హీరో హీరోయిన్లు యిద్దరూ పెద్దవాళ్లయ్యారు కాబట్టి యిప్పుడు వాళ్లు మళ్లీ కలవాలి. ప్రేమలో పడాలి. ఇదివరకే పెళ్లయిన విషయాన్ని చెప్పాలో, దాచాలో తెలియక ఏం చేయాలో తెలియక బాధపడాలి. పెళ్లయిన హీరోయిన్ మళ్లీ ప్రేమలో పడడం యాంటీ సెంటిమెంట్. పాతమొగుడే ప్రియుడైతే ప్రేక్షకుడి ఆమోదం వుంటుంది. అయితే అది ఏ స్టేజిలో పాత్రధారికి రివీల్ చేయాలి, ప్రేక్షకుడికి రివీల్ చేయాలి అన్నదే మెయిన్ పాయింట్. బెంగాలీ వెర్షన్‌లో ఏం చేశారంటే -హీరోకి హీరోయిన్ ఫలానా అని తెలుసు. తెలిసి, ఆ విషయం ఆమెకు చెప్పకుండా ఆమెను పర్‌స్యూ చేశాడు. ఆ విషయం ప్రేక్షకుడికి కూడా హీరోయిన్‌తో బాటే తెలిసింది. అసలు విషయం తెలిసేదాకా ఆమెతో బాటు ప్రేక్షకుడూ మథన పడుతూనే వున్నాడు. తెలుగువాళ్లు యిలాటి విషాదాన్ని భరించలేరనుకున్నారు దుక్కిపాటి. అందువలన కాలేజీ చదువు సాగుతూండగానే హీరోకి యీ విషయం ఎలా తెలిసిందో, దానిపై అతను హీరోయిన్ పర్‌స్యూ చేయాలని ఎలా నిశ్చయించుకున్నాడో చెప్పేశారు. కన్నాంబ నాగేశ్వరరావుకి పెళ్లి గురించి చెప్పేసింది. అతను సావిత్రి యింటికి వెళ్లి గూర్ఖా దగ్గర సమాచారం లాగాడు. తర్వాత తిరుపతికి వెళ్లి హీరో హీరోయిన్‌ను ఏకాంతంలో కలిశాడు.
బెంగాలీలో హీరోయిన్ తన తమ్ముడితో, పిన్ని కూతురుతో ముస్సోరీ వెళ్లింది. అక్కడ ఛాలెంజ్ చేసి శిఖరం దాకా ఎక్కింది. అక్కడ ఫాగ్‌లో చిక్కుకుంది. అక్కడ ఆమెకు హీరో కనబడ్డాడు. ఇద్దరికీ మాటలు కలిశాయి. బెంగాలీలో హీరో పేరు కిరీట్ ముఖర్జీ. బులు అన్నది ముద్దుపేరన్నమాట. తెలుగులో హీరో పేరు చంద్రశేఖర్. చంద్రంగా పెళ్లి చేసుకుని, ప్రేమించేటప్పుడు తన పేరు శేఖర్ అని చెప్తాడు. ఈ కిరీట్ ముఖర్జీ ఫారిన్‌లో యింజనీరింగ్ చదివి వచ్చాడు. బాగా డబ్బున్నవాడు. ముస్సోరీలో కొద్దిరోజులుగా వుంటున్నాడు. ఆడపిల్లలంతా అతనంటె పడిఛస్తారు. కానీ యితను ఈ హీరోయిన్‌పై యిష్టం కనబరచాడు. ఆమె తల్లి కూడా యిలాటి కులీనుడితో ప్రేమను ప్రోత్సహించింది.
