ఎమ్బీయస్: 1980లలో ముఖ్యమంత్రుల మార్పు

ఇవాళ టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం. వచ్చే ఏడాది యీ రోజుకి 40 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. 30 ఏళ్లు పూర్తి చేసుకున్నపుడు, 2012లో నేను ‘‘టిడిపి త్రిదశత్వం’’ అనే పేర ఓ సీరీస్…

ఇవాళ టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం. వచ్చే ఏడాది యీ రోజుకి 40 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. 30 ఏళ్లు పూర్తి చేసుకున్నపుడు, 2012లో నేను ‘‘టిడిపి త్రిదశత్వం’’ అనే పేర ఓ సీరీస్ మొదలుపెట్టి 7 రాసి ఆపేశాను. (నాకిదో పోయేకాలం) ఆ తర్వాత 2017లో మరొకటి రాశాను. 2022 మార్చి 29 లోగా కనీసం ఇరవయ్యో, పాతికో వ్యాసాలు రాస్తే బాగుండుననే ఆలోచనతో యివాళ యిది రాస్తున్నాను. ఇది తారీకులవారీగా రాసే టిడిపి రాజకీయ చరిత్ర కాదు. దాని పయనంలో అక్కడక్కడ మెరిసిన మెరుపులు, పడిన మరకలు గురించి ముందూవెనుకగా రాసే పరంపర. నా పాత ఆర్టికల్స్‌లో పార్టీ ఆవిర్భవానికి ముందు నాదెండ్ల యాక్టివిటీ గురించి రాశాను. ‘‘కథానాయకుడు’’ సినిమా సందర్భంగా నాదెండ్ల మళ్లీ వెలుగులోకి వచ్చి తన వెర్షన్‌ను వినిపించుకున్నారు.

ఇవాళ నేను రాసేది టిడిపి ఆవిర్భవానికి ముందు రాష్ట్రంలో వున్న రాజకీయ పరిస్థితి ఏమిటి, కాంగ్రెసు పరిస్థితి ఏమిటి అనేదాని గురించి. 1978-83 మధ్య (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్‌కు నలుగురు ముఖ్యమంత్రులను మార్చి ఇందిరా గాంధీ తెలుగువారిని అవమానపరిచింది అనేది ఎన్టీయార్‌కు ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. కొందరు ‘చెప్పుల్లా మార్చింది’ అని కూడా అంటూండేవారు. రాజీవ్ గాంధీ అంజయ్యకు చేసిన ‘అవమానం’ కూడా టిడిపి గెలుపుకి పనికి వచ్చింది. ఆ ముఖ్యమంత్రుల మార్పులు ఎందుకు జరిగాయి అనే దాని గురించి రెండు భాగాలుగా రాస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన 1956 నుంచి 1983లో టిడిపి ప్రభుత్వం ఏర్పడేదాక కాంగ్రెసే రాష్ట్రాన్ని ఏలింది. ప్రతిపక్షాలు లేవా అంటే వున్నాయి. అవి కాంగ్రెసు బలాన్ని తగ్గించగలిగేవే కానీ ప్రత్యామ్నాయంగా నిలవగలిగేవి కావు. ప్రతిపక్షం బలహీనంగా వుంది కాబట్టి కాంగ్రెసులోనే వర్గాలు ఏర్పడి ఒకరితో మరొకరు కలహించుకుంటూ పార్టీని బలహీన పరిచేవి.

అధిష్టానం దిల్లీలో వుంటుంది కాబట్టి, అంతా వాళ్ల కనుసన్నల్లోనే నడవాలి కాబట్టి ముఖ్యమంత్రి అంటే పడనివాళ్లందరూ దిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలకు పితూరీలు చెప్తూండేవారు. ఆ పదవి ఆశించి భంగపడి, కేంద్ర మంత్రి ఐన తెలుగు వ్యక్తులు అక్కడుండి, అసమ్మతివాదులను ఎగదోస్తూ వుండేవారు. 1977 పార్లమెంటు ఎన్నికలలో ఉత్తరభారతంలో జనతా పార్టీ గెలిచినా, దక్షిణాదిన కాంగ్రెసే గెలిచింది. కేంద్రంలో జనతా పార్టీ అధికారంలో రావడంతో రాష్ట్రంలో ఒక శాఖ ఏర్పడి దాని భాగస్వామ్యపక్షాల వారు, కాంగ్రెసంటే పడనివాళ్లు దానిలో చేరి 1978 అసెంబ్లీ ఎన్నికలలో మేమే నెగ్గేస్తామంటూ హడావుడి చేయసాగారు. ఇందిర నాయకత్వంలోని కాంగ్రెసు ఉత్తరాదిన ఘోరంగా ఓటమి చెందడంతో ఆ పార్టీ రెండుగా చీలింది. బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షతన రెడ్డి కాంగ్రెసు, ఇందిర అధ్యక్షతన ఇందిరా కాంగ్రెసు ఏర్పడ్డాయి. అప్పట్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న వెంగళరావు రెడ్డి కాంగ్రెసులో చేరి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు.

