ఎమ్బీయస్‌ – ఆప్‌ వాగ్దానాలు నీటిమూటలా?

ఆప్‌ అధికారం స్వీకరిస్తూనే, అసెంబ్లీలో విశ్వాసతీర్మానం నెగ్గకుండానే రెండు వాగ్దానాలు నెరవేర్చేసింది. నెలకు 20 వేల లీటర్ల లోపు వాడేవారికి నీరు ఉచితం, నెలకు 400 యూనిట్ల కంటె తక్కువ వాడే వారికి సగం…

ఆప్‌ అధికారం స్వీకరిస్తూనే, అసెంబ్లీలో విశ్వాసతీర్మానం నెగ్గకుండానే రెండు వాగ్దానాలు నెరవేర్చేసింది. నెలకు 20 వేల లీటర్ల లోపు వాడేవారికి నీరు ఉచితం, నెలకు 400 యూనిట్ల కంటె తక్కువ వాడే వారికి సగం వెలకే విద్యుత్‌ సరఫరా అంటూ ప్రకటనలు చేసేసింది. రాజకీయనాయకులను తెగ విమర్శించి అధికారంలోకి వచ్చిన అరవింద్‌ యిప్పుడు వాళ్లలాగే చేస్తున్నారు. ఈ పథకాలకు డబ్బెక్కడ? అనేది చెప్పకుండానే ప్రకటనలు చేసేశారు. ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ వారు ఫిబ్రవరి నెలాఖరుకు 19 వేల కోట్ల రూ.ల రెవెన్యూ లోటు వుంటుందని చెప్పినా అతను ఖాతరు చేయలేదు. అరవింద్‌లో యీ మొండితనం చిన్నప్పటినుండీ వుందా? అని కొందరు పాత్రికేయులు అతని బాల్యం గురించి తవ్వారు. ఆ వివరాలు చూడబోతే – 

అరవింద్‌ తండ్రి గోవింద రామ్‌ హరియాణాలోని హిసార్‌ పట్టణంలో జిందాల్‌ స్ట్రిప్స్‌లో ఎలక్ట్రికల్‌ యింజనియర్‌గా పనిచేసేవారు.  తల్లి గీతా దేవి. అరవింద్‌ 1968 ఆగస్టు 16న కృష్ణాష్టమినాడు పుట్టారు. తాత, నాయనమ్మ కృష్ణుడి పేరు పెట్టమన్నారు కానీ, తండ్రి అరవింద్‌ అని పెట్టారు. కొన్నాళ్లకు రంజన అనే చెల్లెలు, మనోజ్‌ అనే తమ్ముడు పుట్టారు. రంజన డాక్టరయి హరిద్వార్‌లో బిఎచ్‌ఇఎల్‌లో పనిచేస్తోంది. మనోజ్‌ పుణెలో ఐబిఎమ్‌లో సాఫ్ట్‌వేర్‌ యింజనియర్‌గా పని చేస్తున్నాడు. గోవిందరామ్‌ది మధ్యతరగతి జీవనం. కంపెనీ క్వార్టర్సులో వుండేవారు. స్కూటర్‌పై తిరిగేవారు. ఇంట్లో పూజాపునస్కారాలు బాగా జరిగేవి. అరవింద్‌ కూడా రోజూ పొద్దున్నే ప్రార్థన చేసేవాడు. అరవింద్‌ విద్యాభ్యాసం ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో సాగింది. క్లాసులో బుద్ధిగా వుండేవాడు. ఫుట్‌బాల్‌, క్రికెట్‌ ఆడటం కంటె చదరంగం ఆడడం, పుస్తకపఠనంపై ఎక్కువ ఆసక్తి చూపేవాడు. స్కెచ్‌బుక్‌, పెన్సిల్‌ చేతబట్టి కనబడినదల్లా బొమ్మలు గీసేవాడు. కజిన్స్‌ చాలామంది వుండేవారు. అతను వాళ్లకి లీడరేమీ కాదు. 'మందకొడిగానూ వుండేవాడు కాడు, అలా అని హైపర్‌యాక్టివ్‌గానూ వుండేవాడు కాడు' అంటారు అతని కజిన్స్‌. 

