ఆర్థికమాంద్యం కారణంగా దెబ్బ తిని అప్పణ్నుంచి నానాటికీ దిగజారుతున్న దేశం గ్రీసు. 2010 నుండి దాని ఋణభారం యింతింతై పెరుగుతూ వచ్చి దాన్ని కబళించే స్థితికి వచ్చింది. ప్రజలు అడుక్కుతినే స్థితికి వచ్చారు. ఇదంతా మీకు అప్పులు పెరగడం చేతనే జరుగుతోంది, అవి తీరడానికి మేం యింకాస్త అప్పు యిస్తాం పట్టండి అంటూ 'త్రిమూర్తులు'గా పిలవబడే యూరోజోన్‌లోని దేశాలు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, ఐఎమ్‌ఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) అప్పుల మీద అప్పులు యిస్తూ పోయి దాని కొంప ముంచారు. ఈ సమస్య వచ్చినపుడు అప్పు దేశపు జిడిపికి 120% వుండేది. ఇప్పుడది 175%కి చేరింది. అంటే యీ ఋణాలు వారికి మేలు చేయలేదన్నమాట. దీనికి కారణం అప్పులు యిస్తూ యీ త్రిమూర్తులు పెట్టిన షరతులే! 'మీరు ప్రభుత్వవ్యయం తగ్గించాలి, జీతాలు తగ్గించాలి, సంక్షేమ పథకాలు మానేయాలి, వ్యవస్థ మార్చడానికి చేసే ఖర్చు తగ్గించాలి, గవర్నమెంటు ఆస్తులు అమ్మేయాలి' అంటూ షరతులు విధించి తాము యిచ్చిన అప్పులో 90% వడ్డీ కింద, చెల్లింపుల కింద వెనక్కి లాగేశారు. 2010 నుంచి గ్రీసు తీసుకున్న అప్పు 110 బిలియన్ యూరోలు. దీనివలన గ్రీసు పరిస్థితి మరింత అధ్వాన్నం కావడంతో, గ్రీకు ప్రభుత్వపు బాండ్లు చెత్త కాగితాలతో సమానం అని క్రెడిట్ రేటింగ్ ఏజన్సీలు అనడంతో వూబిలోంచి మళ్లీ బయటపడేయడానికి అంటూ యింకో 130 బిలియన్ యూరోలు యిచ్చారు. ఇటీవలే ఐఎమ్‌ఎఫ్ జనవరి 2015 నుంచి మార్చి 2016 లోపున యింకో 8.2 బిలియన్ యూరోలు యిస్తానంది. ఇంత అప్పుచేసి సాధించినది ఏమిటా అని చూస్తే – నిరుద్యోగం 50% పెరిగింది, యిళ్లు లేని వారి సంఖ్య 25% పెరిగింది, ప్రజారోగ్యంపై పెట్టే ఖర్చు జిడిపిలో 6%కి తగ్గించడానికి ప్రభుత్వ ఆసుపత్రులు మూసేయడంతో ఎచ్‌ఐవి 200% పెరిగింది. యూరోప్ మొత్తంలో గ్రీసులో ఆత్మహత్యలు అతి తక్కువగా వుండేవి. ఇప్పుడవి 60% పెరిగాయి.