జనతా, రెడ్డి కాంగ్రెసులలో ఎవరో ఒకరికి ఛాన్సుంటుంది అనుకున్నారు తప్ప ఎమర్జన్సీ అత్యాచారాలు బయటపడుతున్న వేళ, కొత్తగా కేటాయించిన హస్తం గుర్తుతో పోటీ చేస్తున్న ఇందిరను ఎవరూ ఆదరించరనే అనుకుని ఏ ప్రముఖ నాయకుడూ ఇందిరా కాంగ్రెసు వైపు చూడలేదు. చివరకు జనతా పార్టీ కారణంగా యుపి గవర్నరు పదవి పోగొట్టుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన చెన్నారెడ్డి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావడానికి ఒప్పుకున్నారు. టిక్కెట్టు అడిగిన ప్రముఖుడు ఎవడూ లేకపోవడం చేత ఎవరు కనబడితే వాళ్లకు యిచ్చారు. అందరి అంచనాలూ తల్లకిందులు చేస్తూ 294 సీట్లలో ఇందిరా కాంగ్రెసుకి 175, జనతాకు 60, రెడ్డి కాంగ్రెసుకి 30 వచ్చాయి. దాంతో ఆటోమెటిక్‌గా చెన్నారెడ్డి 1978 మార్చిలో ముఖ్యమంత్రి అయిపోయారు.

ముఖ్యమంత్రి కావాలనే కోరిక తీరకనే 1969లో చెన్నారెడ్డి రాష్ట్రాన్ని రెండుగా చీల్చి కనీసం తెలంగాణకైనా ముఖ్యమంత్రి అవుదామనుకున్నారు. ఇప్పుడు అనుకోకుండా ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయిపోయారు. పైగా యిప్పుడు అదిలించడానికి దిల్లీలో కాంగ్రెసు అధికారంలో లేదు. ఇక్కడా, కర్ణాటకలో మాత్రమే కాంగ్రెసు పాలిస్తోంది. ఉత్తరభారతంలో తిరిగి వచ్చే ఛాన్సు కనుచూపు మేరలో కానరాకుండా అలమటిస్తోంది. జాతీయస్థాయిలో ఇందిరను పలకరించేవాడే లేడు. ఆమె, సంజయ్ కేసులెదుర్కుంటూ వున్నారు. అప్పటిదాకా ఇందిర చుట్టూ తిరిగిన వాణిజ్యవర్గాలన్నీ జనతా పార్టీకే జైజై ధ్వానాలు చేస్తున్నాయి. ఇందిరా కాంగ్రెసు చరిత్ర ముగిసిపోయిందనే కథనాలు వస్తున్నాయి.

1978 నవంబరులో కర్ణాటకలోని చిక్‌మగళూరు పార్లమెంటు ఉపయెన్నికలో ఇందిర 77 వేల మెజారిటీతో నెగ్గి బలహీనవర్గాల ప్రజలు తననింకా నమ్ముతున్నారని  నిరూపించింది. అయినా జనతా పార్టీ నాయకులు ఆమె కాలగర్భంలో కలిసిపోయిందని నమ్ముతూ, తమలో తాము కలహించుకుంటూ తమ ప్రభుత్వాన్ని తామే కూలదోసుకున్నారు. 1980లో పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. కావలసిన నిధులు యీ రెండు కాంగ్రెసు ప్రభుత్వాలే సమకూర్చవలసి వచ్చింది. ఇందిర మెదక్ నుంచి పోటీ చేసి నెగ్గింది. ఆమె పార్టీ అఖండమైన మెజారిటీతో గెలిచి, ఆమె మళ్లీ ప్రధాని అయిపోయింది. సంజయ్ గాంధీకి ఎమర్జన్సీ రోజుల నాటి ప్రభ కంటె ఎక్కువ దర్పం వచ్చిపడింది. ఇప్పణ్నుంచే చెన్నారెడ్డికి, ఇందిరకు మధ్య విభేదాలు ముదిరాయని చెప్పవచ్చు.