పెద్దవాళ్లే ప్రేమను ప్రోత్సహిస్తే మజా ఏముంటుంది చెప్పండి. అందుకని తెలుగులో మార్చారు. హీరోయిన్ తల్లిదండ్రులకు శేఖర్ అంటే యిష్టం లేదు – డబ్బు లేనివాడని. వాళ్లు కైలాసం అనే డబ్బున్నతనితో పెళ్లి నిశ్చయం చేశారు. ఆ పాత్ర వేసినది రేలంగి. ఆ కైలాసం హీరోకి ఫ్రెండే. అతను మీనా అనే అమ్మాయిని ఆత్మహత్యాప్రయత్నం నుంచి కాపాడి ఆమెను ప్రేమించాడు. ఈ జంటలు రెండూ కలిసి పెద్దవాళ్లని ఓ ఆటాడించాయి. బెంగాలీలో యిలాటి సరదాలు లేవు. భావగీతాలు బోల్డు వున్నాయి. హీరో హీరోయిన్ పట్ల ప్రేమ వ్యక్తం చేసి అభిప్రాయం అడిగినపుడు అనుకోకుండా ఓ పెళ్లి వూరేగింపు కనబడింది. ఆమెకు గతంలో జరిగిన పెళ్లి, తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఇక అప్పణ్నుంచి హీరోని దూరంగా పెట్టసాగింది. ఓ దశలో హీరోకి అన్నీ చెప్పేద్దామని నిశ్చయించుకుంది. కానీ వున్న యీ స్నేహం కూడా పోతుందేమోనని సంకోచించింది. ఈమె ఆందోళనను గమనించిన హీరో తన గతం చెప్పబోతే గతం వద్దు అంటూ వారించింది. తెలుగులో హీరోయిన్ పెళ్లి మాట తలపెట్టినప్పుడు అన్నగారు రమణమూర్తి పెళ్లి ఎలా చేస్తారు అంటూ పాత మంగళసూత్రం తీసి దాని విలువ గురించి డైలాగులు చెప్పాడు. సావిత్రి వెంటనే మంగళసూత్రం కట్టుకుంది. ప్రేమ సంగతి మర్చిపోదామనుకుంది.
బెంగాలీ ఒరిజినల్‌లో తల్లి ఓ పార్టీ ఏర్పాటు చేసి కిరీట్ ముఖర్జీతో ఎంగేజ్‌మెంట్ ఎనౌన్సు చేస్తానంది. అప్పుడు కూతురు తిరగబడింది. తనకు పెళ్లయిపోయిందని గుర్తు చేసింది. పార్టీవేళకు పారిపోయింది. అంతకుముందు మొదట్లో వినిపించిన పాట పాడింది. తెలుగులో దాన్ని డ్యూయట్ చేశారు. 'నా ప్రాణసఖి వని తెలిపే అవకాశం పోయిందని' ఓ చరణంలో హీరోచేత అనిపించారు. హీరో తెలిసి తెలిసి హీరోయిన్ను సతాయించాడన్న కోపం ప్రేక్షకుడికి వుంటే దాన్ని పోగొట్టి, అతనిమీదా జాలి పుట్టించారు. బెంగాలీ ఒరిజినల్‌లో ఎంగేజ్‌మెంట్ పార్టీనుండి పారిపోయిన హీరోయిన్ సరాసరి బామ్మ దగ్గరకి వెళ్లింది. సంప్రదాయాన్నే గౌరవిస్తానని ఆమెతో చెప్పింది. బామ్మ సంతోషపడింది. బాల్యంలో పెళ్లి జరిగిన చోటికి తీసుకెళ్లింది. ఆమెకు గతమంతా గుర్తుకు వచ్చింది. పెళ్లికొడుకు బులూ పెద్దవాడై అక్కడికే వచ్చాడు. తీరా చూస్తే అతను కిరీట్ ముఖర్జీయే. ఎందుకు చెప్పలేదు యిన్నాళ్లూ అంది హీరోయిన్. చిన్నప్పటి భర్త అనే క్లెయిమ్‌తో కాకుండా నీ మనసుకు దగ్గరై నిన్ను స్వంతం చేసుకోవాలని అన్నాడతను. నీ బాధ భరించలేక చెప్పేదామనుకుంటే నువ్వే చెప్పవద్దన్నావు అన్నాడు.
