రేటింగ్స్ వల్ల సినిమాలపై తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుంది – ` డైరెక్టర్ శ్రీను వైట్ల
వెండితెరపై విందు భోజనం వడ్డిస్తే ఎలాగుంటుందో… శ్రీను వైట్ల సినిమా అలాగుంటుంది. ఆయన సినిమాలో అన్ని రుచులూ ఉంటాయి. ఒక కమర్షియల్ సినిమాకి అదిరిపోయే కామెడీ జోడిస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందనేది శ్రీను వైట్ల సినిమాల్తో రుజువైంది. కుటుంబ సమేతంగా చూసే సినిమాలు తీసే శ్రీను వైట్ల హాస్యానికి పెట్టింది పేరు. తెలుగు సినిమా ప్రేక్షకుడి నాడి పట్టేసి… తన ప్రతి సినిమాని నవ్వులతో నింపేసి… బాక్సాఫీస్‌ని అదేపనిగా కొల్లగొట్టేస్తున్న శ్రీను వైట్ల లేటెస్ట్‌గా ‘ఆగడు’ తీర్చిదిద్దారు. మహేష్‌తో ఇంతకుముందు ‘దూకుడు’ చూపిన శ్రీను వైట్ల ఈసారి మరో పెద్ద హిట్ కొట్టేవరకు తన హీరో ‘ఆగడు’ అని అంటున్నారు. ఆగడు రిలీజ్ సందర్భంగా ‘గ్రేట్‌ఆంధ్ర’ శ్రీను వైట్లతో చేసిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ మీ కోసం…
‘ఆగడు’పై ఎక్స్‌పెక్టేషన్స్ టూమచ్‌గా ఉన్నాయి. వాటిని ఆగడు ఎంతవరకు రీచ్ అవుతుందని మీరనుకుంటున్నారు.
హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవుతుందనే నమ్మకముందండి. ఈ సినిమా మొదలుపెట్టే ముందే దీనిపై ఎక్స్‌పెక్టేషన్స్ బాగా ఉంటాయనేది తెలుసు కాబట్టి, దానికి అనుగుణంగా అన్నీ ప్లాన్ చేసుకుని చేయడం జరిగింది. తప్పకుండా ఆగడు ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవుతుంది, బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకముంది.
‘దూకుడు’కి, ‘ఆగడు’కి మహేష్‌ని మీరు ప్రెజెంట్ చేసిన విధానంలో ఏమైనా మార్పులున్నాయా?
చాలా అండీ. సినిమా ఓపెనింగ్ రోజునే చెప్పాను. దూకుడులో మహేష్‌ని టెన్ పర్సెంటే యూజ్ చేసుకున్నాను. ఆగడులో హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకుంటాను అని. దూకుడు మా ఇద్దరి కాంబినేషన్‌లో మొదటి సినిమా కావడం వల్ల తనని ఒక లెవల్ వరకే చూపించగలిగాను. ఇప్పుడు తనతో ర్యాపో పెరిగిన తర్వాత, తన గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మహేష్‌కి ఉన్న ఇన్‌హిబిషన్స్ అన్నీ బయటకి తీసి కొత్తగా ప్రెజెంట్ చేసాను. తనెప్పుడూ చేయని విధంగా ఈ సినిమాలో చేసాడు. ‘దూకుడు’ కంటే
‘ఆగడు’ చాలా సుపీరియర్‌గా ఉంటుంది.
మహేష్ గతంలో ఎక్కువగా సీరియస్ క్యారెక్టర్సే చేసారు. తనలో కామెడీ టైమింగ్ ఉందని మీరెప్పుడు గుర్తించారు?