త్రిమూర్తులు విధించిన దుర్మార్గపు పొదుపు షరతులకు తమ ప్రభుత్వం తల వూపడమే తమ యీ దుస్థితికి కారణం అని గ్రీసు పౌరుడు భావించాడు. అందుకే 2015 జనవరిలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో అప్పటిదాకా వున్న పాలిస్తున్న రైటిస్టు కూటమిని గద్దె దింపి, పొదుపు చర్యలను వ్యతిరేకించిన సిరిజా అనే లెఫ్టిస్టు కూటమికి అధికారం అందించాడు. 300 మంది సభ్యులున్న పార్లమెంటులో సిరిజాకు గతంలో 71 వుంటే యిప్పుడు 149 సీట్లు వచ్చాయి. గత కూటమిలో భాగస్వామిగా వున్న న్యూ డెమోక్రసీ అనే కన్సర్వేటిప్ పార్టీకి 129 నుండి 76కి తగ్గాయి. మరో భాగస్వామి ఐన పసోక్ అనే సోషల్ డెమోక్రాటిక్ పార్టీకి 33 నుంచి 13కి తగ్గాయి. అతివాద రైట్ వింగ్ ఫాసిస్టు భావాలున్న డాన్ పార్టీకి 17 రాగా, కమ్యూనిస్టు పార్టీకి 15 వచ్చాయి. ఈ సిరిజా పార్టీ తరఫున ప్రధానిగా ఎలెక్సిస్ సిప్రాస్ అనే 40 ఏళ్ల ఆర్థికవేత్త ఎన్నికయ్యాడు. అతని ముందు అతి పెద్ద సవాలు ఏమిటంటే – తన దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చాలి. అప్పటిదాకా అప్పులాళ్లను గడప అవతల వుంచాలి. మమ్మల్ని మరీ ఒత్తిడి చేస్తే ఇయు (యూరోపియన్ యూనియన్) నుంచి బయటకు వెళ్లిపోతాం, దివాలా తీసి మీ బాకీలు ఎగ్గొడతాం, అందుకని కాస్త ఓపిక పట్టండి, వడ్డీలకోసం, వాయిదాల కోసం తొందరపెడితే మొదటికే మోసం అని బెదిరిస్తూ, అదే సమయంలో అనునయంగా బేరాలాడుతూ యింటి వ్యవహారం చక్కదిద్దుకోవాలి.
దేశంలో ఎవరి వద్దా డబ్బులు లేకపోతే కొనేవాడెవడు? రైతులకు, వస్తూత్పత్తిదారులకు తిండి ఎలా గడుస్తుంది? అందుకని కొన్ని సంస్కరణలు చేపట్టాడు. ఆ ప్రణాళికకు పార్లమెంటు ఆమోదం లభించింది. దాని ప్రకారం పెన్షన్లను పునరుద్ధరించారు, పన్ను మినహాయింపును ప్రస్తుతం వున్న 5 వేల యూరోల నుండి 12 వేల యూరోలకు పెంచారు. దారిద్య్రరేఖకు అడుగున వున్న వారి కోసం తక్కువ ధరలో భోజనాలు ప్రవేశపెట్టారు, గతంలో తీసేసిన 3500 మంది ప్రభుత్వోద్యోగులకు మళ్లీ వుద్యోగాలు యిచ్చారు, ప్రయివేటు సెక్టార్‌లో 2011లో కనీస వేతన పరిమితి 751 యూరోలు వుంటే గత ప్రభుత్వం దాన్ని 586కు తగ్గించింది. 2016 లోగా 751కి తీసుకెళ్లాలని ప్రయివేటు సెక్టారు యజమానులకు ఆదేశాలిచ్చింది. గత ప్రభుత్వం ఒక నౌకాశ్రయాన్ని అమ్మేయబోయింది. ఈ ప్రభుత్వం అమ్మకాన్ని ఆపేయడంతో బాటు, యికపై ప్రభుత్వాస్తులు అమ్మనని చెప్పింది. వీటన్నిటితో బాటు చేయవలసిన దిద్దుబాటు చర్యలు – అవినీతిపరులను, పన్ను ఎగవేతదారులను పట్టుకోవడం, పబ్లిక్ సెక్టార్ పనితీరును మెరుగుపరచడం – కూడా చేపట్టింది. 'మీరు తీసుకున్న 240 బిలియన్ యూరోల ఋణాన్ని పొడిగించాలంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి' అని త్రిమూర్తులు అంటే 'ఈ షరతులపైన అయితే అప్లికేషన్ పెట్టుకోం పొండి' అనేసింది. ఈ చర్యలు ఆ శక్తులకు రుచించలేదు. అందువలన యీ సంస్కరణల బిల్లు పాస్ అయిన రోజున గ్రీసు షేరు మార్కెట్టును పడగొట్టాయి. ఈ సంస్కరణల బిల్లు పాస్ చేయించుకోవడానికి సిరిజా పార్టీకి మెజారిటీ సరిపోలేదు. అందువలన 12 సీట్లున్న ఏనెల్ పార్టీ అనే రైట్ వింగ్ పార్టీతో జత కట్టి, వారికి డిఫెన్సు మంత్రి పదవి యిచ్చింది. ఇది వామపక్ష కూటమి కాబట్టి మామూలుగా చూస్తే 15 సీట్ల కమ్యూనిస్టు పార్టీతో కలియాలి. కానీ కమ్యూనిస్టు పార్టీ ఇయులో కొనసాగకూడదని, ఋణదాతలతో బేరసారాలు ఆడవలసిన పనే లేదని యిలా మొండి వైఖరి అవలంబిస్తోంది. అంతకంటె ప్రాక్టికల్‌గా ఆలోచించే ఏనెల్ పార్టీయే బెటరనుకుంది సిరిజా.
