భారతదేశంలో కూడా బాగా హిట్ అయిన “మన్ పసంద్” (1980- దేవ్ ఆనంద్, టీనా మునీమ్, గిరీష్ కర్నాడ్) కు ప్రేరణ అయిన ఇంగ్లీషు మ్యూజికల్ – “మై ఫెయిర్ లేడీ” (1964). పూలమ్మే ఒక పడుచు, ఆమెకు చదువు, సంస్కారం నేర్పి ఆమెతో ప్రేమలో పడే ముదురు బ్రహ్మచారి ఇంగ్లీషు ప్రొఫెసర్ చుట్టూ తిరిగే ఆ కథకు బెర్నార్డ్ షా రచించిన “పిగ్మాలియన్” నాటకం ఆధారం. చాలా ఏళ్లు స్టేజి మీద ప్రదర్శింప బడ్డాక అది తెర కెక్కినప్పుడు స్టేజి మీద ప్రొఫెసర్ హిగ్గిన్స్ పాత్ర ధరించిన రెక్స్ హారిసన్‌కే ఆ అవకాశం దక్కింది. పీటర్ ఓటూల్‌ని ఆ పాత్ర వేయమంటే అతను రెక్స్‌నే సూచించాడట. ‘‘క్లియోపాత్రా’’ (1963)లో క్లియోపాత్రాగా వేసిన ఎలిజబెత్ టేలర్ సరసన సీజర్ పాత్ర కూడా అత్యద్భుతంగా పోషించినా, రెక్స్ హారిసన్ అనగానే మనకు గుర్తుకువచ్చేది హిగ్గిన్స్‌గా అతను ఆడి, పాడిన ‘వై కాంట్ ఎ ఉమన్ బీ లైక్ ఎ మాన్?’ వంటి పాటలే!
కృష్ణ షా “షాలిమార్” (1978) సినిమాను హిందీ, ఇంగ్లీషుల్లో తీస్తూ విలన్ పాత్రకు భారతీయులకు కూడా బాగా పరిచితుడైన ఓ హాలీవుడ్ నటుడికై అన్వేషించినప్పుడు అతని దృష్టి పడినది రెక్స్ మీదనే!
కృష్ణ షా జన్మతః భారతీయుడే అయినా అమెరికాలో స్థిరపడి అక్కడి థియేటర్, సినిమా రంగాల్లో రాణించాడు. సినిమా డిస్ట్రిబ్యూషన్ ద్వారా నిర్మాణంలోకి వచ్చి ‘‘ద రివర్ నైజర్’’ (1976) అనే సినిమా తీశాడు. ఓ మాదిరిగా ఆడింది. అప్పుడు ఇండియన్, హాలీవుడ్ స్టార్లను కలగలిపి ‘‘షాలిమార్’’ తలపెట్టాడు. దాని ఇంగ్లీషు వెర్షన్ పేరు ‘‘రెయిడర్స్ ఆఫ్ ద సేక్రెడ్ స్టోన్’’. అంతర్జాతీయ నటీనటులకు అవకాశం ఉండేట్లా కథ రాసుకున్నాడు.
విలన్‌గా చివర్లో తేలే రెక్స్ హారిసన్ వద్ద ఒక అంతర్జాతీయ క్రిమినల్. అతని వద్ద షాలిమార్ పేరుతో ఖరీదైన వజ్రం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన స్త్రీ, పురుష చోరులను తనుండే లంకకు రప్పించి, కాన్సర్ కారణంగా తనకు ఆఖరి గడియలు వచ్చాయని, అందుకని ఎవరైనా సమర్థుణ్ని వారసుడిగా ఎంచుకుని, తన ఆస్తిపాస్తులను అప్పగిద్దామను కుంటున్నానని, వారెవరో తేల్చుకునేందుకు పోటీ పెట్టానని చెప్పాడు. తను ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన సెక్యూరిటీని ఛేదించి, షాలిమార్‌ను దొంగిలించడమే ఆ పోటీ అన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కో రోజు గడువు. ఫెయిలయితే చావే శిక్ష. శమ్మీ కపూర్, ఓపి రల్హన్, మరో యిద్దరు విదేశీయులకు ఆహ్వానం వెళ్లింది. ప్రేమ్ నాథ్‌కు వెళ్లిన ఆహ్వానాన్ని కొట్టేసి ఓ చిన్నపాటి దొంగ (ధర్మేంద్ర) కూడా ఆ లంకకు చేరాడు. అతనెవరో తెలిసిపోయినా, అతని చురుకుతనం చూసి ముచ్చటపడిన రెక్స్ అతన్నీ పోటీలో పాలు పంచుకోనిచ్చాడు. రెక్స్ వద్ద సెక్రటరీగా ఉన్న జీనత్ ధర్మేంద్రకు మాజీ ప్రియురాలు. ఇద్దరి మధ్య గొడవలొచ్చి విడిపోయారు.
