ఎమ్బీయస్‌: ఆంధ్రులకు మసి పులమడం అన్యాయం- 4

గవర్నరుకు అధికారాలు అప్పగిస్తే సమస్యలన్నీ తీరిపోతాయని బాబు ఎలా అనుకుంటున్నారో తెలియదు. హైదరాబాదు వరకే కదా, గవర్నరు పరిధి! రేపు వేరెవరైనా ఎమ్మెల్యే 'మెదక్‌ జిల్లాలో నా ఫార్మ్‌హౌస్‌లో కలిసి డబ్బులివ్వండి' అని స్టింగ్‌…

గవర్నరుకు అధికారాలు అప్పగిస్తే సమస్యలన్నీ తీరిపోతాయని బాబు ఎలా అనుకుంటున్నారో తెలియదు. హైదరాబాదు వరకే కదా, గవర్నరు పరిధి! రేపు వేరెవరైనా ఎమ్మెల్యే 'మెదక్‌ జిల్లాలో నా ఫార్మ్‌హౌస్‌లో కలిసి డబ్బులివ్వండి' అని స్టింగ్‌ ఆపరేషన్‌ చేయిస్తే, అప్పుడు గవర్నరు ఏం చేయగలడు? ఆపించగలడా? అర్జంటుగా సెక్షన్‌ 8 అమలు చేయాలంటూ కన్విన్స్‌ చేయడానికి బాబు తన లేఖలో వింత వింత వాదనలు చేశారు. 'కెసియార్‌, ఉద్యోగులు గత ఏడాది కాలంగా ఆంధ్రప్రాంత ప్రజలను దొంగలు, దోపిడీదారులుగా సంబోధిస్తూ అవమానిస్తున్నారు' అని రాశారు. గత ఏడాదిగానా!? పార్టీ పెట్టినప్పటినుంచీ కెసియార్‌ అదే ప్రేలాపన. తెలుగు భాషలో వున్న తిట్లన్నీ ఆంధ్రులను సంబోధించి అనేశారు. రాక్షస జాతి అన్నారు, తెలుగుతల్లి దయ్యం అన్నారు, ఒకటా రెండా గుర్తుండడానికి! అలాటి కెసియార్‌తోనే 2009లో బాబుగారు పొత్తు పెట్టుకున్నారు. తమది మహా కూటమి అని చెప్పుకున్నారు. ఇప్పుడు అర్జంటుగా యీ తిట్లు అక్కరకు వచ్చాయి. 

లేఖలో రాసినట్టు లేదు కానీ, టిడిపి నాయకుల ప్రకటనల్లో అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాల కూల్చివేత, నాగార్జున కన్వెన్షన్‌ సెంటర్‌ వ్యవహారం – వీటన్నిటినీ  ఆంధ్రులపై దాడిగా, సినిమావారిపై దాడిగా చూపారు. అక్రమ కట్టడాలను ఆంధ్ర పేరుతో ఎలా సమర్థిస్తారు? అక్రమ కట్టడాలు అక్కడే వున్నాయా? పాత బస్తీలో లేవా? మరో చోట లేవా అని ప్రశ్నించవచ్చు. కానీ అయ్యప్ప సొసైటీలోవి ఆంధ్రుల కట్టడాలు కాబట్టి అక్రమమైనా కూల్చకూడదని ఎవరైనా వాదించగలరా? నాగార్జున చెఱువు భూమిని కబ్జా చేస్తే దాన్ని ప్రభుత్వం స్వాధీన పరచుకుంటే అది ఆంధ్రులపై దాడిలా ఎలా చెప్పగలరు? పద్మాలయా అక్రమాలకు రక్షణ కల్పిస్తే, అది ఆంధ్రులను రక్షించినట్లా? అయినా అయ్యప్ప సొసైటీలో కూల్చివేసినవన్నీ ఆంధ్రులవే తప్ప యితరులవి లేవు అని ఖండితంగా ఎవరైనా చెప్పగలరా? అక్రమాలకు ప్రాంతీయత పులమడం చాలా తప్పు. ఈ పని తెలంగాణావాదులందరూ చేశారు. ఆంధ్ర మూలాలున్న ఆక్రమణదారులను కొందరిని ఎత్తి చూపి ఆంధ్రులందరూ కబ్జాదారులే అని చిత్రీకరించారు. మిషన్‌ కాకతీయా సందర్భంగా చెఱువులను ఆక్రమించిన వారి జాబితా తయారుచేస్తే ఆక్రమణదారుల ప్రాంతీయత ఏమిటో తెలుస్తుంది. తెలంగాణ వాదులకు ధైర్యం వుంటే ఆ జాబితాను ప్రకటించాలి.  