ఇందిర ఎంత అహంకారో, చెన్నారెడ్డి యింకా ఎక్కువ అహంకారి. అట్టహాసం, ఆడంబరం, ఎవర్నీ ఖాతరు చేయకపోవడం వంటి జమీందారీ లక్షణాలన్నీ పుష్కలంగా వున్నాయి. పాలనాసామర్థ్యం మెండుగా వున్నా ఆగ్రహానుగ్రహాలు హెచ్చు స్థాయిలో వుంటాయి. తన మాట చెల్లాలనే పంతం వలన, లౌక్యం ప్రదర్శించకపోవడం వలన శత్రువులెక్కువ. అవినీతి విషయంలో ఆయన లెక్కే వేరు. పార్టీ కోసం తీసుకుంటున్నాను కాబట్టి తప్పేమీ లేదనే భావం ఆయనది. కాంగ్రెసు ముఖ్యమంత్రులందరూ తాము సంపాదించుకున్న దానిలో 10శాతం తాము వుంచుకుని, 90శాతం అధిష్టానానికి పంపే ఏర్పాటు వుందంటారు. ఆ విధంగా చెన్నారెడ్డి నుంచి వచ్చే నిధులు అవసరమైనంత కాలం ఇందిర ఏమీ అనలేదు. 1980 ఆగస్టులో ఉత్తరాదిన జనతా ప్రభుత్వాలు రద్దు చేసి అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి, అక్కడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడడంతో నిధుల కోసం ఆంధ్రపై ఆధారపడవలసిన అవసరం పడలేదు. అందువలన చెన్నారెడ్డిపై గతంలో వున్న ఆదరం తగ్గింది.

పివి నరసింహారావు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన రోజుల్లో యితర కాంగ్రెసు నాయకులు ఆయనపై చాడీలు చెప్పి, ఆయన్ను ఏ పనీ చేయనీయకుండా చేశారు. ఆంధ్ర ఉద్యమం సందర్భంగా ఆయన్ను ముఖ్యమంత్రిగా తీసేసి, ఇందిర దిల్లీకి తీసుకుని వచ్చి మంత్రిని చేసింది. ఇక ఆయన అక్కడ కూర్చుని తన తర్వాత వచ్చిన వారందరి గురించీ చాడీలు చెప్పేవాడు. అసమ్మతివాదులకు ఆశ్రయం యిచ్చేవాడు. వెంగళరావు విషయంలో వి. జగన్నాథరావు, జి రాజారాంలను అలాగే ప్రోత్సహించి, యిబ్బంది పెట్టాడు. చెన్నారెడ్డి విషయంలోనైతే అప్పట్లో కేంద్రంలో వున్న నలుగురు తెలుగు మంత్రులు ఏకమై చెన్నారెడ్డి వ్యతిరేకులను ప్రోత్సహించారు. ముఖ్యంగా పివి, అంజయ్య, శివశంకర్.

చెన్నారెడ్డికి ఇందిరతో ఎప్పుడూ బ్లో హాట్- బ్లో కోల్డ్‌గానే వుండేది. 1969 తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి ఇందిర ఆయన తెలంగాణ ప్రజా సమితిని తన పార్టీలో విలీనం చేసుకుంది. గవర్నరు పదవులు కట్టబెట్టింది. 1974లో యుపికి గవర్నరు పదవి యిచ్చింది. ఎమర్జన్సీలో అన్ని పదవులూ అనుభవించి, 1977లో ఇందిర ఓటమి తర్వాత హైదరాబాదు వచ్చి ఎమర్జన్సీని, ఇందిర నియంతృత్వాన్ని ఆయన ఓ బహిరంగసభలో తిట్టిపోశాడు. నేను ఆ మీటింగుకి హాజరయ్యాను. ఆయన తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూలలో మంచి వక్త. మర్నాడే ఇందిరా కాంగ్రెసులో చేరాడు. ఈయనకూ దిక్కు లేదు, ఆవిడకూ లేదు. ఇందిర బలపడగానే యిలాటివన్నీ గుర్తు చేసుకుని వుంటుంది. అయినా ఆవిడకు మొహమాటాలున్నాయి కాబట్టి తటపటాయించింది.