కానీ షాలిమార్‌ను కొట్టేసే ప్రయత్నంలో రోజుకొకరు చొప్పున చచ్చిపోయారు. రల్హన్ భయపడి మధ్యలో మానేస్తానంటే రెక్స్ అతన్ని కాల్పించివేశాడు. నిజానికి రెక్స్‌కి కాన్సరూ లేదు, చావూ ముంచుకు రాలేదు. ఈ విధమైన ఆఫర్ యిచ్చి, తన నుండి వజ్రం కొట్టేయగల సమర్థులందరినీ చంపేద్దామని అతని ప్లాను. అయితే ధర్మేంద్ర మాత్రం కొట్టేయగలిగాడు. నిజానికి అతను సిబిఐ ఆఫీసరని నేరస్తులను పట్టుకోవడానికే వచ్చి చేరాడనీ తెలుస్తుంది. స్థానిక గిరిజనులు రెక్స్‌ను చంపేశారు. ధర్మేంద్ర, జీనత్ అపోహలు తొలగి ఒకటయ్యారు. ఈ సినిమా తారాగణంలో అరుణా ఇరానీ, షెట్టీ కూడా ఉన్నారు. జయమాలిని ఓ గిరిజన నృత్యం చేసింది.
ఈ కథను కృష్ణ షాయే రాసుకున్నాడు. భారతదేశంలోనే అత్యంత ఖరీదైన సినిమా అని పబ్లిసిటీ యిచ్చాడు. ఈ సినిమాలో పాత్రధారణకు అంగీకరించి, రెక్స్ అంగీకరించి షూటింగ్‌కై బెంగుళూరు వస్తున్నాడనగానే “షాలిమార్” యూనిట్ అంతా పొంగి పోయారు. “మై ఫెయిర్ లేడీ” చూసి హిగ్గిన్స్‌ను అభిమానించిన వారంతా నిజజీవితంలో రెక్స్ ఎలా ఉంటాడో చూసి విస్తుపోయారు. రెక్స్ పద్ధతే అంత. ఎంత ప్రతిభావంతుడైన నటుడో, అంతటి అహంభావి కూడా. వివాదాలలో చిక్కుకోవడంలో అతను వెనుకబడ లేదు. 1948లో లిల్లీ పామర్ అనే తారకు భర్తగా ఉండే రోజుల్లో (అతను మొత్తం ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు) క్యారల్ లాండిస్ అనే ఇంకో తారతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో అమెరికా వదిలి స్వదేశమైన ఇంగ్లాండుకు పారిపోయాడు. పారిపోయి అతను నటించిన సినిమా పేరు “ఎస్కేప్” (1948)!
1908 మార్చి 5 న ఇంగ్లండులో జన్మించిన రెక్స్ కామెడీ నాటకాలతో తన కెరియర్ ప్రారంభించాడు. లండన్ స్టేజిపై పేరు సంపాదించాక 1936కు బ్రాడ్వేలో నాటకాలాడసాగాడు. అంతకుముందు కొన్ని సినిమాలలో సహాయ పాత్రలు వేసినా హిచ్‌కాక్ టైపు థ్రిల్లర్ “నెక్స్ట్ ట్రెయిన్ టు మ్యూనిక్” (1940)తో అతనికి బాగా గుర్తింపు వచ్చింది. బెర్నార్డ్ షా రాసిన “మేజర్ బార్బరా”(1941) సినిమాలో వెండీ హిల్లర్‌తో కలిసి నటించాడు. ఇలా ఎన్నో చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలు ధరించాడు. “స్టెయిర్ కేస్’’ (1969) సినిమాలో రిచర్డ్ బర్టన్‌తో కలిసి హోమోగా కూడా నటించాడు. అయితే అన్నిటికన్నా తలమానికమైనది, అతనికి ఆస్కార్ తెచ్చిపెట్టినది “మై ఫెయిర్ లేడీ”యే!
