నేనెందుకు వెళ్తాను. ఇండస్ట్రీ ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. నేను బాగా హర్ట్ అయ్యాను. అయినప్పటికీ ఆలోచించి చెబుతా అన్నాను. అంతలోనే వాళ్లకు వాళ్లే ప్రకటించుకున్నారు. బర్త్ డే వేడుకల సందర్భంగా బాలయ్య రానన్నారని వాళ్లే చెప్పుకున్నారు. ఆ ప్రకటనతో నాకు సంబంధం లేదు. నేను చెప్పినట్టు వేరే వాళ్లు చెప్పేశారు. ఆ తర్వాత నా కోసం ప్రయత్నించారు. ఇక నేను స్పందించలేదు.”
ఇలా సీఎం జగన్ తో తన మీటింగ్ ఎందుకు మిస్సయిందనే అంశాన్ని బయటపెట్టారు బాలయ్య. ఇండస్ట్రీలో గ్రూపులు ఎక్కువయ్యాయని, మరీ ముఖ్యంగా కుల సమీకరణాలు పెరిగిపోయాయని విమర్శించిన బాలయ్య.. పరిశ్రమకు రకరకాల రంగులు పూస్తున్నారని, అది మంచిది కాదని అన్నారు.
విశాఖలో పరిశ్రమను నెలకొల్పాలని కొంతమంది సినిమా జనాలు భావించడం తప్పులేదన్నారు బాలకృష్ణ. అయితే ఆ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడం మాత్రం సరికాదన్నారు. విశాఖలో స్టుడియో ఏర్పాటుకు భూమి-అనుమతి కావాలంటూ అందరికంటే ముందు తను అప్లికేషన్ పెట్టుకున్నానని, అలాంటప్పుడు ఎవరో ఒకరికి ఆ క్రెడిట్ ఇస్తే ఒప్పుకోనంటూ పరోక్షంగా చిరంజీవిపై విమర్శలు గుప్పించారు.