రెండవ ప్రపంచయుద్ధానంతరం జర్మనీ 20 యూరోపియన్ దేశాలకు 32 బిలియన్ల డాయిష్ మార్క్‌స్ అప్పుపడింది. అప్పుడు ఆ దేశాలు దానిలో సగాన్ని మాఫీ చేశాయి. ఆ దేశాల్లో గ్రీసు కూడా వుంది. 'మేం యిప్పుడు అలాటి పరిస్థితుల్లోనే వున్నాం, మాకు కూడా సగానికి సగం అప్పు ఎందుకు మాఫీ చేయకూడదు?' అని సిప్రాస్ అడుగుతున్నాడు. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ గ్రీసును ఆక్రమించి అక్కడి ఆస్తులు ధ్వంసం చేసింది. అంతేకాదు, గ్రీసు బ్యాంకుకి యిష్టం లేకపోయినా బలవంతంగా జర్మన్ ప్రభుత్వానికి అప్పు యిప్పించింది. నాజీ ప్రభుత్వం కూలిపోవడంతో ఆ అప్పు చావుబాకీగా మారింది. అలాటివన్నీ లెక్కలేసిన గ్రీక్ కమిషన్ ఒకటి క్రితం ఏడాది ''జర్మనీ మాకు 160 బిలియన్ యూరోలు బాకీ పడింది, వడ్డీ కలిపితే అది యింకా ఎక్కువవుతుంది'' అని ప్రకటించింది. జర్మనీ యివేమీ జాన్తానై అని కొట్టిపారేసింది. ఏది ఏమైనా అప్పులో కొంత కొట్టేయాలనీ, తక్కినది చెల్లించడానికి గడువు యివ్వాలనీ, మా ప్రభుత్వాన్ని ఎలా నడుపుకోవాలో షరతులేవీ విధించకూడదనీ సిరిజా బేరాలాడుతోంది. చివరకు యూరోజోన్ దిగి వచ్చి నాలుగు నెలల గడువు యిచ్చింది. ఈ లోపుగా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే – ప్రపంచ బ్యాంకు ఋణాలకోసం పరిగెట్టి, వాళ్ల షరతులకు లోబడి యూజర్ చార్జీలని, ఫ్యూయల్ చార్జీలని ప్రజలను పీల్చి పిప్పి చేస్తే మన పనీ గ్రీసులాగే తయారవుతుంది. రాత్రికి రాత్రి అద్భుతాలు సృష్టించనక్కరలేదు, ఆకాశహర్మ్యాలు కట్టనక్కరలేదు. ప్రణాళికాబద్ధంగా కష్టపడుతూ, ఓపిక పడితే ఆలస్యంగానైనా విజయాలు సిద్ధిస్తాయి. ప్రపంచబ్యాంకు , లేదా ఐఎమ్‌ఎఫ్ సాయంతో అడ్డదారిలో వెళ్లబోతే వాళ్లు యివాళ ఆవుకి తట్టెడు మేత వేసి, మర్నాడు పొదుగు కోసి పట్టుకుపోతారు!
ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2015)