సినిమావాళ్లు భయభ్రాంతులకు గురవుతున్నారు, రిలీజుకు ముందు తెరాసవారికి మామూళ్లు చెల్లించుకుంటే తప్ప సినిమా విడుదల చేసుకునే పరిస్థితి లేదు అని కూడా టిడిపి నాయకులు అంటున్నారు. ఈ ముక్క సినిమావాళ్లు అనటం లేదు. పైకి అనడానికి కూడా భయపడుతున్నారని అనుకుందాం, ఆ పరిస్థితుల్లో యిక్కడ నుంచి తరలించే కార్యక్రమం చిన్నగానైనా ప్రారంభించాలి. ఆ దాఖలాలు ఏమీ కనబడటం లేదు. అనేక సినిమాలకు పెద్ద పెద్ద స్టూడియోలు అక్కరలేదు, చిన్నపాటి యిళ్లు, సెట్టింగులు చాలు. టీవీ సీరియల్స్‌కు యింకా చిన్నవి చాలు. ఏవీ హైదరాబాదు నుంచి కదలి ఆంధ్రకు వెళ్లినట్లు లేదు. వెళ్లిపోతూంటే తెరాస ప్రభుత్వం పట్టుకుని ఆపలేదు కదా! తెలంగాణ నిర్మాతల సంఘం, నటీనట సంఘం.. యిలా విభేదాలు వస్తున్నమాట వాస్తవం, అయినా అవి తీవ్రస్థాయికి చేరి, సినిమా పరిశ్రమ భయపడే పరిస్థితికి వచ్చినట్లు లేదు. కానీ తనకు ముప్పు వచ్చేసరికి టిడిపి దాన్నో అంశం చేద్దామనుకుంటోంది. 

బాబు తన లేఖలో సమగ్ర సర్వే గురించి కూడా ప్రస్తావించారు. కోర్టు అప్పుడే దానికి ముకుతాడు వేసింది. 1956కు ముందు నివాసం వంటి అంశాలకు కూడా కోర్టు కళ్లెం వేసింది. తన పౌరులను విడగొట్టి పాలించడానికి కెసియార్‌ ప్రయత్నిస్తున్నారనడంలో సందేహం ఏమాత్రం లేదు. ఆంధ్ర మూలాలున్న వారి హక్కులు పరిరక్షిస్తాం అని టిడిపి, మజ్లిస్‌ ప్రకటనలు యివ్వడం తప్ప యీ చర్యలను ప్రతిఘటిస్తూ ఊరేగింపులు, నిరసనలు, రాస్తా రోకోలు, అలాయ్‌బలాయ్‌లు, వీధిభోజనాలు చేశాయా? ఎందుచేత? అలా చేస్తే తెలంగాణ వాదుల ఓట్లు పోతాయేమోనన్న భయం చేత! ఈ రోజు మాత్రం నిద్రలోంచి మేలుకొన్నట్లు అన్నీ ఒక్కసారిగా గుర్తుకు వచ్చేశాయి. హైదరాబాదులోని ఆంధ్ర ప్రాంత ప్రజల ప్రాణాలు, ఆస్తులు, స్వేచ్ఛకు రక్షణ కల్పించాలి అని డిమాండ్‌ చేస్తున్నారు బాబు. తెలంగాణలోని తక్కిన నగరాలలోని వారి మాటేమిటి? ఈ ఆంధ్ర ప్రాంత ప్రజలు అన్నవారెవరు? వారికి నిర్వచనం ఏమిటి? వారు ముందుకు వచ్చి మేం తెలంగాణవారం కాము, ఆంధ్రులం, మా ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ లేదు అని ప్రకటించి ఎమ్మెల్యేలలా పోలీసు పహరా కావాలని అప్లికేషన్‌ పెట్టుకోవాలా? 