మహేష్‌తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు తనకి విపరీతమైన సెన్సాఫ్ హ్యూమర్ ఉందని నాకు తెలిసింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ సెన్సాఫ్ హ్యూమర్ వల్లే మేమిద్దరం ఇంత క్లోజ్ అవ్వగలిగాం. తనలోని హ్యూమరస్ యాంగిల్‌ని నేను గుర్తించాను. తనలో చాలా హ్యూమర్ ఉంది కానీ.. మీరన్నట్టు తను ఇంతకుముందు అంత ఓపెన్ అయి చేసేవాడు కాదు. ఏదీ ఫోర్స్‌డ్‌గా ఉండకూడదని ఫీలవుతాడు మహేష్‌బాబు. ఏం చేసినా కన్విన్సింగ్‌గా ఉండాలి, ఓవర్‌గా ఉండకూడదు అనుకుంటాడు. నేనూ అదే చేస్తాను నా సినిమాల్లో. ఎంత మంది కమెడియన్స్ ఉన్నా, ఎంత మంది ఆర్టిస్టులున్నా కానీ ఏదీ అతిగా అనిపించదు. ఆ సిట్యువేషన్ ప్రకారం చాలా కన్విన్సింగ్‌గా పర్‌ఫార్మెన్స్ ఉంటుంది తప్ప ఓవర్ అనిపించదు. సో… ఆ నమ్మకం తనకి నా మీద పూర్తిగా వచ్చింది దూకుడు టైమ్‌లో. ఆ నమ్మకంతోనే ఫుల్ ఓపెన్ అయి ఈ సినిమాలో చేసాడు. అది అన్‌బిలీవబుల్ లెవల్లో.. అంటే మహేష్ కెరీర్‌లో ఇప్పటివరకు ది బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఆగడులో చేసాడని చెప్పవచ్చు.
మీ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘దూకుడు’ పెద్ద బ్లాక్‌బస్టర్ అయింది. మళ్లీ మీ కాంబినేషన్ అనగానే ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఉంటాయి. దాని గురించి మీరేమీ టెన్షన్ పడలేదా?
‘దూకుడు’ తర్వాత మేము చేస్తున్న సినిమా కాబట్టి డెఫినెట్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ పీక్‌లో ఉంటాయి. అయితే దాని గురించి నేనేమీ టెన్షన్ పడలేదు. ఇది ప్రెజర్‌గా కంటే ప్లెజర్‌లా ఫీలయ్యాను. నిజమే.. ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఉండాలి కూడా! దానిని ఎలా రీచ్ అవ్వాలనే ఆలోచనే నన్ను మోటివేట్ చేసింది. తప్పకుండా ప్రేక్షకుల అంచనాలని రీచ్ అవుతామనే నమ్మకంతో ఇద్దరం చేసాం. అవుట్‌పుట్‌తో మేమిద్దరం వెరీ హ్యాపీ.. ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ.
దూకుడు తర్వాత మీ కాంబినేషన్‌లో దూకుడు 2 వస్తుందని అన్నారు. అందులోలానే ఇందులో కూడా హీరో పోలీస్ క్యారెక్టర్ చేసాడు. ఇది దూకుడు 2 అని ప్రచారం జరిగిన సినిమాయేనా లేక దానికి, దీనికి సంబంధం లేదా?
‘దూకుడు 2’ వస్తుందని స్పెక్యులేషన్ జరిగింది కానీ అది తీస్తానని నేనెప్పుడూ అనలేదు. దూకుడుకీ, ఆగడుకీ ఎలాంటి సంబంధం ఉండదు. ఇది కంప్లీట్‌గా డిఫరెంట్ సినిమా. దూకుడులో హీరో పోలిస్ అయినా కానీ చివర్లో ఒక్కసారి మాత్రమే యూనిఫామ్‌లో కనిపిస్తాడు. ఇందులో హీరో రూరల్ ఏరియాలో పోలీస్. క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. బ్యాక్‌డ్రాప్ వైజ్ కానీ, కథ పరంగా కానీ ఎక్కడా సంబంధముండదు.
రూరల్ కాప్ అనే సరికి ‘గబ్బర్‌సింగ్’తో పోలిక వస్తోంది. అలా మీకేమైనా అనిపించిందా?
అలా ఏమీ లేదండీ. రూరల్ కాప్ స్టోరీస్ చాలా వచ్చాయ్ తెలుగులో. బాలకృష్ణ గారు చేసారు, చిరంజీవి గారు చేసారు, ఆమధ్య యముడు అని ఒక సినిమా వచ్చింది. అలాగే గబ్బర్‌సింగ్ వచ్చింది. రెండూ కాప్ క్యారెక్టర్స్ అనేసరికి దానికీ, దీనికీ కంపారిజన్స్ తీసుకొస్తున్నారు. కానీ సినిమా చూస్తే మీకెక్కడా ఆ పోలిక కనిపించదు. దానికీ, దీనికీ ఎలాంటి సంబంధం లేదు.