రెక్స్‌కి కామెడీ అంటే ఇష్టమే కాదు, కామెడీ నటన గురించి “ఎ డామ్ సీరియస్ బిజినెస్” అనే పుస్తకం (అతను మరణించిన తర్వాత 1990లో విడుదలయింది) రాశాడు. “రెక్స్” అనే పేరుతో ఆత్మకథ కూడా రాసుకున్నాడు. బ్రిటిష్ ప్రభుత్వం అతని ప్రతిభను గుర్తించి 1989లో “సర్” బిరుదాన్ని ఇచ్చింది కూడా. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 1990 జూన్ 2న 82వ యేట మరణించాడు. ఇంతటి ఉజ్జ్వలమైన కెరియర్ కలిగిన రెక్స్ “షాలిమార్” సెట్స్‌పై ఎలా ప్రవర్తించాడో బనీ రూబెన్ అనే పాత్రికేయుడు గ్రంథస్తం చేశాడు. అంతకు ముందు సినిమా ప్రారంభ ముహూర్తం రోజున ఏం జరిగిందో చెప్పాలి.
1977 ఏప్రిల్ 7 ముహూర్తం వేళకు కృష్ణ షా ధర్మేంద్ర, జీనత్‌లతో పాటు జినా లోలోబ్రిగిడాను కూడా తెచ్చాడు. ఇటాలియన్ జాతీయురాలైన ఆమె 1950, 60లలో యూరోప్‌లోనే కాక, అమెరికాలో కూడా సెక్స్ సింబల్‌గా ప్రసిద్ధి కెక్కింది. ఇండియాలో కూడా హిట్ అయిన ‘‘కమ్ సెప్టెంబర్’’ (1961, హీరో రాక్ హడ్సన్) ద్వారా ఆమె యిక్కడ కూడా ప్రసిద్ధురాలు. ఆమె యితర హిట్ సినిమాల్లో ‘‘బీట్ ద డెవిల్’’ (1953, హీరో హంఫ్రీ బోగార్ట్), ‘‘ట్రెపీజ్’’ (1956, హీరో టోనీ కర్టిస్) ‘‘సోలమన్ అండ్ షెబా’’ (1959, హీరో యూల్ బ్రిన్నర్), ‘‘ఉమన్ ఆఫ్ స్ట్రా’ (1964, హీరో షాన్ కానరీ) ‘‘స్ట్రేంజ్ బెడ్‌ఫెలోస్’’ (1965, హీరో రాక్ హడ్సన్) యిత్యాదులున్నాయి. అయితే 1970 వచ్చేసరికి ఆమెకు 40 దాటాయి. గ్లామర్ వేషాలూ తగ్గాయి. ఫోటో జర్నలిజంలోకి దిగింది.
అలాటి తారను 50 ఏళ్ల వయసులో కృష్ణ షా తీసుకుని వచ్చాడు. సాధారణ పారితోషికానికే ఒప్పుకుంది. కానీ యిక్కడకు రాగానే మీడియా అంతా తన వెంట పడడంతో తను యిప్పటికీ పెద్ద తారనే అనే అభిప్రాయం ఆమెకు కలిగింది. ప్రజలంతా 16 ఏళ్ల తర్వాత కూడా ‘‘కమ్ సెప్టెంబరు’’ గురించి మాట్లాడుతున్నారు, పైగా తను ఇటాలియన్‌లో నటించిన ‘‘దట్ స్ప్లెండిడ్ నవంబర్’’ (1969) సినిమా ఇంగ్లీషు డబ్బింగ్ వెర్షన్ బొంబాయిలో థియేటర్లలో ఆడుతోంది. ఇంకేముంది, సెక్స్ స్టార్‌గా తన తడాఖా చూపించవచ్చనుకుంది. ముహూర్తం పూజకు తన వక్షసంపదను ప్రదర్శిస్తూ డ్రెస్ వేసుకుని వచ్చింది. 50 ఏళ్ల వయసులో యీమె యిలా తయారైతే 26 ఏళ్ల వయసు మాత్రమే ఉండి సెక్సప్పీల్ పుష్కలంగా ఉన్న జీనత్ అమాన్ ఊరుకుంటుందా? ఆమె కూడా యీమెను తలదన్నేలా వక్షోజ ప్రదర్శన చేసింది.