ఇవన్నీ ఏకరువు పెట్టి గవర్నరు చేతికి అధికారాలు అప్పగించమంటున్నారు. ఢిల్లీలో లెఫ్టినెంట్‌ జనరల్‌కు, ఎన్నికైన ప్రభుత్వానికి జరుగుతున్న వివాదం కళ్లారా చూశాక, కేంద్రప్రతినిథికి సమస్తాధికారాలు యిమ్మనమని చెప్పి అనడానికి ఎవరూ సాహసించరు. అయినా టిడిపి ప్రభుత్వం తన యావచ్ఛక్తిని యీ వాదనపైనే కేంద్రీకరించింది. గవర్నరు సలహాదారులు బాబును కలిసి తమ పరిమితులను వివరించారు. మరి బాబు కేంద్రంతో చెప్పి వారి అధికారాలు పెరిగేట్లా చేయగలుగుతారో లేదో చూడాలి. మత్తయ్యను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ అధికారాలు వినియోగించి, టిడిపి తెలంగాణ ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వుతోంది. మత్తయ్య చెప్పినది ఎంతవరకు వాస్తవమో, అతను ఎలాటివాడో కోర్టులో తేలుతుంది. ఈ లోపుగా ఆంధ్ర ప్రభుత్వం అతనికి రక్షణ కల్పించడమే వింతగా వుంది. కేసులో నిందితులుగా వున్నవారిని తిప్పి పంమని విదేశాలనే కోరతాం. వారికి వాళ్లు ఆశ్రయం కల్పిస్తే కోపగిస్తాం. అలాటి పక్క పక్కరాష్ట్రం వాళ్లలో ఆ పాటి సహకారం లేకపోతే ఎలా?
 
ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం బాబుపై కేసు పెట్టలేదు. రేవంత్‌ రెడ్డిపై మాత్రమే పెట్టింది. కానీ ఆంధ్రలో కెసియార్‌పై అనేక కేసులు టపటపా పెట్టేశారు. తప్పు లేదు.పెట్టదగ్గ వ్యక్తే. ఆంధ్రుల గురించి ఆయన పలికిన అవాకులు, చవాకులపై పరువునష్టం దావాలు యిప్పటికే బోల్డు వేయవచ్చు. కానీ ఇప్పుడు 13 జిల్లాలలో దాదాపు 70 కేసులు ఫోన్‌ ట్యాపింగ్‌ గురించేట! అది తప్ప ఆంధ్రులకు వేరే చింతలేమీ లేవా!? ఆ కేసుల దర్యాప్తుకై ఆంధ్ర ప్రభుత్వం సిట్‌ వేసే విషయం పరిశీలిస్తోందట. అంటే చంద్రబాబుపై కేసు పెడతారేమోనన్న సందేహం రాగానే దానికి ముందుగానే కెసియార్‌పై సిట్‌ విచారణ మొదలుపెడుతుందన్నమాట. ఫోన్‌ ట్యాపింగ్‌ అంత సీరియస్‌ విషయమా? నిన్నే పేపర్లో వచ్చింది. కేంద్రప్రభుత్వం నెలకు 9 వేల ఫోన్లను ట్యాప్‌ చేస్తుందట. రాష్ట్రాలు ట్యాప్‌ చేసేవాటిని కూడా కలిపితే ఆ అంకె ఎన్ని రెట్లు వుంటుందో మరి! సాక్షాత్తూ ఆంధ్ర ముఖ్యమంత్రి ఫోన్‌ ట్యాప్‌ అయింది అన్న అంశంపైనే యింత రచ్చ జరుగుతోంది. అయిందని తేలితే కేసు ముందుకు నడుస్తుంది. ఒకవేళ కాలేదు అని దర్యాప్తులో తేలితే, అప్పుడేం చేస్తారు? అంతటితో ఆపుతారా? కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం కుమ్మక్కయి ఆంధ్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయని కొత్త రగడ మొదలుపెడతారా? ఇక్కడ యిరుక్కున్నది టిడిపి పార్టీ, దాని నాయకులు. దాన్ని ఆంధ్ర ప్రభుత్వానికి, ఆంధ్ర ప్రజలకు పులమడం అన్నిటికన్న అన్యాయం. దానిపై అసెంబ్లీ తీర్మానం చేయడం, అయిదు కోట్ల ఆంధ్రులను అవమానించారడం అర్థరహితం, అనర్థదాయకం. ఇది రెండు రాష్ట్రాల మధ్య, రాష్ట్రప్రజల మధ్య చిచ్చు పెట్టడమే. తమాషా ఏమిటంటే జరిగిన నేరం గురించి మాట్లాడటం లేదు, నేరం ఎలా బయటపడింది అన్నదానిపైనే యాగీ చేస్తున్నారు. ట్యాపింగ్‌ చేయడం బట్టి కదా, ఎమ్మెల్యేను ప్రలోభపెట్టే మా సంభాషణ రికార్డు చేయగలిగారు అని గొడవ చేస్తున్నారు. మధ్యలో ఆంధ్రులు ఎక్కణ్నుంచి వచ్చారు? వాళ్లేమైనా పక్కరాష్ట్రం కౌన్సిల్‌లో నెగ్గి రా అని తమ ముఖ్యమంత్రికి చెప్పారా? టిడిపి అధ్యకక్షుడు యీ కేసులో ఎ1 లేదా ఎ2 అయితే ఆంధ్రులకు అవమానమా? ఒకవేళ బిజెపి అధ్యకక్షుడే యిలాటి కేసులో యిరుక్కుంటే అప్పుడు యావత్‌ భారతీయులకు అవమానమా? ఎలాటి వాదన యిది!
 
అయిన దానికీ కాని దానికీ ఆంధ్రులను ఆడిపోసుకోవడం, వారిని యిరికించడం యిన్నాళ్లూ తెలంగాణ వాదుల పేటెంటుగా వుంది. ఫలానా సినిమా వ్యక్తి అక్రమ నిర్మాణం చేశాడు అనకుండా, ఆంధ్రులు చేశారు అంటూంటారు, అక్కడికి ఆంధ్రులందరూ దుర్మార్గులు అయినట్టు! మొన్న పాలమూరు, డిండి ప్రాజెక్టుల అనుమతుల గురించి ఆంధ్ర మంత్రి అభ్యంతరం తెలిపితే కెసియార్‌ తన ఉపన్యాసంలో ఆయనను పేరు పెట్టి విమర్శించకుండా 'ఆంధ్ర సన్నాసులు' అంటూ జాతివాచకం వుపయోగించి ఆంధ్రులందరినీ అవమానించారు. తెలంగాణ సెంటిమెంటే పెట్టుబడిగా అధికారం చేజిక్కించుకున్న దాన్ని సజీవంగా వుంచడం కోసం ఆంధ్రద్వేషం చిమ్ముతూనే వున్నారు. ఈ మధ్య ఓ నాలుగు మంచి మాటలు అన్నా అవి హైదరాబాదు కార్పోరేషన్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్నవే తప్ప హృదయంలోంచి వచ్చినవి కావని అందరికీ అనుమానం. ఆంధ్రుల పట్ల కెసియార్‌ దృక్కోణం ఎటువంటిదో తెలియడానికి టైము పడుతుంది. ఒకవేళ ఆయన ఆపినా, ఆ పల్లవిని తెలంగాణలోని తక్కిన పార్టీల వాళ్లు అందుకోవచ్చు. 