మహేష్ డ్రెస్సింగ్ కానీ, డైలాగ్ మాడ్యులేషన్ కానీ చాలా డిఫరెంట్‌గా అనిపిస్తోంది. దాని గురించి చెప్పండి.
‘ఆగడు’కి ముందు చేసిన సినిమా కోసం మహేష్ ఫిజిక్ బాగా వర్కవుట్ చేసాడు. ఆ ఫిజిక్‌కి కాప్ క్యారెక్టర్ బాగా సరిపోయింది. ఆ ఫిజిక్‌కి ఎలాంటి డ్రెస్సింగ్ అయితే బాగుంటుంది, తన స్టయిలింగ్ ఎలా ఉండాలనేది టోటల్‌గా నేనే అనుకున్నాను. ఈ షర్టులు వాడాలి, ఈ ప్యాంట్‌లు వాడాలి, ఈ బెల్టులు వాడాలి, ఈ గాగుల్స్ వాడాలి, ఈ షూస్ వాడాలి.. ఇలా అన్నీ నేనే ఫిక్సయ్యాను. మహేష్‌కి నా మీద చాలా కాన్ఫిడెన్స్. నా ఆలోచనల్ని బాగా రెస్పెక్ట్ చేస్తాడు కాబట్టి నేను చెప్పిన దానికి దేనికీ నో చెప్పకుండా చేసాడు. మహేష్‌బాబు లుక్ అంతా కూడా నేను డిజైన్ చేసిందే. యుఎస్ నుంచి ఆ కాస్టూమ్స్, యాక్ససరీస్ అన్నీ తెప్పించాం. లాస్ట్ టైమ్ నేను యుఎస్ వెళ్లినప్పుడు అక్కడ చూసి నెక్స్‌ట్ రోల్‌కి ఇవన్నీ బాగుంటాయి అని అనుకున్నాను. డైలాగ్ మాడ్యులేషన్ విషయానికి వస్తే… ఇందులో ఒక స్లాంగ్ అని కాకుండా అన్ని స్లాంగ్స్‌లో మాట్లాడతాడు. రూరల్ కాప్ కాబట్టి అన్ని ఏరియాల్లో పని చేసిన అనుభవం ఉంటుంది కాబట్టి ఒక ఏరియా స్లాంగ్ అని కాకుండా అన్ని రకాల స్లాంగ్స్ వాడాం.
మీ సినిమా అనేసరికి కామెడీ చాలా బాగుంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. దానిని ప్రతి సినిమాతో రీచ్ అవడం కష్టం. దీనిని మీరు ప్రెజర్‌గా ఫీలవుతున్నారా, ఎంజాయ్ చేస్తున్నారా?
చేయగలుగుతున్నాను కాబట్టి ప్రస్తుతానికి ఆ ప్రెజర్‌ని ప్లెజర్‌లానే ఫీలవుతున్నాను (నవ్వుతూ). సాధారణంగా నా స్టోరీ సిట్టింగ్స్ అనే సరికి ఏదీ సీరియస్‌గా ఉండదు. చాలా సరదాగా ఉంటుంది. రైటర్స్ టీమ్, నేను అంతా కలిసి తిరుగుతూ, సరదాగా డిస్కస్ చేసుకుంటాం. బేసిగ్గా ఎంజాయ్ చేస్తూనే స్క్రిప్ట్ చేస్తాను. సో అది ప్రెజర్‌గా ఫీలవను.
ఇన్ని సినిమాలు చేసినా కానీ మీ సినిమాల్లో కామెడీ స్టిల్ ఫ్రెష్‌గా అనిపిస్తుందండీ. ఆ స్పెషాలిటీ ఏంటి, ఆ సీక్రెట్ ఏంటో చెప్పండి.