ఈ పోటాపోటీ ప్రదర్శనకు తోడు ఎవరు ముందు రావాలి, ఎవరు వెనక అనే దానిలో కూటా స్పర్ధ ఏర్పడింది. సినీతారల్లో ఎవరు లేటుగా వస్తే వారు పెద్ద తార అనే లెక్క ఉంది కదా. అది పట్టించుకోకుండా ప్రొడక్షన్ మేనేజర్ జినా అంతర్జాతీయ తార కాబట్టి, మన భారతీయ తారలు ముందుగా వచ్చి, లేటుగా వచ్చే ఆమెను రిసీవ్ చేసుకోవాలి అని ప్లాన్ చేశాడు. అందుకని ఆమెను ముహూర్తం టైముకి గంట లేటుగా తీసుకుని వద్దామనుకున్నాడు. కానీ జినా యింకా లేటు చేసి రెండు గంటల తర్వాత వచ్చింది. ఆమె రాగానే మీడియా అంతా ఆమె డ్రస్ చూసి,మురిసి, కెమెరాలు క్లిక్ మనిపించారు. ఇదంతా ముందే ఊహించిన జీనత్ ఆమె వచ్చిన పావు గంట తర్వాత యింకా అదరగొట్టే డ్రస్సు వేసుకుని వచ్చింది. మీడియా కెమెరాలన్నీ ఆమె వైపు తిరిగాయి. ఇది జినాను మండించిందట.
ఇలా పెట్టిన ముహూర్తానికి సినిమా ప్రారంభం కాలేదు. క్లాప్ కొట్టడానికి వచ్చిన దిలీప్ కుమార్ విసుగెత్తి చల్లగా జారుకున్నాడు. తారామణుల మధ్య యీ పోటీని ‘‘ద బాటిల్ ఆఫ్ ద బూబ్స్’’ పేరుతో బనీ రూబెన్ కథనంగా రాశాడు. దీని తర్వాత జినా సినిమాలోంచి తప్పుకుంది. జీనత్‌తో స్పర్ధే కారణమని కొన్ని పత్రికలు రాశాయి. ధర్మేంద్ర వాళ్ల మధ్య ఘర్షణ జరగలేదని క్లారిఫికేషన్ యిచ్చాడు. తన ఫాలోయింగ్ చూసి మతి పోగొట్టుకున్న జినా, బహుశా హెచ్చు పారితోషికం కావాలని కృష్ణ షాను అడిగి ఉంటుంది. అతను కుదరదని ఉంటాడు.
ఆమె స్థానంలో సిల్వియా మైల్స్ అనే అమెరికన్ తారామణిని తెచ్చాడు. ఆమె జినా కంటె మూడేళ్లు పెద్దది. వయసు 53. ‘‘మిడ్‌నైట్ కౌబాయ్’’ (1969)కి సపోర్టింగ్ నటిగా ఆస్కార్ ఎవార్డు గెలుచుకుంది. ‘‘ఫేర్‌వెల్, మై లవ్‌లీ’’ (1975) యిత్యాది సినిమాల్లో నటించింది. ఒక పాత్రకు పీటర్ ఉస్తినోవ్‌ను తెద్దామనుకున్నాడు కానీ కుదరక, అమెరికన్ నటుడు జాన్ సాగ్జన్‌ను తెచ్చాడు. అతను సస్పెన్స్ సినిమాల్లో వేషాల ద్వారా ప్రసిద్ధుడు. బ్రూస్ లీతో పాటు ‘‘ఎంటర్ ద డ్రాగన్’’ (1973)లో నటించి భారతీయులకు కూడా బాగా తెలిశాడు. వీరందరితో బెంగుళూరులో షూటింగు ప్రారంభమైంది.