ఇలాటి బాధ చాలనట్లు, యిప్పుడు చంద్రబాబు తన పట్టిన మసిని ఆంధ్రులకు పులుముతున్నారు. ఆయన దళితుడు అయి వుంటే దళితులను దొరలు వేధించారని అనేవారేమో, ఆ ఛాన్సు లేకపోబట్టి తన జాతిని ముందుకు తెచ్చారు. బాబుని రక్షించే ఒక్కో అస్త్రం ఖర్చయిపోతున్న కొద్దీ యీ సెంటిమెంటుపై పడ్డారు. ఫోరెన్సిల్‌ ల్యాబ్‌ రిపోర్టులు బయటకు వచ్చాక అది ఆయన గొంతు కాదని అనగలరో లేదో తెలియదు. ఎసిబి తన పరిధిని మించి వ్యవహరించిందని టిడిపి నాయకులు అంటూ వచ్చారు. ఇప్పుడు మీడియా ఎసిబిని పాత్రను కాకుండా అది నేరం మోపిన సెక్షన్లను తప్పుపడుతోంది. ఇక హైదరాబాదుపై అధికారాలను గవర్నరుకు కట్టబెట్టించినా అది మున్ముందు కాపాడుతుంది కానీ జరిగిపోయిన దానికి ఏం చేయగలరు? ఫోన్‌ ట్యాపింగ్‌ జరగలేదని కేంద్ర సంస్థ నిర్ధారిస్తే కప్పుకోవడానికి ఏమీ మిగలదు. అందుకని సెంటిమెంటు రగిలిద్దామని చూస్తున్నారు. ఇది దుర్మార్గం. తమ ముఖ్యమంత్రిని పనిగట్టుకుని వేధిస్తున్నారని ఆంధ్రులలో చాలామంది అనుకుంటున్నారని మీడియా రాసేస్తోంది. నిజంగానా!? నేరస్తుణ్ని పట్టుకుంటే వేధింపా? నేరం చేస్తూ పట్టుబడ్డవాడు సక్రమ మార్గాల్లో పట్టుబడ్డాడా, అక్రమ మార్గాల్లో పట్టుబడ్డాడా అనేది సాంకేతిక విషయం. తమ ముఖ్యమంత్రి ఏ నేరం చేసినా పట్టుకోకూడదని, అలా పట్టుకుంటే వేధింపేననీ, తమకు అవమానం జరిగినట్లే అని రాష్ట్ర పౌరులు ఎందుకనుకుంటారు? అలా పట్టుబడడం వలన తమకు జరిగే నష్టం గురించే ఆలోచిస్తారు తప్ప!