అదృష్టమండీ. గాడ్స్ గిఫ్ట్ అది. నేను ఎఫర్ట్స్ పెడితే వచ్చింది కాదది. మా జీన్స్‌లోనే ఉందేమో మరి. మా నాన్నగారు, మా పెదనాన్న గారు, మా తాతగారు… విపరీతంగా సెటైర్స్ వేస్తారు. చాలా హ్యూమరస్ పీపుల్ అందరూ. అలాంటి వాతావరణంలో పెరిగొచ్చాను. ఆ తర్వాత లక్కీగా నేను ఇంటరాక్ట్ అయినవాళ్లు కూడా అలాంటి వాళ్లే. లైక్ మైండెడ్ పీపుల్‌తోనే ఎక్కువగా ఉన్నాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యూమర్‌ని ఇష్టపడే వాళ్లు. నేను నవ్వడాన్ని, నవ్వించడాన్ని ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటాను. అందుకని నా సినిమాల్లో అది కనిపిస్తూ ఉంటుంది. ప్రతి మనిషినీ గమనిస్తుంటాను. ఏదైనా పెక్యూలియర్‌గా అనిపిస్తే వెంటనే అది క్యాచ్ చేస్తాను. అది ఏదో ఒక క్యారెక్టర్‌లో పెడుతుంటాను. అది ఎక్స్‌ప్రెషన్స్ అవ్వొచ్చు, మాట్లాడే విధానం అవ్వొచ్చు, మేనరిజమ్స్ అవ్వొచ్చు. ఏదైనా జనం నుంచే తీసుకుంటాను. కాబట్టే జనానికి ఎక్కువ కనెక్ట్ అవుతుంటాయి.
మిమ్మల్ని ఇరిటేట్ చేస్తే మీ నెక్స్‌ట్ సినిమాలో క్యారెక్టర్ అయిపోతారనే కామెంట్ ఉంది?
(నవ్వేస్తూ…) అదేం లేదు. జస్ట్ అదో సరదా నాకు. ఇరిటేట్ చేసినవాళ్లననే కాదు… నాకు నచ్చినవాళ్ల క్యారెక్టర్లనీ పెడతాను. ఏదైనా క్రియేట్ చేయాలంటే దానికి ఏదైనా సోర్స్ కావాలి కదా. నా చుట్టూ తిరిగే వాళ్లు, నేను ఇంటరాక్ట్ అయ్యే వాళ్లని చూసి చేస్తుంటాను. అప్పుడు అవన్నీ నేచురల్‌గా అనిపిస్తాయని నా ఫీలింగ్.
మీ మొదటి సినిమా నీకోసంలో కామెడీ ఉండదు. ఆ తర్వాత కామెడీపై ఎక్కువ కాన్సన్‌ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. దీనికేదైనా కారణం ఉందా?
‘నీకోసం’ ఆఫ్‌బీట్ సినిమా. పూర్తిగా నా టేస్ట్ ప్రకారం చేసిన సినిమా. చాలా సందర్భాల్లో చెప్పాను.. మణిరత్నం, రామ్‌గోపాల్‌వర్మలాంటి వాళ్ల ఇన్‌ఫ్లుయన్స్ నా మీద ఎక్కువ ఉండేది. సినిమా అంటే అలాగే ఉండాలనే అభిప్రాయంతో ఉండేవాడిని. ఆ సినిమాతో దర్శకుడిగా పేరొచ్చింది, అవార్డులు వచ్చాయి కానీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. అప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్స్ ‘నువ్వు చాలా హ్యూమరస్‌గా ఉంటావు. కానీ నీ సినిమా ఇంత సీరియస్‌గా తీస్తే ఎవరు చూస్తారు. సినిమాకి ఎవరైనా ఎంజాయ్ చేయడానికే కదా వస్తారు’ అన్నారు. నిజమే కదా.. ఎంటర్‌టైన్ కావడానికే జనం ఇష్టపడతారు కదా అని రియలైజ్ అయ్యాను. అది నా నెక్స్‌ట్ ఫిలిం ఆనందంలో స్టార్ట్ చేసాను. ఆ సినిమాలో టెర్రస్ మీద ఎపిసోడ్ గురించి ఇప్పటికీ మాట్లాడుతుంటారు. ఆ తర్వాత ఇంక అది నేను వదిలిపెట్టలేదు. ఏ కథ తీసుకున్నా, ఎంత సీరియస్ థీమ్ తీసుకున్నా కానీ మాగ్జిమమ్ ఎంటర్‌టైనింగ్‌గా చెప్పడానికే ప్రయత్నిస్తాను.
ఇలా చేయడం వల్ల.. ‘నీ కోసం’లాంటి కథ రాసిన మీరు మళ్లీ అలాంటి కథలు రాయలేకపోతున్నా అనే లోటు ఎప్పుడైనా ఫీలయ్యారా?