ఏదైనా చేస్తానని ఒప్పుకుంటే మాత్రం వదిలిపెట్టేరకం కాదని అతని స్కూలుమేట్స్‌ అంటారు. ఓ సారి అతను ఇంటర్‌-స్కూల్‌ డిబేట్‌లో తన స్కూలు తరఫున చర్చలో పాల్గొనాలి. విపరీతమైన చలి, జ్వరం. ఇక అతను రాడనే అందరూ అనుకున్నారు. కానీ కంబళీ కప్పుకుని తండ్రి స్కూటర్‌ వెనక్కాల ఎక్కి అతను వేదికకు చేరుకున్నాడు. 'నన్ను నమ్మి పంపించిన స్కూలుకి చెడ్డపేరు రాదూ..' అన్నాడట. మొన్న 102 డిగ్రీల జ్వరం వున్నా యింటి దగ్గర విద్యుత్‌ అధికారులతో సమావేశమై పథకాన్ని ప్రకటించాడుగా! అరవింద్‌ను వక్తగా తీర్చిదిద్దిన ఘనత మిసెస్‌ చోప్డా అనే టీచరుది. ఆవిడ హిసార్‌ కాంపస్‌ స్కూలులో బయాలజీ టీచరు. వేదిక ఎక్కి మాట్లాడమని ప్రోత్సహించడమే కాదు, టెన్త్‌లో వుండగా ఓ నాటకంలో పాత్ర ధరించమని పట్టుబట్టింది. నాటకాలపై అప్పుడు పుట్టిన ఆసక్తి ఐఐటి రోజులదాకా సాగింది. ఖడగ్‌పూర్‌ ఐఐటి చివరి సంవత్సరంలో హిందీ డ్రామా సొసయిటీకి అతను అధ్యకక్షుడిగా వున్నాడు. ఐఐటిలో అతని సహాధ్యాయులు చెప్పినదాని ప్రకారం అరవింద్‌ రాజకీయ అవగాహన ఆ రోజుల్లోనే రూపుదిద్దుకుంది. తక్కిన ఐఐటి కుర్రాళ్లందరూ విదేశాల్లో అవకాశాల గురించి చర్చిస్తూ వుంటే యితను మాత్రం దేశానికి ఏం చేయాలి? అని వాదిస్తూండేవాడట. అప్పటికే మంచి వాగ్ధాటి, ఆత్మవిశ్వాసం సమకూరాయి.

ఆ రోజుల్లో అరవింద్‌ విపి సింగ్‌ను అభిమానించేవాడు. బోఫోర్స్‌ స్కామ్‌ను బయటపెట్టిన విధానం, మండల్‌ కమిషన్‌ను అమలు చేయడం అరవింద్‌ను ఉత్తేజపరచాయి. రామ మందిరం వివాదం లేవనెత్తి బాబ్రీ మసీదు కూల్చివేతకు కారకులైన బిజెపి నాయకులంటే వ్యతిరేకత వుండేది. కాలేజీ చదువు అయిపోయాక తను వేసుకున్న దుస్తులు తప్ప తక్కినవన్నీ దానం యిచ్చేసి, యింటికి వచ్చాడు. అతనికి జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్స్‌లో వుద్యోగం వచ్చింది. అక్కడ వుండగానే కలకత్తా వెళ్లి మదర్‌ థెరిసాను కలిసి 'మీతో పని చేసే అవకాశం యివ్వండి' అని అడిగాడు. 'కాళీఘాట్‌ ఆశ్రమంలో పని చేయి' అందామె. రెండు నెలలు పని చేశాడు. తిరిగి వచ్చి తన కంపెనీ వాళ్లను ''నన్ను మీ సోషల్‌ వెల్‌ఫేర్‌ డిపార్టుమెంటుకు బదిలీ చేయండి. సంఘసేవ చేస్తాను'' అని అడిగాడు. ''నీ పోస్టింగ్‌ యింజనియర్‌గా యిచ్చాం కాబట్టి అది కుదరదు'' అన్నారు వాళ్లు. ఇక యీ ఉద్యోగం వదిలేద్దామనుకుని సర్వీసెస్‌కు ప్రిపేర్‌ అయ్యాడు. మొదటి ప్రయత్నంలోనే ఐఆర్‌ఎస్‌ (ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌)కు ఎంపికయ్యాడు. ఐయేయస్‌ అయితే ప్రజాసేవ బాగా చేయవచ్చనుకుని, మళ్లీ ప్రయత్నించాడు. అప్పుడు కూడా ఐఆర్‌ఎస్‌ రావడంతో దానికే సిద్ధపడ్డాడు. ఆ సందర్భంగా 1993లో మసూరీలో ఎకాడమీలో తర్ఫీదు పొందే రోజుల్లో తనతో పాటు ట్రెయినింగ్‌ పొందుతున్న సునీతను యిష్టపడ్డాడు. నాగపూర్‌లో డైరక్ట్‌ టాక్సెస్‌ ఎకాడెమీలో 15 నెలల ఇండక్షన్‌ ప్రోగ్రాంలో వారి స్నేహం దృఢపడింది. 1994లో పెళ్లాడారు. ఇద్దరికీ ఢిల్లీలోనే పోస్టింగు వచ్చింది. 

ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖలో పనిచేస్తూండగానే 'పరివర్తన్‌' అనే సేవాసంస్థ ప్రారంభించి తన శాఖపైనే ఒత్తిడి తెచ్చి నిజాయితీగా పన్నుల మదింపు చేయించడం, అధికంగా కట్టిన పన్ను వాపసు యివ్వడం వంటివి చేయించాడు. ఈ సంస్థ ప్రారంభించడానికి తమ్ముడు మనోజ్‌ 50 వేలు, మేనమామ మరో 50 వేలు విరాళం యిచ్చారు. ఈ విజయంతో అరవింద్‌ సమాచారహక్కుపై దృష్టి సారించాడు. తర్వాత కొన్నాళ్లకు అతనికి అనిపించింది – 'సమాచారం తెలుసుకుని ఏం చేస్తాం? అవినీతిపరులకు శిక్ష వేయించే అధికారం లేదు కదా' అని. అక్కణ్నుంచి జనలోక్‌పాల్‌ ఉద్యమం, ఆప్‌ పార్టీ ఆవిర్భావం యిలా సాగింది అతని ప్రస్థానం. ఇప్పుడు ముఖ్యమంత్రి కాగానే చేపట్టినవి యివి!
సగం రేటు విద్యుత్‌ పథకం వలన కలిగే లోటు ఎలా తీర్చగలం అని అధికారులు ప్రశ్నిస్తూ వుంటే 'ఆ ఏముంది? మిగులు విద్యుత్తు వున్న రాష్ట్రాల నుండి తక్కువ రేట్లో కొనేసి విద్యుత్‌ లోటు వున్న రాష్ట్రాలకు రెట్టింపు రేటుకి అమ్మేసి బోల్డు ఆర్జించేస్తాం' అంటున్నారు అరవింద్‌ సహచరులు. ఇదంతా యీజీయే అయితే ఆ పని ఆ మిగులు విద్యుత్తు రాష్ట్రాలే డైరక్టుగా చేసుకోవచ్చుగా! మధ్యలో వీళ్లకెందుకు లాభం చేకూర్చడం? అనేక రాష్ట్రాలు విద్యుత్తు కొనేస్తాయి తప్ప డబ్బులు బకాయి పెట్టేస్తాయి. మరి ఆప్‌ యీ లోటును ఎలా పూరిస్తుందో తెలియదు. 

