టాలీవుడ్ లోని మోస్ట్ వాంటెడ్ ఫిల్మ్ మేకర్లలో ఒకరుగా నిలిచారు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. ఆయన తొలిసారి ఓ అప్ కమింగ్ హీరోతో సినిమా చేసారు. పైగా ఆయన స్టయిల్ కి భిన్నంగా జయజానకీనాయక అంటూ టూ సాఫ్ట్ టైటిల్ పెట్టారు. అక్కడితో ఆగక ముందుగా మాంచి లవబుల్ టీజర్ వదిలారు. ఇవన్నీ చూస్తుంటే బోయపాటి మారిపోయారా? మారిపోవాలనుకుంటున్నారా? అన్న చిన్న అనుమానం. మళ్లీ అంతలోనే వొరిజనల్ లోపల అలాగే వుండే వుంటుందని మరో అనుమానం. వీటన్నింటికీ ఆయన సమాధానాలు.
తొలిసారి హీరో సపోర్ట్ లేకుండా బరువు అంతా మీరే మోస్తున్నట్లుంది?
అదేం లేదండీ. హీరో లేకుండా కథ వుండదు, సినిమా వుండదు. సినిమాను భారీగా మార్కెట్ చేయాలంటే కావాలేమో? లేదా కాంబినేషన్లు, ఓపెనింగ్స్ కావాలంటే వుండాలేమో? అయితే నా గొప్పదనం కాదు, దేవుడి దయ వల్ల నాకు అంటూ కొంత మార్కెట్ బేస్ వుందిగా? అదీ కాక, బెల్లంకొండ శ్రీనివాస్ కు ఇది తొలి సినిమా కాదు. అతని తొలి సినిమానే 40కోట్ల మార్కెట్ చూసింది. అందువల్ల బరువు లాంటి పెద్ద పదాలు అక్కరలేదు.
కానీ ఈ సినిమా విజయం లేదా ఫలితం మీ ఖాతాకే కదా మైనస్ అయినా, ప్లస్ అయినా?
అది వాస్తవమే. అందుకే కాస్త టెన్షన్ వుంటుంది. అయితేనా కథ, కథనాల మీద నమ్మకం నాకు వుంది.
ఇమేజ్ చట్రం నుంచి బయటకు రావాలని చిన్నగా ప్రయత్నాలు ప్రారంభించినట్లున్నారు?
ఇమేజ్ లో ఇరుక్కోవాలని ఎవరికీ వుండదండీ. కానీ ఒక్కో ఇమేజ్ అలా వస్తుందంతే. దాన్ని ఒక్కసారి బ్రేక్ చేయలేం. అలా చేస్తే ఫలితం రివర్స్ కొడుతుంది. మెల్లమెల్లగా చేయాలి. అదే చేస్తున్నాను.
మీ తరహా హెవీనెస్, ఎమోషన్లు, యాక్షన్ సీన్లు ఇవన్నీ బెల్లంకొండ శ్రీనివాస్ కు ఏమేరకు సూటయ్యాయి?
నూరు శాతం. నేను ఎవరితో సినిమా చేయాలన్నా ముందు వాళ్ల బలాలు, బలహీనతలు తెలుసుకుంటాను. తరువాత నాకు కావాల్సినట్లు మౌల్డ్ చేసుకుంటాను. ఈ సినిమా కోసం శ్రీనివాస్ బరువు పెరిగాడు. అతన్ని పూర్తిగా మార్చేసాను. కుర్రాడు ఈ సినిమాలో కుమ్మేసాడు. మీరే చూస్తారుగా.
ఈ సినిమావల్ల బాలయ్య వందో సినిమా వదలుకోవాల్సి వచ్చింది. బాధ పడ్డారా?
లేదండీ. మనకు మన రక్తానికి కూడా ఓ మాట, పద్దతి, క్రమశిక్షణ వుండాలి. మాట ఇస్తే దానికి కట్టుబడి వుండాలి. అందుకోసం ఏమైనా సరే నిలబడాలి. అలా నిలబడే ఈ సినిమా చేసాను.
ఇదే సబ్జెక్ట్ ను పెద్ద హీరోలతో చేసి వుంటే అన్న ఆలోచన ఎప్పుడయినా వచ్చిందా?
లేదండీ. ఈ సబ్జెక్ట్ ను శ్రీనివాస్ కోసమే తయారు చేసాను. అతనితో ఎంత బాగా చేయించాలి, ఎంత బాగా చేయాలి అన్న ఆలోచన తప్ప వేరు లేదు.
డబ్బుల కోసమే ఈ సినిమా చేసారని?
అది వట్టి మాట. చాలా తక్కువ రెమ్యూనిరేషన్ తీసుకున్నా. నా పాకెట్ మనీతో సమానం. మాట కోసం చేసానంతే.
బెల్లంకొండ శ్రీనివాస్ పై ఇంత బడ్జెట్ ఖర్చు చేయించారు. నిర్మాత ఫీలవలేదా?
ప్రారంభంలోనే నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డిని అడిగాను. మీకు అన్నీ తెలిసే ఈ ప్రాజెక్టులోకి దిగారా? లేదూ అంటే చెప్పేయండి. మరో ప్రాజెక్టు చేద్దాం అన్నాను. ఆయన ఒకటే మాట అన్నారు. 'మంచి సినిమా తీసారు నిర్మాత అని నలుగురు అనుకునేలా చేయండి, అది చాలు, లాభం, నష్టం నేను చూసుకుంటాను' అని. ఆయన పద్దతి, మనసుకు నచ్చింది. అందుకే ఆయనకే మరో భారీ సినిమా చేయాలని డిసైడ్ అయిపోయాను. ఎప్పటికైనా చేస్తాను కూడా.
రకుల్, కేథరిన్ అంత నచ్చారా? వరుసగా రెండో సినిమా?
నాకు నచ్చడం కాదు. అసలు రకుల్ నే అన్నదంట. ఆయన డైరక్టర్ అయితేనే చేస్తాను. లేదంటే లేదు అని. మంచి నటి. ఆమెలోని డిఫరెంట్ షేడ్ ను ఈ సినిమాలో చూస్తారు.
సినిమా మీద పూర్తి నమ్మకంతో వున్నారా?
నూరు శాతం. నా బ్రాండ్ ను నూరు శాతం నిలబెట్టే సినిమా అవుతుంది. సందేహం లేదు.