లేదండీ. ఎందుకంటే సక్సెస్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. అప్పట్లో అయినా ఆ సినిమా ఎందుకు చేసానంటే.. జనానికి ఏం కావాలి, ఏం చూస్తారు అనే మెచ్యూరిటీ అప్పటికి నాకు లేకపోవడం వల్ల. అదంతా ఆలోచించలేదు కాబట్టి అప్పుడా సినిమా చేసాను. ఇప్పుడు అలాంటి సినిమా తియ్యమంటే నేనే తీయను. నా దృష్టిలో ఎంతమంది ప్రేక్షకులు చూస్తే అది అంత గొప్ప సినిమా. అది నిజం కూడా. దానిని ఒప్పుకోవాలి అందరూ!
సాధారణంగా ఒక సక్సెస్‌ఫుల్ టీమ్‌ని మార్చడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ మీరు కోన వెంకట్, గోపీ మోహన్‌తో కాకుండా ఆగడు వేరే టీమ్‌తో చేయడానికి కారణం?
యాక్చువల్‌గా నాకు కామెంట్ చేయడం ఇష్టం లేదు. ఒకటి చెప్తాను… శ్రీను వైట్లకి పర్మినెంట్ టెక్నీషియన్ శ్రీను వైట్లే! నన్ను నమ్ముకుని వాళ్లు ఇండస్ట్రీకి రాలేదు. వాళ్లని నమ్ముకుని నేను రాలేదు. కొన్నాళ్లు కలిసి పని చేసాం. కానీ ఒక టైమ్ వచ్చేసరికి ఏవో చిన్నచిన్నవి వస్తుంటాయి కదా. సెపరేట్ అయిపోయాం. వాళ్లూ హ్యాపీ, నేనూ హ్యాపీ. దాని గురించి మాట్లాడాల్సి వస్తే నా పరంగా నేను మాట్లాడతాను. వాళ్ల పరంగా వాళ్లు మాట్లాడతారు. ఆ అర్గ్యుమెంట్ అంతా నాకు నచ్చదు. వాళ్లంటే నాకెప్పటికీ ఇష్టం. వాళ్లు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను.
కొత్తగా పని చేసిన ఈ రైటర్స్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యారా మరి?
డెఫినెట్‌గా అండీ. నేనూ బేసిగ్గా రచయితనే. సో.. నేనెప్పుడూ కూడా లైక్ మైండెడ్ పీపుల్‌నే రైటర్స్‌గా పెట్టుకుంటూ ఉంటాను. యాక్చువల్‌గా వీళ్లు కొత్త కాదు. వీళ్లు దూకుడు టైమ్ నుంచి నా దగ్గర స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్స్‌గా పని చేస్తున్న వాళ్లే. చాలా బాగా సింక్ అయ్యారు. ఎక్సలెంట్‌గా పని చేసారు. వాళ్లకి ఎప్పట్నుంచో తపన నాతో పని చేయాలని. వాళ్లకి నేను ప్రమోషన్ ఇచ్చాను కాబట్టి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. చాలా బాగా పని చేసారు.
హీరో, కామెడీలాంటివి పక్కనపెడితే… ఈ సినిమాలో మీరనుకుంటున్న ఇతర హైలైట్స్ ఏంటి?
దూకుడు కంటే కూడా ఇది హీరో సెంట్రిక్ ఫిలిం అండీ. హీరో క్యారెక్టరైజేషన్ మీదే మొత్తం బేస్ అయి ఉంటుంది. అలాంటి సినిమాలో ఒక చక్కటి ఎమోషన్ ఉంది. ఒక అద్భుతమైన మోరల్ ఉంది. దాంతో పాటు… రెండు గంటల నలభై రెండు నిముషాల సినిమాలో ఎక్కడా ఒక డల్ మొమెంట్ ఉండదు. అంత ఎనర్జీ ఉంటుంది. అంత పవర్ ఉంటుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలా ఇది ఉంటుంది.
‘ఢీ’ నుంచి మీ సినిమాలన్నిటిలో ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. దానిని ఇందులో మార్చారని తెలిసింది.