ప్రయివేటు డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలను కాగ్‌ చేత ఆడిట్‌ చేయిస్తామని అరవింద్‌ అంటున్నారు. ప్రయివేటు సంస్థలను కాగ్‌ ఎలా ఆడిట్‌ చేస్తుంది అంటూ ఢిల్లీ హైకోర్టు గతంలోనే ఒప్పుకోలేదు. అయినా కాగ్‌ ఆడిట్‌ చేస్తే ఏమవుతుంది? డబ్బులు వెనక్కి వస్తాయా? మహా అయితే కొందరికి శిక్షలు పడతాయి తప్ప ఆదాయం పెరగదు కదా. 'లైసెన్సులు రద్దు చేస్తాం, ట్రాన్స్‌మిషన్‌ (సరఫరా) నష్టాలు నివారిస్తాం' అంటున్నారు కూడా. లైసెన్సులు రద్దు చేస్తే కోర్టుకెళతారు. లిటిగేషన్‌ ఏళ్లూ, పూళ్లూ పడుతుంది. ఇక మన రాష్ట్రంలో సరఫరా నష్టాలను అరికట్టడం గురించి నేను చిన్నప్పణ్నుంచి వింటున్నాను. అలాగే ఢిల్లీ జలమండలి వాళ్లు కూడా 20 వేల లీటర్ల గురించి మొత్తుకున్నారట. 'ఇది యిచ్చినా బోర్డు లాభాల్లో వుండేటట్టు మీరంతా కృషి చేయాలి' అని చెప్పాడు అరవింద్‌. అధికారంలోకి వచ్చి లోపాలను అరికట్టి, పనితనం మెరుగుపరచి, యిలాటి పథకాలు ప్రవేశపెట్టడం సవ్యమైన దారి. ఈయన సింహాసనం అధిష్టించాడు కదాని అధికారులందరూ బ్రహ్మాండంగా, సమర్థవంతంగా పని చేస్తారన్న గ్యారంటీ వుందా? మొదటి రోజు మంత్రి శిశోడియా టైముకి సెక్రటేరియట్‌కు వచ్చి కుర్చీలో కూర్చుంటే ఉద్యోగులెవరూ కనబడలేదు. వాళ్లెందుకు మారతారు? వాళ్లను మార్చడం, వాళ్లలో అవినీతిని రూపుమాపడం – యివన్నీ రాత్రికి రాత్రి జరిగేపనులు కావు. 

జనతా పార్టీ అధికారంలోకి వచ్చినపుడు, ఎన్టీయార్‌ వచ్చినపుడు యిదే వరస చూశాను. ఎన్టీయార్‌ ఐతే మరీను, ప్రజాకర్షక పథకాలు చాలా మొదలుపెట్టారు. డబ్బెక్కడిదంటే 'అవినీతిపరుల పొట్ట బద్దలు కొడితే డబ్బులు అవే రాల్తాయి బ్రదర్‌' అనేవారు. ఎవరి పొట్ట బద్దలు కాలేదు. కాలక్రమేణా, టిడిపి మంత్రులపైనే అవినీతి ఆరోపణలు వచ్చాయి. మరి కొన్నాళ్లకు ఎన్టీయార్‌ పైనే వచ్చాయి. ఇప్పుడు ఆప్‌ యిదే భాష మాట్లాడుతోంది. ఆప్‌ ధీమా ఏమిటి? కాంగ్రెసు ఎలాగూ తమ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తుంది, అప్పుడు జవాబు చెప్పుకోవలసిన అవసరం వుండదు. మమ్మల్ని కొనసాగనిస్తే తప్పకుండా అమలు చేసేవాళ్లం అంటూ ఎన్నికలకు వెళ్లవచ్చు. తాము ఓడిపోయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే యీ పథకాలను రద్దు చేసే సాహసం చేయదు. వాళ్ల మెడకు యిది గుదిబండగా తయారవుతుంది. తామే నెగ్గితే యీ పథకాలకు కేంద్రం నిధులు యివ్వాలి అంటూ యాగీ చేయవచ్చు. ఆప్‌ యివాళ చేసినదాని వలన వచ్చే పెద్ద తలకాయనొప్పి ఏమిటంటే అన్ని బస్తీలలోనూ యీ రకమైన డిమాండు వస్తుంది. ప్రతి పార్టీ మ్యానిఫెస్టోలో యివి చేర్చకతప్పదు. ఒక ఆర్నెల్లు రాజ్యం చేసి, నిధులు మిగిల్చి, వాటితో యీ పథకాలు అమలు చేసి చూపించి వుంటే యివి ఆచరణయోగ్యమైన పథకాలన్న నమ్మకం చిక్కేది. అదేమీ లేకుండా బాధ్యతారహితంగా ఆప్‌ పథకాలు ప్రకటించేసి, అన్ని రాష్ట్రప్రభుత్వాలకు చిక్కులు తెచ్చిపెట్టింది. 

