గట్టిగా మాట్లాడవయ్యా గురుమూర్తీ..!

తిరుపతి ఉప ఎన్నికల బరిలో అందరికంటే ఆయనే జూనియర్. అందులోనూ రాజకీయ అనుభవం పూర్తిగా లేదు. అటు చూస్తే కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఓ ప్రత్యర్థి, ఇటు చూస్తే మాజీ ఐఏఎస్…

తిరుపతి ఉప ఎన్నికల బరిలో అందరికంటే ఆయనే జూనియర్. అందులోనూ రాజకీయ అనుభవం పూర్తిగా లేదు. అటు చూస్తే కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఓ ప్రత్యర్థి, ఇటు చూస్తే మాజీ ఐఏఎస్ రత్నప్రభ మరో ప్రత్యర్థి, ఇంకోవైపు ఆరుసార్లు ఎంపీగా గెలిచిన చింతా మోహన్. వీరందరి మధ్యలో డాక్టర్ గురుమూర్తి అధికార వైసీపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు.

రాజకీయ ప్రసంగాలు, పంచ్ డైలాగులు అస్సలు అలవాటు లేదు. అందుకే ఇప్పటి వరకూ గురుమూర్తి మాటలు ఎక్కడా బలంగా వినిపించలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఆయన ప్రసంగాలేవీ లేవు. నామినేషన్ వేసే సందర్భంలో కూడా ఆయన గొంతు గట్టిగా పెగల్లేదు. చుట్టూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. అందరూ ఉండటంతో సహజంగానే గురుమూర్తి డంగైపోయారు. మీడియా ముందు మాట్లాడటానికి బాగా ఇబ్బంది పడ్డారు.

దీంతో పక్కనే ఉన్న మంత్రి పెద్దిరెడ్డి గురుమూర్తి భుజం తట్టారు. మాటి మాటికి గట్టిగా.. గట్టిగా అంటూ గురుమూర్తిలో చురుకు పుట్టించారు. గట్టిగా మాట్లాడవయ్యా గురుమూర్తీ అంటూ సున్నితంగా సూచించారు.

గురుమూర్తి మెతక మనిషి కాబట్టే.. ఆయనకు సపోర్ట్ గా మంత్రులందర్నీ మోహరించారు సీఎం జగన్. అభ్యర్థిని పక్కనపెట్టి.. సీఎం జగన్ పదే పదే సీనియర్లతో మంతనాలు జరిపేది కూడా అందుకేనంటారు. అందులోనూ తిరుపతి ఉప ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కనీసం 4లక్షల మెజార్టీ అంచనా వేస్తోంది.

గతంలో వచ్చిన 2లక్షల 28వేల మెజార్టీతో పోల్చి చూస్తే ఈ ఏడాది లక్షా 70వేల పైచిలుకు ఓట్లు ఎక్కువగా రావాలన్నమాట. అలా అయితేనే జనం వైసీపీతోనే ఉన్నారని, స్థానిక ఎన్నికలు గాలివాటం కాదని రుజువవుతుంది.

దీని కోసమే ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు మంత్రులు ఓ ఎమ్మెల్యేని అటాచ్ చేశారు. గురుమూర్తి గెలుపు బాధ్యత వారిపై పెట్టేశారు. వీరందరినీ కేంద్ర కార్యాలయం నుంచి వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షిస్తుంటారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున తొలిసారిగా పోటీ చేసిన నందిగం సురేష్ లాంటి వాళ్లు ఇప్పుడు రాజకీయాల్లో రాటుదేలారు. ప్రతిపక్షాలపై మాటల తూటాలు విసరడంలో సీనియర్లని మించిపోయారు.

రాబోయే రోజుల్లో గురుమూర్తి నోటి వెంట కూడా పవర్ ఫుల్ డైలాగులు వినపడతాయేమో చూడాలి. ఇప్పటి వరకూ జగన్ ని పొగుడుతూ మాట్లాడిన ఆయన.. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలపై విరుచుకుపడాల్సి అవసరం ఉంది.