ఎప్పటికప్పుడు మనం అప్‌డేట్ అవుతుండాలి. మారుస్తుండాలి. అలాగే మన యు.ఎస్.పి. వచ్చి కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్. అది వదలకూడదు. అదే చేసాను. ఈ సినిమాలో ఖచ్చితంగా ఆ ఫ్రెష్‌నెస్ ఉంటుంది. కొత్తగా ఫీలవుతారు. ఒక్కసారే మొత్తం మార్చేయడం కుదరదు కాబట్టి మాగ్జిమమ్ మార్చుకుంటూ వచ్చాను. నా సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి ఆ క్యారెక్టర్ ఉంటుంది. అది ఏదో ఉండాలని ఉన్నట్టుగా కాదు. పర్‌ఫెక్ట్‌గా… ఇక్కడ ఈ క్యారెక్టర్ అవసరం అన్నప్పుడే వస్తుంది. ఈ సినిమాలో ఏదీ ఫోర్స్‌డ్‌గా ఉండదండీ. డెఫినెట్‌గా ఫ్రెష్‌గా ఫీలవుతారు.
ఇప్పుడు మన సినిమాల్లో ‘శ్రీను వైట్ల జోనర్’ అని ఒకటి క్రియేట్ అయిపోయింది. మీ స్టయిల్లో సినిమాలు చేయడం బాగా ఎక్కువైంది. దీంట్లో చాలా మంది సక్సెస్ అవుతున్నారు, కొందరు ఫెయిలవుతున్నారు. ఇంతమంది మిమ్మల్ని ఫాలో అవుతుంటే మీకేమనిపిస్తుంది.
సంతోషమే కదండీ. ఇలా చేస్తే సక్సెస్ వస్తుంది అనుకున్నప్పుడు చేయడంలో తప్పులేదు ఎవరైనా కానీ. నేను కూడా డెఫినెట్‌గా ఎక్కడో ఇన్‌స్పయిర్ అయి ఉంటానుగా. అయితే అందరూ కూడా ఫ్రెష్‌గా ఆలోచించాలి… నేను కూడా. అందుకే ఇప్పుడు ఆగడులో మాగ్జిమమ్ ఫ్రెష్‌గా ట్రై చేసాం. ఫ్యూచర్‌లో కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ కొత్తకొత్తవి చేసుకుంటూ వెళ్లాలి. ఏదీ పర్మినెంట్‌గా ఉండదు కదా. ఎప్పటికప్పుడు ప్యాటర్న్ మార్చాలి. నేనింతకు ముందు ఒక ప్యాటర్న్‌లో సినిమాలు చేసాను. తర్వాత అది మార్చాను. మళ్లీ ఇప్పుడు మార్చాను. ఇలా గ్రో అవుతూ ఉండాలి.
మహేష్‌తో రెండు సార్లు చేసారు. తనని రెండు విధాలుగా చూపించారు. మళ్లీ మహేష్‌తో చేస్తే తనని ఎలా చూపించబోతున్నారు.
ప్రస్తుతం ఆగడు గురించే మాట్లాడుకుందాం (నవ్వుతూ). దాని గురించి ఇప్పుడే మాట్లాడ్డం టూ ఎర్లీ అవుతుంది. నెక్స్‌ట్ ఎలా చేద్దామనే దాని గురించి మా ఇద్దరికీ ఒక ఐడియా ఉంది. నేను త్వరలో దాని గురించి చెప్తాను.
డైరెక్టర్‌గా మీకు దూకుడు ఎక్కువ శాటిస్‌ఫాక్షన్ ఇచ్చిందా… ఆగడా?
దూకుడు అనేది ఒక క్లాసిక్ అండీ. దూకుడులో ఉండే గొప్పతనాలు దూకుడులో ఉంటాయి. ఆగడులో ఉండే గొప్పతనాలు ఆగడులో ఉంటాయి. అయితే ఒక డైరెక్టర్‌గా మై బెస్ట్ వర్క్ టిల్ డేట్ ఈజ్ ఆగడు.
మేకింగ్ పరంగా ఆగడు ప్రత్యేకతలు ఏంటి?