బాబు యిలా యిరుక్కోవడం ఆంధ్ర రాష్ట్రానికి నష్టమనే నేను నమ్ముతున్నాను. ఈ సందర్భంగా పాఠకులు చేసిన కొన్ని వ్యాఖ్యలకు జవాబిస్తున్నాను.  సినిమాల విషయంలో లాగానే ఎన్నికల ఫలితాల విషయంలో కూడా అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. 2014 ఎన్నికల ఫలితాల విశ్లేషణ వ్యాసాల్లో వాటి గురించి విపులంగా రాశాను. అవినీతి ముద్ర, క్రైస్తవ ముద్ర, ఫ్యాక్షనిస్టు ముద్ర యిత్యాది అనేక అంశాలు జగన్‌కు ప్రతికూలంగా పనిచేశాయి. రాజధాని నిర్మాణం, అవినీతి యిత్యాది అంశాలపై మధ్యతరగతి వర్గాలు టిడిపిని పూర్తిగా బలపరిచాయి. కాపు ఓట్లు, బిజెపి మద్దతు వగైరా విశ్లేషణలు కొంతవరకే పనికి వస్తాయి. వైయస్‌కు కంచుకోటగా నిలిచిన తూర్పుగోదావరి జిల్లాలో వైకాపా దెబ్బ తినడానికి, వైకాపా గౌరవాధ్యకక్షురాలు వైజాగ్‌లో పరాజయం పొందడానికి కారణాలేమిటో వైకాపా అభిమానులు తరచి చూసుకోవాలి. ఆంధ్ర రాజధాని నిర్మాణానికి సరైన సారథి బాబే అని నమ్మిన హైదరాబాదులోని ఆంధ్రులు యిక్కడా, అక్కడా రెండు చోట్లా టిడిపికి ఓట్లు వేశారు. అందుకే జంటనగరాలలో టిడిపి, దానితో పొత్తు పెట్టుకున్న బిజెపి గెలిచాయి. మళ్లీ యిలా జరగకూడదనే కెసియార్‌ జంట నగరాల ద్వంద్వ ఓటర్లపై నిఘా వేశారు. బాబు తన లేఖలో 'ఆంధ్రప్రాంత ప్రజలలో అభద్రతా భావం సృష్టించడానికి సర్వే ఆదేశించారు' అని పేర్కొనడానికి కారణం యిదే. 

బాబు రాజకీయంగా అస్థిరమైతే ఆంధ్ర రాజధాని నిర్మాణం, దానికి వచ్చే పెట్టుబడులు కొంతకాలం పాటు కుంటుపడతాయన్నది వాస్తవం. అబ్బే పెట్టుబడి పెట్టేవారు ముఖ్యమంత్రిని చూసి రారు, అవకాశాల బట్టి వస్తారు అని వాదించేవారు 'మోదీ కాలంలో గుజరాత్‌ అభివృద్ధి చెందింది' 'బుద్ధదేవ్‌ కాలంలో బెంగాల్‌ నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి' వంటి స్టేటుమెంట్లలోని ఔచిత్యాన్ని ప్రశ్నించాలి. డ్రైవర్‌ కౌశలం బట్టే కారు వేగం వుంటుంది. ముఖ్యమంత్రి సామర్థ్యం రాష్ట్రప్రగతిని ప్రభావితం చేస్తుంది. బాబు యిమేజి దెబ్బ తిన్నా, ఆయన స్థానంలో మరొకరు వచ్చినా ఆంధ్రకు యిబ్బందే. జయలలిత స్థానంలో పన్నీరు సెల్వం వుండగా తమిళనాడు పరిస్థితి ఎలా దెబ్బ తిందో గతంలో రాశాను. ఇలా చెప్పడం వలన ఆంధ్రులలో అభద్రత నింపుతున్నావని ఆరోపిస్తున్నారు కొందరు. నాయకుల వాగ్దానాల హోరులో, బ్రోషర్ల జోరులో నా హితోక్తులు ఎంతమందికి వినబడుతున్నాయో నాకు తెలియదు. హైదరాబాదు కోల్పోవడంతోనే ఆంధ్రకు అపారమైన నష్టం కలిగింది. ఇప్పట్లో కోలుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. భూరి పరిశ్రమలు, ఆకాశ హర్మ్యాల పగటి కలలు మానేసి, పంజాబీల తరహాలో చిన్న పరిశ్రమలు పెట్టుకుని శ్రమించడం, వ్యవసాయోత్పత్తుల ద్వారా సంపాదించడం, కేరళీయుల తరహాలో విద్యార్జన, నైపుణ్యం పెంచుకోవడం ఆంధ్ర ప్రజలు చేయవలసిన పని. అప్పుడు ప్రభుత్వం స్థిరంగా వున్నా, అస్థిరంగా వున్నా వారి జీవితాలు ఆటుపోట్లకు లోను కావు. (సమాప్తం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2015)

[email protected]

Click Here For Archives