శ్రీనువైట్ల అంటే పెద్దగా పరిచయ వాక్యాలు అక్కరలేదు. తనకంటూ ఓ స్టయిల్ వేసుకుని, టాలీవుడ్ లో ఎత్తులు, పల్లాలు చూసేసిన దర్శకుడు. తొలిసారి తన పంథా నుంచి కాస్త పక్కకు తప్పుకుని, మెగా హీరో వరుణ్ తేజతో చేసిన సినిమా మిస్టర్. ఈ సినిమా విడుదల సందర్భంగా చిన్న చిట్ చాట్.
*మిస్టర్, మీ మిగిలిన సినిమాలకు ఏ విధంగా డిఫరెంట్ గా వుంటుంది అనుకోవాలి.
తొలిసారి నేను చేస్తున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అదే విధంగా కాస్త ట్రావెల్ మూవీలా వుంటుంది.
*వాటి సంగతి ఓకె. మరి మీ స్టయిల్ బకరా కామెడీ?
మీరు అన్న ఆ బకరా కామెడీ కూడా ఈ సినిమాలో వుండదు. వాస్తవానికి నా సినిమాల్లో అది కొంత జర్నీ తరువాతే మొదలయింది. అన్ని సినిమాల్లోనూ అది కనిపించదు. అలాగే ఇందులో కూడా.
*కానీ శ్రీనువైట్ల అనగానే కామెడీ అనే కదా ప్రేక్షకులు ఆశించేది?
అది ఎక్కడా మిస్ కాలేదు. ఈ సినిమాలో కూడా కామెడీ బాగానే పండింది. ఏదైనా బకరా కామెడీ అని మీరు అంటున్నారో ఆ టైపు మాత్రం వుండదు.
*పెద్ద హీరోలు, పెద్ద బడ్జెట్ ను హ్యాండిల్ చేసి, ఇప్పుడు మీడియం హీరో, మీడియం బడ్జెట్ అంటే ఇబ్బందిగా లేదా?
అస్సలు లేదు. నిజానికి పెద్ద హీరోల సినిమాలు కూడా నేనేమీ పెద్ద భారీ బడ్జెట్ లో ఎప్పుడూ సినిమాలు చేయలేదు. ఈ సినిమా కూడా ఆ సినిమాలకు ఏమాత్రం తగ్గని లుక్ లో వుంటుంది. ఖర్చు ఆ సినిమాల రేంజ్ లో పెట్టానని మీకు అనిపించినా ఆశ్చర్యం లేదు.
*కొన్ని పరాజయాల తరువాత ఈ సినిమా చేస్తుంటే, డూ ఆర్ డై లాంటి టెన్షన్ కలగలేదా?
అస్సలు లేదు. ఇంకా చెప్పాలంటే చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసాను. విజయాలకు పొంగిపోలేదు. అపజయాలకు పడిపోలేదు. నేను ఎప్పుడూ నార్మల్ గానే వుంటూ వచ్చాను.
*ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటున్నారు. చాలా కాలం తరువాత ఈ టైపు సబ్జెక్ట్ తీసుకున్నారు. మరి ఈ జనరేషన్ పల్స్ తెలుసా?
నేను ఎప్పటికప్పుడు అప్ డేట్ గానే వుంటూ వస్తున్నా. అన్ని భాషల సినిమాలు చూస్తున్నా, కుర్రాళ్లను గమనిస్తున్నా. అందువల్ల వాళ్లకు నచ్చేలా, వాళ్లు మెచ్చేలాగే వుంటుంది
*వరుణ్ తేజ ఆల్టర్ నేటివ్ చాయిస్ నా? లేక డైరక్ట్ గా ఆయనకే ఈ సబ్జెక్ట్ తయారు చేసారా?
నిజంగా చెబుతున్నా, ఆయన కోసమే తయారైన సబ్జెక్ట్ ఇది. జస్ట్ క్యాజువల్ గా అన్నా ఓ పెద్ద హీరోకి చెప్పా, నచ్చింది. అని మాత్రమే. కానీ దానికి ఏవేవో అల్లి, ఏవేవో రాసారు. ఇది పక్కాగా వరుణ్ కోసం తయారుచేసాను.
*మళ్లీ పెద్దహీరోలతో ఎప్పుడు?
రెండు సబ్జెక్ట్ లు రెడీ చేస్తున్నా. ఎవరికి సూటవుతుంది అనుకుంటే వాళ్లనే అప్రోచ్ అవుతా. అదంతా ఈ సినిమా తరువాతి సంగతి.
*మీ అభిమానులకు ఏం చెబుతారు?
ఓ కొత్త, మంచి ప్రయత్నం సిన్సియర్ గా చేసాను. ఎంకరేజ్ చేయండి. ఇదే నా అపీల్.
విఎస్ఎన్ మూర్తి