ఇంతకుముందు నేను చేసిన సినిమాలన్నిటికీ స్క్రిప్ట్ ముందు లాక్ చేసుకుని చేయలేదు. షూటింగ్ జరుగుతున్నన్నాళ్లు స్క్రిప్ట్ పరంగా బెటర్‌మెంట్స్ చేస్తుండేవాడిని. కానీ ఆగడుకి స్క్రిప్ట్ ముందే లాక్ చేసేసుకున్నాం. దాంతో మేకింగ్‌పై కాన్సన్‌ట్రేట్ చేయడానికి కుదిరింది. చాలా టఫ్ లొకేషన్స్‌లో షూట్ చేసాం. నేనింతవరకు చేసిన సినిమాల్లో టెక్నికల్‌గా ఈ చిత్రం ది బెస్ట్ అవుతుంది. మేకింగ్ పరంగా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది.
ఈ ప్రొడ్యూసర్స్‌తో మూడు సినిమాలు చేసారు. ఇకముందు కూడా వీరితో చేస్తారా, వేరే నిర్మాతలతో చేస్తారా?
ఇది నేను పెట్టిన బ్యానరే కాబట్టి వారితో ఆ అసోసియేషన్ ఎప్పటికీ ఉంటుంది. నేనే ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలని అనుకునేవాడిని. వీళ్లు ఉండడం వల్ల ఆ ఆలోచన విరమించుకున్నాను. ఫ్యూచర్‌లో కూడా అ బ్యానర్‌లో ఇంకా సినిమాలు చేస్తాను.
ఆగడు ప్రొడక్షన్ కాస్ట్ ఎంతయింది.
ఎంతయినా రీజనబుల్‌గానే ఉంటుందండీ. నేనేదైతే బడ్జెట్ చెప్పానో దాని కంటే ఒక రూపాయి కూడా దాటనివ్వలేదు ఇంతవరకు. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ తగ్గించాలి అనేది నేనే బ్యాలెన్స్ చేసుకుంటాను. నాతో సినిమా అనే సరికి వాళ్లు కూడా పట్టించుకోరు. అంతా నేనే చూసుకుంటాను. ఆగడు అనుకున్న బడ్జెట్‌లోనే పక్కాగా పూర్తి చేసాం.
మహేష్‌తో ఫస్ట్ టైమ్ వర్క్ చేసినప్పుడు గుణశేఖర్, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ పెద్ద హిట్స్ ఇచ్చారు. అయితే సెకండ్ ఎటెంప్ట్‌లో పూరి జగన్నాథ్ మాత్రమే కొంతవరకు సక్సెస్ కాగలిగారు. ఈ సెంటిమెంట్‌ని మీరు బ్రేక్ చేసి, మరో బిగ్ హిట్ ఇస్తారని ఫాన్స్ హోప్…
ఈ సెంటిమెంట్స్‌ని అవీ నేను పెద్దగా నమ్మను కానీ ఆగడు గురించి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం… నేను కానీ, మహేష్ కానీ. దూకుడు కంటే కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం మా ఇద్దరికీ ఉంది.
మీరు అందరు హీరోలతో హిట్స్ ఇచ్చారు. కానీ చిరంజీవిగారితో ఫెయిలయ్యారు. ఆ లోటుని…
రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్నాను కదా.. ఆ లోటుని ఈ సినిమాతో భర్తీ చేస్తానని అనుకుంటున్నాను.
చరణ్ సినిమాతో భర్తీ చేస్తారా… చిరంజీవిగారితోనే చేస్తారా?
చిరంజీవిగారితో చేసే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు కదా. ఆ అవకాశం వస్తే డెఫినెట్‌గా భర్తీ చేయడానికే ట్రై చేస్తాను.
చరణ్‌తో చేయబోయే చిత్రం ఎలా ఉంటుంది?
కథ అనుకున్నాం. చరణ్ కూడా విన్నాడు. తనకి బాగా నచ్చింది. నాకు, చరణ్‌కి కూడా కొత్తగా ఉంటుందా సినిమా. నవంబర్‌లో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. కథ రెడీ అయింది. కొద్ది రోజుల్లో దాని డీటెయిల్డ్ ట్రీట్‌మెంట్‌పై కూర్చుని త్వరలోనే స్టార్ట్ చేస్తాం.
మీ ప్రతి సినిమాకీ మధ్య ఏడాదిన్నర గ్యాప్ వచ్చేస్తోంది. దీనిని తగ్గించి మీరు ఎక్కువ సినిమాలు చేస్తే బాగుంటుందని ప్రేక్షకుల కోరిక.