అసలు యిలాటి సంక్షేమ పథకాలు ఓట్లు రాలుస్తాయా అన్న దానిపై ఆర్థిక, రాజకీయవేత్తల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. 2009 లో యుపిఏ రెండోసారి అధికారంలోకి రావడానికి కారణం వ్యవసాయ ఋణాల మాఫీ, ఎన్‌రేగా (ఉపాధి హామీ పథకం) అనుకున్నారు. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికలనే పరిగణనలోకి తీసుకుంటే – ఢిల్లీలో భాగీదారీ వంటి స్కీము పెట్టినా కాంగ్రెసు ఓడిపోయింది. రాజస్థాన్‌లో ఉచిత మెడికల్‌ చెకప్‌, మందులు, పెన్షన్లు, మహిళలకు బస్సు చార్జీల్లో తగ్గింపు.. వంటి అనేక పథకాలు పెట్టినా ఓడిపోయింది. తమిళనాడులో రాజకీయపార్టీలు చూపే ఔదార్యానికి హద్దే లేదు. కలర్‌ టీవీల నుండి అన్నీ ఉచితమే. అయినా అధికారంలో వున్న పార్టీ ఓడిపోవడం జరుగుతోంది. ఎందువలన అంటే పథకం ప్రకటించగానే సరి కాదు, దాని అమలు ఎలా, ఎప్పుడు జరుగుతోంది అన్నది ముఖ్యం. రాజస్థాన్‌లో అశోక్‌ గెహలోత్‌ చాలా ఎన్నికలకు కాస్త ముందే పథకాలు మొదలుపెట్టారు. దానివలన వాటి ఫలాలు ప్రజలకు సరిగ్గా అందలేదు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌ చౌహాన్‌ ఎన్‌రేగా పథకాన్ని 100 రోజుల నుండి 150 రోజులకు విస్తరించి లబ్ధి పొందారు. ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌ సింగ్‌ ప్రసూతి సెలవు ఒక నెల పెంచి రాజకీయంగా లాభపడ్డాడు. 

సంక్షేమపథకాలు ఉపాధిని కల్పించి తమను దారిద్య్రం నుండి బయటకు లాగేట్టు వుంటే ప్రజలు ఆదరిస్తున్నారు. తమను ఎల్లకాలం దరిద్రులుగా వుంచే స్కీములు రూపొందించిన వారికి ఓట్లు వేయడం లేదు. వారికి కావలసినది జీవనోపాధి. తమ ప్రాంతాల్లో పరిశ్రమలు బాగా పెరిగి తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు అవకాశం కలిగితే చాలు. దానికి బదులుగా ఎన్ని పథకాలు పెట్టినా వారికి రుచించటం లేదు. ఎందుకంటే పథకాల అమలు రాష్ట్రప్రభుత్వపు సామర్థ్యంపై ఆధారపడి వుంది. కేంద్ర పథకాలను యథాతథంగా అమలు చేయకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకుంటేనే అవి ఫలాల నిస్తాయి. అధికార వికేంద్రీకరణ జరిగితేనే అట్టడుగు స్థాయిలో వున్న వ్యక్తులు లాభపడతారు. ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో జిల్లాలో ఒక్కో పరిస్థితి వుంటుంది కాబట్టే ఫలితాల విషయం అన్నిటా సమానంగా లేదు. ఇప్పుడు ఆప్‌ ప్రకటించిన రెండు పథకాలు – ఉత్పాదకతను పెంచేవి కాదు, ఆర్థికసామర్థ్యాన్ని పెంచేవి కావు. పైగా వాటిని కల్పించే ఆర్థిక పటుత్వాన్ని రాష్ట్రప్రభుత్వానికి లేకుండా చేసేవి! వీటిని పూర్తిగా ప్రజాకర్షక పథకాలనే అనాలి. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2014)

[email protected]