కరోనా భయాల నుంచి ప్రపంచం ఇంకా పూర్తిగా బయపడటం లేదు. కొన్ని కొన్ని దేశాలు కరోనా నుంచి విముక్తి పొందుతూ ఉన్నాయి. గణనీయమైన స్థాయిలో కోలుకుంటున్న వారు ఉండటం, కొత్త కేసుల నమోదు చాలా తక్కువ కావడంతో కొన్ని దేశాలు ఊరట పొందుతూ ఉన్నాయి. అయితే అంతర్జాతీయ సరిహద్దులు తెరిచాకా పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆ దేశాలకు కూడా కీలకం. అయితే ఇండియా వంటి భారీ జనాభా ఉన్న దేశంలో రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇండియాలో కూడా కోలుకుంటున్న వారి శాతం గణనీయంగా ఉంది. అయితే సామాజిక జీవనం సాధారణ స్థితికి వచ్చే పరిస్థితి ఇప్పుడప్పుడే కనిపించడం లేదని స్పష్టం అవుతోంది.
ఆ సంగతలా ఉంటే.. కరోనాను నివారించడం అంటే సోషల్ డిస్టెన్సింగ్ పాటించడమే అనేది ఇంకా భారతీయులకు పూర్తిగా అలవాటు కావాల్సిన అంశంగానే నిలుస్తూ ఉంది. సోషల్ డిస్టెన్సింగ్ గురించి మూడు నెలల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో.. ఇప్పుడిప్పుడు అందరిలోనూ అవగాహన పెరుగుతూ ఉంది. జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారు.
ఇక శారీరక ఆరోగ్యం విషయానికి వస్తే.. సోషల్ డిస్టెన్సింగే కాదు, షుగర్ డిస్టెన్సింగ్ కూడా ఇప్పుడు అనుసరించదగిన నియమం అని అంటున్నారు వైద్య నిపుణులు. భారతీయుల షుగర్ ఇన్ టేక్ గణనీయంగా ఉంటుంది. రోజుకు రెండు కప్పుల టీ- కాఫీ తాగినా.. ఏకంగా 80 క్యాలరీలు శరీరంలోకి చేరిపోతాయట. కేవలం రెండు కప్పుల టీ లేదా కాఫీలో వేసే చక్కెరలోనే 80 క్యాలరీలుంటాయి. పాలలో ఉండే క్యాలరీలు అదనం కావొచ్చు!
రెండు కప్పులకు మించి టీ తాగే వాళ్లు, స్వీట్లు గట్రా తినడం ఇదంతా అదనం. అందులోనూ ఇళ్లలో కూర్చుని పనిచేసే వాళ్లే ఇప్పుడు అధికం. దీంతో ఇబ్బడిముబ్బడిగా వెయిట్ పెరిగిపోవడం సహజం! గత మూడు నెలల్లో.. కనీసం మూడు నాలుగు కేజీల బరువు పెరిగినట్టుగా ఇళ్లలో కూర్చుని పని చేస్తున్న ఐటీ రంగ ఉద్యోగులు వాపోతూ ఉన్నారు. ఇన్నాళ్లూ గంటలు గంటలు ట్రాఫిక్ లో జర్నీ చేయడం, ఆఫీసుకు వెళితే అటూ ఇటూ నడవడం, జిమ్ లకు గట్రా వెళ్లే అవకాశాలు ఉండేవి. మూడు నెలలుగా ఇంటికే పరిమితం అయ్యి, పనికి అంకితం కావడంతో.. బరువు పెరుగుదల కొత్త సమస్యగా మారుతున్నట్టుగా పరిశీలనలు చెబుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో.. ఈ సమస్యను సులభంగా నివారించుకోవడం, వెయిట్ పెరగకుండా-ఇమ్యూనిటీని కాపాడుకోవడానికి ముందున్న మార్గాల్లో షుగర్ ఫ్రీ లైఫే కీలకం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉన్నట్టుండి టీ- కాఫీలు పూర్తిగా మానేస్తే.. ఒకటీ రెండు రోజులు కాస్త తలనొప్పి, నిస్తేజంగా అనిపించవచ్చు కానీ, వారం రోజుల్లో ఈ రొటీన్ అలవాటును స్కిప్ చేసేయవచ్చని, అంతలో అంతా కుదురుకుంటుందని వారు వివరిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వేళ షుగర్ ఫ్రీ లైఫ్ అలవాటు చేసుకోవడం అన్ని రకాలుగానూ మంచిదే అని చెబుతున్నారు.