కనీసం సంవత్సరానికి ఒక్క సినిమా అయినా చేయాలని నాకూ ఉంది. కాకపోతే ప్రతి సినిమాకీ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోవడం వల్ల వాటిని రీచ్ అవడానికి ఎక్కువ టైమ్ తీసుకోవాల్సి వస్తోంది. ముందు ముందు సంవత్సరానికి ఒక్క సినిమా అయినా వచ్చేలా ప్లాన్ చేయాలనుకుంటున్నాను.
రాజమౌళి మగధీర, బాహుబలిలాంటి చిత్రాలు చేస్తున్నారు. దర్శకుడిగా మీరు కూడా ఆ స్థాయికి వచ్చారు. ఇప్పుడు మీ నుంచి కూడా అలాంటి సినిమాలు ఆశించవచ్చా?
హిస్టారికల్ సినిమాల్ని, ఫోక్‌లోర్ సినిమాల్ని నేనూ ఇష్టపడతాను. బట్ నేను అలాంటి సినిమా తీసినా కూడా నా నుంచి ఎంటర్‌టైన్‌మెంటే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. నాకుందా ఆలోచన. నాకు మాయాబజార్‌లాంటి సినిమాలు ఇన్‌స్పిరేషన్. అప్పట్లో చారిత్రక చిత్రాలు చూసినా, జానపదాలు చూసినా ఎంటర్‌టైన్‌మెంట్ బాగా ఉండేది. నేనంటూ అలాంటి సినిమా చేస్తే తప్పకుండా ఆ గ్రాండియర్, ఆ స్పాన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేలా చూసుకుంటాను.
ఈ మధ్య వెబ్‌సైట్స్ ఇచ్చే రేటింగ్స్ గురించి చాలా మంది గొడవ చేస్తున్నారు. రేటింగ్స్‌కి మీరెలా రియాక్ట్ అవుతుంటారు?
రేటింగ్స్ గురించి నేనెప్పుడూ రియాక్ట్ కాలేదు. రేటింగ్స్ రీజనబుల్‌గా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ఒకటి రెండు సందర్భాల్లో నా సినిమాలకి కాస్త తక్కువ రేటింగ్ వచ్చిందని అనుకున్నాను. అది సహజంగా జరుగుతుంది ఎవరికైనా కూడా. కానీ దాని గురించి ఎక్కువ బాధ పడను. కొన్ని సందర్భాల్లో తక్కువ రేటింగ్ ఇచ్చారేమో అనుకుని… తర్వాత వాళ్లిచ్చింది కరెక్టే కదా అని రియలైజ్ అయిన సందర్భాలున్నాయి. కొన్ని సందర్భాల్లో అండర్ రేటింగ్ వచ్చిందని అనుకున్న సందర్భాలున్నాయి.
ఈ రేటింగ్స్ వల్ల సినిమాలపై ఎఫెక్ట్ ఉంటుందంటారా?
డెఫినెట్‌గా ఉంటుందండీ. ఉండదని చెప్పడం అమాయకత్వం. ఎస్పెషల్లీ యుఎస్‌లో ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సిటీస్‌లో కూడా కొంత ఇన్‌ఫ్లుయన్స్ ఉంటుందని నా ఫీలింగ్.
ఆగడు ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ ఒక్కొక్కరికీ ఒక్కో అంచనా ఉంది. మీకేమైనా అంచనాలున్నాయా?
నేనెప్పుడూ వాటి గురించి ఆలోచించలేదండీ. దాని గురించి ఆలోచిస్తే చేసే పనిని ఎంజాయ్ చేయలేం. రికార్డ్స్‌ని, కలెక్షన్స్‌ని ఎంజాయ్ చేసి మైండ్‌కి తీసుకునే టైప్ డైరెక్టర్‌ని కాదు. నా సినిమాని జనం అంతా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారంటే… డబ్బులు పెట్టిన వాళ్లంతా సేఫ్ అయిపోయారంటే… ఎవరికైనా నా సినిమా వల్ల పది రూపాయలు వచ్చాయంటే నేను హ్యాపీ. మిగతా వాటి గురించి ఆలోచించను, పట్టించుకోను.
-గణేష్ రావూరి