అలాటి మొహమాటాలేవీ లేని వ్యక్తి సంజయ్ గాంధీ. వీరందరినీ మించిన అహంభావి. పైగా జనతా ప్రభుత్వాన్ని కూలదోసి, ఇందిర ప్రభుత్వాన్ని మళ్లీ తేవడానికి వ్యూహరచన చేసి వున్నాడు కాబట్టి తనను తాను సూపర్ పవర్‌గా వూహించుకుంటున్నాడు. 1979 జనవరిలో చెన్నారెడ్డి తన షష్టిపూర్తిని చాలా అట్టహాసంగా జరుపుకున్నారు. ప్రభుత్వయంత్రాంగాన్ని విచ్చలవిడిగా వాడుకున్నారు. ఆ పేరు చెప్పి చందాలు వసూలు చేశారు. 15 కి.మీ.ల పాటు ఊరేగింపు సాగింది. విపరీతంగా జనం వచ్చారు. దాన్ని చూసిన ఆవేశంలో చెన్నారెడ్డి ‘నేను యీ స్థితిలో వున్నానంటే మీ మద్దతే కారణం, ఏ పార్టీ అధినేతల దయాదాక్షిణ్యమూ కాదు’ అన్నారు. ఇలాటివన్నీ మనసులో పెట్టుకుని తాము అధికారంలోకి రాగానే సంజయ్ చెన్నారెడ్డితో ‘మీరు ముఖ్యమంత్రిగా చేసినది చాలు, యిక దిగండి.’ అని చెప్పాడు. అతని ఆదేశాల మేరకు కొందరు కాంగ్రెసు ఎమ్మెల్యేలే చెన్నారెడ్డికి వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు చేసి, సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండు చేశారు. 16 మంది మంత్రులు ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేశారు.

1980 జూన్‌లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించాడు. అతనికి విపత్తు కలగడానికి చెన్నారెడ్డి పూజలు చేయించారని, అతని మరణవార్త వినగానే ఆయనింట్లో స్వీట్లు పంచారని వార్తలు వచ్చాయి. ఎవరో వ్యక్తి వేరే సందర్భంగా తెచ్చిన స్వీట్లని, దానికీ దీనికీ ముడిపెట్టడం అన్యాయమని కొందరంటారు. ఏది ఏమైనా చెన్నారెడ్డి శత్రువులు (వీరిలో నాదెండ్ల భాస్కరరావు ఒకరు) ఇందిరకు అలాగే చెప్పారు. పుత్రశోకంతో వున్న మాతృమూర్తికి అది నిజమే ననిపించింది. చెన్నారెడ్డిని తీసేయడానికి నిశ్చయించుకుంది. కానీ ఎప్పుడో మాత్రం తేల్చుకోలేక పోయింది. ఇక్కడ మారిస్తే మరో మూడు రాష్ట్రాలలో కూడా యిలాటి డిమాండ్లే వస్తాయన్న భయం ఆమెది. పైగా చెన్నారెడ్డి స్థానంలో పెట్టవలసిన సమర్థుడెవరో తేల్చడం పెద్ద సమస్య అయింది. దాంతో ఇవాళా రేపా అంటూ చాలా రోజులు పుకార్లు షికార్లు చేశాయి. ఓసారి దిల్లీకి పిలిచి, హైదరాబాదు తిరిగి వెళ్లగానే గవర్నరుని కలిసి రాజీనామా యివ్వండి అని చెప్పారు. హైదరాబాదు చేరేలోపున నిర్ణయం మారిపోయి, యిప్పుడే వెళ్లవద్దు అని కబురు పెట్టారు.