తెలుగులో యింత సింపుల్‌గా కథ పూర్తి చేయలేదు. పాపారావు తల్లి జబ్బు పడింది. హీరోయిన్ అన్నగారు తండ్రిని ఎదిరించి వెళ్లి నాయనమ్మను తీసుకుని వచ్చాడు. నాయనమ్మని చూసిన తర్వాత హీరోయిన్ మనసు మరింత గట్టిపడింది. శేఖర్‌ను పూర్తిగా మర్చిపోతానని, చంద్రం ఎ్కడున్నా వెతికి అతని వద్దకు చేరతానని నాయనమ్మకు మాట యిచ్చింది. ఈ లోగా హీరో హీరోయిన్‌కై ఫోన్ చేస్తే అది హీరోయిన్ తలిదండ్రులు రిసీవ్ చేసుకోవడం, అతన్ని ట్రాప్ చేయడం జరిగింది. వాళ్లింటి తోటలో ఘర్షణ జరిగే సమయంలో చంద్రం, శేఖరం ఒకరే అని తెలుస్తుంది. తన పాతభర్తనే కూతురు ప్రేమిస్తోందని తెలిసినా పాపారావు కరగలేదు. అతనికి యిచ్చి పెళ్లి చేయాలని అనుకోలేదు. కూతురికి చెప్పకుండా కైలాసంతో పెళ్లి ఫిక్స్ చేసేశాడు. ఈ కైలాసానికి హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవాలని లేదు. తండ్రిని ఎదిరించలేడు. అందువలన ఉత్తుత్తి రోగం తెచ్చుకుని హీరోయిన్ అన్నగారి ఆసుపత్రిలో ఆశ్రయం పొందాడు. అతని ప్రియురాలు అదే ఆసుపత్రిలో నర్సు. పైగా హీరోయిన్‌కి ఫ్రెండ్. ఆమె ద్వారా హీరో అసలు విషయం తెలుపుతూ హీరోయిన్‌కి ఉత్తరం పంపాడు కానీ ఆమె చదవకుండానే చింపి పారేసింది. అలాటి పరిస్థితుల్లో హీరో స్వయంగా దిగి వచ్చాడు. తనెవరో చెప్పాడు. పక్కనే వున్న నాయనమ్మ ఔనంది.
ఇక్కడితో సినిమా అయిపోలేదు. పాపారావు, అతని భార్య ఒకవైపు, తక్కినవారందరూ మరోవైపు. ఇక రసవత్తరంగా, ప్రేక్షకులకు కులుకు కలిగేట్లా క్లయిమాక్స్ తీర్చిదిద్దారు. ప్రేమ గొడవతో బాటు ''తోడికోడళ్లు'' సినిమాలో లాగ భూమి గొడవ కూడా కల్పించి చిన్న కర్రసాము అదీ పెట్టి గ్రామీణ ప్రజలకు కూడా హుషారు కలిగేట్లా చేశారు. ఆ ఫైటింగ్‌కి వెళ్లబోయే ముందు హీరోయిన్, ఆమె చెలికత్తె వేషాలు మార్చుకునే సీను పెట్టారు. మోసం తెలిసి పాపారావు తుపాకీతో వెంటపడ్డాడు. తల్లిమీద కోపం కొద్దీ పాపారావు గతంలో ఆమె కిచ్చిన పది ఎకరాలు అమ్మేయమని పంతులుతో చెప్పాడు. కొన్నవాళ్లు స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు. హీరో, హీరోయిన్ సొంతవూరికి వచ్చేసరికి ఆ తగాదా రెడీ. పాపారావు నాగేశ్వరరావును తుపాకీతో కాలుస్తూంటే సావిత్రి అడ్డుపడింది. గుండు తగిలి కన్నాంబకు కిందపడింది. దాంతో గయ్యాళి సూర్యకాంతానికి బుద్ధి రావడం, మొగుడు ప్రియుడై, మళ్లీ మొగుడవడం. మాంగల్యబలం ఎంత గట్టిదో చాటి చెప్పడం జరిగింది. హాస్యగాడికి కూడా జోడీ దొరికింది. ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే ఉత్తమ్ కుమార్ ఒరిజినల్ బెంగాలీ సినిమాను మార్పులు చేయకుండా హిందీలో ''ఛోటీసీ ములాకాత్'' అనే సినిమా వైజయంతిమాల హీరోయిన్‌గా భారీగా తీస్తే ఆ సినిమా ఫెయిలైంది. మార్పులు చేసి హిట్ చేసిన ''మాంగల్యబలం'' కథతో తీసి వుంటే అదీ హిట్టయ్యేదేమో! (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2016)