రెక్స్‌కి తను బ్రిటిష్ జాతీయుడనన్న అహంకారం బాగా ఉంది. చుట్టూ ఉన్న అందరిపై కస్సుబుస్సు లాడేవాడట. ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడలేని వారంటే చిన్న చూపు. శమ్మీ కపూర్, జీనత్ ఉచ్చారణలపై అతనికి ఫిర్యాదు లేదు. ధర్మేంద్ర ఇంగ్లీషంటనే చికాకు పడేవాడు. పాపం ధర్మేంద్రకు ఇంగ్లీషు అంత బాగా రాదు. షూటింగు టైములో వీపు నొప్పితో బాధపడుతూ కూడా ఇంగ్లీషు పాఠాలు నేర్చుకునే వాడు. ఆ సినిమాలో ఓ హాస్య పాత్ర పోషించిన ప్రఖ్యాత నిర్మాత-దర్శకుడు ఓ.పి.రల్హన్‌దీ అదే పరిస్థితి. షూటింగు ప్రారంభం కావడానికి ముందే కృష్ణ షా వాళ్లిద్దరికీ బొంబాయిలో పెర్ల్ పాదమ్‌సీ చేత తర్ఫీదు యిప్పించాడు. బెంగుళూరులో షూటింగు జరిగే రోజుల్లో బెహరోజ్ మోదీ అనే ఆమెను ట్యూటరుగా ఏర్పాటు చేశాడు. షూటింగు ముగిశాక ఎంత రాత్రయినా సరే, ధర్మేంద్ర, రల్హన్ యిద్దరూ రల్హన్ గదిలో బెహరోజ్ చేత డైలాగులు చెప్పించుకుని, ఉర్దూ లిపిలో (ఇద్దరూ పంజాబీలే) ఇంగ్లీషు డైలాగులు రాసుకుని ఆమెకు అప్పచెప్పేవారు. ఇదంతా ఫారినర్స్‌కి వేళాకోళంగా ఉండేది. ముఖ్యంగా రెక్స్‌కి!
ఓ రోజు కృష్ణ షాను పిలిచి “ఇతని ఇంగ్లీషు డైలాగులు యాసగా ఉన్నాయి. డబ్ చేయిస్తావు కదా!” అన్నాడు. “ఏం అక్కర్లేదు. అమెరికన్లకు యాస అంటే చాలా ఇష్టం. సోఫియా లోరెన్, జినా లోలోబ్రిగిడా ఇటాలియన్ యాసతోనే మాట్లాడి హిట్ అయ్యారు. వీళ్లదీ అంతే!” అన్నాడు కృష్ణ షా. రెక్స్ మొహం మాడ్చుకున్నాడు. ఈ ఇంగ్లీషు గొడవ చాలదనట్టు షూటింగు మొదలయిన వారం రోజుల్లోనే ధర్మేంద్రకు జలుబు పట్టుకుంది. పాపం ముక్కు ఎగబీలుస్తూ ఉండేవాడు. రెక్స్ లాటి ‘ట్రూ బ్రిటిష్’కి ఇటువంటివి ఎలా ఉంటాయో సులభంగా ఊహించవచ్చు. ‘నా కంటికి కనబడకుండా దూరంగా ఫో’ అని ఆర్డరు వేసేవాడు.
ధర్మేంద్రకు ఒళ్లు మండిపోయి పంజాబీలో తిట్లు లంకించుకునేవాడు (వాటికి ఏ ప్రైవేటు క్లాసులూ అఖ్కర్లేదు. పంజాబీ అతని మాతృభాష!) సెట్ మీద ఉన్న ఇండియన్లు నవ్వలేక, నవ్వు ఆపుకోలేక చచ్చేవారు! ముక్తాయింపు ఏమిటంటే- ధర్మేంద్ర, జీనత్ మొహాలు, ఆర్ డి బర్మన్ మ్యూజిక్ కారణంగా హిందీ ‘‘షాలిమార్’’ థియేటర్లలో ఏదో ఒక మాదిరిగా యీడ్చినా, ఇంగ్లీషు వెర్షన్ మాత్రం ఘోరాతిఘోరంగా ఫ్లాపయింది! రెక్స్ హారిసన్ పెర్‌ఫెక్ట్ ఇంగ్లీషు ఉచ్చారణ సినిమాను కాపాడలేక పోయింది. (ఫోటో – తొలి షాట్‌కు క్లాప్ యిస్తున్న జినా, పక్కన జీనత్, ఇన్‌సెట్‌లో రెక్స్, ధర్మేంద్ర)
– ఎమ్బీయస్ ప్రసాద్
Manaku yendhuku
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Guru Garu, Arab Shekula ontela meeda okati vadalandi sir,
Meeru emina cheppandi guru garu meekee-madhyana chadastham baga perigipoyindi saar
Mare
వీళ్ళకి కూడా ఉచ్చారణ చేతకాదా
Guru Garu, Magolia rachayathalu meeda okati vadalandi saar,