కేంద్రం రాష్ట్ర రెవెన్యూ లోటు భరిస్తుందని అంటే, ఇంకేముంది? హ్యాపీగా ఖర్చులు చేసి, లోటు పెంచేసినా ఫరవాలేదు అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆశలు అడియాశలయ్యాయి. డిస్కమ్ లకు ఎడా పెడా అదనపు చెల్లింపులు చేసేసారు. ఫింఛన్లను 200 నుంచి వెయ్యికి పెంచేసారు. చంద్రన్న కానుక అంటూ పప్పు బెల్లాలు పంచేసారు. ఇలా తమ చిత్తానికి ప్రభుత్వ సొమ్ము ప్రజలకు తాయిలాల కింద ఇచ్చేస్తున్నారు. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగిందని ఘొల్లు మంటున్నారు.
విభజన హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు తొలి ఏడాది బడ్జెట్ లో వచ్చే రెవెన్యూ లోటును కేంద్రం పూడ్చాల్సి వుంది. ఆ మేరకు రాష్ట్రం మొత్తం రెవెన్యూ లోటును 16వేల కోట్లు కింద లెక్కలు కట్టి, ఆ మేరకు లోటు భర్తీ చేయమని కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రలో వున్న మేధావులు తక్కువ వాళ్లు కాదు కదా? రాష్ట్రం విభజన జరిగిన నాటికి ఏయే పథకాలు అమలులో వున్నాయో వాటిని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని, జస్ట్ నాలుగువేల కోట్లు మాత్రమే రెవెన్యూ లోటు అని తేల్చారట.
మిగిలిన 12వేల కోట్లు బాబుగారు కొత్తగా అధికారంలోకి రావడానికి, వచ్చిన తరువాత ప్రజలను తాయిలాల మత్తులో వుంచడానికి ఖర్చు చేసిన మొత్తం అని తేల్చారట. అందువల్ల అది ఇవ్వలేమని క్లియర్ గా చెప్పేసారట.
ఇప్పుడు ఆ మేరకు రాష్ట్ర ఖజానాపై భారం తప్పదన్నమాట. ఇప్పుడే ఇలా వుంటే ఎన్నికలు దగ్గరకు వచ్చిన కొద్దీ ప్రజలకు ప్రభుత్వం సొమ్ముతో తాయిలాలు చాలా ఇవ్వాలనుకుంటున్నారు చంద్రబాబు. మరి నిధులు ఎలా వస్తాయో? అసలే ఖజనా ఖాళీగా వుంది.
డిఎ వ్యవహారమూ ఇంతే
ఇదిలా వుంటే, ఉద్యోగులకు డిఎ వరం అంటూ హంగామా చేసింది మీడియా. కానీ జరిగింది వాస్తవంగా వేరు. గత జనవరిలో ఇవ్వాల్సిన డిఎ ఈ ఆగస్టు నెల నుంచి ఇస్తున్నారు నగదు రూపంలో. అంటే సెప్టెంబర్ 1కి అందుకుంటారు. అప్పటి దాకా రావాల్సిన 20 నెలల మొత్తం 2000కోట్లు కేవలం కాగితాల మీదే వుంటుంది. పిఎఫ్ ఖాతాల్లో. ఎవరు ఎప్పుడు రిటైర్ అయితే అప్పుడు తీసుకోవాలి. అప్పుడు బాబు ప్రభుత్వం వుంటుందన్న గ్యారంటీ లేదు. ఆ వచ్చే ప్రభుత్వాల పైకి ఈ భారం నెట్టేసారు. ఇంకో డిఎ బకాయి అలా వుండనే వుంది.
ఇలా ఖాళీ ఖజనాతో ఎన్నాళ్లు నెట్టుకు వస్తారో? ఈ మూడేళ్ల సంగతి సరే, వచ్చే ఏడాది మరీ కీలకం. ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తాయి. జనంపై ఆ ప్రభావం కచ్చితంగా వుంటుంది మరి.