అమెరికాలో అడ్వాన్స్ సాఫ్ట్, బెస్ట్ బ్రెయిన్స్ స్కూళ్లు, లాంటి విద్యా సంబంధిత వ్యాపారాలు, హైదరాబాద్ లో, విశాఖలో ఫార్మాస్యూటికల్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వీటికి భిన్నంగా ఎకె ఎంటర్ టైన్స్ మెంట్స్, 14 రీల్స్, వింటేజ్ క్రియేషన్స్ డిస్రిబ్యూషన్, సినీ పారడైజ్ లాంటి సినిమా వ్యాపారాలు ఇలా భిన్నమైన వ్యవహారాలు అనిల్ సుంకరకు వున్నాయి.
అయినా ఆయనకు అన్నింటికన్నా సినిమా అంటేనే ఇష్టం. స్క్రిప్ట్ లు డిస్కస్ చేయడం అన్నా, పలు భాషా సినిమాలు చూడడం అన్నా, సినిమాలు పంపిణీ చేయడం అన్నా మరీ ఇష్టం. 14 రీల్స్ పతాకంపై భారీ సినిమాలు, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మీడియం సినిమాలు వరుసగా నిర్మిస్తూ వస్తున అనిల్ సుంకరతో చిన్న చిట్ చాట్.
అంధగాడు. నలభై నిమషాల వరకు హీరోకి కళ్లు లేకుండా సినిమా. ఏమిటి మీ ధైర్యం?
ధైర్యం ఏమీ లేదండీ. సినిమా ఆద్యంతం హాయిగా నవ్వుకునేలా వుంటుంది. ఎవర్ని కించపరచదు. అశ్లీలం వుండదు. డబుల్ మీనింగ్ లు వుండవు. ఏ సర్టిఫికెట్ సినిమా అంతకన్నా కాదు. ఫ్యామిలీతో హాయిగా చూసేయచ్చు. హీరోకి కళ్లు లేని ఆ నలభై నిమషాలు కూడా సినిమా హిలేరియస్ గా వుంటుంది.
రాజ్ తరుణ్ తో వరుసగా మూడు సినిమాలు. అంతగా నచ్చేసాడా మీకు?
అతనికి సబ్జెక్ట్ నచ్చితే చాలండీ, మిగిలినవి ఏవీ పట్టించుకోడు. ఎంతిస్తారు అన్నది చూడడు. అసలు రాజ్ తరుణ్ అనే కాదు. మా బ్యానర్ లో చేసిన డైరక్టర్లయినా, హీరోలయినా మళ్లీ మాతో చేయడానికి రెడీగా వుంటారు. అలా కలిసిపోతాం మేం. అయినా రాజ్ తరుణ్ చాలా మంచి అబ్బాయి. నేను చాలా రోజులుగా యుఎస్ లో లై సినిమా పనిమీదే వున్నాను. అయినా అన్నీ తానే చూసుకుంటున్నాడు. సినిమా ప్రచారం మొత్తం తన భుజాల మీద వేసుకున్నాడు. నేను లేని లోటే తెలియనివ్వడం లేదు.
ఈ మీడియం సినిమాలు సరే, భారీ బడ్జెట్, బ్లాక్ బస్టర్లు ఎప్పుడు?
చిన్న సినిమాలు పేరుకే. కానీ మంచి లాభాలు వస్తున్నాయి. ఒక్క వీడు గోల్డ్ హె మాత్రం కాస్త నిరుత్సాహపర్చింది. నితిన్ హీరోగా నిర్మిస్తున లై సినిమా భారీ బడ్జెట్ సినిమానే.
లై సినిమా సబ్జెక్ట్ ఏమిటి?
ఇదీ అని చెప్పలేనండీ.. అటు యూత్ ఫుల్ లవ్, ఇటు ఇంటిలిజెంట్ ప్లే, యాక్షన్ అన్నీ సమపాళ్లలో వుండే సినిమా. కచ్చితంగా కొత్తగా వుంటుంది.
బాలయ్య గారితో, మహేష్ తో మళ్లీ సినిమా ఎప్పుడు?
వాళ్లకు నప్పే కథ మాకు ఎప్పుడు దొరికితే అప్పుడు వాళ్లు రెడీ. మా వెల్ విషర్స్ వాళ్లు. కానీ సరైన కథ, డైరక్టర్ సెట్ కావాలి. బాలయ్య వందో సినిమా చేయాల్సిందే. మంచి ప్రాజెక్టు ఆయనకు రావడంతో తప్పిపోయింది. త్వరలో చేస్తాం.
ఇన్నాళ్ల బట్టి సినిమాలు నిర్మిస్తున్నారు, పంపిణీ చేస్తున్నారు. మరోపక్క అమెరికాలో వ్యాపారాలు చేస్తున్నారు. వీటిలో ఏది బెటర్ అనిపిస్తోంది.?
అమెరికాలో వ్యాపారమే. ఎందుకంటే ఎంతో మంది మా ద్వారా ఉద్యోగాలు తెచ్చుకుంటే అది మాకు ఆనందంగా వుంటుంది. ఇక్కడ కూడా కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చినపుడు అదే ఆనందం వుంటుంది.
సినిమాల్లో కొట్ల కష్టాలు, నష్టాలు చూసిన తరువాత, అమెరికా వ్యాపారమే బెటర్ అనిపించలేదా?
అన్నింటిలోనూ కష్టాలు, నష్టాలు వుంటాయండీ. దిగిన తరువాత ఈదుతూ వెళ్లడమే.
మీ సినిమాల్లో మీ జోక్యం ఎక్కువగా వుంటుందని అంటారు?
అవును వుంటుంది. కానీ ఎంత వరకు? స్క్రిప్ట్ లాక్ అయ్యే వరకే. వన్స్ షూట్ కు వెళ్లాక నేను పట్టించుకోను. లేదూ నేను స్క్రిప్ట్ గురించి మాట్లాడకూడదు, డిస్కస్ చేయకూడదు అంటే ఇక నేను డబ్బులు పెట్టడం ఎందుకు? రిస్క్ నాదే కదా?
దర్శకత్వం ఆలోచన ఒక్క చేదు అనుభవంతో వదిలేసినట్లేనా?
లేదండీ. పాఠం నేర్చుకున్నాను. ప్రాక్టికల్ గా అది ప్రూవ్ చేసుకుంటాను. కానీ ఇప్పుడే కాదు. మరి కొంచెం టైమ్ వుంది.
నిఖిల్-రాజు సుందరం కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారా?
అవునండీ. కన్నడ హిట్ కిర్రాక్ పార్టీ లైన్ మాత్రం తీసుకుని, చందు మొండేటి మాంచి స్క్రిప్ట్ తయారుచేసి ఇచ్చారు. నేను ఇండియా రాగానే అది లాక్ చేసి, స్టార్ట్ చేయడమే.