ఈ లోగా యితర పార్టీల ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడంతో చెన్నారెడ్డి వద్ద ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య పెరిగి ఆయన తన వాపును బలంగా భ్రమించాడు. తనకు తగినంత విధేయత చూపటం లేదని ఇందిరకు కోపం. మూడు నెలలపాటు అధిష్టానానికి, చెన్నారెడ్డికి మధ్య దాగుడుమూతల ఆట సాగి, చివరకు 1980 అక్టోబరులో ఆయన చేత రాజీనామా చేయించారు. ఇక అప్పణ్నుంచి రాష్ట్రంలో అస్థిరత ప్రారంభమైంది. చెన్నారెడ్డిని దింపేశాక, అంతటి బలమైన నాయకుడు రాష్ట్రంలో వుంటే ముప్పని అసమ్మతివాదులను కూడగట్టగలిగిన రాజారాంను పక్కన పెట్టేసి, గతంలో పివిని ఎంపిక చేసినట్లుగానే యీసారి బలహీనుడైన అంజయ్యను సెలక్టు చేసింది ఇందిర.

అంజయ్య సాధారణస్థాయి కార్యకర్త. ఆరణాలకు కూలీగా పనిచేశానని ఆయనే చెప్పుకునేవాడు. ఎవరికీ ఆయనంటే భయమూ లేదు, పెద్దగా గౌరవమూ లేదు. సీనియర్లకు హేళన కూడా. 1978 అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయారు. రాజ్యసభ మెంబరుగా తీసుకుని, కేంద్రంలో కార్మికశాఖ మంత్రిగా చేసింది ఇందిర. చెన్నారెడ్డికి అంజయ్య ఏంటీ-థీసిస్. రూపం చూస్తే నవ్వు వచ్చేట్లు వుంటుంది. మొహమాటస్తుడు కావడంతో 61 మంది మంత్రులతో జంబో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి, తొమ్మిది వారాలకు దాన్ని 45కి కుదించి, నవ్వులపాలయ్యాడు. ముఖ్యమంత్రికి వుండవలసిన హుందాతనం కానవచ్చేది కాదు. పెద్దగా చదువుకున్నవాడు కాదు. ఇంగ్లీషు రాదని అందరికీ లోకువ. అందరూ ఆయన మీద జోకులేయడమే కాదు, ఆయన మీదే ఆయనే జోకులేసుకునేవాడు. ఏవి నిజమో, ఏవి కల్పనో తెలిసేది కాదు.

అయితే ఆయన మంచివాడు, అవినీతికి దూరం. నిరాడంబరుడు. అందరినీ ఆత్మీయంగా పలకరించేవాడు. ప్రజలందరికీ, ముఖ్యంగా పేదలకు అందుబాటులో వుండేవాడు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అనేకమంది సాయమందించడంతో పాప్యులర్ అయిపోయి విమర్శలు తగ్గాయి. ఆయన కాలంలో ప్రజల్లో కాంగ్రెసు పట్ల వ్యతిరేకత తగ్గింది. అయితే ‘‘ఈనాడు’’ అంజయ్యలోని యీ గుణాన్ని గుర్తించడానికి యిష్టపడలేదు. చెన్నారెడ్డి వంటి విలన్ పోయిన తర్వాత అంజయ్య వంటి విదూషకుడు ముఖ్యమంత్రిగా వచ్చాడు. తెలుగు ప్రజలకు యింతకంటె మంచివాడు దొరకడా? అంటూ రాసింది. అయితే రాజీవ్ గాంధీ సంఘటన తర్వాత అంజయ్యను ‘మార్టియర్’ను చేసి, వీరుడు శూరుడు అనేసింది.

సంజయ్ పోయిన తర్వాత ఇందిరా గాంధీ రాజీవ్‌ను బలవంతంగా రాజకీయాల్లోకి దింపింది. సంజయ్‌కు ఆడంబరం యిష్టం, రాజీవ్‌కు అట్టహాసం గిట్టదు. రాజీవ్ హత్య గురించి రాసిన పుస్తకంలో  ‘సిట్’ అధిపతి కార్తికేయన్ ఓ సారి హోటల్లో రాజీవ్ తన బట్టలు తనే ఉతుక్కున్న సంఘటన రాశారు. ఎయిర్‌లైన్స్‌లో పనిచేసినప్పుడు కూడా ఏ భేషజం లేకుండా వుండేవాడని కొలీగ్స్ చెప్పేవారు. 1982 ఫిబ్రవరిలో హైదరాబాదు వచ్చేనాటికి ఆయన ఒక ఎంపీ మాత్రమే. అంజయ్య దాన్ని ఓ పెద్ద ఈవెంటుగా చేద్దామనుకుని బేగంపేట ఎయిర్‌పోర్టుకి వేలాదిమంది కార్యకర్తలను తీసుకుని వచ్చి వందలాదిమందిని రన్‌వే మీదకే తీసుకుని వచ్చి బాజాభజంత్రీలు, పూలదండలు, డాన్సులు, నినాదాలతో రిసీవ్ చేసుకోబోయారు. వృత్తిరీత్యా పైలట్ అయిన రాజీవ్ రన్‌వే మీద చేస్తున్న యీ కోలాహలానికి, క్రమశిక్షణారాహిత్యానికి మండిపడ్డాడు.

