టాలీవుడ్ 2017 సెకెండాఫ్ లో భలే ఫైట్ వచ్చింది. అనుకోకుండా ఈ నెల 11న ఒకేసారి మూడు కీలకమైన సినిమాలు విడుదలవుతున్నాయి. పోటీ మాంచి రసవత్తరంగా వుంది. సినిమాలు, హీరోలు, డైరక్టర్లు, ప్లస్ మైనస్ లు పక్కన పెడితే, ముందు విడుదల సంగతి భలే రంజుగా మారింది. మూడు సినిమాలకు బలమైన బ్యాకింగ్ లు వుండడమే ఇందుకు కారణం. దీంతో ఎక్కడిక్కడ థియేటర్ల కోసం పోటీ గట్టిగా నెలకొంది.
ముందుగా లై సినిమా విషయానికి వస్తే, ఆ సినిమాకు సీడెడ్ లో ఎన్వీ ప్రసాద్, సాయి కొర్రపాటి అండగా నిల్చున్నారు. వాళ్ల ధియేటర్లు అన్నీ లై కోసమే బ్లాక్ చేసారు. అలాగే ఆంధ్రలో చాలాకాలం ముందుగా థియేటర్లు బ్లాక్ చేయడం అన్నది వాళ్లకు కలిసి వచ్చింది. ఒక్క నైజాంలోనే సమస్యగా వుండేది.
అయితే హీరో నితిన్ తండ్రి సుదాకర రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి, దిల్ రాజు తో తనకు వున్న చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లను సర్దుబాటు చేసుకుని, సినిమాను ఆయనకు అప్పగించారు. నిజానికి దిల్ రాజు జయ జానకీ నాయక సినిమాను కొన్నారు. అయినా కూడా సుధాకర రెడ్డి కోసం ఇప్పుడు లై సినిమాకు కూడా థియేటర్లు సమకూరుస్తున్నారు.
ఇక నేనే రాజు నేనే మంత్రి సినిమాకు నిర్మాత సురేష్ బాబే పెద్ద అండ. ఇండస్ట్రీలోని పెద్ద పంపిణీ దారుల్లో ఆయన ఒకరు. ఆయన తన థియేటర్లు అన్నీ ఈ సినిమాకే కేటాయించారు. నైజాంలో ఆసియన్ సినిమాస్ రాజు-మంత్రికి అండగా వుంది. సీడెడ్ లో కూడా సురేష్ బాబుకు కొన్ని ప్యాకెట్లలో థియేటర్లు వున్నాయి. ఇక ఆంధ్రలో సురేష్ కు ధియేటర్లు బలంగానే వున్నాయి.
బలమైన సినిమాగా ఆడియన్స్ అనుకుంటున్న జయ జానకీ నాయక సినిమా కూడా తక్కువ తినలేదు. నైజాం, విశాఖల్లో దిల్ రాజు థియేటర్లు అండగా వున్నాయి. సీడెడ్ లో బలమైన డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య ఈ సినిమాను పంపిణీ చేస్తున్నారు. కృష్ణలో గీతా ఆర్ట్స్, ఈస్ట్ లో అనుశ్రీ లాంటి బలమైన థియేటర్లు చేతిలో వున్నవారు ఈ సినిమాను పంపిణీ చేస్తున్నారు.
కీలక థియేటర్లే సమస్య
అందువల్ల మూడు సినిమాలకు కూడా థియేటర్ల సమస్య లేదు. అయితే థియేటర్లలో కీలకమైన థియేటర్లు వేరయా? అని అక్కడే సమస్య వస్తుంది. ప్రతి ఊళ్లలోనూ ప్రేక్షకులకు అభిమాన థియేటర్లు కొన్ని వుంటాయి. వాటికి వెళ్లడానికి ప్రిఫర్ చేస్తారు. ముఖ్యంగా ఫ్యామిలీలు అంటే కొన్ని థియేటర్లకు వెళ్లవు. కొన్నింటిని ఫ్రిఫర్ చేస్తాయి. ఇక్కడ అదే కీలకం. అలాగే సింగిల్ థియేటర్లు వున్న ఊళ్లలో, కేవలం రెండు థియేటర్లు వున్న ఊళ్లలో కూడా సమస్య కొద్దిగా వుంటుంది.
అయితే ఎవరి చేతిలో థియేటర్లు వున్నా, అవసరానికి మించి ఏం చేసుకోవాలి? ఒక ఊళ్లో సురేష్ చేతిలోనే మూడు థియేటర్లు వున్నాయి అనుకుందాం? మహా అయితే రెండింటిలో తన సినిమా వేసుకుంటారు. మూడోది ఏం చేయాలి? ఎవరో ఒకరికి ఇవ్వాల్సిందే కదా?
డబ్బులు కట్టడమే అసలు సమస్య
మూడు సినిమాలు పోటీ పడడం వల్ల వచ్చే పెద్ద సమస్య థియేటర్లు కాదు. డబ్బులు కట్టడం. సినిమా విడుదలకు ముందు రోజే బిజినెస్ సెటిల్ మెంట్ లు వుంటాయి. సాధారణంగా ఒక్క సినిమా వస్తేనే, బయ్యర్లు ఏదో ఒక వంక చెప్పి, ఎంతో కొంత తక్కువ కట్టడం అన్నది ఇండస్ట్రీలో కామన్. అలాంటిది ఎప్పుడయితే మూడు సినిమాలు వస్తున్నాయో, అప్పుడు ఇలాంటి 'డ్యాన్స్ లు' మరీ ఎక్కువగా వుంటాయి. అదే అసలు సిసలు సమస్య.
అయితే ఈ సమస్య నేనే రాజు నేనే మంత్రికి లేదు. ఎందుకంటే వాళ్లు స్వంతంగా పంపిణీ చేసుకుంటున్నారు కాబట్టి గొడవ లేదు. థియేటర్ అడ్వాన్స్ లు అన్నవి లోకల్ గా చూసుకుంటారు. లై సినిమాకు నైజాంలో, సీడెడ్ లొ కూడా ఈ సమస్య లేదు. ఆంధ్రలో చూడాలి. జయ జానకీ నాయక సినిమాకు కూడా ఆంధ్రలో అది కూడా ఒకటి రెండు ఏరియాల్లోనే సమస్య కావచ్చు. మిగిలిన చోట్ల ఫరవాలేదు.
మొత్తానికి రసవత్తరమైన మూడు సినిమాల పోరు మరో 24 గంటల్లో ఫలితం అందించి, విషయం, విజయం తేల్చేస్తుంది.