అంజయ్యను పిలిచి ‘‘ఒక ఎంపీని రిసీవ్ చేసుకోవడానికి యింత ఆర్భాటమా? ఏమిటీ సంత?’’ అని ఇంగ్లీషులో కోప్పడ్డాడు. ‘ఏదో యిక్కడ రివాజు యిది. ఏమనుకోకుండా మా సత్కారాన్ని అందుకోండి.’ అంటూ అంజయ్య చెప్పబోయారు. అసలే ఇంగ్లీషు అంతంత మాత్రం. దానికి తోడు కంగారు. రాజీవ్‌కు కోపం వచ్చిందని తెలియగానే ఒక చేతిసైగతో ఆ హంగామాను ఆపేసి వుండవచ్చు. అది చేయకుండా పదేపదే దండాలు పెడుతూ బతిమాలడం ఫోటోగ్రాఫర్లకు పండగైంది. తన మాటలను, తన ఫీలింగులను పట్టించుకోకుండా పంతంతో అంజయ్య బాజాభజంత్రీలను కంటిన్యూ చేయించారని, కార్యకర్తలను అదుపు చేయించలేదని రాజీవ్‌కు కోపం వచ్చింది. విమానం దిగకుండా వెళ్లిపోతానని హెచ్చరించాడు. అయినా అంజయ్య బతిమాలుతూ కూర్చున్నారు తప్ప హంగామా ఆపించలేదు. దాంతో రాజీవ్ ఒక ప్రయివేటు విమానమెక్కి తిరుపతికి బయలుదేరారు. అంజయ్య తోడుగా వస్తానంటే వద్దన్నారు.

ఈ సంఘటనలో నాకు అంజయ్య వ్యక్తిత్వలోపమే కనబడుతుంది. మన గౌరవం మాట ఎలాగున్నా అతిథి యిష్టాయిష్టాలు కూడా గమనించాలి. నేను కాఫీ తాగను. ఎవరింటికైనా వెళితే ఆఫర్ చేస్తే అలవాటు లేదు వద్దని మర్యాదగానే చెపుతాను. వినకుండా పదేపదే కాస్త తాగండి, యివాళ ఒక్కసారీ తాగి చూడండి అని విసిగిస్తే చికాకు పడతాను. ఎవరైనా బలవంతంగా కప్పు నా నోటికి తీసుకుని వచ్చారనుకోండి (యిప్పటిదాకా అలా జరగలేదు) కప్పు నేలకేసి కొడతానేమో కూడా. అంజయ్య అక్కడదాకా తెచ్చుకున్నారంటే అది ఆయన మూర్ఖత్వమే అనుకోవాలి. అయితే తర్వాతి రోజుల్లో దీనిని తెలుగుజాతికి జరిగిన అవమానంగా చిత్రీకరించారు. ఎన్టీయార్‌పై పుస్తకం రాసిన కె చంద్రహాస్, కె లక్ష్మీనారాయణ ఆ ఫిబ్రవరి 2ను తెలుగుజాతి దుర్దినంగా వర్ణించారు. నేను కప్పు విసిరికొట్టిన (జరిగివుంటే) సంఘటనలో అవతలి వ్యక్తి తమిళుడనుకోండి, అది తమిళజాతికి దుర్దినం అయిపోతుందా?

అప్పటిదాకా అంజయ్యను ఒక బఫూన్‌గా, యాదగిరి అనే హెలికాప్టర్‌ను ఆటబొమ్మగా పెట్టుకుని తిరిగే పిల్లాడిలా కార్టూన్‌లలో చిత్రీకరిస్తూ వచ్చిన ‘‘ఈనాడు’’ సడన్‌గా ఆయనను ట్రాజిక్ హీరోను చేసేసింది. అంజయ్య చేతులు జోడించి బతిమాలే ఫోటోలను చిత్రమాలికగా వేసి కాంగ్రెసు అధిష్టానాన్ని అల్లరి పెట్టింది. రాజీవ్‌ను పొగరుబోతు యువరాజుగా చిత్రీకరించింది తప్ప అతని సెన్సిటివిటీని పట్టించుకోలేదు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. నిజానికి రాజీవ్ తిరుపతి నుంచి వెనక్కి వెళుతూ ఎయిర్‌పోర్టులో కలిసిన అంజయ్యను సముదాయించాడు కూడా. టిడిపి ఏర్పడిన తర్వాత ఐతే ఎయిర్‌పోర్ట్ సంఘటనను ఎంత హైప్ చేశారో చెప్పనక్కరలేదు. ఇందిరకు తెలుగుజాతి అంటే చులకన అన్నారు తప్ప, రన్‌వే మీదకి వందలాది కార్యకర్తలను తీసుకెళ్లడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించలేదు. అంజయ్యను సిఎంగా తీసేసిన తర్వాత కాంగ్రెసు ఆయన్ను 1983లో ఎంఎల్‌ఏగా చేసింది, 1984లో ఎంపీని చేసింది. తను ప్రధాని అయ్యాక రాజీవ్ గాంధీ ఆయన్ని కేంద్రమంత్రిని చేశారు.

అంజయ్య ముఖ్యమంత్రిగా వుండగానే దిల్లీలో చెవులు కొరికే పని సాగుతూనే వుంది. హైదరాబాదులో ఎన్ జనార్దన రెడ్డి, కోన ప్రభాకరరావు, నాదెండ్ల, 1981 మేలో కారు యాక్సిడెంటులో పోయేవరకు రాజారాం, అసమ్మతి కార్యకలాపాలు చేస్తూనే వున్నారు. కేంద్రంలో శివశంకర్, పివి సంగతి సరేసరి. వీళ్లందరూ కలిసి అంజయ్య ముఖ్యమంత్రి పదవికి అప్రతిష్ఠ తెచ్చారని చెప్తూన్నారు. ఈ సంఘటన జరగగానే అంజయ్యను మార్చేయమని పివి ఇందిరకు చెప్పారట. దాన్ని ప్రణబ్ ముఖర్జీ ద్వారా అమలు చేశారని ఇందిర సలహాదారుడు ఎంఎల్ ఫోతేదార్ చెప్పారని పైన చెప్పిన రచయితలు చంద్రహాస్, లక్ష్మీనారాయణ ఆ పుస్తకంలో రాశారు.

దాని ప్రకారం ప్రణబ్ ఫోతేదార్‌కు ఫోన్ చేసి ‘అంజయ్యను దిల్లీ రప్పించమని ఇందిర చెప్పారు. జనవరిలోనే రమ్మనమని అంజయ్యకు ఫోనే చేస్తే అసెంబ్లీ సమావేశాలున్నాయని సాకు చెప్పాడు. ఇప్పుడు ఇందిర మళ్లీ చెప్పారు.’ అన్నాడు. రాజీవ్ సంఘటన తర్వాత ఫోతేదార్ అంజయ్యకు ఫోన్ చేసి మీరు దిల్లీ వచ్చి, ప్రణబ్‌ను కలిసి, తర్వాత నన్ను కలవండి. అని చెప్పారు. అంజయ్య తన దగ్గరకు రాగానే ప్రణబ్ ‘మేడమ్ మీ దగ్గర్నుంచి రాజీనామా తీసుకోమన్నారు.’ అని చెప్పాడు. అంజయ్య అది నమ్మి, రాజీనామా పత్రం యిచ్చేసి, ఖిన్నుడై ఫోతేదార్‌ను కలవకుండానే హైదరాబాదు వెళ్లిపోయారు. ప్రణబ్ ఆ పత్రాన్ని ఇందిరకు పంపించి ఆమోదముద్ర వేయించుకున్నాడు. దీనిలో ఇందిర ప్రమేయం లేనేలేదు. రాజీనామా యిచ్చేసిన తర్వాత ఫోతేదార్ ఏమీ చేయలేకపోయాడు.

ఆ విధంగా అంజయ్య ఫిబ్రవరి 24న గద్దె దిగిపోయారు. అంజయ్య 16 నెలల పాలన ముగిసింది. భవనం, విజయభాస్కర  రెడ్డిల గురించి తర్వాతి వ్యాసంలో రాస్తాను

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2021)

mbsprasad@gmail.com